hinduBrahmins

--------------------------------------------------------------------------------------పరాశరుడు
పరాశర గోత్రీకులకు గోత్రపురుషుడు పరాశరుడు. పరాశర మహర్షి పేరుతో ఇద్దరు ఋషులు ఉన్నారని భావన. సుప్రసిద్ధులైన మహామునులలో ఒక్కడు పరాశరుడు. ఆయన వశిష్ఠుడు - అరుంధతిల మనుమడు. శక్తిముని కుమారుడు; వ్యాసునికి తండ్రి. శ్రీరామచంద్రుని ఇల్లాలైన జానకి తండ్రి జన మహారాజుకు గురువైన మైత్రేయునికి గురువు.  

వశిష్ఠుడి కుమారుడైన శక్తిముని ఒక రాక్షసుడికి ఆహారం అయ్యాడు. ఈ కారణంగా పరాశరుడు తన తాతగారైన వశిష్ఠుడివద్ద పెరిగాడు. తన తండ్రిని ఒక రాక్షసుడు తిన్నాడనే కోపం పరాశరునిలో అధికంగా ఉంటుంది. తన తండ్రిని చంపిన రాక్షసుడిమీద కోపంతో, పరాశరుడు రాక్షసులను సంహరించడం ఆరంభిస్తాడు. అప్పుడు, వశిష్ఠుడు వచ్చి, 'ఇదంతా సృష్టిలో భాగం, విధిలిఖితం కనుక ఆగ్రహాన్ని తగ్గించుకో'మని ఆదేశిస్తాడు. తన తాతగారైన వశిష్ఠునిమాట విని, పరాశరుడు తన ఆగ్రహాన్ని తగ్గించుకుంటాడు. 

అప్పుడే, పరాశరునికి ఒక రాక్షసుడి దాడిలో ఒక కాలు విరిగిపోతుంది. అందుకే ఆయన సరిగ్గా నడవకలేక, కుంటిగా నడుస్తుంటాడని ప్రతీతి. 

శ్రీమద్‌ భాగవతం ప్రకారం - పరాశరుడు సత్యవతికి భర్త. నిత్యం సంచారం చేసే పరాశరుడు ఒకసారి గంగానది ఒడ్డున ఉన్న ఒక పల్లెటూరికి వచ్చాడు. ఆ పల్లెటూరికి పాలకుడు దాసరాజు. ఆ రాత్రి అక్కడ విశ్రమించిన పరాశరుడు, మర్నాడు ఉదయం తిరుగు ప్రయాణానికి సిద్ధపడతాడు. ఆ మునిని నది దాటించి రమ్మని దాసరాజు తన కుమార్తె సత్యవతిని పంపుతాడు. ఆమె ఒక చిన్న నావను సిద్ధం చేసి, మునిని అందులోకి ఆహ్వానిస్తుంది. పరాశర ముని వచ్చి నావలో కూర్చుంటాడు కానీ, నావలో భరించలేనంత చేపల వాసన ఉంటుంది. అప్పట్లో గంగానదిలో చేపలు ఉండేవి కావు, మరి ఈ వాసన ఎక్కడినుంచి వస్తోందా అని ముని పరిశీలించి చూస్తాడు. ఆ వాసన అంతా ఆ నావను నడుపుతున్న సత్యవతినుంచి వస్తోందని గుర్తించి, ఆమెను 'మత్స్యగంధి' అని సంబోధిస్తాడు. దానితో ఆమె నొచ్చుకుని, 'మేము జన్మతః మత్స్యకారులం. నదులలో చేపలు పట్టటం మా కులవృత్తి. మా తండ్రితో నిత్యం తిరుగుతూ, చేపలు పట్టటంవల్ల నా శరీరానికి

