hinduBrahmins

---------------------------------------------------------------
                                                                          దక్షిణ కాశీ

                                         శ్రీకాళహస్తి                                                                    


అనేకానేక ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు నిలయం మన ఆంధ్రప్రదేశం. పవిత్రమైన ప్రతీ ఆలయం వెనుకా తెలుసుకోదగ్గ అంశాలూ, విశేషాలూ అనేకంగా ఉన్నాయి, ఉంటాయి. వాటిగురించి వివరంగా తెలుసుకోవటం అనందదాయకం, విజ్ఞానభరితం, పుణ్యఫలదాయకం. 

    పంచభూతాల నిలయం ఈ విశాలవిశ్వం. నీరు, గాలి, నేల, నిప్పు, నింటీ.. ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా ఇలమీద వెలసిన పంచభూత లింగాలలో ఒకటి - చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉందని ప్రతీతి. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని లింగం, పంచభూతాలలో ఒకటైన వాయులింగమని నమ్మిక. దీనికి నిదర్శనమా అన్నట్లుగా గర్భగుడిలో నేటికీ వెలిగే దీసం గాలికి కదలాడుతున్నట్లుగా ఉంటుంది. వెలిగే దీసం గాలికి కదలాడటంలో వింతేముందీ అనిపిస్తుంది గానీ, ఆ ఆలయం గర్భగుడిలోకి గాలి ప్రవేశంచడానికి ఎటువైపునుంచీ చిన్న రంధ్రంకూడా లేదన్నది గుర్తించాల్సిన విషయం. 

పంచభూతాలు- ప్రతీకలు
పంచభూతాలకు ప్రతీకలుగా ఐదు లింగాలు ఉన్నాయి, అందులో ఒకటి శ్రీకాళహస్తిలో ఉంది అంటే, మిగిలిన నాలుగు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తక మానదు. ఆ పంచభూతాల వివరాలు ఇవీ: 

1. జలక్షేత్రం : జంబుకేశ్వరం;     2. పృథ్వీక్షేత్రం : కాంచీపురం; 3. తేజోక్షేత్రం : అరుణాచలం; 

4. ఆకాశక్షేత్రం : చిదంబరం;     5. వాయుక్షేత్రం : శ్రీకాళహస్తి. 

    శ్రీకాళహస్తి క్షేత్రం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ముందుగా శ్రీకాళహస్తి ఆవిర్భావం గురించిన కథ చూద్దాం: ఒకప్పుడు, శ్రీమహావిష్ణువు శయనించి ఉన్న ఆదిశేషునికీ, వాయుదేవునికీ మధ్య తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తిందట. ఈ వివాదం జరుగుతున్నప్పుడు, ఒక క్షణంపాటు ఆదిశేషుడు ప్రమత్తంగా ఉన్నప్పుడు వాయుదేవుడు తన వాయువులను బలంగా వీచాడట. ఈ బలమైన గాలులకు ఆదిశేషుడు దూరంగా ఉన్న శేషాచలంపైకి విసిరివేయబడ్డాడట. అదే సమయంలో, మేరు పర్వతంలోంచి మూడు ముక్కలు విడిపోయాయట. వాటిలో ఒకటి శ్రీకాళహస్తిలో, మరొకటి తిరుచినాపల్లిలో, మూడోది శ్రీలంకలోని ట్రింకొమలీలో పడ్డాయట. కనుక, మేరు పర్వంతలోని మరో రెండు భాగాల మధ్య ఉంది ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తిని 'శ్రీపురం' అనీ, 'ముమ్మిడిచోళపురం' అనీ అంటారు.  

