hinduBrahmins

------------------------------------------------------------------------------------------కణ్వ మహర్షి
'కణ్వుడు' అంటే 'మేధావి' అనీ, 'పురోహితుడు' అనీ అర్థం. యాస్కుడు రచించినట్లు చెప్తున్న 'నిఘంటువు'లో కణ్వుడు అనే పదాన్ని 'మేధావి' అనే అర్థంలోనే వాడటం జరిగింది. అయితే, సాయనభాష్యం ప్రకారమయితే, 'కణ్వుడు' అనే పదానికి 'పురోహితుడు' అన్న అర్థముంది. గానం చేయటం, స్తోత్రపఠనం ద్వారా దేవతలను యజ్ఞయాగాదులకు ఆహ్వానించడం ఇతని విధి అని సాయన భాష్యం పేర్కొంటోంది కాబట్టి, ఈ పదం ఒక వ్యక్తిని కాక, ఒక విధిని సూచిస్తోందనీ భావించవచ్చు. 

ఆంగిరస వంశోద్ధారకుడుగా ప్రసిద్ధికెక్కిన కణ్వ మహర్షి, మనదేశంలోని ఉత్తర భారతంలోని హరిద్వార్‌కు 42 మైళ్ల దూరంలోని మాలినీ నదీ తీరప్రాంతంలో             ఉండేవాడంటారు. 

ఆయన తల్లి కేశిని. తండ్రి ఘోరుడు. ఇతని సతీమణికి వేరుగా పేరేదీ ఉన్నట్లు తెలియటం లేదు. ఆమెను 'కణ్వపత్ని'గానే వ్యవహరిస్తున్నారు. కణ్వుడి తమ్ముడి పేరు ప్రగాథుడు. వీరిగురించిన కథ ఒకటి ఉంది. 

కణ్వపత్ని కథ
ఒకసారి కణ్వుడు, తన భార్యకు చెప్పి ఎక్కడికో బయటికి వెళ్లాడు. తర్వాత కొంత సమయానికి ఆయన తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన ఆయనకు ఒక అనూహ్య దృశ్యం కానవచ్చింది. తన భార్య ఒడిలో తన తమ్ముడు ప్రగాథుడు పడుకొని ఉన్నాడు. తన భార్య తనను చూసికూడా కొంచెం అయినా తడబడలేదు సరికదా, అలాగే, ఉండిపోయింది. దానితో కణ్వుడి కోపం హద్దులు దాటిపోయింది. ఆవేశంతో ఆయన, భార్యను చూస్తూ, 'పాపాత్మురాలా!' అన్నాడు. ఆ శబ్దాన్ని విని కణ్వపత్ని ఒడిలో ఉన్న ప్రగాథుడు ఉలికిపడి లేచాడు. 

భర్త ఆగ్రహానికి గురైన కణ్వపత్ని నివ్వెరపోతూ, 'స్వామీ! ప్రగాథునికి గాయాలు అయ్యాయి. అందుకే...' అంటున్నా, కణ్వుడు వాటిని పట్టించుకోకుండా,

మరింత కోపాన్ని ప్రదర్శించాడు. 

 ప్రగాథుడు 'మహర్షీ! నేను చేసిన తప్పేమీ లేదు! నాకు సోదరుడివైనా, తండ్రివి అయినా నువ్వే! ఇక, ఆమె నా తల్లి!' అన్నాడు. 

ఆ మాట విన్న కణ్వుడికి క్షణంలో నిజం తెలిసిపోయింది. తను తొందరపడ్డాడని అనిపించింది. ఈలోగానే, ప్రగాథుడు, తన వదినెగారైన కణ్వపత్ని పాదాలమీద మోకరిల్లాడు. 'మీ అన్నగారిలాగనే, నీవుకూడా మంత్రద్రష్టవు కాగలవు' అని ఆమె నిండు మనసుతో దీవించింది. కణ్వుడుకూడా వెంటనే తమ్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. ఆమెఆశీస్సుల ఫలితమా అన్నట్లుగా, కణ్వునితోబాటుగా, ప్రగాథుడు సైతం మంత్రదష్టగా వేదాలలోని అనేక మంత్రాలను దర్శించగలిగాడు. ఈ గాథ మనకు 'కిరాతార్జునీయం' రాసిన భారవి కథ గుర్తుకు తేవటం ఖాయం. అదెలా ఉన్నా, మనం కణ్వుడిగురించి మరింత ఆలోచించాల్సి ఉంది.  

