hinduBrahmins

-----------------------------------------------------------------------------------విశ్వామిత్రుడు   

    
జనసామాన్యంలో సుపరిచితమైన ఋషి విశ్వామిత్రుడు. గాధి రాజకుమారుడుగా, వశిష్ఠుడిని వ్యతిరేకించిన వ్యక్తిగా, త్రిశంకుడికోసం కొత్త స్వర్గాన్ని సృష్టించిన మహాతపస్విగా, అత్యంతనిష్టతో తపస్సులు చేసి, ఆపై రాజర్షిగా, తర్వాత దేవర్షిగా, చివరికి బ్రహ్మర్షిగా సకల లోకాలలో పూజలు అందుకున్న ఉత్తముడు. ఆయన గురించిన గాథలు అనేకం. శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం వంటి అనేక పురాణేతిహాసాలలో విశ్వామిత్రుని ప్రసక్తి ఉంది. వాల్మీకి రామాయణం, బాల కాండ, 51వ శ్లోకంనుంచీ విశ్వామిత్రుని కథ ప్రారంభం అవుతుంది. విష్ణుపురాణంలోనూ, హరివంశం 27వ అధ్యాయంలోనూ విశ్వామిత్రుని కథ ఉంది. 

    పూర్వ గ్రంథాలలో మనకు మొత్తం ముగ్గురు విశ్వామిత్రులు దర్శనం ఇస్తున్నారని డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు పేర్కొన్నారు. ఒకరు గాధి కుమారుడు; మరొకరు ప్రగాధి కుమారుడు, ఇంకొకరు జమదగ్ని కుమారుడు. 

        విష్ణు పురాణం ప్రకారం - కుశ వంశానికి చెందిన రాజులలో ఒకడైన కౌశికుడు పురు-కుత్స వంశానికి చెందిన ఒక స్త్రీని వివాహమాడి, ఒక కుమారుడిని పొందాడు. ఆ కుమారుడే గాధి. ఆయన కుమారుడే విశ్వామిత్రుడు. పురు-కుత్స వంశీయులనే తర్వాత కాలంలో 'శఠమర్షణ' వంశస్థులనేవారు. వీరంతా ఇక్ష్వాకు రాజులైన త్రశదస్యుడి వారసులనీ అంటారు. 'శఠం' అంటే కోపం అని అర్థం. 'శఠమర్షణుడు' అంటే కోపాన్ని నిగ్రహించుకున్నవాడు కావచ్చు. 

    బ్రాహ్మణులకు పరమపవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని దర్శించిన ద్రష్ట విశ్వామిత్రుడు. ఇదే కాకుండా అనేక ఇతరేతర మంత్రాలనుసైతం  విశ్వామిత్రుడే దర్శించి మనకు అందజేశాడన్న భావన ఉంది. మనం నిత్యం చదువుకునే శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం 
        
'కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యాప్రవర్తతే
        ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్‌'

విశ్వామిత్ర ప్రణీతమని ప్రశస్తి.
 


విశ్వామిత్రుని కథ
    విశ్వామిత్రుడు గాధిరాజకుమారుడు. గాధిరాజు కన్యాకుబ్జ రాజ్యానికి పాలకుడు. గాధి తండ్రి పేరు కుశనాభుడు. అందుకే గాధిరాజు కుమారుడు గనుక, విశ్వామిత్రుడిని 'గాధేయుడు' అనీ, కుశనాభుని మనుమడు కాబట్టి 'కౌశికుడు' అనీ వ్యవహరించటం ఉంది. గాధిరాజుకు పుత్రసంతానం లేకపోయింది. గాధిరాజుకు ఒక్క కుమార్తె. ఆమె పేరు సత్యవతి. సత్యవతి ఋచీకుడు అనే మహర్షిని వివాహమాడింది. ఆమె తన భర్త అయిన ఋచీ మహర్షిని, తనకొక కుమారుడిని, తన తల్లికి పుత్రసంతానంలేని కారణంగా ఆమెకు ఒక కుమారుడిని వరంగా అనుగ్రహించమని కోరింది. ఋచీకుడు సరేనని, సత్యవతికి రెండు మంత్రాలను ఉపదేశిస్తాడు. ఒక మంత్రం (ఒక మేడి చెట్టును కౌగలించుకోవాలన్నది) సత్యవతికికాగా, మరొకటి (రావి చెట్టును కౌగలించుకోవాలన్నది) ఆమె తల్లికి ఆయన ఉపదేశిస్తాడు. కానీ, విధివశాత్తూ సత్యవతి, ఆమె తల్లి ఆ మంత్రాలను తారుమారుగా తీసుకుని, మేడి చెట్టును సత్యవతి తల్లి, రావి చెట్టును సత్యవతి కౌగలించుకుంటారు. భర్త తనకు శక్తిమంతమైన మంత్రాన్ని అనుగ్రహించి ఉంటాడని భావిస్తూ, అంత మహిమాన్వితమైనది తల్లికి ఇవ్వటం బాగుంటుందని అనుకుని, తనకు భర్త ఇచ్చిన దానిని తన తల్లికి సత్యవతి ఇస్తుంది. ఇలా ఈ మంత్రాలు తారుమారు అవుతాయి. ఈ విషయం ఋచీకుడికి తెలుస్తుంది. ఆయన, దాని ఫలితంగా సత్యవతికి క్షత్రియ స్వభావం ఉండే పుత్రుడు, ఆమె తల్లికి జన్మతః క్షత్రియ స్వభావం ఉన్నా, బ్రాహ్మణ స్వభావంతో బ్రహ్మర్షి కాగల పుత్రుడు జన్మిస్తారని తెలియజేస్తాడు. ఆ మీదట, సత్యవతికి జమదగ్ని జన్మించాడు. ఆయనకు పరశురాముడు జన్మించిన సంగతి తెలిసిందే! అందుకే, సత్యవతి తల్లికి ఒక కుమారుడు (విశ్వరథుడు), అయిదుగురు కుమార్తెలు (హేమవతి, శీలవతి, ధృషధ్వతి, రేణు, మాధవి) జన్మించారు. విశ్వరథుడే తర్వాత కాలంలో బ్రహ్మర్షి అయ్యాడు.

వశిష్ఠునితో వైరం - దాసరాజ యుద్ధం 
    విశ్వామిత్రునికి వశిష్ఠ మహర్షితో వైరం ఉన్న సంగతి జగద్విదితం.  భరత గణానికి చెందిన రాజు సుదాసుడు. ఆయనకు విశ్వామిత్రుడు కుల పురోహితునిగా ఉండేవాడు. ఆసమయంలో సుదాసరాజు - అను, దృహ్యు, పురు, తుర్వసు, యదు గణాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. వీరు పదిమంది రాజులు. వీరంతా ఒక కూటమిగా ఏర్పడి, సుదాసుడిమీదకు యుద్ధానికి వచ్చారు. ఈ కూటమిని అందుకే 'దాసరాజ' కూటమిగా అంటారు. ఈ యుద్ధంలో తనకు తోడ్పడవలసిందిగా సుదాసుడు, త్రస్యులనే వారి సహాయం కోరతాడు. త్రస్యుల గురువు వశిష్ఠుడు కావటంతో, విశ్వామిత్రుడిని తన పురోహిత పదవినుంచి తొలగించి, వశిష్ఠుడినే తన గురువుగా సుదాసుడు నియమించుకున్నాడు. అక్కడితో విశ్వామిత్రునికి వశిష్ఠునిపట్ల ఆగ్రహం ఆరంభం అయింది. ఇది చాలదన్నట్లుగా, ఈ యుద్ధంలో వశిష్ఠుని సలహాలు తీసుకున్న సుదాసుడు విజేత అయ్యాడు. విశ్వామిత్రుని సూచనలు తీసుకున్న దశరాజులు ఓడిపోయారు. ఈ కారణాలవల్ల విశ్వామిత్రునికి వశిష్ఠుడిపట్ల ద్వేషభావం పెరిగింది. 

    ఈ యుద్ధాన్ని 'దాశరాజ యుద్ధం'గా వేదకాలంలో పేర్కొనేవారు. యుద్ధ వర్ణన అంతా ఋగ్వేదంలోని 7వ మండలం, 18వ సూక్తంలో ఉంది.

ఈ కథ ప్రపంచ కథా వాజ్ఞయంలో మొట్టమొదటిదిగా పేరొందింది. 

