hinduBrahmins

-----------------------------------------------------------------------------------కొండగట్టు ఆంజనేయ స్వామి

నమ్మి కొలిచే భక్తుల కోరికలను తీర్చి, వారిని ఆదుకునే కొండంత దేవుడు - కొండగట్టు కొండపైన కొలువైన  ఆంజనేయస్వామి. కరీమ్‌నగర్‌ జిల్లాలో కరీమ్‌నగర్‌కు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు. ప్రతీ ఏడాదీ చైత్ర పూర్ణిమనాడు వచ్చే చిన్న హనుమజ్జయంతి నాడు, వైశాఖ బహుళ దశమినాడు పెద్ద హనుమజ్జయంతినాడు లక్షలాది హనుమద్దీక్షాపరులయిన భక్తులు సందర్శించుకునే హనుమంతుడు ఈ ఆంజనేయుడు. 41 రోజులపాటు కాషాయ వస్త్రాలు ధరించి, కఠోర నియమాలతో హనుమద్దీక్ష పాటించిన భక్తులు, స్వామివారిముందు, స్వామివారి అనుమతితో దీక్షావిరమణ చేస్తారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆ ఆలయంలో 3 రోజులపాటు హోమం కూడా జరుగుతుంది.

పుణ్యభూమి భరతావనిలో అడుగడుగున ఓ గుడి ఉంటుంది. ప్రతీ గుడికీ ఓ ఐతిహ్యంకూడా ఉండితీరుతుంది. అలాగే, కొండగట్టు ఆంజనేయుడిఆలయం వెనుకా ఒక ఐతిహ్యాన్ని స్థానికులు చెప్తారు. పూర్వమెప్పుడో, శ్రీరాముడికీ రావణుడికీ ఘోరయుద్ధం జరుగుతున్న రోజుల్లో ఇంద్రజిత్‌ బాణానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడని రామాయణం మనకు చెప్తున్న కథ. ఆ లక్ష్మణస్వామిని మూర్ఛనుంచి సేద తీర్చేందుకు సంజీవని మూలికలు కావాల్సి వచ్చాయి. ఆ మూలికలకోసం హిమవత్పర్వత ప్రాంతానికి చేరిన హనుమంతుడు, అక్కడ ఆ పర్వతాలమీద సంజీవని మొక్కలను గుర్తించలేక, సమయాన్ని వృధా చేయలేక, ఏకంగా సంజీవపర్వతాన్నే పెకలించి తెచ్చాడు. దానిని లంకానగర ప్రాంతానికి తెస్తున్న సమయంలో, ఆ పర్వతంలోని కొంత భాగం విరిగి నేలమీద పడిపోయిందట. అదే, నేటి కొండగట్టు అంటారు. 

ఈ కొండగట్టుమీద సింగం సంజీవుడు అనే పశువుల కాపరి, ఒకనాడు తన గేదెలు కొన్నింటిని మేపుతుండగా, వాటిలో కొన్ని గేదెలు తప్పిపోయాయి (తప్పిపోయినవి గేదెలు కాదు, ఆవులు అని కొందరు అంటారు). తప్పిపోయిన తన గేదెలను వెతుకుతూ, చీకటి పడిపోగా, సంజీవుడు అక్కడే ఉన్న ఒక చింతచెట్టు కింద విశ్రమించాడు. ఆ రాత్రి అతనికి కలలో ఆంజనేయుడు దర్శనం ఇచ్చి, తనకు అక్కడ ఒక గుడి కట్టించడానికి సిద్ధపడితే, ఆ గేదెలు తిరిగి దొరుకుతాయని సంజీవుడికి చెప్పాడట. కళ్లు తెరిచి చూసిన సంజీవుడు అక్కడ ఎదురుగా ఉన్న వేవేల కాంతుల హనుమత్‌ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నరసింహుని వక్త్రంతో, ఆంజనేయ రూపంలో ఉన్న ఆ విగ్రహం అపూర్వంగా ఉంది. వెంటనే, సంజీవుడు, ఆ స్వామికి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా అనుకున్న తక్షణమే, హనుమంతుడు స్వప్నంలో చెప్పినట్లుగా, అతని గేదెలు అతనికి దొరికాయి. వెంటనే సంజీవుడు, తనకున్న కొద్దిపాటి వనరులతో, ఉత్తరాభిముఖంగా ఉన్న స్వామివారితో అక్కడ గుడి కట్టించాడని ప్రతీతి. ఈ గుడిని దాదాపు 160 సంవత్సరాల కిందట కృష్ణారావ్‌ దేశ్‌ముఖ్‌ అనే వ్యక్తి, పునరుద్ధరించారట. 1968లో ఈ గుడిని రాష్ట్ర దేవాదాయ శాఖ తన అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు 5 అంతస్థుల రాజగోపురంతో, ఆలయంపైన 5 శిఖరాలతో కొండగట్టు ఆలయం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలో శ్రీ ఆంజనేయునితోబాటు, ఆళ్వార్‌ అమ్మవారు, లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు. అక్కడే, శ్రీ వెంకటేశ్వరుని గుడి కూడా ఉంది. శ్రీ ఆంజనేయుని ఆలయం వెనుక, బేతాళ ఆలయం, రామాలయం కూడా ఉన్నాయి కానీ, అక్కడ ఏ పూజలూ జరగవు. 

శ్రీ ఆంజనేయస్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, బాలభోగ నివేదన, సూర్యదర్శనం, నిత్యహారతి, అభిషేకం, భజన, తీర్థప్రసాదాల వినియోగం జరుగుతాయి. రాత్రి 7 గం.లకు లక్ష్మీఅమ్మవారికి కుంకుమార్చన, రాత్రి 7.30ని.లకు శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవాఉత్సవం జరుగుతాయి. శ్రావణ మాసంలో సప్తాహాన్ని నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం, గోదాదేవి, రంగనాధుల కల్యాణం ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఉత్తరద్వార దర్శనభాగ్యం ఉంటుంది. దీపావళికి సహస్రదీపాలంకరణతో మొత్తం గుడి కొత్త కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. 

హైదరాబాద్‌నుంచి 175 కిలోమీటర్‌లు, జగిత్యాలనుంచి 14 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టు గుట్టల ప్రాంతమంతా అందమయిన చెట్లతో నిత్యం సహజమయిన పచ్చని తోరణాలతో అలరారుతూ ఉంటుంది. ఆ గుట్టల నడుమ కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకం! బహుపుణ్యఫలం!!