hinduBrahmins

------------------------------------------------------------------------------------------వశిష్ఠుడు

    వశిష్ఠుడు సూర్య వంశ ఇక్ష్వాకు కులానికి పురోహితుడుగా, దాశరథి శ్రీరామచంద్రునికి గురువుగా, ఉన్నతమైన వ్యక్త్తిత్వంగల విశిష్టమైన మహర్షిగా మనకు సుపరిచితులు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటానికి వెనుకనున్న గాథలో వశిష్ఠుని పాత్ర తెలిసిందే. 

    వశిష్ఠుడు ప్రస్తుత మన్వంతరంలో ఒక సప్తర్షి. సప్తర్షిమండలంలోని ఒక ఋషి. మనం 'సప్తర్షి మండలం'గా పేర్కొనే ఏడు నక్షత్రాల సమూహాన్ని అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం 'ఉర్సా మేజర్‌' (Ursae Major)గా వ్యవహరిస్తారు. ఇందులో వశిష్ఠుడిని Mizor నక్షత్రంగా వ్యవహరించటం జరుగుతుండగా, వశిష్ఠుని సతీమణి అయిన అరుంధతీ నక్షత్రాన్ని Alcorగా వ్యవహరించడం ఉంది. ఈ నక్షత్రాన్ని వివాహసమయంలో నూతన వధూవరులు దర్శించుకోవటం సంప్రదాయం.

    వశిష్ఠ మహర్షి కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దాసరాజుల యుద్ధం, విశ్వామిత్రునితో వైరం రావటానికి కారణాలూ - అన్నీ ఋగ్వేదం, 7వ మండలం, 33వ ఋక్కులో ఉన్నాయి.         

    ఆయన తపోవనం సరస్వతీ నదీ తీరాన ఉండేదని కొందరి భావన. మరికొందరు వశిష్ఠుని ఆశ్రమం, అయోధ్యకు సమీపంలోని సరయూనదీ తీరాన సుమారు 45 ఎకరాల స్థలంలో ఉండేదంటారు. ఇంకొందరైతే, వశిష్ఠ ఆశ్రమం ఋషీకేశ్‌ దాటిన తర్వాత, గంగానదీ తీరాన దేవప్రయోగవద్ద ఉందని అంటారు. అక్కడ 'వశిష్ఠ గుహ' ఉంది. మరికొందరైతే, వశిష్ఠుని ఆలయం మనాలికి సమీపంలో ఉందంటారు. ఆమాటకొస్తే, వశిష్ఠుని ఆలయాలు మనకు గౌహతికి సమీపంలోనూ, అబూ శిఖరం (మౌంట్‌ అబూ) వద్ద కూడా ఉన్నాయి. 

    ఉత్తర భారతంలో దొరికిన ఒక రాగి వస్తువు వశిష్ఠుడి తల ఆకారంలో ఉంది. దానిని పాశ్చాత్తులు కార్బన్‌ -14 డేటింగ్‌ పద్ధతులలో పరిశీలించి, అది సుమారుగా

క్రీ. పూ. 3700నాటిది అయిఉంటుందని అంచనా వేశారు. అంటే, వశిష్ఠుడి వయసు సుమారుగా అంతకుమించి ఉంటుందని వారి భావన.   

    వశిష్ఠుడి భార్య అరుంధతి. వశిష్ఠ - అరుంధతి దంపతులకు 100 కుమారులు ఉండేవారు. కామధేనువు కుమార్తె అయిన నందినిని తరలించుకుని పోయే ప్రయత్నంలోనూ, ఆ తర్వాత బ్రహ్మర్షి కావాలనే తపనతో తపస్సు చేస్తూ, వశిష్ఠుడినుంచి 'బ్రహ్మర్షి' అనిపించుకునే ప్రయత్నంలోనూ, ఆ కుమారులను విశ్వామిత్రుడు సంహరించటంతో, వశిష్ఠ-అరుంధతి దంపతులకు తర్వాత శక్తి, సుయజ్ఞ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.  