వశిష్ఠునితో వైరం - భారతంలోని కథ 
    అయితే, విశ్వామిత్ర వశిష్టుల వైరానికి కారణంగా మరో కథనూ చెప్తారు. ఇది భారతంలో ఉంది. విశ్వామిత్రుడు, కృశాశ్వుడి దగ్గర అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. ఒకసారి, విశ్వరథుడు (అప్పటికి ఆయనవిశ్వామిత్రుడు కాలేదు) రాజుగా తన 100మంది కుమారులతో, ఇతర బంధు సైన్యాలతో వేటకు వెళ్తాడు. అక్కడ, వేటలో అలసిన రాజు, వశిష్ఠుని ఆశ్రమం చేరతాడు. అంతమంది అనుకోకుండా వచ్చినా, వశిష్ఠుడు ఏమాత్రం తొణకుండా, తన హోమధేనువు అయిన నందినిని కోరి, క్షణాలమీద, వారందరికీ షడ్రసోపేతమైన విందును సమకూర్చాడు. ఇంద్రునివద్దనున్న కామధేనువు 'సురభి' కుమార్తె ఈ నందిని. (దీనికే 'సబల' అని మరో పేరు.) ఇంత శక్తిగల ధేనువు తనవద్ద ఉంటే బాగుంటుందన్న కోరికను వ్యక్తం చేస్తాడు విశ్వరథుడు. అయితే, తాను తన హోమధేనువు అయిన నందిని ఇవ్వలేనని, కావాలంటే ప్రతిగా ఒక లక్ష గోవులను ఇవ్వగలననీ వశిష్ఠుడు స్పష్టం చేస్తాడు. దీనికి ప్రతిగా విశ్వరథుడు, 'నేను మీకు స్వర్ణభూషితమైన 14 వేల ఏనుగులను, ఒక్కొక్కటీ నాలుగు శ్రేష్ఠమైన శ్వేతాశ్వాలతో లాగబడే 800 స్వర్ణరథాలను, 11వేల స్వర్ణభరితమైన మంచి గుర్రాలను, 10వేల గోవులను, వీటన్నింటికీ అదనంగా తాము కోరినంత బంగారాన్నీ ఇస్తాన'ని అంటాడు. అయినా, తన కామధేనువు నందినిని ఇవ్వలేనని వశిష్ఠుడు స్పష్టం చేస్తాడు. దీనితో ఆ విశ్వరథ మహారాజుకు మరింత కోపం వస్తుంది. వెంటనే, వశిష్ఠుడి గోవును బలవంతంగా తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. అంతేకాక, వశిష్ఠుడిమీదకు తన సైన్యాలను ఉసి గొల్పుతాడు. దానితో, వశిష్ఠుడు తన నందిని గోవును ప్రేరేపిస్తాడు. ఫలితంగా, నందినినుంచి అనూహ్యమైన శబర సైన్యం వెలువడుతుంది. ఆ శబరసైన్యం రాజుగారి సైన్యాన్ని పూర్తిగా ఓడిస్తుంది. 

బ్రహ్మర్షి కావాలనే కాంక్ష
    ఈవిధంగా వశిష్ఠుడి చేతిలో ఘోరపరాభవం పొందిన విశ్వరథుడు, అడవులలోకి వెళ్లి, తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి, పరమశివుడు ప్రత్యక్షమై, విశ్వరథునికి అనేక అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తాడు. ఆ శక్తితో మళ్లీ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చి, తనవద్దనున్న పాశాలను, అస్త్రాలను వశిష్ఠుడిమీద ప్రయోగిస్తాడు. వశిష్ఠుడు వాటిని తన మంత్రశక్తితో పరిహరిస్తాడు. ఆ అవమానం భరించలేక విశ్వరథుడు తనవద్దనున్న ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదికూడా వశిష్ఠుడి శక్తిముందు నిష్ఫలం అవుతుంది. దానికి కోపించిన విశ్వరథుడు తన వద్దనున్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదికూడా వశిష్ఠుడి యోగదండం (బ్రహ్మదండం) ముందు నిష్ఫలమే అవుతుంది. ఇది విశ్వరథుడికి మరింత కోపాన్ని కలిగిస్తుంది. వశిష్ఠుడి పట్ల ద్వేషం పెంచుతుంది. 'ఒక చిన్నకర్ర ముక్క అయిన యోగదండానికి ఇంత శక్తి ఉండటం అసాధ్యం. బహుశా, ఇదంతా వశిష్ఠుడు బ్రహ్మర్షి కావటంవల్లనే సంభవించి ఉంటుందనీ, ఏనాటికైనా తానుకూడా వశిష్ఠునిలాగనే బ్రహ్మర్షి అయితీరాల'నీ విశ్వరథుడు నిర్ణయించుకుంటాడు. 

    ఈ లక్ష్యసాధనకోసం ఆయన వెంటనే, తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, తాను అడవులలోకి వెళ్లి కఠోరమైన తపస్సును చేపడతాడు. 

    అనేక సంవత్సరాలపాటు ఇలా విశ్వరథుడు తపస్సు చేశాక, ఒకనాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, 'అనేక తపసస్వంతు రాజర్షి రితి విద్మహే!' అని విశ్వరథుడిని 'రాజర్షి'గా గుర్తిస్తూ దీవిస్తాడు. తాను కోరుకునేది 'బ్రహ్మర్షి'త్వమైతే, తనకు లభించింది 'రాజర్షి'త్వమేనన్న అసంతృప్తికి లోనైన విశ్వరథుడు తిరిగి, తన తపస్సును కొనసాగిస్తాడు. 

త్రిశంకు స్వర్గ నిర్మాణం
    విశ్వామిత్రుడి గురించిన కథలలో 'త్రిశంకు స్వర్గ నిర్మాణం' కథ చాలా సుప్రసిద్ధం. ఆ కథ ఇది: 

    ఇక్ష్వాకు కులజుడైన సత్యవ్రతుడనే రాజుకు బొందితోనే స్వర్గానికి చేరుకోవాలనే కాంక్ష కలిగింది. ఈ రాజుకే 'త్రిశంకువు' అనే పేరుకూడా ఉంది. తనను బొందితోనే స్వర్గానికి పంపమని సత్యవ్రతుడు వశిష్ఠుడిని కోరాడు. అయితే, అది అసాధ్యమని వశిష్ఠుడు స్పష్టం చేశాడు. తర్వాత, సత్యవ్రతుడు, వశిష్ఠుని కుమారులను కోరాడు. వాళ్లుకూడా అది అసాధ్యమేనని చెప్పారు. దీనితో, సత్యవ్రతుడికి ఆగ్రహం కలిగి, వశిష్ఠకుమారులను తీవ్రంగా దూషిస్తాడు. ఆ దూషణకు ఆగ్రహించిన వశిష్టకుమారులు, సత్యవ్రతుడిని చండాలుడివి కమ్మని శాపం ఇస్తారు. వెంటనే సత్యవ్రతుడి రూపం మారిపోతుంది. అయినా, సత్యవ్రతుడి ఆశ చావక, వశిష్ఠునిపై ఆగహ్రం ఉన్న విశ్వామిత్రుడిని శరణు కోరి, తనను బొందితో స్వర్గానికి పంపవలసిందిగా కోరతాడు. అది అసాధ్యమని వశిష్ఠుడు అన్నాడని తెలుసుకున్న విశ్వామిత్రుడు, ఆ కోరికను తాను తీరుస్తానని సత్యవ్రతుడికి మాట ఇస్తాడు. బొందితో నేరుగా సత్యవ్రతుడిని స్వర్గానికి పంపటానికి తగిన శక్తిని అతనికి సమకూర్చేందుకు అతని చేత తగిన యజ్ఞం చేయిస్తాడు. తన సకల తపోశక్తినీ ధారపోసి, సత్యవ్రతుడిని బొందితో స్వర్గానికి పంపే ప్రయత్నం చేస్తాడు. సత్యవ్రతుడు స్వర్గం వరకూ చేరతాడు కానీ, అక్కడకు 'వశిష్ఠకుమారులచేత చండాలుడివి కమ్మని శాపం పొందిన నీకు స్వర్గప్రవేశ అర్హత లేద'ంటూ, స్వర్గంలోకి అతన్ని రానీయక, ఇంద్రుడు అతడిని కిందకు తోసేస్తాడు. దాంతో, సత్యవ్రతుడు స్వర్గంనుంచి పెడబొబ్బలు పెట్టుకుంటూ, తిరిగి కిందకు పడిపోనారంభిస్తాడు. దానికి  కోపించిన విశ్వామిత్రుడు, ఇంద్రుడినే ఇంద్రపదవినుంచీ తొలగించాలని ఆశిస్తాడు. ఈ విషయం తెలిసి, ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడి వద్దకు చేరి 'స్వామీ! త్రిశంకుడికి వశిష్ఠకుమారుల శాపం ఉంది గనుకనే, మేము అతనికి స్వర్గప్రవేశం కల్పించలేకపోయాం.. ఇందులో మా తప్పేమీ లేదు' అని వేడుకుంటారు. దానితో, విశ్వామిత్రుడి కోపం కొంత చల్లారుతుంది. 'అయితే, ఒక్క మాట! త్రిశంకునికి స్వర్గప్రవేశం కల్పిస్తానని నేను మాట ఇచ్చాను, ఆప్రకారమే అతనికి స్వర్గప్రవేశం కల్పించి తీరతాను! దానికై మరో స్వర్గాన్ని అయినా సృష్టించి తీరతాను!' అని విశ్వరథుడు స్పష్టం చేస్తాడు. ఆ ప్రకారమే సత్యవ్రతుడిని భూలోకానికీ, స్వర్గలోకానికీ మధ్యనే ఉండమని శాసిస్తూ, అతనికోసం ఒక కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాడు. అక్కడ త్రిశంకునికోసం విశ్వామిత్రుడు, సప్త గ్రహాలను, సప్తర్షులను, 27 నక్షత్రాలనూ సృష్టిస్తాడు. అదే 'త్రిశంకు స్వర్గం' అయింది.