    మిగిలిన కథలు అనేకం ఉన్నా, వాటిలో భక్త కన్నప్ప కథ; పాము, సాలీడు, ఏనుగుల కథ ముఖ్యమైనవి. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. శివునికి తన కన్నులనే అర్పించిన మహాభక్తుడు కావటంతో తిన్నడినే 'భక్త కన్నప్ప' అని అనటమూ కద్దు. ఆటవికుడైన తిన్నడు, శివభక్తిపరాయణుడు. తన ఇష్టదైవానికి, రోజూ తాను వేటాడే జంతువుల రక్తమాంసాలను బహుభక్తితో నైవేద్యంగా సమర్పించేవాడు. అయితే, ఈ భక్తుని భక్తిపరాయణత్వం ఎంతో పరీక్షించాలనే కాంక్షతో పరమశివుఉడు ఒకసారి తిన్నడు పూజించే లింగం ఒక కంటినుంచి కన్నీరు ఒలికించసాగాడు. ఆ కన్నీరు తర్వాత రక్తం రూపంలో ప్రవహించసాగింది. ఇది చూసిన తిన్నడు, ఏదో కారణంవల్ల తన దేవుని నేత్రానికి హాని జరిగిందని భావిస్తూ, వెంటనే తన రెండు కళ్లలోని ఒకదానిని తీసి, రక్తం స్రవిస్తున్న కంటిస్థానే పెట్టాడు. పలితంగా ఆ కన్నునుంచి రక్తం స్రవించటం ఆగింది కానీ, వెంటనే రెండో కంటినుంచి రక్తం స్రవించటం ఆరంభం అయింది. ఇది చూసిన తిన్నడు, క్షణం అయినా సంశయించకుండా, తన రెండో కంటిని తీసి, ఆ లింగానికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ అచంచల భక్తికి మెచ్చిన శివుడు, తక్షణమే ప్రత్యక్షమై, తిన్నడికి అతడి నేత్రాలను సమర్పించి, మరేదైనా వరం కోరుకోమన్నాడు. నిత్యమూ తాను శివుని వెంటే ఉండేలా తనకు వరం ప్రసాదించవలసిందిగా తిన్నడు కోరాడు. తన కన్నులనే శివుడికి సమర్పించిన తిన్నడికి 'కన్నప్ప'గా చిరస్థాయిగా ఉండమని పరమశివుడు ఆ భక్తునికి వరం ఇచ్చాడు. శ్రీకాళహస్తిలో లింగం దగ్గరే భక్త కన్నప్ప విగ్రహమూ ఉంటుంది. ముందుగా కన్నప్పకు పూజలు జరిగాకనే, శివునికి పూజలు అందుతాయి, అంటే ఆ మహాభక్తునికి పరశివుడు అనుగ్రహించిన వరం ఎంతటిదో గుర్తించవచ్చు. దేవాలయానికి సమీపంలోనే ఉన్న చిన్న కొండమీద కన్నప్ప దేవాలయం కూడా ఉంటుంది. శివాలయం దిగువన, కన్నప్ప ఆలయం దానికి పైన ఎత్తులో ఉండటం అంటే, తనకన్నా తన భక్తుని స్థానమే అధికమని ఆ సాంబశివుడు ప్రత్యక్షంగా చూపుతున్నట్లేనని పలువురి విశ్వాసం. 

    
శ్రీకాళహస్తి గురించిన కథ ఇది: ఇది ఒక పాము, ఒక సాలీడు, ఒక ఏనుగుల భక్తికి సంబంధించిన కథ. అపారమైన శివభక్తి కలిగిన ఈ మూడూ కౄతయుగంలో ఇక్కడే లింగాన్ని పూజించేవి. ఎండావానల బెడదలు లేకుండా లింగానికి పైన ఒక గూడును కట్టింది సాలీడు. ఇక, ఏనుగు అయితే, సమీపంలోని కొలనులోంచి నీటిని తెచ్చి, స్వామికి నిత్యం ఆ జలంతో అభిషేకం చేసేది. ఇక, పాము అయితే, తన పడగతో శివార్చన చేసేది. ఈ మూడింటి ఉనికీ పరస్పరం మరోదానికి తెలీదు. తను నిత్యం పూజిస్తున్న శివలింగంమీద నీళ్లు చల్లుతూ ఒక ఏనుగు, లింగానికి హానితోబాటుగా, తన పూజకు అవాంతరం కూడా కలగచేస్తోందని పాము భావించింది. ఎలాగైనా ఏనుగు బారినుంచి శివలింగాన్ని కాపాడుకోవాలనే ఉద్ధేశంతో, ఒకనాడు, ఆ పాము ఏనుగు తొండంలోనికి దూరింది. ఆ బాధ భరించలేని ఏనుగు, తన తొండాన్ని శివలింగానికేసి కొట్టుకోసాగింది. శివలింగానికి నీడనిచ్చేలా అక్కడే గూడు కట్టిన సాలీడు, ఆ దెబ్బలకు గురయింది. అటు ఏనుగు తొండంలో దూరిన పాముకూడా ఏనుగు శివలింగానికి కొట్టుకున్న దెబ్బలకు తాళలేక, మరణించింది. ఇలా, శివభక్తిపరాయణత కలిగిన ఆ మూడూ ఒకేసారి శివైక్యం చెందాయి. వీలి భక్తికి మెచ్చిన శివుడు, ఆ మూడింటికీ ముక్తి ప్రసాదించడంతోబాటుగా, ఆ పరమపవిత్ర క్షేత్రానికి ఆ మూడింటి పేరుమీదుగా 'శ్రీకాళహస్తి' అనే నామధేయాన్ని స్థిరపడేలా దీవించాడు. శ్రీ అంటే సాలీడు, కాళమంటే పాము, హస్తి అంటే ఏనుగు అని అర్థం.