    వశిష్ఠుడు, జనకుని పూర్వజుడైన నిమి మహారాజుకు సమకాలికుడు. 

మళ్లీ పుట్టిన వశిష్ఠుడు 
    వశిష్ఠుడు భూలోకంలో రెండుసార్లు జన్మించినట్లు చెప్పే కథ ఒకటి మనకు లభిస్తోంది. వశిష్ఠుడు ఇక్ష్వాకు కులానికి పురోహితుడు, రాజగురువు. ఇక్ష్వాకు రాజైన నిమి ఒకసారి ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. దానికి వశిష్ఠుడిని ఆధ్వర్యం వహించమని నిమి కోరితే, వశిష్ఠుడు అదే సమయంలో తనకు ఇంద్రుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్లాల్సిన పని ఉందనీ, అది అయిన తర్వాత తాను నిమి తలపెట్టిన యజ్ఞాన్ని చేపట్టగలననీ వశిష్ఠుడు చెప్తాడు. ఇది నిమికి నచ్చదు. అయినా ఏమీ అనకుండా,

తన యజ్ఞాన్ని తాను అనుకున్నట్లుగానే, గౌతమ మహర్షి కుమారుడైన శతానందుని ఆధ్వర్యంలో కొనసాగిస్తాడు. ఇంద్రుని యజ్ఞానికి హాజరైన తర్వాత, వశిష్ఠుడు

తిరిగి వస్తాడు. నిమి వద్దకు వెళ్తే, నిమి నిద్రపోతూ ఉండి, వశిష్ఠుని రాకను పట్టించుకోడు. తనను ఈవిధంగా అవమానించిన నిమి మరణించాలని వశిష్ఠుడు శాపం పెడతాడు. ఇది తెలిసిన నిమి, తనకున్న తపోబలంతో వశిష్ఠుడు కూడా మరణించాలని శపిస్తాడు. ఈవిధంగా నిమి, వశిష్ఠులు ఇద్దరూ మరణిస్తారు. చనిపోయిన వశిష్ఠుడు బ్రహ్మలోకం చేరతాడు. బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని చూసి 'మహర్షీ! తమరు భూలోకంలో చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి, మీరు తిరిగి భూలోకానికి వెళ్లండి!' అని కోరతాడు. ఫలితంగా వశిష్ఠుడు, ఆయనతోబాటుగా అగస్త్యుడు, మైత్రావరుణుల సహాయంతో భూలోకంలో తిరిగి జన్మిస్తారు. 

'యోగవాశిష్ఠం' కర్త
    శ్రీరామచంద్రునికి వశిష్ఠుడు 'యోగ వాశిష్ఠం' నేర్పించాడు. ఇది ప్రధానంగా ఆత్మ చైతన్య విద్యకు సంబంధించినది. శ్రీరాముడు తన దేశ పర్యటనలలో భాగంగా అనేక ప్రదేశాలు తిరిగి వస్తాడు. ఆయా ప్రదేశాల్లో తాను చూసిన పలు అంశాలు శ్రీరాముడిని బాధిస్తాయి. ఆ దుఃఖంలోంచి శ్రీరాముడు కోలుకోలేకపోతాడు. ఇది చూసిన దశరథుడు, చాలా దుఃఖితుడై, తన రాజగురువైన వశిష్ఠుడికి రాముడి వృత్తాంతం చెప్పి, శ్రీరాముడిని తిరిగి మామూలు మనిషిని చేసే మార్గం యోచించమని చెప్తాడు. అప్పుడు వశిష్ఠుడు, దశరథునితో 'ఇది చాలా సహజమైన పరిణామం! ఈ వైరాగ్యంనుంచి శ్రీరాముడు తప్పక బయటపడతాడు, దానికి తగిన మార్గం నాకు తెలుసు' అంటూ శ్రీరామచంద్రునికి 'యోగవాశిష్ఠం' నేర్పుతాడు. ఈ విషయాన్ని వాల్మీకి, తన రామాయణంలో రచించారు. 

