hinduBrahmins

--------------------------------------------------------------------------------------కౌశికుడు   

జనసామాన్యంలో విశ్వామిత్రునికీ, కౌశికునికీ పెద్ద తేడా లేదు. విశ్వామిత్రునికిగల అనేకమైన నామధేయాలలో ఒకటి 'కౌశికుడు' అని అనేకులు అంటారు. 

అయితే, మరి కొందరి దృష్టిలో - కౌశికుడు, విశ్వామిత్రుని కుమారుడు. ఇంకొందరి దృష్టిలో విశ్వామిత్రుడే కౌశికుని మనుమడు. 

ఈ సందర్భంలో శ్రీమద్రామాయణంలోని ఒక కథ చెప్పుకోవచ్చు. - విశ్వామిత్రుని యాగరక్షణకై ఆయనతో వెడుతున్న శ్రీరామలక్ష్మణులు ఒకనాడు సోనానదీప్రాంతానికి వచ్చి చేరతారు. ఆ ప్రాంతం అంతా చాలా సుభిక్షంగా ఉండటంతో, వారు విశ్వామిత్రుడిని 'ఈ ప్రాంతం ఇంత బాగుంది, ఇది ఏ ప్రాంతం,

దీని విశేషాలు ఏమిటి?' అని అడుగుతారు. దానికి జవాబుగా విశ్వామిత్రుడు ఆ ప్రాంతంగురించి వివరిస్తాడు. 'ఇది బ్రహ్మమానస పుత్రుడైన కుశ మహారాజు ఏలిన ప్రాంతం. ఆయన విదర్భ రాకుమారిని వివాహమాడి, నలుగురు పుత్రులను పొందాడు. వారు- కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజుడు, వసుడు. విశ్వాన్ని నాలుగు భాగాలు చేసి, కుశుడు తన నలుగురు కుమారులకు పంచుతాడు. ఆ నలుగురు కుమారులూ తమతమ రాజ్యాలకు ప్రత్యేక రాజధానీనగరాలను నిర్మించుకుంటారు. 

కుశాంబుడు కౌశాంబీనగరాన్ని, కుశనాభుడు మహోదయ నగరాన్ని, అధూర్తరజుడు ధర్మారణ్యాన్ని, వసుడు గిరివ్రజాన్ని తమ రాజధానులుగా నిర్మించుకుంటారు. 

వీరిలో కుశనాభుడికి నలుగురు ఆడపిల్లలు. వీరిని ఆయన కాంపిల్య నగరానికి రాజైన బ్రహ్మదత్తుని కుమారులకు ఇచ్చి వివాహం చేస్తాడు. తన కుమార్తెలు అందరూ ఇలా వివాహితులై వెళ్లిపోవటంతో, కుశనాభుడు తనకు కుమారుడు ఉంటే బాగుండేదని బాధ పడుతుంటాడు. అప్పుడు, కుశనాభుని తండ్రి అయిన కుశుడు వచ్చి కుమారజననం అవుతుంది, బాధపడవద్దని ఓదార్చి వెడతాడు. ఆ ప్రకారమే, కుశనాభునికి ఒక కుమారుడు పుడతాడు. అతడే - కుశవంశంలో పుట్టాడు గనుక, 'కౌశికుడు' అయ్యాడు. అతనికి గాధి జన్మిస్తాడు. ఈ గాధి కుమారుడే విశ్వామిత్రుడు అని మరొక గాథ. ఈ కథకు ఇంకా కొనసాగింపు ఉంది. - కాలక్రమంలో ఆ నలుగురు కుమార్తెలూ తమతమ భర్తలను కోల్పోయి, సతీసహగమనానికి పాల్పడతారు. వారు తమ తర్వాత జన్మలో పవిత్ర హిమాలయాలలో పలు నదులుగా జన్మించి, 'కౌశికీ నది'గా కలిసి ప్రవహిస్తుంటారు. తన సోదరీమణులలో పెద్దదైన సత్యవతిమీద ఇష్టంతో, కౌశికుడు,

ఆ కౌశికీ నది ఒడ్డుమీద 'సిద్ధాశ్రమం' పేరుతో ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకుని. అక్కడ నివసించనారంభిస్తాడు. అదే ఈ ప్రాంతం' అని విశ్వామిత్రుడు వివరిస్తాడు. 