ఇంతవరకూ పైన చెప్పింది అంతా అందరికీ తెలిసిన కథే. అయితే, ఈ కథ వెనుక మరొక కథా కొందరు చెప్తారు. 
    ఉమానాభుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన, కృతయుగంలో సుప్రసిద్ధ శిల్పిగా పేరుగాంచిన విశ్వకర్మ కుమారుడు. ఆ కారణంగా ఉమానాభుడికి కొన్ని ప్రత్యేక విద్యలు అలవడ్డాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. సృష్టికర్త బ్రహ్మ దేనినైతే సృష్టించగలడో, దానిని ఉమానాభుడుకూడా సృష్టించగలిగేవాడు. ఇది బ్రహ్మకు చాలా చిరాకును తెప్పించింది. విధాతగా తనకు మాత్రమే ఉన్న అధికారాన్ని ఎవరో ఒక బ్రాహ్మణుడు ఇలా వెటకారం చేస్తున్నట్లు ప్రతిసృష్టి చేయటంతో బ్రహ్మ ఆగ్రహించి, ఉమానాభుడిని ఒక బిల్వవనంలో సాలీడుగా జన్మించమని శాపం ఇచ్చాడు. దానితో తన తప్పును గ్రహించిన ఉమానాభుడు బ్రహ్మను క్షమించమని కోరాడు. బ్రహ్మదేవుడుసైతం, ఉమానాభుడి తప్పును మన్నిస్తూ, శివాజ్ఞ లేనిదే తానుసైతం ఇలా శపించి ఉండననీ, కనుక శివానుగ్రహంకోసం దక్షిణ కాశీలో శివపూజలు చేసుకుని, శాపవిమోచనం పొందమని తరుణోపాయం సూచిస్తాడు. ఫలితంగా, ఉమానాభుడు, దక్షిణ కాశీలో సాలీడుగా జీవనం ఆరంభిస్తాడు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి, ఆ బిల్వవనంలోంచి బిల్వపత్రాలను కోసుకుని, సమీపంలోని స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి వస్తాడు. అతని ఒంటిమీదనుంచి కొన్ని నీటిబిందువులు ఆ బిల్వపత్రాలమధ్యనున్న సాలీడుమీద పడతాయి. తర్వాత,       ఆ భక్తుడు శివాలయంలోకి వచ్చి, శివునికి సహస్రనామార్చన చేస్తూ, ఒక్కో బిల్వపత్రాన్ని స్వామి పాదాలమీద వేస్తుంటాడు. ఆ పత్రాలలో దాగిఉన్న సాలీడు, అలా స్వామివారి పాదాల చెంత శుచిగా చేరుతుంది. అక్కడికి చేరగానే, ఆ సాలీడుకు తన పూర్వజన్మవృత్తాంతం అంతా జ్ఞప్తికి వస్తుంది. శివానుగ్రహంకోసం నిత్యం అక్కడే ఉంటూ, శివపూజలో నిమగ్నమయింది ఆ సాలీడు. తన ఇష్టదైవమైన శివుడు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాడని గుర్తించిన     ఆ సాలీడు, శివుని ఎండావానల బెడద లేకుండా ఉండేందుకు ఒక గూడును అల్లుతుంది. అయితే, ఒకసారి, హటాత్తుగా ఏదో కారణంగా ఆ శివలింగం ముందున్న జ్యోతినుంచి మంట రాజుకుని, శివలింగంవైపు జ్వాలలు కదిలాయి. అది చూసిన సాలీడు, తన దైవానికి హాని జరుగుంతుందనే భావనతో శివలింగంవైపు వచ్చింది. ఫలితంగా దాని సాలెగూడుకు కూడా నిప్పు అంటుకుంటుంది. ఇదేమీ పట్టని విధంగా శివునికి మంటలు తగలకూడదనే భావనతోనే ముందుకు కదులుతున్న సాలీడు భక్తికి శివుడు ఎంతగానో సంతోషించి, శాపవిమోచనం కలిగించి, కైలాసప్రాప్తి చేకూర్చాడని ఈ కథ. అలాగే, ఆ భక్తుని పేరుమీదుగా ఆ క్షేత్రం వెలుస్తుందని వరమిచ్చినందుకే, ఆ క్షేత్రంపేరులో 'శ్రీ'కారం చోటు చేసుకుందనీ అంటారు.   