ఆ వాసన వచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన మీరు నన్ను 'మత్స్యగంధి' అని సంబోధించడం భావ్యమా? ఇందులో నా దోషం ఏముంది?' అని ప్రశ్నిస్తుంది. వెంటనే, పరాశరుడు తన తప్పును గుర్తించి. 'నువ్వు చెప్పిన మాట వాస్తవం! తప్పంతా నాదే! అందుకే తప్పును సరిదిద్దుకుంటాను.. ఇకపై నువ్వు మత్స్యగంధివి కాక, 'యోజనగంధి'గా విలసిల్లుతావు.. నీ శరీరపరిమళం ఒక యోజనమంత దూరం వ్యాపిస్తుంది' అని చెప్తాడు. ఆ విధంగా యోజనగంధి అయిన సత్యవతిని అప్పుడు పరాశరుడు మరింత పరికించి చూస్తాడు. ఆమె అందం ఆయనను సమ్మోహనపరుస్తుంది. ఆమెపై పరాశరునికి కాంక్ష పెరుగుతుంది. దాచుకోకుండా, ఆయన ఆమెముందు తన కాంక్షను వ్యక్తపరుస్తాడు. ఆమెకూడా తనకు ఆ విషయంలో అభ్యంతరం లేదంటుంది. కానీ, 'ఇక్కడ ఇంత నదీమధ్యంలో ఎందరో మత్స్యకారులు, ప్రయాణీకుల మధ్యనా..' అని సందేహం వ్యక్తపరుస్తుంది. వెంటనే పరాశరుడు ఆ ప్రాంతం అంతా మంచు పరుచుకున్నట్లుగా చేస్తాడు. దానితో వారిద్దరికి ఆటంకం లేకుండాపోతుంది. ఆ ఇద్దరి సాంగత్యం ఫలితంగా వారికి అప్పుడు వ్యాసుడు జన్మిస్తాడు. అయితే, ఒడ్డు చేరిన వెంటనే, పరాశరుడు వెళ్లిపోబోతోంటే, 'మీ సాంగత్యంతో కన్యాత్వం కోల్పోయిన నా మాట ఏమిటి?' అని అడుగుతుంది సత్యవతి. పరాశరుడు వెంటనే 'నేను తపస్సు చేసుకునే మునిని. నాకు ఈ సంసారలంపటాలు పనికిరావు. నువ్వు వివాహం చేసుకో!' అంటాడు. పరాశర ముని సంగమంతో తనకు కన్వాత్వం పోయింది కనుక, తనకు ఇక  వివాహయోగ్యత ఉండదని సత్యవతి తన బాధను ఆయన ముందు వెళ్లగక్కింది. దానికి ఆయన వెంటనే స్పందిస్తూ, తనతో సంగమంవల్ల ఏ నష్టమూ ఆమెకు కలగకుండా, ఆమె కన్యాత్వం తిరిగి ఆమెకు లభించేలా వరమిస్తాడు. ఆ తరువాత, ఆమె కొన్నాళ్లకు హస్తినాపురానికి అధీశుడైన శంతనుడి కంటపడి, ఆయనకుమారుడైన దేవవ్రతుని 'భీష్మ' ప్రతిజ్ఞ అనంతరం, ఆయనతో వివాహానికి అంగీకరించి, వివాహం చేసుకుంటుంది.    

పరాశరుడు- సత్యవతిలకు జన్మించిన వ్యాసుడు. కాలక్రమంలో, తన తల్లి సత్యవతి ఆజ్ఞపై అంబికద్వారా ధృతరాష్ట్రుడు, అంబాలికద్వారా పాండురాజు, ఒక దాసిద్వారా విదురుడికి జన్మనిచ్చిన తండ్రి అయ్యాడు. ఈ విధంగా పరాశరుడు, కురుపాండవులకు ముత్తాత అవుతాడు. (వ్యాసుడికి శుక మహర్షి కూడా కుమారుడే).

కౌరవపాండవుల కురుక్షేత్ర యుద్ధసమయంలో, భీష్ముడు స్వచ్ఛందమరణం పొందే సమయంలో పరాశరుడు అక్కడే ఉన్నాడు. 

వేదద్రష్ట పరాశరుడు
పరాశరుడు వేదద్రష్ట. వేదాలలోని అనేక ఋక్కులను ఆయన దర్శించాడని ప్రతీతి.  అయితే, ఆయన ప్రధానంగా ఆచార్యులుగా ఉంటూ, నిత్యం పర్యటిస్తూ ఉండేవారనీ, ఆయన వాక్కులను శిష్యులు గ్రంథరూపం చేసేవారనీ, అంతేతప్ప ఆయన ఏ గ్రంథాలనూ స్వయంగా రాయలేదనీ కొందరు అంటారు.  

ఋగ్వేదంలో మొదటి మండలంలోని కొంత భాగాన్ని (1.65-73 వరకూగల ఋక్కులు), 9వ మండలంలోని కొంత భాగాన్ని (9.97) పరాశరుడు దర్శించాడని అంటారు. 

వ్యాస మహర్షి, తన తండ్రి అయిన పరాశరుడిని- 
           'సర్వధర్మః కృతేజాతాః సర్వేనష్టాః కలౌయుగే
            చాతుర్వర్ణ్యం సమాచారమ్‌ కించిత్‌ సాధారణం వదే!'
 
