hinduBrahmins

----------------------------------------------------------------------------

11. ఉపనయనం :
బ్రాహ్మణులను 'ద్విజులు'గా పేర్కొనటం పరిపాటి. అంటే, రెండు సార్లు జన్మించే వారు అని అర్థం. తల్లి గర్భంలోంచి జననం పొందటం తొలి జన్మ అయితే ఉపనయనం ఆ వ్యక్తికి రెండో జననంగా పరిగణిస్తారు. దీనికి అధర్వణ వేదంలో ఈ విధమైన వివరణ ఉంది. 

'ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణ్వతే గర్భమంతః
తం రాత్రోస్తిత్ర ఉదరే విభర్తి తం జాతం ద్రష్టుమాభిసంయతి దేవాః'

అంటే, ఆచార్యుని వద్దకు విద్య కోసం వచ్చే బ్రహ్మచారి చేసుకునే ఉపనయనం, అతను తన తల్లి గర్బం నుంచి జననం పొందినదానికి సమానమైనదిగా భావించవచ్చునని అర్థం. బ్రాహ్మణుల జీవితంలో అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చిన కారణంగా ఉపనయనం గురించి కొంత విశదంగా తెలుసుకోవటం అవసరం.

ఉపనయనం అంటే ఏమిటి?
సమాజాన్ని నేరుగా చూడడానికి మనకు భౌతికమైన నేత్రాలు రెండు ఉన్నాయి. కానీ, ఈ రెండు కళ్లకూ కనపడని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి మనం మన అంతఃచక్షువులను తెరువవలసి  ఉంటుంది. 'భక్త కన్నప్ప' చిత్రంలో ముళ్లపూడి వారు అన్నట్లుగా లోపలి నేత్రాలు,

లోని వెలుగు అన్నమాట! పుట్టిన నాటి నుంచి శారీరకంగా తెరుచుకుని ఉన్న నయనాలు కాకుండా, ఆ 'లోని నేత్రాల'ను తెరవాలని మనం చేసే ప్రయత్నమే 'ఉపనయనం'.

సమాజంలోకి స్వాగతం
అంతవరకూ చిన్న అబ్బాయిగానో, అమ్మాయిగానో చూస్తూ వచ్చిన వ్యక్తి యవ్వనం సంతరించుకుంటున్న దశలో, ఆ వ్యక్తిని, 'పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించటానికి ఇక నువ్వు సిద్ధం కావాల'ని తెలియజేస్తూ, చేసే వేడుకే ఇది. వాస్తవానికి ఇది, తమ మధ్యలోకి ఒక యువకుడిని (లేదా యువతిని) ఆహ్వానించడం అన్నమాట. ఇలాంటి వేడుకలు అన్ని మతాలలోనూ ఉన్నాయి. క్రైస్తవులు దీన్ని 'బాప్టిజమ్‌'  అంటుండగా, పార్శీలు తమ ఆడ, మగ బిడ్డలకు ఆరు సంవత్సరాల మూడు నెలలకు చేసే ఈ   ఉత్సవాన్ని 'నవ్‌జోత్‌' (నవజాతం - 'కొత్త పుట్టుక') అంటున్నారు.

మహమ్మదీయులు ఈ వేడుకను ఆ మగబిడ్డ జననాంగానికి సున్తీ చేయటం ద్వారా జరుపుకుంటున్నారు. 'ఇక ఈ వ్యక్తికి యవ్వనారంభం అయింద'ంటూ సమాజానికి ప్రకటించే పద్ధతి ఇది అనుకోవచ్చు. దాదాపు ఇలాంటి వేడుకనే మనం 'ఉపనయనం' అంటున్నాం. 

గురుకుల విద్యకు ఆరంభం
మొదట్లో 'ఉపనయనం' ఉండేది కానీ, 'విద్యారంభం' అనే సంస్కారం ఉండేది కాదు. దానికి గల కారణాలను పైన పేర్కొవడం జరిగింది.  

ఉపనయనం అనేది అనాదిగా బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పే ప్రక్రియకు ఆరంభంగానే ఉండేది. అందుకే, అథర్వ వేదం 'ఉపనయమానో బ్రహ్మచారిణమ్‌' అన్న నిర్వచనాన్ని ఇచ్చింది. బ్రహ్మచారి కావటం అంటే, ఒక ఆచార్యుని వద్ద విద్యార్థి కావటం అనే అర్థం.

'ఉపసమీపే ఆచార్యదీనా వటోర్నితిర్నయనం ప్రాపణ ముపనయనమ్‌'  అంటే, తమ బిడ్డను గురువు వద్దకు విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు తీసుకు వెళ్లటం అన్నది ఇందుకే!! అయితే,
'గురుర్వ్రతానాం వేదస్య యమస్య నియమస్య చ
దేవతానాం సమీపం వ యేనాసౌ నీయతాసౌ'

అంటే, ఉపనయనం అంటే, గురువు సన్నిధిలో విద్య నేర్చుకునే వ్రతం ఆరంభించటం ఒక్కటే కాదనీ, వేదం నేర్చుకోవటం, దైవానికి సమీపం కావటానికి దైవం గురించి తెలుసుకోవటం వంటివన్నీ ఉన్నాయని చెప్పటమూ ఉంది. వీటిన్నిటిలోనూ వేదాధ్యయనానికి పెద్దపీటగానూ  ఉండేది. భరద్వాజుడు మాత్రం ఉపనయన సంస్కారాన్ని 'ఒక వ్యక్తి తాను విద్యాభ్యాసం చేయదలిచినట్టు తెలియజేసే ప్రకటన'గానే భావించారు. 