విశ్వరథుడు 'విశ్వామిత్రుడు' కావటం
    అప్పుడు దేవగురువైన బృహస్పతి 'విశ్వరథా! తమరు కోరినట్లు మీరు సృష్టించిన స్వర్గంలోనే త్రిశంకుడిని ఉండనీయండి. మీరు సృష్టించిన సప్తగ్రహాలనూ శాశ్వతంగా ఉండనీయండి.. దయచేసి, మా అభ్యర్థన మన్నించి, మీ పంతాన్ని విడనాడండి!' అని కోరతాడు. దేవతల గురువు వచ్చి కోరినందుకు విశ్వరథుడు దానికి అంగీకరించి, ఇంద్రుడిని పదవీచ్యుతుడిని చేసే తన ప్రయత్నాన్ని విరమిస్తాడు. ఈ విధంగా, విశ్వరథుడు తన మాట విని విశ్వశ్రేయస్సుకు దోహదం చేశాడు కనుక ఇకపై 'విశ్వామిత్రుడు'గా వ్యవహరింపబడతాడని బృహస్పతి ప్రకటిస్తాడు. ఇలా విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని సృష్టికి ప్రతిసృష్టిని చేసి, అపర బ్రహ్మ కాగలిగాడు. ఇదికూడా విశ్వామిత్రునికి వశిష్ఠునిపట్ల గల వైరం కారణంగానే జరిగిందన్నది స్పష్టం. వశిష్ఠుడు కాదన్నా, సత్యవ్రతుడిని స్వర్గానికి పంపగల శక్తి తనకు ఉందనీ, అవసరమైతే తాను సృష్టికి ప్రతిసృష్టి చేసి అయినా, పంతం నెగ్గించుకోగలననీ విశ్వామిత్రుడు ఋజువు చేసిన ఘట్టం ఇది. 

    ఈవిధంగా విశ్వామిత్రుడు అప్పటివరకూ తాను సాధించిన సమస్త తపశ్శక్తిని త్రిశంకునికోసం వినియోగించడంతో, మళ్లీ తపశ్శక్తిని సంపాదించుకోవడానికి సిద్ధపడతాడు. ఏం చేసినా తనకు బ్రహ్మర్షిత్వం సిద్ధించకపోవటం, విశ్వామిత్రుడిని బాధిస్తుంటుంది. 

    ఆ విధంగా నిరాశలో మునిగిన విశ్వామిత్రునికి ఒకరోజు అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై, 'ఎంత తపస్సు చేస్తున్నా, ఇంకా మీలో ఆగ్రహావేశాలు మిగిలే ఉన్నాయి, వాటిని జయించినట్లయితేనే మీకు బ్రాహ్మణ్యం సిద్ధిస్తుంది. బ్రాహ్మణ్యం సిద్ధించిన తర్వాతనే మీరు 'బ్రహ్మర్షి' కాగలరు' అని చెప్పి మాయమవుతారు. దానితో విశ్వామిత్రుడు తన 'బ్రహ్మర్షి'త్వ సాధన కృషిలో మళ్లీ తపస్సులో నిమగ్నమవుతాడు.  

హరిశ్చంద్రుని కథ
    విశ్వామిత్రుడు కొత్తగా సృష్టించిన స్వర్గానికి త్రిశంకుడు బొందితో చేరిన తర్వాత కోసల దేశానికి త్రిశంకుని కుమారుడైన హరిశ్చంద్రుడు 28వ రాజైనాడు. ఈయన భార్య చంద్రమతి (ఈమెను 'తారామతి' అనటమూ ఉంది.) ఈ దంపతులకు సుదీర్ఘకాలంపాటు బిడ్డలు కలగలేదు. దీనితో ఆ దంపతులు తపస్సు చేస్తే, వారికి వరుణుడు ప్రత్యక్షమవుతాడు. 'నీకు ఇంతటి పుత్రసంతాన కాంక్ష ఎందుకు?' అని వరుణుడు ప్రశ్నిస్తే, దానికి జవాబుగా హరిశ్చంద్రుడు 'అపుత్రస్య గతిర్నాస్తి' అనికదా పెద్దలు అంటారు, అందుకే, మాకు ఉత్తమగతులు కలిగేందుకు పుత్రసంతానాన్ని కోరుకుంటున్నాం' అని జవాబు ఇస్తాడు. 'మాకు పుత్రుడు జన్మిస్తే చాలు, తల్లిదండ్రులమని మేము అనిపించుకున్న వెంటనే, ఆ బిడ్డను మీకే సమర్పించుకుంటాం!' అంటాడు హరిశ్చంద్రుడు. దానికి వరుణుడు సమ్మతించి, ఆ దంపతులకు పుత్రసంతానయోగాన్ని కలుగజేస్తాడు. ఆ వరప్రసాదంగా వారికి 'లోహితుడు' (రోహితుడు) అనే కుమారుడు జన్మిస్తాడు. అన్నమాట ప్రకారం ఆ బిడ్డను తనకు అందజేయమని వారిని వరుణుడు కోరతాడు. అయితే, బిడ్డ జన్మించిన వెంటనే అప్పగించటం అంటే, తమకు ఇంకా మమకారం పోలేదనీ, కొంతకాలం తర్వాత బిడ్డను అప్పగిస్తామనీ హరిశ్చంద్రచంద్రమతులు వరుణదేవునికి విన్నవిస్తారు. దానికి వరుణుడు సమ్మతించి వెళ్లిపోతాడు. మళ్లీ కొన్నాళ్లకు వరుణుడు వచ్చి, తనకు వాగ్దానం చేసిన బిడ్డను తనపరం చేయమని కోరతాడు. దానికి హరిశ్చంద్రుడు అంగీకరించక, మరో వంక చెప్తాడు. ఇలా కొంతకాలం గడిచాక, వరుణుడు వచ్చి, మళ్లీ ఆ బిడ్డను తనపరం చేయమని కోరతాడు. అప్పటికీ హరిశ్చంద్రుడు అంగీకరించడు. దానితో వరుణుడు కోపించి, 'ఇచ్చిన మాటను తప్పిన దోషానికి 'మహోదర'మనే వ్యాధికి గురి కమ్మ'ని హరిశ్చంద్రునికి శాపం ఇస్తాడు. ఫలితంగా హరిశ్చంద్రుని ఉదరం (కడుపు) అమితంగా పెరగనారంభిస్తుంది. ఎన్ని రకాల వైద్యం చేయించినా, ఆ వ్యాధి తగ్గకపోవటంతో హరిశ్చంద్రుడు పశ్చాత్తాపం చెందుతాడు. తను ఇచ్చిన మాటను తప్పటంవల్లనే తనకు ఈ వ్యాధి సంక్రమించిందని అంగీకరిస్తూ, తన బిడ్డ లోహితుడికి ఆ విషయం చెప్తాడు. ఇకపై, జీవించి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమాడనని ప్రమాణం చేస్తాడు. వెంటనే, ఆ 'మహోదర'మనే వ్యాధి తగ్గుముఖం పట్టి, క్రమంగా పూర్తిగా తగ్గిపోతుంది. 

