hinduBrahmins

----------------------------------------------------------------------------------------

శ్రీవత్స

    'శ్రీవత్స' మహావిష్ణువు హృదయచిహ్నం అన్నది తెలిసిందే. అక్కడే శ్రీమహాలక్ష్మి నివాసం. 

    ప్రతివాద భయంకర అణ్ణన్‌ రాసిన, నిత్యం మనందరం పఠించే 'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం'లో 22వ శ్లోకంలో 
                         
 'శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
                             వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
                            శ్రీవత్స చిహ్న శరణాగతపారిజాత
                           శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌'
అని ఉంటుంది. 

    అలాగే, శ్రీ విష్ణు సహస్ర నామ స్త్రోత్రంలోని 64వ శ్లోకం (ఇది విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు నిత్యం పఠించడం మంచిదంటారు)లో
                       
'అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృత్‌ శివః
                        శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః'
అనీ ఉంటుంది.

    పై రెండు శ్లోకాలవల్లా 'శ్రీవత్స' అనేది శ్రీ మహావిష్ణువుకు మరో పేరన్నది స్పష్టం. 

    వత్స, శ్రీవత్స అనేవి రెండూ రెండు వేర్వేరు గోత్రాలని కొందరి భావన. కాదు, రెండూ ఒకటేనన్నది ఇంకొందరి అభిప్రాయం. రెండూ వేర్వేరు అనేవారు శ్రీవత్స గోత్రానికి పంచార్షేయ (ఐదుగురు ఋషుల) ప్రవర కాగా, వత్స గోత్రానికి త్రయార్షేయ (ముగ్గురు ఋషుల) ప్రవర   ఉందని అంటారు. 

    పద్మ పురాణంలో వత్స మహర్షి ప్రస్తావన ఉంది. శ్రీమద్భగవద్గీతలోని 14వ అధ్యాయం ప్రశస్తిని పరమశివుడు పార్వతీదేవికి వివరిస్తున్నప్పుడు, వత్స మహర్షి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఈ వివరం ఇలా ఉంది: 

    సింహళ దేశాధిపతి అయిన (బేతాళ) విక్రమార్కుడు, ఒకసారి వేటకు వెడుతూ, తన కుమారుడిని, రెండు వేటకుక్కలనూ తీసుకు వెడతాడు. అడవిలో ఒక కుందేలుమీదకు తన కుక్కల్ని ఉసిగొలుపుతాడు. ఆ కుందేలు భయంతో పారిపోతూ, ఒక ఋషి ఆశ్రమంవరకూ వెళ్తుంది. అది వత్స మహర్షి ఆశ్రమం. ఆయన ఆ సమయంలో శ్రీమద్భగవద్గీతలోని 14వ అధ్యాయాన్ని పఠిస్తూ, శ్రీమహావిష్ణువును జపిస్తూ, కీర్తిస్తూ, తన కాళ్లను కడుక్కుంటూ ఉంటాడు. ఆయన కడుక్కుంటున్న కాళ్లనుంచి ప్రవహిస్తున్న నీరంతా అక్కడ బురదగా ఏర్పడుతుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన కుందేలు, దానివెంట వచ్చిన వేటకుక్క రెండూ

ఆ బురదలో పడి, స్వర్గం చేరుకుంటాయి. ఈ దృశ్యాన్ని చూసి, ఆ వత్స మహర్షి పకాలున నవ్వుతాడు. అప్పటికి అక్కడికి చేరిన విక్రమార్కుడు, వత్స మహర్షిని ఆ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతాడు. 

    అప్పుడు, వత్స మహాముని, మహాభారతంలోని ఒక కథ చెప్తాడు: భరత ఖండంలో ప్రతూథక్‌ అని ఒక నగరం ఉంటుంది.అక్కడ, కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్య విలోపమ (ఈమె పేరే 'విలోపన' అనికూడా అంటారు)తో నివాసం ఉంటాడు. ఆ భార్యది విచ్చలవిడి ప్రవర్తన. ఆమెను ఆ విషయంలో కేశవుడు నిత్యం వేధిస్తూ ఉంటాడు. ఆమె తన తర్వాతి జన్మలో కుక్కగా జన్మించగా, కేశవుడు తన తర్వాతి జన్మలో కుందేలుగా పుడతాడు. ఆ దంపతులే ఇప్పుడు అదే జన్మాంతరవైరం కొనసాగిస్తూ, ఈవిధంగా మళ్లీ ఒకరినొకరు తరుముకుంటూ ఉండటం చూసి తనకు నవ్వు వచ్చిందని వత్స మహర్షి వివరిస్తాడని

ఈ కథ. 

----------------------------------------------------------------------------

Copyright Reserved