    సీతాదేవి లంకలో అశోక వనానికి చేరి, భర్తకు దూరం కావటం, లేదా శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి తిరిగి అడవుల పాలవటంలో  అరుంధతి శాపం ఉందని అంటారు. 

    తన చిన్నదనంలో సీతాదేవి ఒకసారి తన తండ్రి జనకుని ఇంటగల శివధనుస్సుకు పూజలు చేయాలని సంకల్పిస్తుంది. అప్పుడు, సప్తర్షుల సతీమణులను వారు ఆహ్వానిస్తారు. అలా పేరంటానికి వచ్చిన సప్తర్షుల సతీమణుల నుదుట సీతాదేవి తిలకం దిద్దుతున్న సమయంలో, సీతాదేవి చేతివేలిగోరు గుచ్చుకుని, అరుంధతి నుదుటన చిన్న గాయం అయి, రక్తం స్రవిస్తుంది. దానికి ఎంతో కోపించిన అరుంధతి, 'నా నుదుటి బొట్టు స్థానంలో రక్తం చిందించిన నీకు పతీవియోగం తప్పదు' అని శపిస్తుంది. దానికి జనకుడు ఎంతో చింతిస్తాడు. అయితే, తన శాపంవల్ల లోకకల్యాణం జరుగుతుందని అరుంధతి వివరిస్తుంది. అందుకే, సీతాదేవికి లంకలో  ఉన్నందువల్ల పతీవియోగం సంభవించినా, రావణుని వధతో లోకకల్యాణం జరుగుతుంది. అయితే, ఈ కథ వాల్మీకి విరచితమైన రామాయణంలో లేదు.        

పృషదాఖ్యుని కథ
    వశిష్ఠుడి గురించిన కథ ఒకటి ప్రజాపతుల సృష్టి సందర్భంలో మనకు కనిపిస్తుంది. ఈ కథ శ్రీమద్భాగవతం, నవమ స్కంధంలో ఉంది. 

    సూర్యునికి మరొక పేరు వివస్వతుడు. 'ఆదిత్య హృదయం'లో 'వైవస్వతాయ' అనే పదం కనిపిస్తుంది. వివస్వతుని కుమారుడు వైవస్వతుడు. ఈయనకు పదిమంది కుమారులు. వీరిలో ఒకడు పృషదాఖ్యుడు. 

    
'తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః సంభృతం పృషదాజ్యమ్‌
    పశూగ్‌ంస్తాగ్‌ం శ్చక్రే వాయవ్యాన్‌ ఆరణ్యాన్‌ గ్రామాశ్చయే'

అన్న సూక్తం మనకు పురుషసూక్తంలో (ఋగ్వేదం, 10వ మండలం, సూక్తం 90) కానవస్తుంది. విరాట్‌పురుషుని దర్శించడానికి చేయవలసిన యజ్ఞవిధానాన్ని వివరిస్తూ, అమృతత్వాన్ని పొందటానికి ఆ యజ్ఞంలో పృషత్‌ అనే పెరుగు కలిపిన నెయ్యిని వెయ్యాలని ఈ సూక్తం అర్థం. ఇందులో 'పృషత్‌' అనే మాటను వ్యక్తివాచకం చేస్తూ రూపొందించిన ఒక కథ మనకు శ్రీమద్భాగవతంలో ఉంది. 

    పృషదాఖ్యుడు ఒకసారి తన గురువుగారి ఆజ్ఞమేరకు అడవిలో పశువుల మందను మేపుతూ ఉన్నాడు. అర్థరాత్రి సమయంలో పెద్ద ఉరుములు, మెరుపులతో

వర్షం రాసాగింది. ఇదే అదనుగా ఒక పులి వచ్చి, ఒక ఆవును పట్టుకుంటుంది. అప్పుడు ఆ చీకటిలో ఆ రాజు పొరబడి, పులి అనుకుని ఆవును చంపుతాడు.