శునశ్శేఫుని కథ
    అయితే, లోహితుడికి తనను తండ్రి వరుణుడికి ఇస్తాననటం నచ్చదు. అందుకే, రాజ్యం వదిలి, అడవులలోకి వెళ్లిపోతాడు. అక్కడ తిరుగుతున్నప్పుడు, లోహితుడికి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబానికి అజీగర్తుడు పెద్ద. ఈ అజీగర్తునికే 'రుచీకుడు' అనే మరో పేరూ ఉంది. వారికి ముగ్గురు కుమారులు. తనకు వచ్చిన కష్టాన్ని ఆ దంపతులకు చెప్పి, లోహితుడు తనకు మారుగా వరుణునివద్దకు వెళ్లేందుకు ఒక కుమారుడిని ఇవ్వవలసిందిగా ఆ దంపతులను కోరతాడు. దానికి ప్రతిఫలంగా ఎంత ధనమైనా ఇప్పిస్తానని తెలియజేస్తాడు. అయితే, ధనవ్యామోహంతో కాకుండా, కోసల దేశానికి అధిపతి కాగల ఒక వారసుడు రాజుకు ఉండాలనే భావనతో, తమ కుమారులలో ఒకరిని ఇవ్వడానికి ఆ దంపతులు అంగీకరిస్తారు. అయితే, పెద్దకుమారుడు తనకు ఇష్టమనీ, అందుచేత అతనిని ఇవ్వనని అంటాడు అజీగర్తుడు. దానికి ప్రతిగా అతని సతీమణి, తనకు చిన్న కుమారుడంటే ఇష్టంగనుక అతనిని ఇవ్వలేమని అంటుంది. దానితో, లోహితునికి మారుగా వరుణునివద్దకు వెళ్లటానికి రెండవ కుమారుడు అంగీకరించక తప్పదు. ఈవిధంగా తననుతాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడిన అజీగర్తుని రెండవ కుమారుడే శునశ్శేఫుడు. 

    శునశ్శేఫుడి గురించి మరొక కథా ఉంది. ఆ కథ ఇది: 

    అయోధ్యారాజ్యానికి రాజైన అంబరీషుడు ఒకసారి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. దానికి ఒక యజ్ఞపశువును సిద్ధం చేస్తారు. కానీ, దాన్ని ఇంద్రుడు దొంగలిస్తాడు. ఆ సంగతి తెలియని అంబరీషుడు దానికై నలుమూలలా వెతికిస్తాడు. ఎక్కడా ఆ పశువు జాడ కానరాదు. దానితో తను ఆశించిన యజ్ఞం నిష్ఫలం అవుతుందన్న భయంతో తమ రాజపురోహితుడిని సంప్రదిస్తాడు. యజ్ఞపశువు లేనప్పుడు దానికి పరిహారంగా ఒక నరుడిని యజ్ఞపశువుగా బలి ఇవ్వవచ్చునని ఆ పురోహితుడు సూచిస్తాడు. అలా యజ్ఞాన్ని పూర్తి చేయలేని పక్షంలో రాజ్యానికి అరిష్టం తప్పదని స్పష్టం చేస్తాడు. ఆ సమయంలో దేశమంతా తీవ్రమైన కరవుతో అల్లాడుతోంది. చేసేదిలేక, అజీగర్తుడు అనే ఒక బ్రాహ్మణుడు, తన ముగ్గురు కుమారులలో రెండవ వాడైన శునశ్శేఫుడిని బలిపశువుగా అమ్మేస్తాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసింది. ఆయన వెంటనే,  శునశ్శేఫునికి ఒక మంత్రం (ఇమమ్‌ మేవ వరుణశ్రుధిః) ఉపదేశించి, దాన్ని పఠిస్తూ ఉండమని చెప్తాడు. ఆ అబ్బాయి ఆ ప్రకారమే చేస్తుంటాడు. యజ్ఞంలో భాగంగా శునశ్శేఫుడిని యూపస్తంభానికి కడతారు. ఇక అతని బలి జరుగుతుందనగా, ఇంద్రాది దేవతలు వచ్చి అతన్ని రక్షిస్తారు. 'దేవతలచేత రక్షింపబడినవాడు' కాబట్టి అతనికి 'దేవరథుడు' అనికూడా పేరు కలిగింది. విశ్వామిత్ర గోత్రంలోని ప్రవరలో ఒక ఋషి అయిన 'దేవరథుడు' శునశ్శేఫుడే!!

    అంబరీషుని కథ 'ఋగ్వేదం'లో ఉంది. 

    అయితే, శునశ్శేఫుడు, రుచికుడనే ఒక ఋషి కుమారుడనీ అంటారు. అజీగర్తుడు, రుచీకుడు ఒకరో కాదో.. తెలియటం లేదు. 

ఆంధ్రుల ఆవిర్భావం కథ
    ఈ రుచికుడికీ ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడినిఅంబరీషునికి బలిపశువుగా ఇవ్వలేనని రుచికుడు అంటే, చిన్నకుమారుడిని తాను వదులుకోలేనని రుచికుని భార్య అంటుంది. దీనితో, తల్లీదండ్రుల ప్రేమకు నోచుకోని తాను అంబరీషునికి బలిపశువుగా వెడతానని శునశ్శేఫుడు అంటాడు. లక్ష గోవులను ప్రతిగా తీసుకుని, శునశ్శేఫుడిని బలిపశువుగా అంబరీషుడికి రుచికుడు ఇచ్చేస్తాడు. కానీ, శునశ్శేఫుడికి జీవించాలనే కోరిక బలీయంగా ఉంటుంది. అందుకే, అంబరీషునితో వెడుతున్నప్పుడు, మార్గమధ్యంలో పుష్కర అడవులలో విశ్రమిస్తారు. అక్కడే, తన మేనమామ అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడని తెలిసి, శునశ్శేఫుడు ఆయన శరణు కోరతాడు. దానికి విశ్వామిత్రుడు సరేనని,  అతనిస్థానే బలిపశువుగా తన కుమారులలో ఒకరిని వెళ్లమని అడుగుతాడు. 'ఎవరి బిడ్డకోసమో నీ బిడ్డ ప్రాణాలను బలి ఇస్తానంటావా!' అంటూ విశ్వామిత్రుని కుమారులు విశ్వామిత్రుని మాటను పాలించేందుకు తిరస్కరిస్తారు. దీనికి కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు, తన కుమారులను 'కుక్క మాంసం తిని జీవించే జాతిగా జన్మించమ'ంటూ శపిస్తాడు. అలా జన్మించిన వారిలో 'అంధక' జాతి ఒకటి. వారి సంతతే నేటి 'ఆంధ్రులు' అని మరో కథ ఉంది. 

    మరికొన్ని కథల ప్రకారం- శునశ్శేఫుడిని తన కుమారుడిగా స్వీకరించిన విశ్వామిత్రుడు, తన ఇతర కుమారులను పిలిచి, ఆ విషయమే చెప్తాడు. కానీ, శునశ్శేఫుడిని తమ అన్నగా ఆమోదించడానికి విశ్వామిత్రుని పుత్రులలో అధికులు (మొదటి 50 మంది) అంగీకరించరు. అంగీకరించిన మిగిలిన వారిలో మధుచ్ఛందుడు వంటి వారు ఉన్నారు. తన మాట వినని వారిని విశ్వామిత్రుడు 'తండ్రి మాట వినని మీరంతా అనాగరిక జాతులుగా జీవనం సాగించండి' అంటూ తీవ్రంగా శపిస్తాడు. విశ్వామిత్ర శాపగ్రస్తులై, అలా జన్మించిన వారిలో ఆంధ్రులుకూడా ఉన్నారని, వీరు ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు పుండ్ర, శబర, పుళింద, మూతిబ వంటి జాతివారలతో కలిసి జీవించారని ఒక కథ. హస్తినాపుర పాలకుడైన ధర్మరాజు, రాజసూయం చేసినప్పుడు వీరు ధర్మరాజును దర్శనం చేసుకుని, విలువైన కానుకలు చెల్లించుకున్నారని ఐతరేయ బ్రాహ్మణం వివరిస్తోంది. 

    ఐతరేయ బ్రాహ్మణంలోని మరొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించవించడం సమంజసం. 

    
'తస్య విశ్వామిత్రైకక్షతమ్‌ అసుః పంచశతేక జ్యయమ్సో మధుచ్ఛనః దశపంచశత్‌ కనియాంశం తద్యైజ్యం సు న తో కులమ్‌ మెనెరేతన్‌ అను-వ్యాజహరణ్‌ తన్వా ప్రజాభక్షిస్థితి త ఏతి ఆంధ్ర పుండ్ర శబరి పుథింద మూతిబ ఇత్యుదంత్య బహవో వైశ్వామిత్ర దశ్యునామ్‌ భూయిష్ఠాః'

    ఇక్కడ ఇలా ఉన్నా మరికొన్నిచోట్ల ఆంధ్రులు, వశిష్ఠుని వద్ద గల నందిని గోవునుంచి, విశ్వామిత్రుని ఆక్రమణను ఎదుర్కొవటానికి జనించిన వివిధ జాతుల సౖౖెన్యాలలో ఒకరని ఉంది. ((History of Andhras up to 1565 AD, by Sri Durga Prasad, Page: 7, Pub. by P G Publishers, Guntur-10).  