    
ఇదే కథ కొంత వ్యత్యాసంతోనూ ఉంది. ఈ కథలో ఉమానాభుడు, సత్యనాభుడనే పద్మసాలీకుటుంబీకుని  కుమారుడు. నేతపని వారి కుటుంబవృత్తి. దానిప్రకారమే, ఉమానాభుడు ఒకసారి, ఒక శివభక్తునికి ఒక చీర నేసి ఇస్తాడు. ఆ భక్తుడు, ఆ చీరతోబాటుగా, ఒక బిల్వవనంలోకి వెళ్లి, అక్కడ బిల్వపత్రాలను కోసుకుని తెచ్చి, శివునికి పూజలు చేస్తాడు. అది చూసిన ఉమానాభుడు తానుకూడా శివునికి పూజ చేస్తూ ఉండాలనిపించి, అప్పటినుంచీ అక్కడే ఉండిపోయి, పూజలలో నిమగ్నమయిపోయాడు. తర్వాత జన్మలో ఆ ఉమానాభుడే, సాలీడుగా జన్మించాడనేది ఈ కథ. 

    
ఇక, 'శ్రీకాళహస్తి' పేరులో స్థానం సంపాదించుకున్న పాముగురించిన కథా మరొకటి ఉంది. ఈ కథ కైలాసంలో మొదలవుతుంది. ఒకసారి శివుడు, తన మెడలో ఉన్న ఆభరణాలను సరి చూసుకుంటుండగా, అక్కడ ఉండాల్సిన నాగరాజు ఆయనకు కానరాలేదు. ఏమయింది అని శివుడు తన దివ్యదృష్టితో చూడగా, ఆ నాగరాజు పాతాళలోకంలో తన భార్యవద్ద ఉన్నాడట. దానికి ఆగ్రహించిన శివుడు, ఆ నాగరాజు తిరిగి వచ్చిన వెంటనే, 'ఇక నీకు నా కంఠాభరణంగా ఉండగల అర్హత లేదు' అంటూ కైలాసంనుంచి పొమ్మన్నాడు. తన తప్పును క్షమించమని ఆ నాగరాజు, శివుడిని కోరగా, శివుడు 'దక్షిణ కాశీని చేరి, అక్కడ బిల్వవనంలో నివసిస్తూ, నా సేవలో తరిస్తూ ఉండు, కాలానుగుణంగా నీకు ఒక గజరాజుతో విరోధం ఏర్పడి, తత్ఫలితంగా మోక్షం లభిస్తుంది' అని శాపావకాశంకూడా వివరించి పంపాడు. ఫలితంగా ఆ నాగరాజు, దక్షిణ కాశీ చేరుకుంది. అక్కడ బిల్వవనంలో ఉంటూ, శివపూజ చేసుకుంటూ, శివునికి సూర్యకిరణాలతాపం కలుగకుండా తన పడగలను అడ్డం పెట్టి, కాలం గడుపుతూ ఉండేది. తర్వాత కథ మనం ముందు చదివిందే. ఏనుగుతో తగువు ఫలితంగా తన సేవలో తలలు బదలు కొట్టుకున్న ఏనుగుకు, పాముకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ, శివుడు ఆ దక్షిణ కాశీకి నామాంతరంగా ఏర్పడిన 'శ్రీకాళహస్తి'లో ఆ రెండింటికీ స్థానం కల్పిస్తూ, వాటి జన్మలకు సార్థకత కల్పించాడు. 

