hinduBrahmins


మల్లాది రామకృష్ణ శాస్త్రి

                                                          

​                                                                 జీవిత విశేషాలు

                                                                                  వచన రచనకు మేస్త్రీ - మానవతావాది మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక                                                                                      కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి                                                                                        1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి,                                                                                                నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత                                                                                              మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర                                                                                      వేదవిద్యను, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహశాస్త్రి గారి దగ్గర                                                                                            బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీపట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలంపాటు గుంటూరులో కాపురం. 15వ ఏట పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరికీ ఒకరికి తండ్రిపేరు (మల్లాది నరసింహ శాస్త్రి), మరొకరికి మామగారి పేరు పెట్టుకున్నారు.


మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే 'దేశాభిమాని' పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. చిన్నతనంనుంచే వీరు రాసిన వ్యాసాలు, కథలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి. శాస్త్రిగారు రాసిన పలు నాటకాలు, నవలలు వారికి చిరకీర్తిని ఆర్జించిపెట్టాయి. 'కృష్ణాతీరం' అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాలకోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాందీ పలికారు. మద్రాసులో చాలాకాలంపాటు సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్"గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలావాటిల్లో వీరి పేరు ఉండేదికాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు.


మద్రాసులోని పానగల్లుపార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్లమీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తికీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఎందరో వర్థమాన కవులకు, రచయితలకు సందేహాలను నివృత్తి చేసేవారు. అదిమాత్రమే కాక ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి శాస్త్రిగారిని కలిసినవారిలో ఆకలిగొన్నవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపునింపిన వెన్నలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించడంకోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. అందరినీ తనవాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది.


రామకృష్ణశాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణశాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. వీరు రాసిన 'ఖామోష్' కథ ఓ మచ్చు తునక


రామకృష్ణశాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు. రచనలు మల్లాది రామకృష్ణ శాస్త్రి కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే చలువ మిరియాలు పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన 'డుమువులు' కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.

సంకలనాలు :

చలవ మిరియాలు

నవలలు :

 కృష్ణాతీరం, తేజోమూర్తులు,  క్షేత్రయ్య

నాటికలు  : గోపీదేవి, కేళీగోపాలం, బాల, అ ఇ ఉ ఱ్, సేఫ్టీ రేజర్

సినీ సాహిత్యం :

మల్లాది రామకృష్ణశాస్త్రి సినిమా పాటల జాబితా ‍*

బాలరాజు (1948)                                   చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం)                                   కన్యాశుల్కం (1955) (గీత రచయిత) రేచుక్క (1955) (గీత రచయిత),         చిరంజీవులు (1956) (గీత రచయిత),                                                 కార్తవరాయని కథ (1958) (గీత రచయిత) జయభేరి (1959) (గీత రచయిత)       తల్లి బిడ్డ (1963) (గీత రచయిత)                                                                       జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత) దేశద్రోహులు (1964) (గీత రచయిత)      రహస్యం (1967) (గీత రచయిత)                                                        వీరాంజనేయ (1968) (గీత రచయిత) అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)


​మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి కథ, నవల, వ్యాస, సినీ సాహిత్యానికి మనసోల్లాస వ్యాఖ్యగా శ్రీ వి.వి. రామారావు 'మది శారదాదేవి మందిరమే' అనే అద్భుతమైన పుస్తకం రాసారు. బ్రహ్మశ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని విహంగ వీక్షణంగా అనుశీలించి విశ్లేషణాత్మకంగా రచించే అవకాశం రావడం తన చేతికి చిక్కిన అదృష్టంగా శ్రీ రామారావు మురిసిపోయారు. తమ తండ్రి గురించి ఆ పుస్తకంలో వారి కుమారులు శ్రీ మల్లాది నరసింహశాస్త్రి - 'మదరాసులోని పానగల్ పార్కు, మా నాన్నగారి భువనవిజయమై,ఎందరో సాహితీపిపాసులకు విజ్ఞాన కల్పతరువయింది..... మా నాయనగారి సాహిత్యం ఒక జీవధార. మా నాయనగారి సాహిత్యమథనం చేస్తే అమృతం లభిస్తుంది. ... ' అని ఉగ్గడించారు. ఆ మాటలన్నీ అక్షరసత్యాలు. 


'మది శారదాదేవి మందిరమే' పుస్తకంలో మల్లాదివారి గురించిన విశేషాలను అనేకంగా రాసారు శ్రీ రామారావు. వాటిలోనుంచి కొన్ని మాటలు: 
రామకృష్ణశాస్త్రి గారు సంస్కృత ఛందస్సుకు తెలుగు పద్యాలను రాసేవారు. అలాగే ఫార్సీ ఉర్దూ భాషల్లో ప్రాచుర్యం పొందిన గజళ్ళను తెలుగులో ఆ రోజుల్లోనే రాయడం విశేషం. కానీ, అవేవీ కానరావు. 'అజ్ఞాతకవి' పేరిట ఆయా పత్రికల్లో 'కిరణావళి' శీర్షికన వచ్చిన  కవితలు కానరావు. కాలగర్భంలో కలసిపోయినాయి. 

          --- రామకృష్ణశాస్త్రి గారి రచనలు చదవడం అంటే... తెలుగు అందాలను చవిచూడడమే!

                                                                                                           తెలుగు భాష సొగసును తల్చుకుంటూ నిత్యం మురిసిపోవడమే!!

                                                                                                                            
- విషయసేకరణ : పాలకోడేటి వెంకటేశ్వరరావు