    శునశ్శేఫుడికి శరణు ఇచ్చిన విశ్వామిత్రుడు, అతనికి రెండు మంత్రాలను బోధిస్తాడు. 'యజ్ఞవాటికలో ఈ రెండు మంత్రాలనూ పఠిస్తూ ఉండు! ఇంద్రుడు ప్రత్యక్షమై, నిన్ను రక్షిస్తాడు' అని చెప్పి, శునశ్శేఫుడిని తిరిగి అంబరీషుని వద్దకు పంపేస్తాడు. విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారమే, ఆ మంత్రాలను పఠిస్తూ ఉన్న శునశ్శేఫుడిని ఇంద్రుడు రక్షిస్తాడు. అంబరీషుని యజ్ఞాన్ని ఇంద్రుడు సఫలం చేస్తాడు. 

    అయితే, హరిశ్చంద్రుని కథ అంతటితో అయిపోలేదు. వరుణుడి బారినుంచి తన కుమారుడిని రక్షించుకున్న హరిశ్చంద్రుడు సత్యవ్రతదీక్షను పాటిస్తూ, ముల్లోకాలలో విశేషమైన కీర్తిని సంపాదించుకున్నాడు. 

    తనకు బలి కానున్న శునశ్శేఫుడిని రక్షించి, తన బిడ్డగా ఆమోదించిన విశ్వామిత్రుడిని వరుణుడు అభినందించి, తనతో స్వర్గానికి రావాల్సిందిగా కోరతాడు. దీనికి సమ్మతించి విశ్వామిత్రుడు స్వర్గానికి చేరుకుంటాడు. ఒకనాడు స్వర్గంలో ఉన్న ఇంద్రాది దేవతలు, అష్ట దిక్పాలకులు, అనేక ఋషిపుంగవులు అనేక విషయాలను చర్చించుకుంటున్న సమయంలో 'సమస్త లోకాలలోనూ నిత్యం సత్యానికి కట్టుబడి ఉండటం ఎవరికైనా సాధ్యమా?' అన్న విషయం చర్చకు వచ్చింది. అలా నిత్యం సత్యం చెప్పటం ఎవరికైనా కష్టమేనని పలువురు భావిస్తున్న తరుణంలో, వశిష్ఠుడు లేచి 'కోసల దేశ ప్రభువైన తన శిష్యుడు హరిశ్చంద్రుడు నిత్య సత్యవ్రతుడు' అని ఘంటాపథంగా చెప్తాడు. దీనికి అదే సభలో ఉన్న విశ్వామిత్రుడు అభ్యంతరం చెప్తూ 'నిత్య సత్య వ్రతం సామాన్యమైన విషయంకాదు.. సత్యశీలిగా ఎంతటి పేరున్నా హరిశ్చంద్రుడు సైతం ఏదో ఒక సందర్భంలోనైనా అసత్యం పలికి తీరతాడు' అని అంటాడు. దీనికి వశిష్ఠుడు తన అసమ్మతి తెలుపుతాడు: 'హరిశ్చంద్రుడు నిత్యసత్యవంతుడు. ఎవరైనా దీన్ని పరీక్షించుకోవచ్చు'నని అంటాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచి 'ఈ పరీక్ష నేనే చేపడతాను! హరిశ్చంద్రుడిచేత అసత్యాన్ని పలికిస్తాను!' అని చెప్పి కోసల దేశం చేరతాడు. 

    అక్కడ హరిశ్చంద్రుడిని కలుసుకుని, తానొక యజ్ఞం తలపెట్టాననీ, దానికి అపారమైన ధనం ఖర్చవుతుందనీ చెప్తూ, సహాయం అభ్యర్థిస్తాడు. 'లోకకల్యాణంకోసం జరిగే ఆ యజ్ఞానికి ఎంత ధనమైనా తాను సమకూర్చుతాన'ని హరిశ్చంద్రుడు మాట ఇస్తాడు. 'ఆ యజ్ఞానికి అవసరమైనది తృణమో పణమో కాదు. ఒక ఎత్తైన కొండమీద ఒక బలమైన ఏనుగు నిలబడి ఉండగా, దానిమీద ఒక బలిష్టుడైన ఒక వ్యక్తి నిలబడి, ఒక యంత్రంద్వారా పైకి విసిరిన ఒక రాయి ఎంత పైకి చేరుతుందో అంత ఎత్తు బంగారం నా యజ్ఞానికి అవసరం అవుతుంది. అంతటి బంగారాన్ని సమకూర్చడం నీకు సాధ్యమవుతుందో లేదో ఆలోచించుకో' అని హెచ్చరిస్తాడు. అయితే, తానొకసారి యజ్ఞనిర్వహణకు అవసరమైన ధనాన్ని సమకూర్చేందుకు సిద్ధపడి, మాట ఇచ్చాననీ, ఎట్టి పరిస్థితులలోనైనా దానికి కట్టుబడే ఉంటానని హరిశ్చంద్రుడు స్పష్టం చేస్తాడు. 'సరే అయితే, నీవద్దనుంచి ఆ ధనాన్ని నాకొరకు తీసుకునేందుకు నక్షత్రకుడనే నా శిష్యుడిని ఉంచుతాను' అంటూ ధనాన్ని వసూలు చేసే బాధ్యతను నక్షత్రకునికి అప్పగించి విశ్వామిత్రుడు వెళ్లిపోతాడు. తర్వాత తాను అన్నమాట ప్రకారం, విశ్వామిత్రుని యాగానికి సరిపడే ధనాన్ని సమకూర్చడానికి ముందుగా తన రాజ్యాన్ని, తర్వాత తన కుమారుడు లోహితుడినీ, తర్వాత భార్య చంద్రమతినీ, చివరగా తన్నుతాను హరిశ్చంద్రుడు అమ్ముకుంటాడు. 'ఇన్ని కష్టాలు దేనికీ.. డబ్బు ఇవ్వలేను' అని ఒక్క మాట చెప్తే తాము వెనుదిరిగి వెళ్లిపోతామని నక్షత్రకుడు ఎంత ప్రలోభపెట్టినా, హరిశ్చంద్రుడు ఆ ప్రలోభాలకు లొంగడు, సరికదా తన సత్యవ్రతానికి కట్టుబడి ఉంటాడు. ఆఖరికి పాము కాటుకు గురైన తన కన్న కుమారుడి చితిని అంటించడానికి సైతం డబ్బు ఇవ్వలేని భార్య చంద్రమతిని ఆమె మెడలో ఉన్న తాళిని అమ్మి, శ్మశానంలో చెల్లించవలసిన సుంకాన్ని చెల్లించవలసిందిగా హరిశ్చంద్రుడు కోరతాడు. తన భర్తకు తప్ప మరెవ్వరికీ కానరాని తాళిని గుర్తించిన ఆ కాటికాపరి తన భర్త హరిశ్చంద్రుడేనని చంద్రమతి గుర్తిస్తుంది. ఇన్ని కష్టాలలోనూ అసత్యవచనం పలుకని హరిశ్చంద్రుని సత్యదీక్షను చివరికి విశ్వామిత్రుడు ఆమోదించి, వశిష్ఠుడు చెప్పినట్లు హరిశ్చంద్రుని సత్యదీక్ష అనితర సాధ్యమనీ, హరిశ్చంద్రుని సత్యవ్రతం ముల్లోకాలకు ఆదర్శమనీ అంగీకరిస్తాడు. 

    ఈ వృత్తాంతం తర్వాత, వశిష్ఠుడిముందు మళ్లీ తను ఓటమి పాలవటంతో నిరాశ చెందిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనే తన తపనలో తిరిగి, తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతాడు. 