ఏది సరైన వయస్సు?
ఉపనయనానికి తగిన వయసును పలు రకాలుగా నిర్ధారించారు. బ్రాహ్మణులలో ఉపనయనానికి ఎనిమిది సంవత్సరాలు వయసు తగినదని, క్షత్రియులకు పదకొండు సంవత్సరాలు, వైశ్యులకు పన్నెండు సంవత్సరాల వయసు మేలని అనేక గృహ్య సూత్రాలు వివరిస్తున్నాయి. సావిత్రి మంత్రంలో ఉన్న అక్షరాలను బట్టి ఈ వ్యత్యాసం ఏర్పడిందన్నది ఒక భావన. బ్రాహ్మణుల సావిత్రీ మంత్రంలో 8, క్షత్రియుల మంత్రంలో 11, వైశ్యుల మంత్రంలో 12 అక్షరాలు ఉండడమే కారణమని వీరి అభిప్రాయం. అయితే వీటన్నిటితో బాటు మరొక కారణం కూడా ఉండి ఉండవచ్చునని కొందరి భావన.  అప్పట్లో విద్యాభ్యాసం అంతా బ్రాహ్మణ గురువుల వద్దనే జరిగేది. దీనికై విద్యార్థులు గురుకులానికి వెళ్లి, అక్కడే నివసించవలసి వచ్చేది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉపనయన సంస్కారానికి వయస్సును నిర్ణయించడం జరిగి   ఉండవచ్చునని వీరి అభిప్రాయం. బ్రాహ్మణ బాలురకు తమ ఇంటనే,తమ తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేయగల అవకాశం ఉండటం, ఇతరులకు తమ బిడ్డలను వేరే చోటకు పంపవలసి రావటం వల్ల ఆయా పిల్లలు వేరే చోట, ఒంటరిగా ఉండగల వయస్సు వచ్చేంత వరకు విద్యాభ్యాసాన్ని ఆపవలసి వచ్చేదని, అందుకే వారికి బ్రాహ్మణులతో పోలిస్తే కొంచెం ఆలస్యంగా విద్యాభ్యాసాన్ని మొదలు పెట్టే విధానం ఆరంభమయి              ఉండవచ్చునని అనుకోవచ్చు. 

ఈ విధమైన భిన్నమైన వయో నిర్ధారణలకు మరో కారణం కూడా ఉండవచ్చు. అనాది నుంచి బ్రాహ్మణులకు విద్యాభ్యాసమే ప్రాథమికమై  ఉండేది.

ఇక, క్షత్రియులకు యుద్ధకళల విద్య, వైశ్యులకు వ్యాపార విద్య అవసరం ఉండేది. వీరికి వేద విద్య అంతగా అవసరం లేని కారణంగా, తమకు ప్రాథమికమైన వేద విద్యను బ్రాహ్మణ బ్రహ్మచారులు పూర్తి చేసే నాటికి ఇతరులు వచ్చి ఆ గురుకులంలో చేరేవారు. ఫలితంగా, విద్యాభ్యాసానికి, దానికి ముందు చేయవలసిన ఉపనయనానికి బ్రాహ్మణేతరులకు కొంత వెసులుబాటు (అధిక సమయం రూపంలో) లభించి  ఉండవచ్చు. కాలక్రమేణా ఇదే వారి వారి వయస్సులో వ్యత్యాసానికి ప్రాతిపదిక అయి ఉండవచ్చు కూడా!!

మనుస్మృతిలో దీని గురించి ఇలా ఉంది:
'బ్రహ్మచర్యస కామస్య కాయం విప్రస్య పంచమే
రాజ్ఞో బలార్థినః షష్ఠే వైశ్యస్య చార్థినోష్ఠమే!!' 

తేజస్సును కోరుకునే బ్రాహ్మణ బ్రహ్మచారికి అయిదవ ఏట, బలాన్ని కోరుకునే క్షత్రియ బ్రహ్మచారికి ఆరవ ఏట, అర్థాన్ని (సంపదను) కోరుకునే వైశ్య బ్రహ్మచారికి ఎనిమిదవ ఏట ఉపనయనం మంచిది, అని అర్థం. 

అయితే ఎట్టి పరిస్థితిలోనూ బ్రాహ్మణులకు 16 సంవత్సరాలలోపు, క్షత్రియులకు 22 సంవత్సరాలలోపు, వైశ్యులకు 24 సంవత్సరాలలోపు  ఉపనయనం జరపాలన్న నియమం కూడా పారస్కర గృహ్య సూత్రాలలో (1,5,36,38) ఉంది. 

ఎప్పుడు చేయాలి :
'మౌంజీబంధ శ్శంస్యతే బ్రాహ్మణానాం గర్భాదానాజ్జన్మతో వాష్టమేబ్దే
భూమీశానా మేన మేకాదశేబ్దే వైశ్యానాస్తు ద్వాదశే తద్వదేవ..'


'బ్రహ్మక్షత్ర విశామధోపనయనం వక్ష్యే వసంతే క్రమా
ద్గ్రీష్మర్తౌ శరదీహ వర్ణనియతే తత్రాపి సాధారణాః'

అని 'మనుస్మృతి'లో మరోచోట ఉంది. మౌంజీబంధకార్యం (ఉపనయనం) బ్రాహ్మణులకు వారు పుట్టిన తర్వాత అష్టమ వర్షంలో, వసంత ఋతువులో, క్షత్రియులకు 11వ సంవత్సరంలో గ్రీష్మ ఋతువులో, వైశ్యులకు 12వ సంవత్సరంలో శరదృతువులో చెయ్యాలని అర్థం.     