తర్వాత, తప్పు తెలుసుకుని పులిని కూడా చంపుతాడు. ఆవును చంపినందుకు ఆ రాజు గురువైన వశిష్ఠుడు ఆగ్రహించి, ఆ రాజును శూద్రుడవు కమ్మని శాపం ఇస్తాడు. అప్పుడు, రాజు వశిష్ఠుని క్షమాపణ కోరి, ఆయన వల్ల శాపవిమోచన మార్గం తెలుసుకుంటాడు. అప్పటినుంచి ఆ రాజైన పృషదాఖ్యుడు, విష్ణుభక్తుడై, సర్వేంద్రియాలనూ గెలిచి, తిరిగి అడవిలోకి వెళ్లి, అక్కడ కార్చిచ్చులో తన దేహాన్ని చాలించి, బ్రహ్మలోకం చేరతాడు. 

ఆంధ్రుల ఆవిర్భావం కథ 
    వశిష్ఠునితో విశ్వామిత్రునికి గల వైరం కారణంవల్ల ఆంధ్రులు ఆవిర్భవించారనే కథలు ఉన్నాయి. ఆంధ్రులు శాపగ్రస్తులైన విశ్వామిత్రుని కుమారులని ఒక కథ ఉండగా, వారు వశిష్ఠుని వద్దగల కామధేనువు సురభి కుమార్తె అయిన నందిని వల్ల జనించిన జాతి అని మరొక కథ   ఉంది. ఈ వృతాంతాలు విశ్వామిత్రుని గురించిన అధ్యాయంలో వివరంగా ఉన్నాయి. 

అరుంధతి కథ
    అరుంధతి అనగానే మనకు వివాహ సందర్భాలలో వధూవరులు దర్శించుకునే నక్షత్రం గుర్తుకు వచ్చి తీరుతుంది. అరుంధతి నక్షత్రం, సప్తర్షి మండలంలో వశిష్ఠ నక్షత్రం పక్కన కనీకనబడకుండా ఉండే ఒక చిన్న నక్షత్రం అంటారు. నక్షత్ర మండలంలోని సప్తర్షి మండలంలో తమ భర్తలు ఉన్నా, మిగిలిన ఆరుగురు ఋషుల భార్యలకూ అక్కడ చోటు లభించక, కేవలం అరుంధతికి మాత్రమే అక్కడ స్థానం లభించటం అంటే ఆమె ప్రత్యేకత ఏమిటో స్పష్టంగా మనకు తెలుస్తుంది. సప్తర్షిపత్నులలో అరుంధతి ఒక్కతెకు మాత్రమే పూజార్హత లభించటం విశేషం. ఏడు నక్షత్రాలలో వశిష్ఠుడిని చూసి, దానికి పక్కనే మినుకుమినుకుమనే నక్షత్రాన్ని అరుంధతిగా గుర్తించడాన్ని 'అరుంధతీదర్శనాన్యాయః' అంటారని వామన్‌ ఆప్టే సంకలించిన The Students’ Sanskrit English Dictionary వివరిస్తోంది. అంటే, తెలిసిన దానినుంచి తెలియని దాన్ని గుర్తించటం అని అర్థం.

    అరుంధతి కథ మనకు శివ పురాణం, భాగవత పురాణంలో కనిపిస్తుంది. 

    శివ పురాణం ప్రకారం ఆమె పూర్వజన్మలో బ్రహ్మమానస పుత్రిక 'సంధ్య'. వశిష్ఠుడి ఆనతి ప్రకారం ఆమె శివుడిని మెప్పిస్తుంది. అప్పుడు, శివుడు ఆమెను మేధాతిథి (అగ్ని) యజ్ఞగుండంలో దూకమంటాడు. ఆవిధంగా మేధాతిథి యజ్ఞగుండంలో దూకిన ఆమె, మేధాతిథికి కుమార్తెగా జన్మిస్తుంది. తర్వాత, వశిష్ఠుడిని వివాహమాడుతుంది. ఈ విధంగా బ్రహ్మమానసపుత్రిక అయిన కారణంగా అరుంధతి, నారదునికి సోదరి అవుతుంది. తన సోదరి అరుంధతిని నారదుడే వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేస్తాడు. 