    కథ ఏదైతేనేం, శివుడిని నమ్మిన భక్తులకు శివానుగ్రహం ఉండితీరుతుందనేది ఈ కథలు చెప్పే విశేషం.          

ఆలయ విశేషాలు:
    మేరు పర్వతభాగాలైన రెండు కొండల మధ్య శ్రీకాళహస్తి ఉంది. మేరు పర్వతం లేదా శేషశైలంలో భాగమైన శ్రీపురం, ముమ్మిడిచోళ పురాల మధ్యలో ఉంది ఈ కైలాసగిరి. ఈ రెండు కొండలలోనూ ఉత్తరంవైపున ఉన్న కొండమీద దుర్గాంబ దేవాలయం ఉంది. దక్షిణం వైపున ఉన్న కొండమీద కన్నప్పేశ్వరాలయం ఉంది. కన్నప్పేశ్వరాలయానికి పశ్చిమ దిశలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఉంది. గుడికిగల రెండు గోపురాలు అద్భుతంగా ఉంటాయి.   

    శ్రీకాళహస్లి ఆలయ ప్రధాన ద్వారం దక్షిణ దిశగా ఉంటుంది. స్వామివారి లింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయంలోని లింగసీఠంఒక ఏనుగు తొండంలా ఉంటుంది. ఆ పీఠానికి ఇరువైపులా రెండు దంతాలవంటివి ఉండటం విశేషం. ఈ పీఠానికి దిగువన సాలీడు ఆకారం మనకు కానవస్తుంది. లింగాన్ని పైనుండి చూస్తే, అది ఐదు పడగలు విప్పిన పాములా కానవస్తూ ఉంటుంది. అయితే, మరికొందరు మాత్రం, లింగపీఠంవద్ద ఏనుగు తొండం, సాలీడు చిహ్నాలు కానవస్తాయనీ, లింగం మధ్యలో పాము రూపం కనిపిస్తుందనీ అంటారు. 

    ఆలయంలో కన్నప్ప, శక్తి, వినాయక శిల్పాలతోబాటుగా 63మంది నయనార్లు, కాళం, శ్రీ, హస్తి, భరద్వాజ మహర్షి, మహిషాసుర మర్దని విగ్రహాలు ఉన్నాయి.   

    ఆలయనిర్మాణవిశేషాలను గురించీ మనం చెప్పుకోవాలి. శ్రీకాళహస్లి ఆలయంగురించిన ప్రస్తావన స్కంద పురాణంలో ఉంది. తన తీర్థయాత్రలలో భాగంగా అర్జునుడు, శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి, సేవించుకున్నాడని ఆ పురాణంలో ఉంది. ఈ ఆలయాన్ని కైలాసగిరి పీఠప్రాంతంలో పల్లవరాజులు నిర్మించారు. మేరు పర్వతం, లేదా శేషశైలంలో భాగమైన శ్రీపురం, ముమ్మిడిచోళ పురాల మధ్యలో ఉంది కైలాసగిరి. ఈ ఆలయానికి తొండమాన్‌ చక్రవర్తి సంపూర్ణరూపం ఇచ్చాడని అంటారు. 