బ్రాహ్మణులకు వసంతకాలంలో, క్షత్రియులకు గ్రీష్మకాలంలో, ఇక, వైశ్యులకు శరత్కాలంలో, రథకారులకు వర్షాకాలంలో చేయాలని బౌధాయన గృహ్య సూత్రాలూ (11,5, 6) చెప్తున్నాయి. ఆయా కాలాలు ఆయా వృత్తుల వారి మనస్తత్వాలకు తగినట్టుగా ఉంటాయనేది ఈ కాల నిర్ణయానికి కారణం.

అలాగే, 'మాఘమాసంలో ఉపనయనం జరిగినట్లయితే ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు; ఫాల్గుణంలో ఉపనయనం జరిగితే మేధావి అవుతాడు.

చైత్రంలో జరిగితే ప్రతిభావంతుడు, వేదవేదాంగ పారంగతుడు అవుతాడు; వైశాఖంలో జరిగితే ఐహిక సుఖాలు లభిస్తాయి. జ్యేష్టంలో జరిగితే తెలివైన వాడు, గొప్పవాడు అవుతాడు. ఆషాడంలో జరిగితే శత్రు సంహారకుడు, పండితుడు అవుతాడు' అని చెప్తారు. అయితే, 'మాఘంనుంచీ జ్యేష్ట మాసం వరకూ శ్రేష్ఠ మాసాలు కాబట్టి, జాతిభేద నిమిత్తము లేకుండా ఈ అయిదు మాసాలందునూ బ్రహ్మక్షత్రియవైశ్యులకు ఉపనయన కర్మ చేయుట ముఖ్యము' అని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం తమ పుస్తకం 'వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు' (పేజీ. 33)లో అంటున్నారు. 

ఉపనయనం చేయడానికి నెలలో చంద్రకళలు పెరిగే శుక్లపక్షం మంచిది. 

ఉపనయన సంస్కార విధి
ఉపనయనానికి నిర్ణయించుకున్న రోజుకు - ఒక్కరోజు ముందు గణపతి పూజతో పాటు లక్ష్మీపూజ, ధృతిపూజ, మేధా పూజ, పుష్టిశ్రద్ధతో బాటు సరస్వతీ పూజ చేస్తారు. రాత్రి సమయంలో, కాబోయే బ్రహ్మచారి శరీరానికి పసుపు రాసి ఉంచుతారు. ఆ రాత్రి అంతా అతను మౌనంగా ఉండాలి. పసుపు రాయటం వల్ల తల్లి గర్భంలో ఉన్న పిండ భావన, మౌనంగా ఉండటమంటే ఇంకా జన్మనెత్తని మౌనపిండ భావన కలగజేయటమే వీటి అంతరార్థం. అంటే మరో జన్మను ఎత్తటానికి అతను సంసిద్ధం అవుతున్నాడన్న మాట!! తర్వాతరోజు ఉదయం, తల్లితో కూర్చుని భోజనం చేయాలి. ఇకపై బిడ్డ తనతో ఉండడనీ, కనుక తను అతనికి వండి వడ్డించే అవకాశం కోల్పోతుందనీ తల్లికి గుర్తుకు వచ్చే సన్నివేశం అది. అలాగే, తాను ఇకపై తల్లికూచి కాదనీ, ఇక చిన్న పిల్లవాడిలా కాకుండా బాధ్యతతో ఉండాలని ఆ పిల్లవాడికి గుర్తు చేసే సన్నివేశమూ ఇదే! దీనితో బాటు, ఉపనయన సంస్కారానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఆ సమయంలో ఆకలికి బిడ్డ గురి కాకుండా ఉండేందుకు జరిగిన ఏర్పాటు కూడా ఇది కావచ్చు!! దీని తర్వాత, తల్లిదండ్రులు ఇద్దరూ తమ బిడ్డను  ఉపనయనం వేడుక జరిగే పందిరి కిందకు తీసుకు వెడతారు. అప్పటికే చూడాకరణం జరిగి ఉంటే సాధారణ రీతిలో క్షవరం చేయిస్తారు. లేదంటే అప్పుడే చూడాకరణం చేయిస్తారు. తర్వాత అభ్యంగనం లేదా తలస్నానం.

కౌపీన ధారణం
తలంటు అయిపోయాక, వటువుకు ఒక కౌపీనం (గోచీ) ఇస్తారు. ఆ తర్వాత, వటువు, గురువు వద్దకు వెళ్లి (ఆ గురువు ఆ బ్రహ్మచారి తండ్రి కూడా కావచ్చు), తాను విద్యాభ్యాసం కోసం వచ్చినట్టు, తనను శిష్యునిగా ఆమోదించవలసిందిగా కోరుతాడు. అప్పుడు గురువు ఆ అభ్యర్థనను మన్నించి, కాబోయే శిష్యునికి 'ఇంద్రునికి బృహస్పతి అమరత్వమనే వస్త్రాన్ని ఇచ్చినట్టు' అధిక ఆయుష్షుకు, బలానికి, సాహసానికి గుర్తుగా ఉత్తరీయ వస్త్రం ఇస్తారు. ఇది శిష్యుడు, అంతక్రితం ధరించిన ఒక్క కౌపీనానికి అదనం అవుతుంది. ఇకపై వస్త్ర ద్వయంతోనే ఆ వటువు ఉండాలి. మనం కూడా పూజలను వస్త్రద్వయంతోనే చేయడం ఇందుకే!!

ముంజీబంధం
తర్వాత, ఆ బ్రహ్మచారి నడుముకు ఒక (మొల) తాడును గురువు కడతారు. ముంజ (గడ్డి) దర్భలతో దీన్ని చేయటం వల్ల దీన్ని 'ముంజ' అంటారు. ఇది మూడు వరసలుగా ఉంటుంది. ఈ మూడు వరసలూ మూడు వేదాలకు ప్రతీకలుగానూ, ఆ వేదాలు అతనికి రక్షగా ఉంటాయని భావిస్తారు. 

పోతన 'శ్రీమదాంధ్ర మహా భాగవతం'లో వామనావతారం కథా సందర్భంలో ఒక పద్యం రాశారు: 
'గొడుగో జన్నిదమో కమండలువో నాకున్‌ ముంజియో దండమో
వడుగేనెక్కడ భూముల్కెడ కరుల్‌ వామాక్షులశ్వంబులె
క్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్‌ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్‌'

అంటూ రాసిన ఆ పద్యంలో ఒక బ్రహ్మచారికి ఉండవలసినవి, ఆ బ్రహ్మచారి కోరుకోదగినవీ ఉన్నాయి. ఆ పద్యాన్ని ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవడం ఔచిత్యంగా ఉంటుంది. 

యజ్ఞోపవీత ధారణ

ఉపనయన సంస్కారంలో ముఖ్యమైన యజ్ఞోపవీతధారణ కార్యక్రమం ఉంటుంది. చిత్రం ఏమిటంటే ఏ గృహ్యసూత్రాలలోనూ యజ్ఞోపవీతధారణ గురించి ప్రస్తావన లేకపోవటం!! అయితే, బ్రాహ్మణులు తెలుపు రంగుతో తయారైన నూలు యజ్ఞోపవీతాన్ని, క్షత్రియులు ఎరుపు రంగు ఉన్ని (ఊలు) యజ్ఞోపవీతాన్ని, వైశ్యులు పసుపు రంగు లినెన్‌ (Linen) యజ్ఞోపవీతాన్ని ధరించాలని ఉండేది. వారు ధరించే యజ్ఞోపవీతాన్ని బట్టి ఆనాడు కుల నిర్ధారణ జరిగేది. అందుకే, అది కులానికి మరో పేరైన 'వర్ణం' అయింది. ఇప్పటికీ పల్లెటూళ్లలో 'మీరు ఏ కులంవారు?' అని అడగటానికి 'మీరు ఏ వర్ణస్తులు?' అని అడగటం  ఉంది. 'కులం' వర్ణం కావటానికి ఇదే కారణం!! కానీ, కాలక్రమేణా యజ్ఞోపవీత ధారణకు అందరూ పత్తితో వడికిన దానినే వాడటం పద్దతి అయింది. 

అయితే, ఇది తప్పంటారు పూజ్యులు డా. మైలవరపు శ్రీనివాస రావుగారు. 'వర్ణం' అనే మాటకు 'లక్షణం' అని అర్థం. సత్త్వలక్షణం కలవాడివా, అయితే బ్రాహ్మణుడివే, రజోగుణం కలవాడివా.. అయితే క్షత్రియుడివే... ఇలా ఆయా లక్షణాలనుబట్టి ఏర్పడినవే వర్ణాలు అంటారు శ్రీ శ్రీనివాస రావుగారు.  ఉపనయనం అనేది శుద్ధిని, ఔన్నత్యాన్ని సాధించే ప్రక్రియ కాబట్టి, దీనికి తగినట్టుగానే, పరిపూర్ణ స్వచ్ఛతకు ప్రతీక వంటి ఒక బ్రాహ్మణ కన్య వడికిన నూలుతో, ఒక బ్రాహ్మణుడు పురి పెట్టిన దారంతో యజ్జోపవీతాన్ని సిద్ధం చేస్తారు. ఆయా గోత్రాలలో ప్రవరకు ఎంత మంది ఋషులు ఉంటారో, యజ్ఞోపవీతంలో అన్ని ముడులు వేస్తారు. ఈ ముడులూ ఒక వ్యక్తికి తనకు ఉన్న దేవఋణం, ఋషి ఋణం, పితౄణం అనే మూడు ఋణాలను నిత్యం గుర్తు తెస్తుంటాయని భావిస్తారు. ఈ మూడు ముడులనూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీలుగా భావిస్తారు. 

ఈ మూడు ముడులను కలుపుతూ మరో ముడి వేస్తారు. దీన్ని 'బ్రహ్మగ్రంథి' అంటారు. కొందరు తమతమ ప్రవరలను బట్టి అన్ని ముడులను వేస్తారు. అలాగే, యజ్ఞోపవీతంలో ఉండే మూడు పోగులు సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలు అంటారు. ఒక వయోజనుడి చేతి నాలుగు వేళ్ల వెడల్పునకు 96 రెట్ల పొడవుతో యజ్ఞోపవీతం ఉండాలి. ఈ నాలుగు వేళ్లూ ఒక మనిషి జీవితంలోని మెలుకువగా ఉండటం, కలలు కనటం, కలలు లేని నిద్రాస్థితి, బ్రహ్మత్వం పొందటం అనే నాలుగు స్థితులకు ప్రతీకలుగా భావిస్తారు. 

ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మచారి మెడలో వేస్తూ, మనకు సుపరిచితమైన
'యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్‌
 ఆయుష్యమగ్రం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః'

అన్న పారస్కర గృహ్యసూత్రాలలోని మంత్రాన్ని గురువు పఠిస్తారు. ఈ మంత్రాన్ని గురువు పఠిస్తున్న సమయంలో వటువు తలెత్తి సూర్యుని వైపు చూస్తుంటాడు. 

యజ్ఞోపవీత ధారణ నియమాలు
యజ్ఞోపవీతం ధరించటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సాధారణంగా ఎడమభుజంమీదనుంచి కుడివైపు నడుముమీదకు యజ్ఞోపవీతాన్ని ధరించాలి. దీన్ని 'ఉపవీతి' అంటారు. ఏదైనా అశుభ కార్యాలను చేస్తున్నప్పుడు, యజ్ఞోపవీతాన్ని కుడి భుజం మీద నుంచి ధరించాలి. దాన్ని 'ప్రాచీనావీతి' అంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో యజ్ఞోపవీతాన్ని మెడలో హారంగా ధరించినప్పుడు 'నివీతి' అంటారు. 

'యజ్ఞము' అన్న తత్సమపదానికి 'జన్నము' అనేది వికృతి. ఈ 'జన్నము' అనే పదం నుంచి పుట్టిందే 'జంధ్యము'.

కృష్ణాజినం
యజ్ఞోపవీతధారణ తర్వాత వటువుకు 'అజినం' ఇస్తారు. 'అజినం' అంటే జంతు చర్మం, 'కృష్ణాజినం' అంటే నల్ల జింక చర్మం. మనిషి ఆటవికుడిగా జీవిస్తున్న కాలంలో అతనికి వివిధ శీతోష్ణ స్థితిగతులలో తోడుండే ఒక జింక చర్మం లభించటమంటే చాలా గొప్ప విషయం. కానీ, ఇప్పుడు అటవీ జంతువుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయి, ఉన్న కొన్ని జంతువులనూ కంటి పాపలలాగా కాపాడుకోవాల్సిన ఈ రోజుల్లో ఒక జంతువు చర్మాన్ని కలిగి ఉండటమే మహనేరం. అందుకే, ఇప్పుడు 'ధర్భాజినం'తో ఈ సంస్కారం కొనసాగిస్తున్నారు. ఋషులు వాడే 'కృష్ణాజినం' ఇవ్వటం ద్వారా 'నువ్వు సైతం అంతటి స్థాయిని చేరుకోవాల'ని పరోక్షంగా చెప్పటమన్నమాట!!

దండప్రసాదం
తర్వాత, గురువు తన శిష్యునికి ఒక దండాన్ని ఇస్తారు. 'దండం' అంటే కర్ర అని అర్థం. ఆ రోజుల్లో గురువు ఇంటికి వెళ్లే విద్యార్థికి చేతి సహాయంగా ఉండేందుకు దీన్ని ఇచ్చినా, క్రమేణా దీని వెనక కూడా సంకేతాలు ఉన్నాయన్న వ్యాఖ్యానాలు పెరిగాయి. 'నేర్చుకునేది వేద విద్య కాబట్టి, ధర్మాన్ని పరిరక్షించటంలో నీ బాధ్యత గుర్తెరుగు' అన్నది ఒక వ్యాఖ్యానం అయితే 'విద్యాభ్యాస ప్రక్రియలో నువ్వు బహుదూరపు బాటసారివి, జాగ్రత్తగా ముందుకు వెళ్లు' అనేది మరో వ్యాఖ్యానం. 

సరే, ఈ వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా, ఆ దండం ఎలాంటిది, ఎంత పొడవుతో ఉండాలనే విషయాన్నీ నిర్ధారించారు. బ్రాహ్మణ వటువులకు అతని శిరోజాల వరకు ఎత్తుండే పలస కర్ర, క్షత్రియ వటువులకు అతని నుదుటి వరకూ ఎత్తుండే ఉడుంబర కర్ర, వైశ్య వటువులకు వారి ముక్కు వరకూ ఎత్తుండే బిల్వ కర్రలతో చేసిన దండం ఇవ్వాలి. ఈ దండం ఎలాంటి వంకరలూ ఎలాంటి పుచ్చులు లేకుండా ఉండాలి. అయితే ఇప్పుడుఎవ్వరూ విద్యకై గురుకులాలకు వెళ్లటం లేదు కాబట్టి, దండం అనేది ఒక చిహ్నంగానే మిగిలి ఉంది. 

సావిత్రీ మంత్రగ్రహణం
దండాన్ని ఇచ్చిన తర్వాత గురువు, ఆ వటువును తన శిష్యుడిగా స్వీకరించినట్లు అవుతుంది. అప్పుడు, ఆ వటువు జోడించిన చేతులలోకి గురువు నీటిని పోసి, అతడిని శుద్ది చేస్తారు. దీనితో అతనికి సావిత్రీ మంత్ర గ్రహణానికి అర్హత లభిస్తుంది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని చూస్తూ, సూర్యుడి నుంచి క్రమశిక్షణను, విధి నిర్వహణను నేర్చుకోవాలని చెప్తారు. దీని తర్వాత, శిక్షణ కాలంలో అన్నిటినీ హృదయపూర్వకంగా నేర్చుకోవాలనే దానికి సూచనగా గురువు, తన చేతిని వటువు గుండెలమీద పెడతారు. తర్వాత, వటువును ఒక రాతి మీద నిలబెడతారు. 'విద్యాభ్యాసం కఠోర పరిశ్రమతో కూడినదనీ, ఏ పరిస్థితిలోనైనా నిత్యం అంత స్థిరంగానూ ఉండాల'ని చెప్పటం దాని ఉద్దేశ్యం. తర్వాత, అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం, సావిత్రీ మంత్రాన్ని మొదట ఒక్కొక్క పదంగా, తర్వాత ఒక్కొక్క పాదంగా, మూడోసారి పూర్తిగానూ అతనికి బోధిస్తారు. సావిత్రీ మంత్రాన్ని బ్రాహ్మణులకు గాయత్రీ ఛందస్సులో, క్షత్రియులకు త్రిష్టుభ ఛందస్సులో, వైశ్యులకు జగతీ ఛందస్సులో వినిపిస్తారు. అయితే ఇప్పుడు సర్వత్రా గాయత్రీ ఛందస్సులోనే ఈ బోధ జరుగుతోంది. 

    
'తత్సవితుర్వరేణ్యం
    భర్గోర్దేవస్యధీమహీ
    ధీయో యో నః ప్రచోదయాత్‌'

అన్న సావిత్రీ మంత్రబోధనతో, మంత్రాన్ని బోధించిన గురువు తండ్రిగా, సావిత్రి తల్లిగా వటువు రెండో జన్మను పొందినట్టుగా భావిస్తారు. దీనితో, ఆ వటువు 'ద్విజుడు' అవుతాడు. దీని తర్వాత, జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నట్టుగా హోమంలో సమిధలను వేస్తారు. 

సావిత్రే గాయత్రి:
ఇక్కడ మరొక్క విషయం ముచ్చటించుకోవటం మంచిది. 'గాయత్రీ మంత్రం' అనగానే మనం 

  
 'ఓమ్‌ భూరుభవస్సువః
    తత్సవితుర్వరేణ్యం, భర్గోర్దేవస్యధీమహీ
    ధీయో యో నః ప్రచోదయాత్‌'

అన్న మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం. ఇది విశ్వామిత్రుడు రాసినదని అంటాం. అయితే,
ఋగ్వేదంలో 3వ మండలం, 62వ సూక్తం, 10వ ఋక్‌లో ఉన్న సావిత్రీ మంత్రంలో 'ఓమ్‌ భూర్భువస్సువః' అన్న మాట ఉండదు. నిజానికి ఇది సవితృను పూజించే ప్రార్ధనా మంత్రం. సూర్యుడినే 'సవిత' అంటారు.

కానీ, సూర్యునికి భిన్నంగా వేరే ఆదిత్యులు ఎనిమిది మంది, లేదా పన్నెండు మంది ఉన్నారని వేరే లెక్క ఉంది. అయితే, మన దృష్టిలో సూర్యుడు, సవిత, ఆదిత్యుడు, అందరూ ఒక్కరే కాబట్టి, ఇది సూర్యోపాసన సంబంధితమనే అనుకోవడం మంచిది. 

సూర్యుడు, సావిత్రి అనే రెండు పేర్లనూ సమానార్థకంగా వాడటం ఉంది. మన కళ్లకు  కనిపించేవాడు సూర్యుడు అయితే కంటికి కానరాని సమయంలోని సూర్యుడిని 'సావిత్రి' అంటారని, అయితే ఈ వివరణ అంత సంతృప్తికరమైనది కాకపోవచ్చునని విల్కిన్స్‌ అంటారు. (Hindu Mythology, W.J. Wilkins, Roopa & Co, New Delhi, 2006, P.30)

ఈ సావిత్రీ మంత్రం ఒక్కొక్క పాదంలో ఎనిమిదేసి అక్షరాలు చొప్పున మూడు పాదాలు ఉండే 'గాయత్రీ ఛందస్‌'కు చెందినది కావటంతో, దీన్ని 'గాయత్రీ మంత్రం' అనటం కూడా జరుగుతోంది.   

            'తత్సవితుర్వరేణ్యం

             భర్గోర్దేవస్య ధీమహీ
             ధీయో యో నః ప్రచోదయాత్‌'
 
అనే గాయత్రీ మంత్రానికి ముందు
'ఓమ్‌ భూర్భువస్సువః' అన్నది  చేర్చాలని త్తైత్తరీయ ఆరణ్యకం (2.11.1-8) నిర్దేశిస్తోంది.

        'తత్సవితుర్వరేణ్యం

         భర్గోర్దేవస్య ధీమహీ
        ధీయో యో నః ప్రచోదయాత్‌' 

అనేది వ్యాహృతి కాగా, 'ఓమ్‌ భూర్భువస్సువః' అనేది మహావ్యాహృతి. మనం నిత్యం పఠించే గాయత్రీ మంత్రం వెనుక ఇంత కథ ఉంది. 

అన్నట్లు 'గాయత్రి' అంటే అర్థం ఏమిటో తెలుసా? 'గా' అంటే పాడటం వలన, 'యత్రి' అంటే రక్షించునది అనీ అర్థం. అంటే, గాయత్రి అంటే 'పఠించటం ద్వారా రక్షణ కలిగించేది' అని అర్థమన్నమాట!!

ఇదే సందర్భంలో 'గాయత్రీ మంత్రం' అర్థం ఏమిటో కూడా తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది.

'ఓమ్‌.. భువర్లోక, భూలోక, స్వర్గ లోకాలలో అంతర్యామి అయిన ఏ దివ్య తేజస్సు మన బుద్ధిప్రవృత్తులను ప్రేరేపింపజేస్తోందో ఆ దివ్య తేజస్సును ధ్యానిస్తున్నాను...' అని గాయత్రీ మంత్రానికి అర్థం. 

విద్యార్జనకు బిక్ష 
ఈ సంస్కార క్రియల అనంతరం, బ్రహ్మచారి బిక్షలకు బయలు దేరుతాడు. చాలా కాలం వరకూ జరిగే విద్యార్జనకు తగినంత డబ్బు ఉండడం కష్టం కనుక, తెలిసిన వారి నుంచి ధన సహాయం కోరటం ఆ రోజుల్లో మామూలు విషయంగా ఉండేది. 

'భవతీ బిక్షాం దేహి' అని ఆడవారిని కోరటం, 'బిక్షాం దేహి' అని మగవారిని కోరటం ఆనవాయితీ అయింది. అర్హులైన బ్రహ్మచారులను చదివించడం సమాజం బాధ్యత అని కూడా ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుంది. 

త్రిరాత్రా వ్రతం
వీటన్నటి తర్వాత, బ్రహ్మచారి చేయవలసిన త్రిరాత్రా వ్రతం ఉంటుంది. ఈ మూడు రోజులూ ఆ బ్రహ్మచారి ఉప్పు వేసిన భోజనం తినరాదు. నేలమీదే నిద్రపోవాలి. పగటి పూట నిద్ర పోరాడు. ఇది రాబోయే గురుకులంలోని శిక్షణాకాలానికి తర్ఫీదులాంటిది. 