మేనక వృత్తాంతం
    విశ్వామిత్రుని ఇంత తీవ్రమైన తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు కంకణం కట్టుకుని, ఇంద్రలోకనర్తకీమణులలో (రంభ, ఊర్వశి, మేనకలు) ఒకరైన మేనకను పంపిస్తాడు. పుష్కర సరస్సులో స్నానం చేస్తున్న మేనకను చూసి మోహించిన విశ్వరథుడు, తన తపస్సు లక్ష్యాన్ని విస్మరించి, మేనకపై మరులు పెంచుకుని, ఆమెతో సంసారం చేస్తాడు. వారిద్దరి దాంపత్యబంధం కారణంగా వారికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. తను వచ్చిన పని దిగ్విజయంగా పూర్తయిందన్న భావనతో, తను కన్న ఆడపిల్లను విశ్వామిత్రుడికి అప్పగించి, మేనక తిరిగి ఇంద్రలోకానికి పయనం కడుతుంది. దానితో విశ్వామిత్రుడికి నిజం తెలుస్తుంది. తను ఆశించిన బ్రహ్మర్షి స్థానం పొందాలంటే, తనవల్ల మేనకకు కలిగిన ఈ ఆడపిల్ల తనకు అవరోధం కారాదని భావిస్తూ, ఆమెను అక్కడి శకుంతల పక్షులకు అప్పగించి, తాను తిరిగి, తపస్సుకు వెళ్లిపోతాడు విశ్వామిత్రుడు. అయితే, తన తపస్సుకు పుష్కర అటవీప్రాంతం సరైనది కాదని భావిస్తూ, ఈసారి విశ్వామిత్రుడు హిమాలయాలలోని కౌశికీ నదీ ప్రాంతానికి వెళ్తాడు. శకుంతల పక్షుల పెంపకంలో పెరిగిన ఆ ఆడపిల్లే 'శకుంతల'గా పేరొందింది. ఆమెను ఆతర్వాత, కణ్వ మహర్షి పెంచి, పెద్ద చేశాడు. అక్కడే శకుంతల, దుష్యంతుడిని గాంధర్వ వివాహం చేసుకుంది. ఆ దంపతుల కుమారుడే భరతుడు. ఈ గాథనంతా మహాకవి కాళిదాసు తన 'అభిజ్ఞాన శాకుంతలం' పేరిట నాటకరూపంలో గ్రంథస్థం చేశాడు. రంభకు శాపం

    ఈవిధంగా కౌశికీనదీ తీరాన ఘోరమైన తపస్సును చేస్తున్న విశ్వామిత్రుడి ధ్యానాన్ని భగ్నం చేయాలనే కోరికతో, ఇంద్రుడు తిరిగి, రంభను విశ్వామిత్రుడి దగ్గరకు పంపాలని ఆశిస్తాడు, అయితే, 'ఆ ముని కోపిష్టి, నేను వెళ్లను' అంటుంది రంభ. 'భయపడాల్సిన పని లేదు, నేను ఒక కోకిల రూపంలో నీకూడానే ఉంటాను.. నేను కోకిలగానాన్ని వినిపించగానే, విశ్వామిత్రుడు నిన్ను చూసి మోహిస్తాడు, ఆవిధంగా ఆయన తపస్సును మనం భగ్నం చేయగలం' అంటూ రంభను ఇంద్రుడు పంపిస్తాడు. ఆవిధంగానే కోకిల రూపంలో ఉన్న ఇంద్రుడు కూయగానే, తపస్సునుంచి తలెత్తిన విశ్వామిత్రుడికి తన ఎదురుగా రంభ కనిపిస్తుంది. దాన్ని ఇంద్రుడి కుట్రగా గుర్తించిన విశ్వామిత్రుడు, వెంటనే 'నన్ను మోసం చేయడానికి వచ్చిన నువ్వు ఒక శిలగా మారిపో!' అంటూ రంభను శపిస్తాడు. ఇది చూడగానే ఇంద్రుడు పారిపోతాడు. ఆమె భయంతో ఆయన కాళ్లమీద పడగానే, విశ్వామిత్రుడు కోపం తగ్గించుకుని, 'పదివేల సంవత్సరాలపాటు నీకు ఈ శిక్ష తప్పదు, అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నీకు శాపవిమోచనం చేస్తాడు' అని అనుగ్రహించి మళ్లీ తపస్సుకు పయనమవుతాడు. 

    ఇక్కడ విశ్వామిత్రుడు, రంభను శపిస్తూ, ఒక బ్రాహ్మణ పుంగవుడు ఆమెకు శాపవిమోచన భాగ్యం కలుగజేస్తాడని చెప్పినా, ఆ బ్రాహ్మణుడు వశిష్ఠుడేనని ఆయన భావన అని అంటారు. ఆ బ్రాహ్మణుని లక్షణాలను విశ్వామిత్రుడు పేర్కోనే శ్లోకం ఇలా ఉంది:

    
'బ్రాహ్మణా సుమహతా తేజా తపోబల సమన్వితా
    ఉద్ధరితి రంభే త్వం మత్క్రోధ కలుషీకృతమ్‌'  

                (రామాయణం, 1-64-13).

     ఈ కథ అంతా వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణం, బాలకాండ, చతుష్షష్టి సర్గలో (1-64- 13) ఉంది. పై శ్లోకంలో పేర్కొన్న లక్షణాలు సరిగ్గా వశిష్ఠ మహర్షికి సరిపోతాయి. 

విశ్వామిత్రునికి బ్రాహ్మణ్య సిద్ధి
        మేనక, రంభల వృత్తాంతాల అనంతరం, బ్రహ్మత్వం పొందటంకోసం, విశ్వామిత్రుడు మళ్లీ తన తపస్సును కొనసాగించాడు. అపూర్వమైన దీక్షతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడికి తన శరీరంలో అనేక భాగాలు క్రమంగా శుద్ధి చెందటం తెలుస్తూనే వచ్చింది. ఆ సమయంలో దేవేంద్రుడు ప్రత్యక్షమై. 'స్వామీ! మీ తపస్సు ఫలితంగా మీరు ఇప్పుడు 'దేవర్షి' అయ్యారు. త్వరలోనే మీరు 'బ్రహ్మర్షి' కాగలుగుతారు. దానికి ముందుగా మీరు బ్రాహ్మణులు కావాల్సిఉంది. దానికై మీరు 'అగ్నివిద్య'ను స్వీకరించవలసి ఉంటుంది' అని చెప్తాడు. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, విశ్వామిత్రునికి అగ్నివిద్యను బోధిస్తాడు. 

    అయినా తనకు ఇంకా బ్రహ్మర్షిత్వం సిద్ధించలేదన్న బాధ విశ్వామిత్రుడిలో మిగిలి ఉండిపోయింది. అది గ్రహించిన ఇంద్రుడు 'స్వామీ! మీలో ఇంకా కొంత కోపతాపాలు మిగిలే ఉన్నాయి. మీరు వాటిని సైతం విసర్జించిన పక్షంలోనే మీకు బ్రహ్మర్షిత్వం సిద్ధిస్తుంది' అంటూ, అదే సమయంలో అటు వశిష్ఠుడు పడుతున్న బాధల గురించి వివరిస్తాడు.

    విశ్వామిత్రుడు తమ కుమారులను చంపేసినందుకు వశిష్ఠుని భార్య అరుంధతి తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. అదే వశిష్ఠుడిని సైతం బాధిస్తుంటుంది. తన మనస్తాపం భరించలేక వశిష్ఠుడు ఆత్మత్యాగానికి సిద్ధమై, తన శరీరానికి లతలను చుట్టుకుని సరస్వతీ నదిలో దూకుతాడు. అది చూసిన విశ్వామిత్రుడు, వెంటనే తన తపశ్శక్తితో వశిష్ఠుడి బాధలను తాను స్వీకరిస్తానని చెప్పి, వశిష్ఠుడిని ఒడ్డుమీదకు తెప్పిస్తాడు. ఈవిధంగా వశిష్ఠుడిమీద తన పాతకాలం పగలను మర్చిపోయి, ఆయనను రక్షించగలిగే స్థితికి చేరటంతో విశ్వామిత్రుడు మరింత పవిత్రుడయి బ్రహ్మర్షిత్వానికి మరింత చేరువ అవుతాడు.   

ఆ నదికి కొత్త పేరు - విపాశా నది
    ఈ కథే మరో విధంగా కూడా ఉంది: 

    సరస్వతీనదిలోకి దూకిన వెంటనే, వశిష్ఠుడి శరీరానికి చుట్టుకున్న లతలన్నీ తమంత తామే విడిపోయాయన్నది ఈ కథ. ఇలా వశిష్ఠుడిని లతా'పాశాల'నుంచి విముక్తి చేసింది గనుక, ఆ నది అప్పటినుంచి 'విపాశా' నది (పాశాలను తొలగించినది) అయిందని అంటారు. అదే నేటి పంజాబ్‌లోని 'బియాస్‌' నది. అయితే, ఈ నది 'వ్యాస కుండం'లో జన్మించింది గనుక 'వ్యాస'నది అయిందనీ, అదే క్రమంగా 'బియాస్‌' అయిందనీ కొందరు అంటారు. ఈ 'వ్యాసకుండం'లో జన్మించిన వాడు కనుకనే ఆయన 'వ్యాస' మహర్షి అయినాడనీ అంటారు. (నేటి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటీమణి 'బిపాషా బసు' పేరుకూడా 'విపాశా'నది పేరుమీదే,  బెంగాలీ భాషానుగుణంగా పెట్టుకున్నదే!) 

