hinduBrahmins

--------------------------------------------------------కశ్యపుడు
                              శ్రీవిష్ణు పదభక్తి జెలగు సప్తర్షి చం
                                                     ద్రములలో మున్నెన్నదగిన మేటి
                              దిత్యదిత్యాది సాధ్వీశిరోరత్నంబు
                                                    లను బ్రేమ జెట్టబట్టిన గృహస్థు
                               కమలాస్త భుజగేంద్ర ఖగరాజరోహిణీ
                                                    కన్యకారమణుల గన్న తండ్రి
                                రాముచే దానధారాపూర్వముగ భూత
                                                   ధాత్రి గ్రహించిన శ్రోత్రియుండు

                                 తోయరుహసంభవునకు బౌత్త్రుడు మరీచి
                                 పుత్త్రుండ్రు విచిత్ర గుణమణిపాత్రు డఖిల
                                 వేదవేదాంతతత్త్వ వివేకశాలి
                                  మహిమ జెలువొందు కశ్యపమౌని గొల్తు.

                                                                                        - (దశావతార చరిత్రము, 3-4)

కాశ్యప గోత్రానికి ఆది పురుషుడు కశ్యపుడు. 

సృష్టికి మూలపురుషులైన వారిలో ఒకరు కశ్యపుడు అని ప్రతీతి. బ్రహ్మమానసపుత్రులలో ఒకరైన కశ్యపుడు ప్రజాపతులలో ఒకడు.  

కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. 

అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే,అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం. 

ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు. అంటే, ఈ మన్వంతరంలో జరిగిన సకల సృష్టికి మూలపురుషుడు కశ్యపుడు అన్నది స్పష్టం. 

కర్దమ ప్రజాపతి తన కుమార్తె అయిన కళను మరీచి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ మరీచ, కళ దంపతులకు కశ్యపుడు జన్మించాడు. 

దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో మొత్తం 13 మందిని కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ 13 మంది పేర్లు ఇవి:

1. అదితి     2. దితి     3. దను 4. కళ     5. దనయ  6. సింహిక 7. క్రోధ 8. ప్రధ 9. విశ్వ 10. వినత  11. కపిల  12. మను  13. కద్రు(వ). 

దక్ష ప్రజాపతి తనకు గల మరో 27మంది కుమార్తెలను (అశ్వని నుంచి రేవతివరకూ గల 27 నక్షత్రాలు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. మరో కుమార్తె అయిన సతీదేవి పరమ శివుడిని వివాహమాడింది. ఈ బంధుత్వరీత్యా విధంగా కశ్యపునికి ఈశ్వరుడు, చంద్రుడు తోడల్లుళ్లు అవుతారు.  

కశ్యప సంతానం  
కశ్యపుడు తన వివిధ బార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:

దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు. 

అదితికి పుట్టినవారు దేవతలు మరియు ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి. 

దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే. 

సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.

క్రోధకు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు.

వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.

కద్రువకు జన్మించినవారు నాగులు. 

మనుకు జన్మించిన వారు మానవులు. 

అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి 

    1. దితి    2. అదితి  3. దను   4. కష్ట     5.అరిష్ట     6. సురస  7. ఇళ   8. ముని   9. క్రోధావసు 10. తమ్ర    11. సురభి 12. సరమ    13. తిమి 

అనే భార్యలు ఉన్నారని అంటారు. ఇక్కడకూడా 13 మందే భార్యలు అయినప్పటికీ, ఇందులో కొన్ని పేర్లు వేరుగా ఉన్నాయనేది గమనార్హం.

తిమి వల్ల జన్మించినవి జలచరాలు,   

సరమ వల్ల భయంకరమైన జంతువులు, 

సురభి వల్ల గోవులు, గేదెలు, తదితర గిట్టలు పగిలిన జంతువులు, 

తమ్ర వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు, 

ముని వల్ల దేవతలు, అప్సరలు,

క్రోధావసు వల్ల సర్పాలు, దోమలు, తదితర కీటకాలు, 

ఇళ వల్ల చెట్టు, పాకుడు తీగలు, 

సురస వల్ల చెడు ఆత్మలు, 

అరిష్ట వల్ల గుర్రాలవంటి గిట్టలు పగలని జంతువులు, (కిన్నెరలు, గంధర్వులు కూడా అరిష్ట వల్లనే జన్మించారని మరొక కథ), 

విశ్వ వల్ల యక్షులు, 

దితి వల్ల 49 మంది వాయుదేవులు, 

అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు. 

మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది. 

అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.

వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.   

వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ     ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు. వీరిలో నైద్రువుడి పరంగా 'నైద్రువ కాశ్యపస గోత్రం' ఏర్పడింది. కాశ్యపుడు, నైద్రువుడు తండ్రీకొడుకులు కావటంతో, నైద్రువ కాశ్యపస గోత్రంలో చాలామంది తాము 'కాశ్యపస గోత్రీకులు' అని చెప్పుకుంటారు. నైద్రువుడు ఋగ్వేదంలోని 9వ మండలంలోని సోమాధ్యాయం కర్త.  

కశ్యపుని భార్యలైన కద్రువ, వినతల మధ్య సవతుల మధ్య సహజంగా ఉండే ఈర్ష్యాద్వేషాలు తీవ్రంగా ఉండేవి. ఇద్దరూ తమకు బిడ్డలను అనుగ్రహించాలని భర్త అయిన కశ్యపుడిని కోరారు. కశ్యపునికి కద్రువవల్ల వెయ్యిమంది నాగులు సంతానంగా కలిగారు. వినతకు మాత్రం గర్భం కలిగినా, బిడ్డలు పుట్టటంలో ఆలస్యం అయింది. ఈ ఆలస్యాన్ని ఆమె భరించలేకపోయింది. అసలు తన గర్భంలో బిడ్డలు ఉన్నారో లేదోనన్న సందేహంతో ఆమె తన కడుపును విచ్ఛిన్నం చేసుకుంది. అప్పుడు, ఆమె కడుపులో ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోని అనూరుడు కానవచ్చాడు. ఫలితంగా అనూరుడు, గరుత్మంతుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు.ఈ అనూరుడే, సూర్యుడికి రథసారథి అన్నది తెలిసిందే! 

కశ్యపుడు, కద్రువలు ఒకసారి ఏకాంతంలో ఉన్నప్పుడు, ఆ దృశ్యాన్ని అదితి చూసింది. ఆమెకూడా అదే సమయంలో భర్తతో ఏకాంతాన్నే కోరుతూ వచ్చింది. ఫలితంగా, అదితికి ఆ దంపతుల ఏకాంతం చెప్పలేనంత ఆగ్రహాన్ని, ఈర్ష్యనూ కలిగించింది. రతికాంక్షతో ఉన్న వారిద్దరినీ, నరులుగా జన్మించమని అదితి శాపం ఇచ్చింది. ఫలితంగా ద్వాపరయుగంలో కశ్యపుడు వసుదేవుడుగా, కద్రువ దేవకిగా జన్మించారు. వీరి కుమారుడే శ్రీకృష్ణుడు. ఈ దంపతులే త్రేతాయుగంలో దశరథుడు, కౌసల్యలుగా జన్మించారు. ఈ పుణ్యదంపతుల కుమారుడే శ్రీ రామచంద్రుడు. ఈ విధంగా ముగ్గురు అవతారపురుషులకు - వామనుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు- కశ్యపుడు తండ్రి అయినాడు. 

ఈ కథే మరొక విధంగానూ ఉంది. కశ్యప, దితిలు ఒకసారి ఒక సాయం సంధ్యా సమయంలో ఏకాంతంలో ఉన్నప్పుడు, దితి తగని రతికాంక్షతో భర్త సాన్నిహిత్యాన్ని కోరుతుంది. అయితే, అది సాయం సంధ్యా సమయం కాబట్టి, ఆ సమయంలో పరమ శివుడు తన నంది, తదితర గణాలతో తిరుగుతుంటాడు కాబట్టి, రతి కూడదని కశ్యపుడు వారిస్తాడు. అయినా దితి అంగీకరించక, భర్తను రతికి బలవంత పెడుతుంది. ఫలితంగా కశ్యపుడు ఆమెను చేరతాడు. ఆ కలయిక ఫలితంగా, దితికి రాక్షసాంశగల ఇద్దరు కవలలు జన్మిస్తారు. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అంటారు. రాక్షసాంశగల సంతానం జన్మించే ప్రమాదం ఉంటుంది కనుకనే, అసుర సంధ్యాసమయంలో రతి కూడదని పెద్దలు నిషేధం విధించారు.