ఈ విధులన్నీ సంపూర్ణం కావటంతో ఉపనయన సంస్కారం పూర్తి అయినట్టు లెక్క. ఆ తర్వాత నుంచి, వటువు, ప్రతి నిత్యం గాయత్రీ చేస్తూ,               శుభస్కరమైన జీవితాన్ని గడపటం అవసరం. 

కాశీయాత్ర
పూర్వకాలంలో ప్రధాన విద్యాకేంద్రంగా వారణాసి విలసిల్లుతూ ఉండేది. ముఖ్యంగా సంస్కృతవిద్యకు వారణాసి (లేదా కాశీ) నగరమే పుట్టిల్లుగా ఉండేది.

ఆ కారణంగా ఉపనయనం తర్వాత, విద్యాభ్యాసానికై వటువు కాశీ వెళ్లటం తప్పనిసరిగా ఉండేది. ఇప్పటికిలాగ అప్పట్లో విమానాలు, రైళ్లు, బస్సులు వంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావు గనుక, కాశీకి నడచివెళ్లటమే గతి. ఆ కాశీ ప్రయాణం అంటేనే కష్టమైన పని. పైగా వెడుతున్నది చదువుకోసం.

అది ఎంతకాలం జరుగుతుందో అదీ తెలీదు. గురువుగారి దయమీద, విద్యార్థి ఆసక్తిమీదా, పరిస్థితులమీదా ఆ గురుకుల విద్య కొనసాగేది. ఎంత లేదన్నా, కనీసం ఎనిమిది, పది, లేదా పన్నెండు సంవత్సరాల వరకూ విద్యాభ్యాసం జరిగేది. గురువుగారి దయమీద, వారింట్లో ఉంటూ చదువుకునే విద్యార్థి, మధ్యలో తల్లీదండ్రులను చూడాలని ఇంటికి తిరిగి రావటం దాదాపు అసాధ్యం కనుక, కాశీ యాత్రను ఒక వేడుకగా, చుట్టుపక్కలవారికి ఆ విషయం తెలియజేసే

ఒక ప్రకటనగా జరపటం ఆచారమయింది.

అయితే, ఇప్పుడు అనేక కారణాల వల్ల (ముఖ్యంగా చదువులన్నీ  ఉపనయనానికి ముందే పూర్తవుతున్న కారణంగా) ఉపనయనాన్ని, దానితోబాటుగా

ఒక బ్రహ్మచారి చేసే కాశీ యాత్రను వివాహానికి ముందు ఒక తంతుగా చేస్తున్నారు. ఫలితంగా, ఇప్పుడు వివాహసమయంలో జరిగే, ఉపనయనంలో భాగంగా ఆ బ్రహ్మచారి విద్యాభ్యాసానికి కాశీకి బయలుదేరుతాడు. 

ఈ సమయంలో అతని దీక్షను భగ్నం చేస్తూ, కాబోయే బావమరిది వచ్చి, ఆ బ్రహ్మచారి గడ్డం కింద బెల్లం లంచం పెట్టి, 'నా సోదరిని ఇచ్చి వివాహం చేయిస్తాము, దయచేసి నువ్వు విద్యాభ్యాసానికై కాశీ వెళ్లే యోచనవిరమించుకో' అని ప్రార్థించగానే, ఆ బ్రహ్మచారి 'బతుకు జీవుడా' అనుకుంటూ, చేతిలోని గొడుగూ, ముంజీ, దండం, కాళ్లకున్న పాంకోళ్లను అక్కడే పడేసి, కాబోయే భార్యకోసం పందిట్లోకి పరుగెడుతున్నాడనేది మనం కళ్లారా చూస్తున్న నిజం!

ఈ కాశీయాత్ర కామెడీ అంతా ముందుతరాల వారి కోసం మన ఫొటో ఆల్బమ్‌లలో నిక్షిప్తం కావటం మరొక విషయం!!

12. వేదారంభం :
ఒకప్పుడు ఉపనయనం, వేదారంభం అనే రెండు సంస్కారాలు వేర్వేరుగా జరిగేవి. కానీ, కాలక్రమేణా ఉపనయనంతోనే విద్యాభ్యాసారంభం కావటంతో, 'వేదారంభ' సంస్కారం పాతబడి, కనుమరుగున పడిపోయింది. ఈ సంస్కారం జరుగుతున్న కాలంలో, ఉపనయనం చేసుకున్న వటువు వచ్చినప్పుడు, గురువు అతనికి వేదారంభం చేస్తూ, కొన్ని సంస్కారాలు చేసేవారు. అగ్నిహోత్రం వద్ద వేదవిద్యను బోధించటం ఆరంభించేవారు. 

13. కేశాంతం :
ఇది కూడా బ్రహ్మచారికి అతని యవ్వనారంభాన్ని, బాధ్యతలను తెలియజెప్పే సంస్కారంగానే భావించాలి. ఈ సంస్కారం అంతా దాదాపు చూడాకరణం పద్ధ్దతిలోనే జరుగుతుంది. తేడా అంతా - చూడాకరణంలో తలమీద కేశాల ఖండనం జరిగితే, కేశాంతంలో మీసాలు, గెడ్డాలను తీసి వేయటం జరుగుతుంది. 

ఈ సంస్కారాన్నే 'గోదానం' అనటం కూడా ఉంది. కేశాంతం తర్వాత, గురువుకు దక్షిణగా ఒక గోవును ఇవ్వటం వల్లనే దీనికే 'గోదానం' అనే పేరు వచ్చిందనాలి. 

14. సమావర్తనం :
'ఆవర్తనం' అంటే వృత్తం అని అర్థం. చుట్టు తిరగటం అన్నమాట. విద్యకోసం గురుకులానికి వెళ్లిన బ్రహ్మచారి విద్యానంతరం తిరిగి తన గృహానికి రావటాన్నే 'సమావర్తనం' అంటున్నారు. 

'తత్ర సమావర్తనం నామ వేదాధ్యనానంతరం గురుకులాత్‌ స్వగృహాగమనమ్‌' అని సూక్తి.

స్వగృహానికి వచ్చిన వెంటనే స్నానం చేయవలసి ఉంటుంది కాబట్టి, ఈ సంస్కారాన్ని 'స్నానం' అని కూడా అంటున్నారు. విద్య అనేది ఒక మహాసముద్రం కాబట్టి, విద్యాసముద్రతరణం తర్వాత చేసేది 'విద్యాస్నాతకం' అయింది. 

ఈ స్నాతకాలు మూడు రకాలుగా ఉండేవి.
1. విద్యాస్నాతకం, 2. వ్రతస్నాతకం, 3. ఉభయస్నాతకం.
గురుకులంలో విద్యను పూర్తి చేసుకుని, ఇంటికి తిరిగి వచ్చే వారికి చేసేది 'విద్యాస్నాతకం'.

గురుకులంలో అన్ని వ్రతాలనూ పూర్తి చేసుకుని వచ్చే వారికి చేసేది 'వ్రతస్నాతకం' అనీ అంటున్నారు. 

గురుకులంలో విద్యనూ, వ్రతాలను రెంటినీ పూర్తి చేసుకుని, స్వగృహానికి తిరిగి వచ్చే వారికి చేసేది 'ఉభయస్నాతకం'.

ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి - ఇప్పుడు కూడా మన విశ్వ విద్యాలయాలు తమ విద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు 'స్నాతకోత్సవం' (Graduation Ceremony  లేదా Convocation Ceremony లను నిర్వహిస్తున్నాయి. అన్నట్లు, విశ్వవిద్యాలయాలు తమ పట్టభద్రులు తిరిగి చేపట్టే ఉన్నత విద్యను 'స్నాతకోత్తర విద్య' (Post Graduation) అనీ, ఆ విద్యను పూర్తి చేస్తే, వారిని 'స్నాతకోత్తర పట్టభద్రులు' (Post Graduates) అనీ అంటున్నారని గమనించారా!! ఆ పదాలన్నీ సమావర్తన సంస్కారం నుంచి ఆవిర్భవించినవే!!

విద్యానంతరం స్వగృహానికి తిరిగి వచ్చిన బ్రహ్మచారి సమావర్తనానికి నిర్ణయించుకున్న రోజు ఉదయం ఒక చీకటి గదిలో  ఉండాలి. అతను గురుకులంలో నేర్చుకున్న ఆ విద్యాప్రకాశం ముందు సూర్యుడు చిన్నబుచ్చుకుంటాడని భావన. అందుకే, సూర్యునికి ఆ అవమానం జరగకుండా ఉండేందుకు బ్రహ్మచారిని చీకటి గదిలో ఉంచుతారు. 

ఆ రోజు మధ్యాహ్నం ఆ బ్రహ్మచారి ఆ గదిలోంచి బయటకు వచ్చి, గురువు పాదాలకు నమస్కరించి, గౌరవ సూచకంగా వేదాగ్నికి సమిధలనువేస్తాడు. అప్పటికే అక్కడ ఎనిమిది పాత్రలతో నీళ్లు పెట్టి ఉంచుతారు. ఆ ఎనిమిది పాత్రలూ, భూమండలంలోని ఎనిమిది దిక్కుల నుంచి ఆ బ్రహ్మచారికి గౌరవప్రశంసలు లభిస్తున్నట్టు సూచన చేస్తాయి. అంతవరకూ, గురుకులంలోని నిష్ఠ వల్ల, కఠోరదీక్షల వల్ల బాగా వేడెక్కిపోయిన శరీరం ఆ ఎనిమిది పాత్రలలోని నీటి వల్ల చల్లబడాలన్నది ఆకాంక్ష. తగిన మంత్రోచ్చాటనతో, బ్రహ్మచారి ఒక్కొక్క పాత్రలోని నీళ్లు పోసుకుంటూ, స్నానం చేస్తాడు.

ఈ స్నానానంతరం, అంతవరకూ తను ధరిస్తూ వచ్చిన మొలతాడు (మేఖల), కృష్ణ్ణాజినం, దండం వంటి వాటిని తీసి నీళ్లలో వేస్తాడు. అంటే, తన పాత జీవితానికి స్వస్తివాచకం పలకటం అన్నమాట. స్థూలంగా ఈ సంస్కారం జరిగిన ఆ తర్వాత, అతనికి కొత్తబట్టలు తొడుగుతారు. విద్యాబుద్ధులు సంపాదించుకుని, సమావర్తనం జరుపుకున్న వ్యక్తికి సమాజంలో గొప్ప స్థానం ఉండేది. అయితే, ఇప్పుడు ఇది వివాహ సంస్కారంలో ఒక భాగంగా, ఒక వేడుకగా మారిపోయింది. ముఖ్యంగా మగ పెళ్లివారు నదిని దాటి వచ్చినట్లయితే, స్నాతకం జరుపుకొని తీరాలన్న పద్ధతి రూపొందింది. 

'విద్యాసముద్రం' దాటి రావటంతో ప్రారంభం అయిన 'స్నాతక' సంస్కార విధి చివరికి 'వివాహ మహోత్సవం' కోసం సాధారణ నదీ జలాలను దాటితే, స్నానం చేసే స్థితికి చేరటం జరిగింది!!

------------------------------------------------------------------------------