సతీ సుమతి కథ
కౌశిక మహర్షి భార్య సుమతి. ఈమె మహా పతివ్రత. ఈమె గురించిన కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం - దురదృష్టవశాత్తూ, మహర్షే అయినా కౌశికుడు దుర్వ్యసనాలలో పడతాడు. ఆయనకు ఒక వేశ్యపై అనురాగం కలుగుతుంది. భర్త కోరికను తీర్చేందుకు ఆమె తన భర్తను ఒక గంపలో కూర్చోబెట్టుకుని, ఆ వేశ్యల వద్దకు తీసుకువెడుతుందనే కథ ఉంది. 

అలా భర్తను సుమతి తీసుకుని వెడుతున్నప్పుడు, ఆయన కాలు మాండవ్య మునికి తగులుతుంది. ఆయన వెంటనే, 'కౌశికుడు సూర్యోదయ సమయానికి మరణిస్తాడ'ని శాపం పెడతాడు. అయితే, దీనికి ప్రతిగా, సుమతి, తాను తన భర్తను రక్షించుకోగలనని స్పష్టం చేస్తూ సూర్యోదయం కారాదని శాసిస్తుంది. సూర్యోదయం కాకుంటే, సమస్త లోకాలకూ తీవ్రమైన బాధ కలుగుతుంది కనుక, తన శాపాన్ని నిగ్రహించుకోవలసిందిగా సుమతినికోరమని బ్రహ్మాది దేవతలు వచ్చి, అనసూయను అభ్యర్థిస్తారు. అప్పుడు, అనసూయ కౌశికుడిని మాండవ్యుని శాపంనుంచి రక్షించి, సుమతిని తన శాపాన్ని ఉపసంహరించుకోవలసిందిగా కోరుతుంది. అనసూయ అభ్యర్థనను సుమతి మన్నించటంతో, సూర్యోదయం మామూలుగా జరుగుతుంది.
 

ఈ కౌశిక మహామునే 5 ఆగమాలను దర్శించాడు.
కామిక, యోగజ, చింత్య, కారణ, అజిత అనే ఈ ఐదు ఆగమాలూ శివుని సద్యోజాత ముఖంనుంచి ఆవిర్భవించాయని అంటారన్నది తెలిసిందే! (ఈ 5 ఆగమాలూ శైవ ఆగమాలు 28లో మొదటివి. శివుని పంచ ముఖాలనుంచి ఇవి వెలువడ్డాయి.

మొదటి నాలుగు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ముఖాలనుంచి ఐదేసి ఆగమాలు, ఐదో ముఖమైన ఈశాన నుంచి

8 ఆగమాలు ఉద్భవించాయి. ఈ ఆగమాలను దర్శించిన నలుగురు ఇతర ఋషులలో కాశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అగస్త్యుడు ఉన్నారు.)

విశ్వామిత్ర గోత్రీకులకు భిన్నంగా ఈ గోత్రీకులు తమ గోత్రపురుషుడిగా 'రాజర్షి' కౌశికుడిని పేర్కొంటారు. 

కౌశికుడు అనగానే మనకు ఆయన 'కుశ' రాజ్యానికి చెందిన వాడై ఉంటాడని స్ఫురించడం సహజం. కుశ రాజ్యం లేదా ప్రాంతం ఇప్పటి బీహార్‌ రాష్ట్రంలో ఉంది. 

కౌశికస గోత్రీకులైన బ్రాహ్మణులలో అనేకులు మిథిల ప్రాంతానికి చెందిన మైథిలీ బ్రాహ్మణులు ఉన్నారు.

అలాగే, కన్యాకుబ్జ ప్రాంతంనుంచి కాశ్మీర్‌కు వలస పోయి, అక్కడ  స్థిరపడిన బ్రాహ్మణులలోనూ అనేకులు కౌశికస గోత్రీకులే!!

మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో నివసించే కొంకణస్థ బ్రాహ్మణులలోనూ, దేవస్థ బ్రాహ్మణులలోనూ అధికులు కౌశిక గోత్రీకులు.  

మన ఆంధ్రప్రదేశ్‌లోని నియోగి, వైదీకి బ్రాహ్మణులలో చాలామంది కౌశికస గోత్రీకులు ఉన్నారు.

కౌశిక గోత్రీకులకు - విశ్వామిత్ర, అఘమర్షణ, కౌశిక అనే త్రయార్షేయ ప్రవర కాగా,

విశ్వామిత్ర గోత్రీకులకు - విశ్వామిత్ర, దేవరథ, ఔదల అనే త్రయార్షేయ ప్రవర ఉన్నట్లూ చెప్తారు.   


                                                                      *       *       *       *       *

-----------------------------------------------------------------------

Copyright Reserved