వామనుడి తండ్రి కశ్యపుడు
కశ్యపుడు, అదితిలకు జన్మించిన  మరొక అవతార పురుషుడు - వామనుడు.


దితి అదితుల మధ్యగల సవతుల సహజమైన అసూయాద్వేషాలు అందరికీ తెలిసిందే. రాక్షసరాజైన బలి చక్రవర్తి, భృగువు తదితరులను ప్రార్థించి, వారి సహాయంతో అనేక అశ్వమేధ యాగాలు చేస్తాడు. తనకున్న బలం, బలగాలతో దేవతలను అణచివేస్తాడు. ఈ విధంగా తన సవతి కుమారులైన రాక్షసులు ఆధిక్యతలో, ఐశ్వర్యంతో ఉండగా, తన బిడ్డలు అష్టకష్టాలూ పడటం అదితిని బాధిస్తుంది. తన బాధను భర్త అయిన కశ్యపునికి తెలియజేస్తుంది. కశ్యపుడు భవిష్యద్దర్శనం చేసి, అదితికి 'పయోభక్షణం' అనే వ్రతం చేసి, విష్ణువును ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. ఆమె ఆ వ్రతం చేస్తే, విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఆమె కోరినట్లే తాను ఆమెకు కుమారుడనై జన్మించి, ఆమె బిడ్డలైన దేవతల కష్టాలను తీరుస్తానని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే ఆ దంపతులకు విష్ణువు, వామనుడై పుడతాడు. 

వామనుడు యుక్తవయసుకు రాగానే, కశ్యప అదితులు వామనునికి ఉపనయనం చేస్తారు. ఆ మహావకాశం అందుకుని, వామనునికి సవిత సావిత్రీ మంత్రాన్ని ఉపదేశించగా, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని అందిస్తాడు. కశ్యపుడు మౌంజిని ఇస్తాడు. అదితి కౌపీనం ఇస్తుంది. ఆ నూతన వటువుకు బ్రహ్మ కమండలాన్ని ఇస్తాడు. సరస్వతి అక్షమాలికను ఇస్తుంది. ఇలా అన్ని విధాలా సిద్ధమయి, వామనుడు బలి చక్రవర్తిని చేరి 'మూడడుగుల నేలయే బ్రహ్మాండంబు నాపాలికిన్‌' అంటూ అడుగుతాడు. బలిని పాతాళంలోకి అణగగొడతాడు. తల్లి కోరికను తీరుస్తాడు. 

భూమికి మరో పేరు 'కాశ్యపి'
క్షత్రియులపై ఇరవైఒక్కమార్లు దండయాత్రలు చేసి, వారిని పూర్తిగా ఓడించిన పరశురాముడు, తాను అందరు క్షత్రియులను చంపిన పాపాన్ని పరిహరించుకోవడానికై, అశ్వమేధయాగం చేస్తాడు. ఆ అశ్వమేధయాగం సమాప్తి కాగానే, పరశురాముడు, కశ్యపుడిని చేరి, తాను క్షత్రియులనుంచి సాధించిన భూమండలాన్ని కశ్యపుడికి అప్పగిస్తాడు. అప్పుడు కశ్యపుడు ఆ భూమిని భూసురులైన బ్రాహ్మణులకు ఇచ్చేస్తాడు. ఈ కారణంగానే భూమండలాన్ని 'కాశ్యపి' అని వ్యవహరించటం ఆరంభం అయింది.     