    భాగవత పురాణం ప్రకారం - కర్దమ, దేవహుతిల కుమార్తె అరుంధతి. 

    తులసీదాస్‌ విరచితమైన 'శ్రీరామ చరిత మానస్‌' ఉత్తర కాండలో అరుంధతికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం గురించిన ప్రస్తావన ఉంది. ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలోని స్త్రీలు చైత్రమాసం, శుక్ల పక్షం విదియ రోజున అరుంధతి పేరుమీదుగా ఉపవాస దీక్ష చేపట్టటం ఉంది. ఈ     ఉపవాస దీక్ష వల్ల తమకు వైధవ్యం సంప్రాప్తించదని స్త్రీల విశ్వాసం. ఈ విషయం శ్రీ గంగారామ్‌ గార్గ్‌ గారు సంకలనం చేసిన ‘Encyclopedia of the Hindu World’ (Vol: Ar-Az)లో ఉంది. 

    బ్రహ్మదేవుడు, అరుంధతికి ఒక కుంకుమ భరిణెను ఇచ్చి, అందులో కుంకుమ ఉన్నంతకాలం ఆమెకు భర్త సాంగత్యం ఉంటుందని వరమిస్తాడు. ఈ వరం విషయం తెలిసిన వశిష్ఠుడు, ఆమెను ఏరికోరి వివాహమాడాడని ఒక కథ. 

    మహాకవి కాళిదాసు రచించిన 'కుమారసంభవం' కావ్యంలో శివపార్వతుల వివాహఘట్టంలో అరుంధతి ప్రస్తావన ఉంటుంది. దానిప్రకారం - శివుడికై తపస్సు చేసిన పార్వతిని వివాహం చేసుకోవాల్సిందిగా అరుంధతి శివుడిని కోరుతుంది. 

    అరుంధతి - వశిష్ఠులే యజ్ఞాదికాలలో అగ్నిహోత్రపూజను ప్రవేశపెట్టారని అంటారు. 

    వనవాసానంతరం తిరిగి వస్తున్న సీత, రామ, లక్ష్మణులకు అరుంధతి ఆహారం వండి వడ్డించిందనికూడా తెలుస్తోంది. 

సరస్వతీ స్తోత్రం

    వశిష్ఠుడు రాసిన 'వశిష్ఠ సంహిత'లో 

    
'నమస్తే దేవీ గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ
    అజరే అమరే మాతా త్రాహిమాం భవసాగరాత్‌' 

అంటూ ఆరంభం అయ్యే సరస్వతీ స్తోత్రం ఉంది. ఇది మొత్తం 12 శ్లోకాలు. 

అరుంధతి - మహాకావ్యం
    'అరుంధతి' పేరుతో ఒక మహాకావ్యాన్ని శ్రీ జగద్గురు రామభద్రాచార్య హిందీ మాండలికమైన ఖడీబోలీలో రచించారు. తాను వశిష్ఠ గోత్రానికి చెందిన వాడిని కావటంతో 15 సర్గలు, 1279 శ్లోకాలతో ఈ కావ్యరచన చేశానని ఆయన చెప్పుకున్నారు. శ్రీ రామభద్రాచార్య 1950 జనవరి 14న జన్మించారు. రెండు నెలల ప్రాయంలోనే ఆయన తన కంటిచూపును కోల్పోయారు. ఆతర్వాత, ఆయన ఏ భాషా నేర్చుకోకుండానే కేవలం వినికిడితోనే అనేక గ్రంథాలను 'అభ్యసించారు'. ఈ కావ్యాన్ని నాటి భారతదేశ అధ్యక్షుడు శ్రీ శంకర్‌ దయాళ్‌ శర్మ ఆవిష్కరించారు. ఇందులో అరుంధతి గురించిన అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు.