hinduBrahmins

Type your paragraph here.

ముద్గలుడు
    మౌద్గల్య గోత్రపురుషుడు ముద్గల మహర్షి. 'ముద్గల' అనేది ఒకరకమైన గడ్డి. దీన్ని 'రోహిషతృణం' అనీ అంటారు. బహుశా ముద్గలుని కుమారుడు మౌద్గల్యుడు కావచ్చు. 

    ముద్గలుని సతీమణి నలాయని. ఈమె పేరు ఇంద్రసేన అనీ అంటారు. మౌద్గల్య మహర్షికి కుష్టు వ్యాధి ఉండేది. అయినా, భర్తను ఆమె ఎంతో గౌరవంతో,

భక్తితో సేవించుకునేది. ఒకసారి ఆయన భోజనం చేస్తుండగా, ఆయన చేతివేలు ఒకటి ఒంటినుంచి విడిపోయి, తింటున్న భోజన పాత్రలో పడింది. అయినా, ఏమాత్రం వెగటు పడకుండా, ఆమె మిగిలిన భోజనాన్ని తిందన్న కథ ఉంది. 

ద్రౌపది జన్మ రహస్యం
    మహాభారతంలో మరో కథా ఉంది. తనకు కుష్టు వ్యాధి ఉన్నా, ఆమెకు శారీరక సౌఖ్యాలను సమకూర్చేందుకు ముద్గలుడు, పంచభూతాలకు ప్రతీకలుగా

ఐదు శరీరాలను ధరించి, ఆమెను సంతుష్టి పరిచేవాడు. అలా ఒక వెయ్యి సంవత్సరాలు గడిచాక, ఆయన ఇక తాను వానప్రస్థం స్వీకరించాలని సంకల్పించాడు. అయితే, దానికి ఆమె అంగీకరించలేదు. సాంసారిక జీవనాన్ని కొనసాగించాలని ఆమె భర్తను కోరింది. దానికి ఆయన కోపించి, ఆమెను ద్రుపద రాజకుమార్తెగా జన్మించి, ఐదుగురు భర్తలను పొందమని శపించాడు. అందుకే, ఆమె ద్రౌపదిగా జన్మించి, పాండవులకు భార్యగా, పంచభర్తృక అయింది. (మహాభారతం, ఆదిపర్వం, 197-204). 

    ఇదే కథ మరొకవిధంగానూ ఉంది. మౌద్గల్య మహర్షికి కుషువ్యాధి ఉండటంతో ఆయన, తన భార్య అయిన ఇంద్రసేనను శారీరకంగా సంతృప్తిపరచలేకపోయేవాడు. ఫలితంగా, ఆమె కొంత అసంతుష్టితో కాలం గడుపుతూ ఉండేది. చివరికి మౌద్గల్యుని మరణానంతరం, ఆమె తన కామవాంఛను అదుపులో ఉంచుకునేందుకు సుదీర్ఘకాలం తపస్సు చేసింది. అప్పుడు, ఆమెకు శివుడు ప్రత్యక్షమై, 'కావాల్సినది ఏదైనా కోరుకో'మని ఆనతి ఇచ్చాడు.

ఆమె అప్పటివరకూ పతి ధ్యాసలోనే ఉండటంతో, శివుడి ముందు తడబడుతూ, తనకు కనీసం వచ్చే జన్మలోనైనా మంచి పతి కావాలని అని కోరుకోబోతూ,

ఆ తొందరలో 'పతి.. పతి..' అంటూ ఏకంగా అయిదుసార్లు అనటంతో, శివుడు అదే ఆమె కోరికగా భావించి, 'తథాస్తు' అన్నాడు. ఆ కారణంగానే, ఆమె

తన తర్వాత జన్మలో ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మించి, పాండురాకుమారులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులకు ఇల్లాలు అయిందనేది ఈ కథ.       

స్వర్గలోక సుఖాలకు తిరస్కారం
    మౌద్గల్య మహర్షికి బొందితో స్వర్గానికి పోగల అవకాశాన్ని దుర్వాసో మహర్షి కల్పించినట్లుగానూ, దానిని మౌద్గల్య మహర్షి తిరస్కరించినట్లుగానూ

మరొక కథ ఉంది. ఒకసారి, దుర్వాసో మహాముని మౌద్గల్య మహర్షి ఆశ్రమానికి దిగంబరునిగా విచ్చేశారు. అది ఆహారం తీసుకునే సమయం. ఆ సమయానికి వచ్చిన అతిథికి మౌద్గల్యుడు సకల సత్కారాలూ చేసి, ఆహారం అందజేశాడు. దుర్వాసుడు తను తిన్నంత తిని, మిగిలినది తన ఒంటికి రాసుకున్నాడు.

దాంతో, మౌద్గల్యునికి తినడానికి ఏమీ మిగలలేదు. మర్నాడూ దూర్వాసుడు అదేవేళకు వచ్చి, మళ్లీ అలాగే చేశాడు. ఇలా ఎన్ని రోజులు చేసినా, మౌద్గల్యుడు ఏమీ అనకపోవటంతో, దుర్వాసుడు ఎంతో సంతోషించి, మౌద్గల్యుడిని స్వర్గలోకానికి బొందితో తీసుకువెళ్తానని చెప్తాడు. అయితే, తనకు స్వర్గలోక సుఖాలు ఏవీ అవసరం లేదని మౌద్గల్యుడు తిరస్కరించి, అడవులలోకి వెళ్లిపోయాడనేది ఈ కథ.

    మౌద్గల్యుడు గణేశుని భక్తుడు. గణేశుని వృత్తాంతాలు, ఆయనకు వివిధ పూజలు చేసే విధానాలను వివరిస్తూ, ముద్గలుడు 'మౌద్గల్య పురాణం' రాశాడని అంటారు. ఒక మానవమాత్రుని పేరుతో ఉన్న ఏకైక పురాణంగా దీనికి పేరుంది. 


                                                              *       *       *       *       *

-----------------------------------------------------------------

Copyright Reserved