అయితే, ఇలా కశ్యపుడు బ్రాహ్మణులకు ఇచ్చిన భూమి తిరిగి క్షత్రియుల పాలనలోకి ఎలా వెళ్లిందనే సందేహం ఎవరికైనా రావచ్చు. దానికికూడా కశ్యపుడే కారణం అన్న మరో కథా ఉంది. కశ్యపుడు తమకు భూమండలాన్ని ఇవ్వటంతో అధికారం తలకెక్కిన బ్రాహ్మణులు, తమ యజ్ఞయాగాదులవంటి పుణ్యకార్యాలను వదిలి పాపకార్యాలలో మునిగిపోతారు. ఈ పాపభారంవల్ల, భూమి క్రమంగా పాతాళంలోకి కుంగిపోనారంభిస్తుంది. తన దురవస్థను కశ్యపునికి భూదేవి విన్నవిస్తుంది. వెంటనే కశ్యపుడు తన తొడతో భూమికి ఊతమిచ్చి, కుంగిపోవటం ఆపుతాడు. తర్వాత, భూమిని పరిపాలించటం ఉత్తమ క్షత్రియులకే సాధ్యమని భావించి, పరశురాముడి దండయాత్రలలో చనిపోని క్షత్రియులు ఎవరో భూదేవి సహాయంతో గుర్తించి, ఎక్కడెక్కడో తల దాచుకుంటున్న వారిని రావించి, వారికి వివిధ రాజ్యాలను అప్పగిస్తాడు.

గంగకూ 'కాశ్యపి' అన్న పేరే! 
'కాశ్యపి' అన్న పేరు గంగానదికి కూడా ఉండటం విశేషం. ఒకసారి కశ్యపుడు నైమిశారణ్యసందర్శనానికి వెడతాడు. అక్కడ మునులు అందరూ కశ్యపుడిని చేరి, తమతమ కష్టాలను విన్నవించుకుంటూ, తమకు స్నానపానాదులకుకూడా సరైన నీటివసతి లేదని తెలియజేస్తూ, దయతో గంగానదిని భూలోకానికి తీసుకురావలసిందిగా కోరతారు. దానికి సమ్మతించిన కశ్యపుడు, గంగానదికోసం శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు  కశ్యపుని కోరికను మన్నించి, తన జటాజూటంలో ఒక పాయ తొలగించి, గంగానదిని భూలోకానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తాడు. అలా భూలోకంలోకి చేరిన గంగకు కశ్యపుడి పేరుమీదుగా 'కాశ్యపి' అని నామధేయం స్థిరపరుస్తారు. ఈ నదిని కృతయుగంలో 'కృతవతి' అనీ,   త్రేతాయుగంలో 'గిరికర్ణిక' అనీ, ద్వాపరయుగంలో 'చందన' అనీ, కలియుగంలో 'సాభ్రమతి' అనీ అంటారు. 

కశ్యపుడే దశరథుడు 
కశ్యప, కద్రువలకు అదితి ఇచ్చిన శాపఫలితంగా వారిద్దరూ మానవులుగా జన్మిస్తారు. ఒక జన్మలో వారిద్దరికీ వామనుడు జన్మించగా, తరువాతి జన్మలో

వారు వసుదేవ, దేవకిలుగా జన్మిస్తారు. తమకు ప్రతీ జన్మలోనూ విష్ణువు కుమారుడై జన్మించాలని వారు కోరుకోవటంచేత, శ్రీ మహావిష్ణవు శ్రీకృష్ణుడై వారికి జన్మిస్తాడు. తరువాతి జన్మలో వారు దశరథకౌసల్య దంపతులుగా ఉన్నప్పుడు వారికి శ్రీరాముడై విష్ణువు జన్మిస్తాడు. ఈ కథ బ్రహ్మవైవర్తపురాణంలో ఉంది. 

ఇదే కథ కొంత వ్యత్యాసంతో హరివంశంలోనూ ఉంది. ఒకసారి కశ్యపుడు, సముద్రుడి దగ్గరనుంచి హోమధేనువును అడిగి తెచ్చుకుంటాడు. ఎంతో కాలం ఆ ధేనువు క్షీరాన్ని కశ్యపుని కుటుంబం అనుభవించిన తర్వాత, సముద్రుడు వచ్చి, తన ధేనువును తనకు ఇవ్వవలసిందిగా కోరతాడు. ఆ ధేనువును సముద్రుడికి తిరిగి ఇచ్చేందుకు కశ్యపుడు సిద్ధపడినా, అతని భార్యలైన అదితి, కపిలలు దానికి అంగీకరించరు. దానితో, సముద్రుడు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు వెంటనే, కశ్యపుడిని ఈ ధేనువును తిరిగి సముద్రుడికి ఇచ్చివేయమని కశ్యపుడిని కోరతాడు. కానీ, ఆ మాట కశ్యపుడు వినడు. ఫలితంగా బ్రహ్మదేవుడు కోపంతో 'ఒక గోవుకోసం ఆశ పడిన నీవు గోపాలుడవై జన్మిస్తావు' అని శాపం ఇస్తాడు. ఈ శాపకారణంగానే, కశ్యపుడు వసుదేవుడై జన్మించి, కంసుడివద్ద గోవుల మందకు కాపరిగా చేరతాడని హరివంశంలోని కథ. 

