hinduBrahmins

తిక్కన సోమయాజి

'శ్రీయన గౌరి నాబరగు చెల్వకు జిత్తము పల్లవింప భ
ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూ
పాయ నయశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్‌'


అని తిక్కన సోమయాజి 'శ్రీమదాంధ్ర మహాభారతము' విరాట పర్వము, ప్రథమాశ్వాసము ఆరంభంలో ఇష్టసిద్ధిని కోరుతూ, 'సకల బ్రహ్మపార్థనంబు' చేసి, శ్రీమదాంధ్ర మహాభారత ఆంధ్రీకరణానికి శ్రీకారం చుట్టారు. 

నన్నయభట్టు తెనిగీకరణం చేసి వదలిన అరణ్యపర్వ శేషభాగాన్ని ముట్టక, తిక్కన నేరుగా విరాట పర్వంతో ఆరంభించి,  స్వర్గారోహణ పర్వం చివరివరకూ గల మొత్తం 15 పర్వాలనూ తెనిగీకరించారు. 

తిక్కన 13వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవాడు. బహుశా 1210నుంచి 1288వరకూ ఆయన జీవితకాలమయి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఈయన తండ్రి కొమ్మన (దండనాథుడు), తల్లి అన్నాంబ (అన్నమాంబ). వీరి ఇంటిపేరు 'కొట్టరువు'. 'కోష్ఠాధిపతి' అనే సంస్క ృతపదానికి 'కొట్టారువు' అనే తెలుగు పదం ఉందనీ, అదే క్రమంగా 'కొట్టరువు' అయి ఉంటుందనీ భావన.  తిక్కన రాసిన 'నిర్వచనోత్తర రామాయణము'లోని 'అమలోదాత్తమనిషే'త్యాది పద్యాలనుబట్టి, ఆయన గౌతమ గోత్రికుడనీ, ఆపస్తంబ సూత్రులనీ తెలుస్తోంది. 'తిక్కన' అనే పేరు బహుశా, మనుమసిద్ధి తండ్రి అయిన తిక్కరాజు పేరునుబట్టి, తిక్కన తండ్రి తన కుమారునికి ఆ తిక్కరాజు పేరుమీదుగా 'తిక్కన' అని పెట్టి ఉండవచ్చునని భావన. శ్రీకాళహస్తిలోని తిరుకాళత్తి దేవుడి పేరుమీదుగానే ఈ పేర్లు వచ్చి ఉంటాయని పరిశోధకుల భావన. (మనుమసిద్ధి తండ్రి) తిక్కరాజు మరణానంతరం మనుమసిద్ధి రాజ్యాభిషిక్తుడు అయిన వెంటనే, అంటే, సుమారుగా క్రీ. శ. 1253లో తిక్కన మంత్రిపదవిని చేపట్టి ఉండవచ్చు. 

కేతన రాసిన 'దశకుమార చరితము'లో వర్ణనల ప్రకారం, తిక్కన కీర్తిశాలి, విద్యాకళాపారగుడు, ధైర్యగాంభీర్యాది గుణసంపన్నుడు, మహాదాత, వైభవసంపన్నుడు. సుందరాకారుడు, జితేంద్రియుడు, కలభాషణుడు, తేజోమహితుడు, వేదవిద్యాప్రవీణుడు, యజ్ఞాచరణపరుడు, నీతివద్యానిపుణుడు, శివభక్తితత్పరుడు. 