సరస్వతీనదికి శాపం    
    నిరంతరం తపస్సును చేస్తూనే ఉన్నాడు కానీ, వశిష్ఠుడిమీద కోపం మాత్రం విశ్వామిత్రునికి తగ్గనే లేదు. వశిష్ఠుడు 'బ్రహ్మర్షి' కాగలిగినప్పుడు, తానెందుకు కాలేడని విశ్వామిత్రుని అభిప్రాయం. ఎలాగైనా, వశిష్ఠుడిమీద పగ తీర్చుకోవాలని విశ్వామిత్రుడు భావించాడు. అందుకే, ఒకసారి సరస్వతీనదిలో స్నానం చేస్తూ, విశ్వామిత్రుడు ఆ నదీమతల్లిని పిలిచాడు. 'తక్షణం వెళ్లి, వశిష్ఠుడిని నావద్దకు తీసుకురా!' అని కోరాడు. విశ్వామిత్రుడి స్వభావం తెలిసిన సరస్వతీనది నేరుగా వశిష్ఠునివద్దకే వెళ్లి, విశ్వామిత్రుడు చెప్పిన విషయాన్ని ఆయనకు తెలియజేసింది. వశిష్ఠుడు నవ్వి 'ఆయన తీసుకురమ్మంటే, తీసుకు వెళ్లు' అని, ఆ నదిలో కూర్చున్నాడట. తన తరంగాల మీద సరస్వతీ నది, వశిష్ఠుడిని విశ్వామిత్రుడి వద్దకు చేర్చింది. తనకు ఇలా దొరికిన వశిష్ఠుడిని ఏం చేయాలా అని విశ్వామిత్రుడు ఆలోచిస్తున్న సమయంలో, ఆ నదీతరంగాలు మరింత దూరానికి వశిష్ఠుడిని తీసుకెళ్లిపోయాయి. అయితే, కావాలనే వశిష్ఠుడిని రక్షించేందుకు సరస్వతీ నది తనను వంచించిందని విశ్వామిత్రుడు భావించి,  తీవ్రమైన కోపంతో, సరస్వతీనదిని 'ఈక్షణంనుంచీ నువ్వు శోణిత (ఎరుపు) వర్ణంగలదానివి అయిపో' అంటూ శాపం ఇచ్చాడు. ఈ కథ భాగవతంలో ఉంది. 

    ఏం చేసి అయినా సరే, తన బ్రహ్మర్షి కావాలనే తన ప్రయత్నాలను మాత్రం విశ్వామిత్రుడు మానుకోలేదు. ఆ తపస్సుకు భయపడి, అనంత విశ్వంలోని బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి, విశ్వామిత్రుడిని తపస్సు విరమించవలసిందిగా కోరారు. అయినా, విశ్వామిత్రుడు వారి మాటను లెక్క చేయలేదు. తన తపస్సును కొనసాగిస్తూనే వచ్చాడు. తనలో తాను కోరుకున్న మార్పులన్నీ వచ్చాయని భావించిన విశ్వామిత్రుడు, ఒకరోజు ఆహారం తీసుకోవాలని అన్నీ సిద్ధం చేసుకుని, కూర్చున్నాడు. అదే సమయంలో ఇంద్రుడు, ఒక ముసలి బ్రాహ్మణుని వేషంలో వచ్చి తాను ఆకలి బాధను తట్టుకోలేకుండా ఉన్నానని చెప్తాడు. వెంటనే, విశ్వామిత్రుడు తన భోజనాన్ని ఆ బ్రాహ్మణునికి వడ్డిస్తాడు. అది భుజించిన ఇంద్రుడు, సంతుష్టితో, తన అసలు స్వరూపాన్ని విశ్వామిత్రుడి ముందు ప్రకటిస్తాడు. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై, 'మహర్షీ! మీరు మీ అపార తపశ్శక్తి సంపన్నతతో 'బ్రహ్మర్షి' అయినారు!' అని ప్రకటించాడు. అంతలోనే అంతరిక్షంనుంచి ఒక దివ్యశక్తి ప్రత్యక్షమై, విశ్వామిత్రునికి అపారమైన వేదసంపదను, గాయత్రీ మంత్రాన్నీ అనుగ్రహించింది. 

    ఇంతైనా తనను వశిష్ఠుడే వచ్చి, బ్రహ్మర్షిగా సంబోధిస్తే తప్ప తనకు తృప్తి లేదని విశ్వామిత్రుడు చెప్పటంతో, వశిష్ఠుడు వెంటనే అక్కడికి విచ్చేసి, విశ్వామిత్రుడిని 'బ్రహ్మర్షీ! ఇంక మీ తపస్సును చాలించి విశ్వకల్యాణానికి మీ దీవెనలు అందించండి!' అని కోరతాడు. దానితో విశ్వామిత్రుడు సంతుష్టి చెందుతాడు.  

వశిష్ఠ పుత్రుల మరణానికి కారణం 
    వశిష్ఠుని కుమారుల మరణానికి కారణాలుగా వేర్వేరు కథలు   ఉన్నాయి. విశ్వరథుడుగా ఉన్నప్పుడు, వశిష్ఠుని కామధేనువైన నందినిని కోరుతూ, విశ్వరథుడు జరిపిస యుద్ధంలో వశిష్ఠుని నూరుమంది కుమారులు చనిపోయారని ఒక గాధ. 

    అలాకాకుండా, ప్రచారంలో ఉన్న మరో కథ ఇది:

    విశ్వరథుడు తపస్సులో ఉన్నప్పుడు, ఆ తపస్సుకు సంతోషించి, ఒకరోజు వశిష్ఠుడే వచ్చి, 'రాజర్షీ! ఇక తపస్సును చాలించు!' అని కోరాడు. తనను వశిష్ఠుడు 'రాజర్షీ' అని సంబోధించటంతో, విశ్వామిత్రుడు మరింత కోపించాడు. ఆ కోపంలో, వశిష్ఠుడి కుమారుడిని చంపేశాడు. అయినా, వశిష్ఠుడు ఏమీ అనక వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు మళ్లీ తన తపస్సును కొనసాగించాడు. 

    మళ్లీ వశిష్ఠుడు వచ్చి 'రాజర్షీ' అని విశ్వామిత్రుడిని పలకరించాడు. ఆ పిలుపూ ఆయనకు నచ్చలేదు. ఆ ఆగ్రహం పట్టలేక, విశ్వామిత్రుడు వశిష్ఠుడి మరో కుమారుడిని చంపేశాడు. ఇలా, వశిష్ఠుడు వచ్చి, విశ్వామిత్రుడిని 'రాజర్షీ' అని పిలవటం, విశ్వామిత్రుడు వెంటనే వశిష్ఠుడి మరొక కుమారుడిని హతమార్చటం కొనసాగుతూ వచ్చింది. చివరికి వశిష్ఠుడి కుమారులు అందరూ చనిపోయారు. అయినా, విశ్వామిత్రుడిని వశిష్ఠుడు 'బ్రహ్మర్షీ' అని మాత్రం పిలవలేదు. ఆసారీ, విశ్వామిత్రుడిని వశిష్ఠుడు 'రాజర్షీ' అనే పలకరించాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చినా, ఏమీ అనకుండా అక్కడనుంచి లేచి వెళ్లిపోబోయాడు. 

    అప్పుడు వశిష్ఠుడు నవ్వుతూ, 'బ్రహ్మర్షీ! ఇక తపస్సును చాలించు!' అన్నాడు. వెంటనే, విశ్వామిత్రుడు వశిష్ఠుడికి వందనం చేసి, 'మహర్షీ! ఇంతకాలమూ నన్ను రాజర్షీ అనే సంబోధిస్తూ వచ్చావు, ఇప్పుడు ఎందుకు 'బ్రహ్మర్షీ' అన్న పిలుపుతో నాపై కరుణ చిలికించావు?' అని ప్రశ్నించాడు. 

    వశిష్ఠుడు నవ్వుతూ 'ఇంతకాలమూ నువ్వు గొప్ప తపస్వియే అయినా, కోపాన్ని ఆపుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు నీ కోపాన్ని జయించి, బ్రహ్మర్షి కాగలిగావు' అని జవాబు ఇచ్చాడు. దానితో విశ్వామిత్రుడికి తనలోని లోపం ఏమిటో అర్థమయింది. అయినా, అచంచల దీక్షతో తాను ఆశించింది అందుకోగలిగాడు విశ్వామిత్రుడు.

కుమారులకు విశ్వామిత్రుని శాపాలూ, వరాలూ
    శునశ్శేఫుడిని తన కుమారుడిగా అంగీకరించమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, తన మాటకు అంగీకరించక, వ్యతిరేకతను ప్రదర్శించిన తన కుమారులలో మొదటి యాభైమందినీ శపించిన విశ్వామిత్రుడు, తర్వాతి యాభైమందినీ దీవించాడు. రెండో యాభైమందిలో మొదటివాడైన మధుచ్ఛందుడు, వేద మంత్ర ద్రష్టగా పేరొందాడు. ఋగ్వేదంలోని మొదటి మండలంలోని మొదటి 10 సూక్తాలను ఆయనే దర్శించాడని అంటారు. ఋగ్వేదంలో మొదటిదైన 

        
'అగ్ని మీళే పురోహితమ్‌
        యజ్ఞస్య దేవమృత్విజమ్‌
        హోతారం రత్న ధాతమమ్‌'

అన్న సూక్తం మధుచ్ఛందుడు దర్శించినదే! విశ్వామిత్రుడు తన కుమారుడిగా చేసుకున్న శునశ్శేఫుడుకూడా మంత్రద్రష్ట అయినాడు. ఆయన కృష్ణ యజుర్వేదంలోని 24 మంత్రాలను దర్శించాడు. 

వేదాలలో విశ్వామిత్రుడు
    వేదవాఙ్మయంలో విశ్వామిత్రుడి గురించిన విశేషాలు అనేకం ఉన్నాయి. ఋగ్వేదంలో 46 సూక్తాలను, సామవేదంలో 24 దశతుల్లో కొన్నింటిని,

కృష్ణ యజుర్వేదంలో 33 మంత్రాలను, అథర్వ వేదంలో 13 సూక్తాలను విశ్వామిత్రుడు దర్శించాడు. 

    విశ్వామిత్రుడి గురించిన ఒక కథ ఋగ్వేదం 3వ మండలం, 33వ సూక్తంలో ఉంది. ఒకసారి  విశ్వామిత్రుడు తన అనుచరగణాలతో, పరివారాలతో ప్రయాణిస్తున్నాడు. దారిలో 'విపాట్‌', 'శుతుద్రి' అనే రెండు నదులు వారికి అడ్డం వచ్చాయి. తమ ప్రయాణానికి అంతరాయం కలిగించకుండా, తాము వెళ్లడానికి వీలుగా, నీటి ప్రవాహ ఉధృతిని తగ్గించుకోవలసిందిగా విశ్వామిత్రుడు ఆ నదులను కోరతాడు. అయితే, తమకు ప్రకృతిపరంగా వేగంగా ప్రవహిస్తూ, సముద్రంలో కలవవలసిన అవసరం ఉందనీ, దీనికి దేవేంద్రుని నియమం ఉందనీ ఆ నదులు వినయంతో జవాబునిస్తాయి. అది విన్న విశ్వామిత్రుడు, దేవేంద్రుడిని స్తుతించి,

ఆ నదులు తమ వేగాన్ని తగ్గించే విధంగా ఆయన అనుమతి తీసుకుంటాడు. ఆ తర్వాత, విశ్వామిత్రుడు తన పరివారగణంతో ఆ నదులను దాటతాడు. 

    విశ్వామిత్రుడు దర్శించిన గాయత్రీ మంత్రంకూడా ఋగ్వేదం, మూడో మండలం, 62వ సూక్తంలో ఉంది. గాయత్రీమంత్రంలో విశ్వామిత్రుడు, సవితను ఉపాసించాడు. నాటినుంచి మనకు గాయత్రీ మంత్రమే మార్గదర్శకంగా నిలుస్తోంది. 

    గాయత్రీ మంత్రశక్తిని గ్రహించిన ఋషులు 24 మంది అని అంటారు. వారిలో మొదటివాడు విశ్వామిత్రుడు కాగా, చివరివాడు యాజ్ఞవల్క్యుడు. 

రామాయణంలో విశ్వామిత్రుడు
    రామాయణంలో విశ్వామిత్రుడి గురించి మనం చాలా విశేషాలనే వింటాం. రామలక్ష్మణులకు అస్త్రశస్త్రవిద్యలను నేర్పింది విశ్వామిత్రుడే! మహాకవి వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణంలోని బాల కాండలో విశ్వామిత్రుడు మనకు దర్శనం ఇస్తాడు. కౌశికీ నదీతీరాన 'సిద్ధాశ్రమం' పేరుతో విశ్వామిత్రుడి ఆశ్రమం ఉంది. విశ్వామిత్రుడు అక్కడ చేస్తున్న యజ్ఞయాగాదులకు మారీచాది అనేక రాక్షసగణాలు పలు విఘ్నాలను కలుగజేస్తున్నాయనీ, తన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలంటే, తనకు శ్రీరాముని సహాయం కావాలనీ విశ్వామిత్రుడు అయోధ్యాపురికి వచ్చి, పాలకుడైన దశరథుడిని కోరతాడు. దశరథుడికి పుత్రవాత్సల్యం అధికం. అందుకే, ఆయన తన పసికుమారులను పంపేందుకు మొదట నిరాకరిస్తాడు. అయితే, దశరథుని ఆస్థానగురువైన వశిష్ఠుడు, విశ్వామిత్రుని గొప్పదనం దశరథునికి వివరించి, ఏ సందేహమూ లేక, శ్రీరాముడిని విశ్వామిత్రుని వెంట పంపవలసిందిగా, దానివల్ల లోకకల్యాణమూ, శ్రీరామ కల్యాణమూ అవుతుందనీ నచ్చజెప్తాడు. అలా, తన వెంట వచ్చిన శ్రీరామలక్ష్మణులకు విశ్వామిత్రుడు దివ్యమైన అస్త్ర శస్త్ర విద్యలను నేర్పిస్తాడు. నిద్రను, ఆకలిని జయించడానికి బల, అతిబల అనే రెండు దివ్య మంత్రాలనూ ఉపదేశిస్తాడు. తాను సంపాదించుకున్న జృంభకాస్త్రాలను సైతం శ్రీరామునికి అనుగ్రహిస్తాడు. ఆ పిమ్మటే, విశ్వామిత్రుని ఆదేశంమేరకు శ్రీరాముడు, తాటక, సుబాహులను సంహరిస్తాడు. మారీచుడిని సముద్రమధ్యంలోకి వెళ్లి పడేటట్లుగా విసిరేస్తాడు. ఇదే సమయంలో, ఒకసారి నిద్రపోతున్న శ్రీరాముడిని నిద్రలేపి, కర్తవ్యోన్ముఖుడిని చేస్తూ విశ్వామిత్రుడు ఆలపించిన స్త్రోత్రపాఠం 

        
'కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యాప్రవర్తతే
        ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికమ్‌'

అనేది నేటికీ శ్రీ వైష్ణవ సుప్రభాతగీతాలలో ప్రథమమై నిలుస్తోంది. 

    అదే సమయంలో, జనకమహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవర ప్రకటన చేశాడని విన్న విశ్వామిత్రుడు, శ్రీరామలక్ష్మణులను మిథిలానగరానికి తీసుకెడతాడు. అక్కడ, విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు, శ్రీరాముడు, శివధనుస్సును ఎక్కుపెట్ట ప్రయత్నించి, శివధనుర్భంగం చేస్తాడు. అక్కడే పరశురాముని గర్వభంగం చేస్తాడు. విశ్వామిత్రుని ఆజ్ఞమీద సీతను ఇల్లాలుగా స్వీకరిస్తాడు. ఇలా, విశ్వామిత్రుడు సాక్షాత్తూ విష్ణువు అవతారమైన శ్రీరామునికి పరమగురుస్థానం పొందిన పూజ్యనీయుడు. 

విశ్వామిత్ర గోత్రీకులు
    విశ్వామిత్రుడు గోత్రపురుషుడుగా ఉన్న బ్రాహ్మణ శాఖలు మనకు 52 కానవస్తున్నాయి. వాటి వివరాలు కిందటి అధ్యాయాలలో చూడటం జరిగింది. ముఖ్యంగా పేర్కొనవలసిన అంశం ఇక్కడ ఒకటి ఉంది. ఆ 52 శాఖలకు అదనంగా మరో రెండు కూడా కానవస్తున్నాయి.  

    బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని పేర్కొనే శాఖ ఒకటి కాగా, మరొకటి కొంత భిన్నంగా 'చకిత విశ్వామిత్ర' గోత్ర శాఖగా పేరొందింది. 

    ప్రాధమికమైన విశ్వామిత్ర గోత్రంనుంచి వేరుపడిన వారు ఈ 'చకిత విశ్వామిత్ర' గోత్రీకులు అని ఒక వాదం కాగా, ఏదో ఒక సందర్భంలో ఆశ్చర్యచకితుడైన విశ్వామిత్రుడే తమ గోత్రపురుషుడని చెప్పుకునేవారు 'చకిత విశ్వామిత్ర' గోత్రీకులని మరొక వాదం.