    11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు, ఈ ఆలయానికి అపురూపమైన గాలిగోపురాన్ని కట్టించగా, 12వ శతాబ్దంలో వీరనరసింహ యాదవరాయలువాలయానికి ప్రస్తుతమున్న ప్రాకారాన్నీ, గుడికి నాలుగు వైపులా నాలుగు గోపురాలనూ నిర్మించాడు. క్రీ.శ. 1516-17లో శ్రీకృష్ణదేవరాయలు వంద స్థంభాల మంటపాన్నీ, తూర్పు అభిముఖంగా ఉన్న గాలిగోపురాన్నీ కట్టించారని తిరువణ్ణామలైలో లభించిన ఒక శాసనం పేర్కొంటోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలోనే రికార్డురూమ్‌ సమీపంలోని స్థూపాకార స్థంభంమీద మరొక శాశనం ఉంది. దానిప్రకారం అయితే, ఆ స్థూపాన్ని శక సంవత్సరం 1289 ప్లవంగ నామ సంవత్సరంలో వేసినట్లుగా ఉంది. ఇది క్రీ.శ. 1367-68కి సమానం. 

    కాళహస్తిలోనే మణికంఠేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 'తిరుమణిక్కెన్‌గై దైవ నయనార్‌'గా వ్యవహరిస్తారు. దీన్ని త్రిభువన చక్రవర్తి వీర రాజేంద్ర చోళ దేవుడు (మూడో కులోత్తుంగ చోళుడు) నిర్మించాడు. ఇది క్రీ.శ. 12వ శతాబ్దం నాలుగో భాగం నాటిదై ఉండవచ్చునని అంచనా. ((Madras Epigraphists’ Report for 1903-04) 

గాలిగోపురం దాటి ఆలయంలోనికి రాగానే, లోపల కాశీవిశ్వేరుడు, అన్నపూర్ణల విగ్రహాలతో కూడిన దేవాలయం ఒకటి ఉంటుంది. ఆలయప్రాకారంలోపల పాతాళగణపతి ఆలయమూ ఉంది. ఈ ఆలయంలో పాతాళ వినాయకుని విగ్రహం సాధారణ ఆలయ ఉపరితలానికి 30 అడుగుల లోతున ఉంటుంది. ఆలయం పశ్చిమ దిశ ప్రాకారాన్ని తాకుతూ, స్వర్ణముఖీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోని ప్రవాహమట్టం ఈ లోతును సూచిస్తుందని అంటారు. స్వర్ణముఖీ నదిని అగస్త్య మహర్షి, దివినుంచి భువికి తెచ్చాడనీ పురాణాలు చెప్తున్నాయంటారు. జీవనదిగా పేరున్న ఈ స్వర్ణముఖీ నదిని 'ఉత్తరవాహిని'గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తినుంచే ఈ నది దక్షిణదిశనుంచి ఉత్తరదిశవైపు తన గతిని మార్చుకుంటుంది. అందుకే, ఇది ఇక్కడ 'ఉత్తరవాహిని' అయింది. 

    గర్భగుడిలోని శివలింగాన్ని నేటికీ ఎవ్వరూ - ఆఖరికి ఆ శివునికి నిత్యం పూజలు చేసే అర్చక పురోహితులు కూడా తాకలేదంటారు. శివలింగానికి నీరు, క్షీరం (పాలు), పంచామృతాలు కలసిన కర్పూరంతో అభిషేకాలు జరుపుతారు. ఈ అభిషేకాలు జరిపేందుకుసైతం, ఈ గుడిలో దీక్ష పొందిన ఆపస్తంబ సూత్రావలంబకులైన భరద్వాజ గోత్రీకులకు మాత్రమే అర్హత ఉంది. పూలు, గంధం, యజ్ఞోపవీతాలన్నీ ఉత్సవమూర్తులకే సమర్పితం. అంతేకానీ, ప్రధాన లింగమూర్తికి కాదు. 

    శ్రీకాళహస్తీశ్వరాలయంలో దేవి - జ్ఞాన ప్రసూనాంబ. ఆమెను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని సోదరిగా పేర్కొంటారు. ఇంద్రునికి సైతం మొదటిసారిగా పరబ్రహ్మస్వరూపం గురించిన జ్ఞానాన్ని ప్రసాదించిన మాత కాబట్టి, ఆ తల్లిని 'జ్ఞాన ప్రసూనాంబ' అంటారని 'జ్ఞానోపనిషత్‌'లో ఉంది. 

    శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని లింగాన్ని బ్రహ్మ పూజించేవాడనీ, అందుకే శివుడు కైలాసాన్ని వదిలి, శ్రీకాళహస్తి చేరాడనీ అంటారు. అందుకే, ఈ క్షేత్రాన్ని 'దక్షిణ కాశీ'గా వ్యవహరిస్తారనీ 'శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర మహత్మ్యం' పేర్కొంటోంది. 

    అత్యంత సుందరమైన, ప్రకృతిరమణీయమైన ప్రాంతంలో నెలకొన్న శ్రీకాళహస్తిని చేరుకుని, శ్రీకాళహస్తీశ్వర స్వామిని సందర్శించి, స్వామి కృపకు పాత్రులు కావటం అదృష్టమే!!

శివదీక్ష 
    శివరాత్రికి శివదీక్ష స్వీకరించడం, శివానుగ్రమం పొందడం సంప్రదాయమై వస్తోంది. సర్వారిష్టాలను తొలగించి సమస్త శుభాలను పొందడానికి శివదీక్ష స్వీకరించి, మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మహాక్షేత్రదర్శనం చేయటం అత్యుత్తమం. శివదీక్ష స్వీకరిండం అంటే ఏమిటి, ఎట్లా అని కొందరికి సందేహాలు ఉంటాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దీక్షాధారణ చేయటం ఉత్తమం. అది సాధ్యపడనివారు తమతమ గ్రామాలలోని శివాలయాలలో దీక్ష స్వీకరించవచ్చు. స్థానికంగా గల శివాలయాలలోని స్వామి పాదాలవద్ద రుద్రాక్షమాలలను ఉంచి, అర్చన స్వాములతో ఆ రుద్రాక్షమాలలకు స్వామి శివలింగాన్ని కానీ, లేదా ఓంకారంగా ఉన్న వెండి, రాగి ముద్రను కానీ జత చేసుకుని ధరించాలి. దీక్షాకాలంలో చందనవర్ణంలోని వస్త్రాలనే ధరించాలి. సూర్యోదయ, మధ్యాహ్న, సాయంసమయాలలో పూజలు చేసి, కామక్రోధలోభమదమాత్సర్యాలను విడిచిపెట్టి, చరించాలి. దీక్ష స్వీకరించినవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. నేలమీదే నిద్రించాలి. చన్నీళ్లతో స్నానాలు చేయాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలకు ముందే స్సానాలు పూర్తి చేయాలి. విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.  ధూమపానం, మద్యపానం, మాంసభక్షణం మానేయ్యాలి. పాదరోలు ధరించకూడదు. మితభాషణం అవసరం. కలహాలు కూడవు. 

    ఈ నియమాలు పాటిస్తూ, చందనం వర్ణం ఉండే సంచీలో తేనె, నెయ్యి, చక్కెర, చందనం పొడి, విభూతి, కుంకుమ, బియ్యం, టెంకాయ, అగరుబత్తి, బిల్వదళాలు, పదకొండు రూపాయల నగదు ఉంచి, జ్యోతిర్ముడిని శిరస్సున ధరించి, మహాశివరాత్రినాడు శ్రీశైలక్షేత్రంలో దీక్ష విరమణ చేయాలి. దీక్షను స్వీకరించిన భక్తులకు మహాశివరాత్రినాడు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు ఉంటాయి. 

     మొదటిసారి దీక్ష సక్రమంగా పూర్తి చేసినవారు తిరిగి రెండోసారి స్వీకరించినట్లయితే, అప్పుడు వారు నీలివర్ణంలోని వస్త్రాలను ధరించాలి. వీరిని 'గురుస్వాములు'గా వ్యవహరించటం పరిపాటి.

    
శివదీక్ష స్వీకరించటం అంటే శివానుగ్రహపాత్రులు కావటానికి సంసిద్ధులు కావటమే! శివదీక్షలో ఉండి శివతత్త్వం తెలియటమంటే ప్రపంచాన్ని తెలియటమే!! శివతత్త్వం సంపూర్ణంగా తెలుసుకోవటం సామాన్యులకు అంత తేలికగా సాధ్యం కాగల విషయం కాదు కాబట్టే, భక్తులు పదేపదే శివదీక్ష స్వీకరిస్తారు!! శివానుగ్రహప్రాప్తులు అవుతారు!!