అని కోరాడు. అనగా, 'తండ్రీ! కృతయుగంలో పుట్టిన అన్ని ధర్మాలూ కలియుగంలో నశిస్తాయి. కనుక, కలియుగంలో నాలుగు వర్ణాలకూ ఉపయుక్తంగా ఉండేలా ధర్మసూత్రాలను చెప్పండి!' అని కోరాడు. దానికి జవాబుగా, ప్రస్తుత వైవస్వత మన్వంతర కలియుగంలో ధర్మావలంబనకోసం అవసరమైన ధర్మశాస్త్రాన్ని పరాశరుడే రచించాడు. అదే
'పరాశర స్మృతి'

         
'కృతే తు మనవో ధర్మశాస్త్రేతాయామ్‌ గౌతామోస్మృతాః
          ద్వాపరే శంఖలిఖితా కలౌ పరాశర స్మృతాః'

అంటే, కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపర యుగంలో శంఖుడు రచించిన స్మృతి, కలియుగంలో పరాశర స్మృతి ధర్మశాస్త్రంగా వర్ధిల్లుతాయని అర్థం. 

విష్ణుపురాణ కర్తగా కూడా పరాశరుడు పేరు పొందాడు. 

'పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః' అని సూత్రం. అంటే, 'భగవంతుని పూజించుట మున్నగు వానియందలి అనురాగము - భక్తి అగునని పారాశర్య మతం' అని అర్థం. ('నారద భక్తి సూత్రాలు', బ్రహ్మవిద్యా సాంప్రదాయము, సిద్ధాశ్రమం, హైదరాబాద్‌ ప్రచురణ, 2004 ఆగస్టు). ఈవిధంగా పరాశరుడు పూజావిధాన ప్రాశస్త్యాన్ని వివరించాడన్నది స్పష్టం. 

ఖగోళ శాస్త్రవేత్త పరాశరుడు
       
'అథౌ కథా మునిశ్రేష్ఠం త్రికాలజ్ఞమ్‌ పరాశరమ్‌
          ప్రపచ్ఛోత్య మైత్రేయః ప్రతిపత్య కృతాంజలిః'


 పరాశరుడు సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. ఆయనే 'బృహత్‌ పరాశర హోరాశాస్త్ర'ను రాశారు. క్రీస్తు శకం 7 లేదా 8వ శతాబ్దంలో, సంస్కృతంలో ఆయన రాసిన

ఈ బృహత్‌గ్రంధమే నేటి మన ఖగోళశాస్త్ర విజ్ఞానానికి ఆదికావ్యం వంటిదంటారు. 

అలాగే, పరాశరుడు 'వృక్షాయుర్వేద' పేరుతో ఒక విశిష్టమైన ఆయుర్వేదగ్రంధాన్ని రాసి, సంప్రదాయ భారతీయ వైద్యశాస్త్రానికి గొప్ప మేలు చేశారు.

తమిళ వాఙ్మయంలో ఒక కథ ఉంది. దాని ప్రకారం పరాశరుడికి ఆరుగురు కుమారులు. వారందరూ ఏదో శాపవశాన చేపలు అవుతారు. వారు తమ శాపవిమోచనంగురించి అడిగితే, సుబ్రహ్మణ్యస్వామి దర్శనంతో శాపవిమోచనం అవుతుందని వారికి చెప్తారు. ఫలితంగా, వారు సుబ్రహ్మణ్య స్వామికోసం

ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడనే రాక్షసుడిని చంపడానికి వెళ్లి ఉంటాడు. ఆ రాక్షసుడిని చంపిన తర్వాత స్వామి తిరిగి రావటంతో, వారికి ఆ చేపలరూపం పోతుంది. ఈ చేపలు ఉన్న గుండాన్ని 'తిరుప్పురం కుండ్రమ్‌' అంటారు. అంటే, శ్రీపురం గుండం అని అర్థం. 

పరాశరుని ఆలయం
పరాశర మహర్షికి అంకితమైన ఆలయం ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, మనాలినుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దానిదని భావన. ఇక్కడ ఒక లోతైన సరస్సుకూడా ఉంది. దీని లోతును ఇంతవరకూ ఎవ్వరూ అంచనా వేయలేకపోయారన్నది విశేషం. 

అయితే, ఆయన జన్మించిన ప్రదేశం గురించిన కొన్ని అంశాలు మనకు 'కరవీర పురాణం' ద్వారా తెలియవస్తున్నాయి. 'కరవీర పురాణం' మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన స్థలపురాణం. దానిప్రకారం, పరాశరుడు మహారాష్ట్రలోని పన్నగాలయ్‌లో జన్మించారు. 

లభిస్తున్న ఒక గాథ ప్రకారం- పరాశరుడు తోడేళ్లచేత మృత్యువాత పడ్డాడనీ, కాదు, తోడేళ్లు ఆయనను కరిచిన తర్వాత, తనే ఆ తోడేళ్లగుంపులో కలిసిపోయాడనీ అంటారు. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఆచార్య కె.ఎమ్‌. మున్షీజీ రాసిన పుస్తకం 'The Book of Vedavyasa: The Master'లో లభిస్తున్నాయి.