మరుత్‌గణం జననం 
దితి కశ్యప దంపతులకు మరుత్‌గణాల జననం గురించిన కథ ఒకటి బ్రహ్మ, మత్స్య పురాణాలలో ఉంది. దితి కుమారులను ఇంద్రుడు అనేకవిధాలుగా బాధించేవాడట. ఇది గమనించిన దితి, భర్త అయిన కశ్యపుని చేరి తనకు ఇంద్రునితో సమానమైన కుమారుడిని ప్రసాదించమని వేడుకుంటుంది. దానికి కశ్యపుడు సమ్మతించిన కారణంగా, దితి గర్భవతి అవుతుంది. ఆ సంగతి ఇంద్రునికి తెలిసి, తనకు పోటీగా మరొకరి జననాన్ని సహించలేక, దితి వద్దకు వచ్చి, తనకు ఆమె సేవాభాగ్యం కలిగించమని కోరతాడు. ఇంద్రుడంతటివాడు తనను సేవిస్తానంటే, దితి ముచ్చటపడి, దానికి సరేనంటుంది. సేవ అనే ముసుగులో తగిన సమయంకోసం ఎదురు చూస్తూ ఉన్న ఇంద్రుడు, ఒకసారి దితి నిద్రిస్తున్నప్పుడు, ఆమె గర్భంలోకి ప్రవేశించి, లోపల ఉన్న గర్భస్థశిశువును తన కత్తితో ఏడు ముక్కలు చేస్తాడు. ఆ ఏడు ముక్కలూ బాధ భరించలేక ఏడుస్తుండగా, ఇంద్రుడు, ఆ ఏడు ముక్కలనూ మళ్లీ ఏడేసి ఖండాలుగా కోస్తాడు. ఈ ఏడ్పులు విన్న దితి, ఇంద్రుడిని చూసి 'ఈ బిడ్డలు ఇంద్రునికి మిత్రులే అవుతారు కానీ ఎవ్వరూ ఇంద్రునికి శత్రువులు కారు' అని స్పష్టం చేయటంతో, ఇంద్రుడు అప్పుడు వారిని వదిలి వెళ్లిపోతాడు. ఆవిధంగా దితికి, కశ్యపునికి ఏడుఏడుల (నలభైతొమ్మిది మంది) మరుద్గణాల జననం కలుగుతుంది.

కశ్యపస్మృతి, కశ్యపగీత   
'కశ్యపస్మృతి' పేరుతో ఒక ధర్మశాస్త్రం లభిస్తోంది. అందులో నిత్యజీవన వ్యవహారంలో మానవజాతి పాటించాల్సిన నీతినియమాలను గురించిన అనేక ధర్మసూత్రాలు ఉన్నాయి. అలాగే 'కశ్యపగీత' పేరుతో  లభిస్తున్న మరొక శ్లోకసంచయంకూడా లభిస్తోంది. ఇది 

    'క్షమా ధర్మః  క్షమా యజ్ఞః  క్షమా వేదా క్షమా శ్రుతమ్‌
    య ఏతదేవం జానాతి వసర్వం క్షంతు మర్హతి:...'


అనే శ్లోకంతో ఆరంభం అవుతుంది. ఇది పూర్తిగా క్షమాగుణ ప్రశంసతో నిండినది. వేదాలు, యజ్ఞాలు, శౌచము, సత్యము, విద్య, ధర్మము, చరాచరమైన జగత్తు అంతా క్షమవల్లనే నిలిచిఉన్నాయి అనేది 'కశ్యపగీత' సారాంశం. 


                                                                                 *     *     *     *     *

-----------------------------------------------------------------------


Copyright Reserved