తిక్కన తాత భాస్కరమంత్రి, పూర్వ రామాయణాన్ని రాశారు కానీ, తర్వాతి కథను రాయలేదు. అందుకే, తిక్కన, ఏ వచనమూ ఉండని విధంగా 'నిర్వచనోత్తర రామాయణము'ను రాశారు. తిక్కన దీన్నికూడా,వాల్మీకి రామాయణోత్తర కాండమును అనుసరించే  రాశారు. సీతాపరిత్యాగ ఇతివృత్తంతోకూడిన 'నిర్వచనోత్తర రామాయణం'లోనూ తిక్కన రామనిర్యాణగాథను అనువదించలేదు. (దీన్ని జయంతి రామభట్టు అనే ఆయన ఒకే ఆశ్వాసంతో, ఏకాశ్వాస ప్రబంధంగా రాశారు.) మనుమసిద్ధి జీవితకాలంలోనే తిక్కన 'నిర్వచనోత్తర రామాయణం' రాసిఉంటారనే భావన ఉంది.  
నెల్లూరు పాలకుడుగా ఉన్న మనుమసిద్ధి 1260లో కాటమరాజుతో యుద్ధం తర్వాతనో, లేదా 1263లో మోతుకూరువద్ద పాండ్యులతో జరిగిన యుద్ధంలోనో చనిపోయాడని చరిత్ర ఊహిస్తోంది. అంతవరకూ మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉన్న తిక్కన, మంత్రిపదవినుంచీ, రాజకీయాలనుంచీ విరమించుకుని, 1265నుంచి 1270వరకూ మహాభారత అనువాద ప్రకియలో ఉండిఉంటారని భావన. తిక్కన తను రచించిన మహాభారతంలో ఎక్కడా మనుమసిద్ధి పేరును ప్రస్తావించకపోవడంవల్లనే, మనుమసిద్ధి మరణం తర్వాతనే తిక్కన మహాభారత అనువాదం చేసిఉంటారనే భావనకు ఊతం కలిగిస్తోంది. 

తిక్కన, తను రచించిన మహాభారత భాగాన్ని హరిహరనాథ దేవునికి అంకితం చేశాడు. ఈ స్వామి దేవాలయం నెల్లూరులో ఇప్పటి రంగనాథస్వామి ఆలయమేనని కొందరు భావిస్తుండగా, అప్పట్లో నెల్లూరు దగ్గర పెన్నానది రెండు పాయలుగా ఉండేదనీ, నెల్లూరుకు దక్షిణ దిక్కున ఉండిన పెన్నానది పాయ తీరంలో హరిహరనాథ దేవాలయం ఉండేదనీ, దాని శిథిలాలు ఇప్పటికీ కానవస్తుంటాయనీ ఇంకొందరు అంటారు. అయితే, తిక్కన అంకితమిచ్చిన హరిహరనాథడు, దాక్షారామ సమీపంలోని సప్తగోదావరీ  సంగమ స్థలంలో హరిహరనాథ దేవాలయంలోని స్వామివారేనని ఇంకొందరి భావన.  

తిక్కనకు 'వాగనుశాసనుడు', 'ఉభయకవిమిత్రుడు' అనే బిరుదాలు ఉన్నాయి. 

తిక్కన మహాభారతంలోని 15 పర్వాలను అనువదించడమేకాకుండా, విజయసేనము, కవిసార్వభౌమచ్ఛందస్సు (దీనికే 'కవివాగ్బంధం' అనే మరోపేరూ ఉంది), 'కృష్ణ! భక్తప్రియా' అనే మకుటం ఉన్న కృష్ణశతకము అనే గ్రంథాలనూ రాశారని అంటారు. 'కృష్ణశతకము' ఇప్పుడు లభించడంలేదు. 

తిక్కన కుమారుడు కొమ్మన, నెల్లూరు సమీపంలోని పాటూరుకు కరణంగా ఉండేవారనీ, ఆ కారణంగానే ఆ వంశంవారికి క్రమంగా అసలైన 'కొట్టరువు' అనే ఇంటిపేరుకు బదులుగా 'పాటూరు' అనే ఇంటిపేరు స్థిరపడిందనీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాశారు. ఆ ఇంటిపేరు గలవారివద్ద తిక్కన ఉపయోగించిన గంటపు ఒర చాలా కాలంపాటు ఉండేదనీ, దానిపై ఒకపక్క సరస్వతీ విగ్రహము, మరో పక్క విఘ్నేశ్వరుని విగ్రహమూ ఉండేదనీ అంటారు. 

తిక్కన పెదతండ్రి సిద్ధనామాత్యుని పెద్ద కుమారుడు 'ఖడ్గ' తిక్కనగా పేరొందిన మహావీరుడు. 

దివాకర్ల వేంకటావధాని వారు అన్నట్లుగా
తిక్కన 'కవితాదీక్ష నంది మహా కావ్యమును రచించి యొకవంక పరమ పురుషార్థమయిన మోక్షానందమును వేఱొకవంక సంఘ శ్రేయమును సాధించిన సుకవి పుంగవుడు, ఆంధ్ర కవుల కాచార్యుడు, కారణ జన్ముడు.'