    ముఖ్యంగా రెండు విషయాలమీద మనం దృష్టి సారించాలి. 
    1. కణ్వుడు ఆంగిరస వంశోద్ధారకుడు అనేది. మనకు 'ఆంగిరస' గోత్రం వేరుగా ఉంది. మరి, కణ్వుడే ఆంగిరస వంశోద్ధారకుడు అయితే, కణ్వస గోత్రం ఎలా ఏర్పడింది?
    2. అంటే, ఆంగిరస గోత్రంలోంచి కణ్వస గోత్రం రూపొందినట్లు భావించవచ్చునా?

భారతంలో కణ్వుడు
కణ్వుని ప్రసక్తి మనకు మహాభారతంలోనూ ఉంది. మేనక, విశ్వామిత్రులకు జన్మించిన ఒక పాపను, ఆ ఇద్దరు తల్లీదండ్రులు వదిలివేసినప్పుడు, ఆ పాపను అక్కడి శకుంతల పక్షులు పెంచాయని మనకు తెలుసు. శకుంతల పక్షులు పెంచిన ఆ చిన్నారి పాపకు 'శకుంతల' అని పేరు పెట్టి, కణ్వుడు ఆమెను తన ఆశ్రమానికి తెచ్చి, పెంచినట్లుకూడా మనకు తెలుసు. అలా యుక్త వయస్కురాలైన శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహమాడిన తర్వాత, శకుంతల

కణ్వ మహర్షి ఆశ్రమంలోనే ఉన్నట్లు, అక్కడే ఆమెకు భరతుడు జన్మించినట్లుకూడా మనం చదువుకున్నాం. శకుంతలను దుష్యంతుడివద్దకు పంపేటప్పుడు, ఆమెకు కణ్వుడు చేసే హితబోధకూడా జగత్ప్రసిద్ధం. ఇదే గాథను మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' పేరిట ఒక గొప్ప నాటకాన్ని రచించాడు. అది ఎంత గొప్పదీ అంటే, 'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలా' అన్న పేరు పొందేంతగా!! మరి, ఈ కణ్వుడు, పైన పేర్కొన్న ఆంగీరస వంశోద్ధారకుడు ఒకరేనేమో!!

మంత్రద్రష్టలు కాణ్వాయనులు
కణ్వుడు, ఆయన సోదరుడైన ప్రగాథుడు కలిసి అనేక వేద మంత్రాలను దర్శించారు. కణ్వుడితోబాటు, ఆయన వంశంవారు అనేకులు ఋషులుగా సుప్రసిద్ధులు. వారిగురించిన వివరాలు మనకు ఋగ్వేదంలోని ఎనిమిదో మండలంలో కానవస్తాయి. వీరిని సామూహికంగా 'కాణ్వాయనులు' లేదా 'కాణ్వులు' అంటారు.

ఈ 'కాణ్వులు' ముప్ఫయిమంది. వారి వివరాలు ఇవి:

1. ప్రగాథుడు      2. మేధాతిథి        3. దేవాతిథి      4. బ్రహ్మాతిథి             5. వత్సుడు    6. పునర్వత్సుడు   7. సాధ్వంసుడు      8. శశకర్ణుడు  
9. పర్వతుడు     10. నారదుడు    11. గోషూక్తుడు  12. ఇరిమ్బిఠుడు     13. సోభరి      14. నీపాతిథి          15. నాభాకుడు        16. త్రిశోకుడు
17.ప్రస్కణుడు    18. పుష్టిగుడు    19. శ్రుష్టిగుడు 20. ఆయువు          21. మేధ్యుడు  22. మాతరిశ్వుడు  23. కృశుడు      24. పృషధ్రుడు          

25. సుపర్ణుడు    26. భర్గుడు       27. కలి           28. హర్యతుడు       29. కురుసుతి    30. కుసీదిస


పైవారిలో ప్రగాథుడు, కణ్వుడి తమ్ముడు. 

యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని రెండు శాఖలు. శుక్ల యజుర్వేదంలో 10 శాఖలు (15 అని కొందరి భావన), కృష్ణ యజుర్వేదంలో

14 శాఖలు ఉన్నాయి. శుక్ల యజుర్వేదంలోని 10 శాఖలలో మొదటిది కాణ్వ శాఖ. ఈ కాణ్వ సంహితలో మొత్తం 40 అధ్యాయాలు, 328 అనువాకాలు,

2,086 మంత్రాలు ఉన్నాయి. ఈ శాఖ, మంత్రాలు మనకు అందుబాటులో ఉండటం మన అదృష్టం. 

కాణ్వ శాఖలలో ముఖ్యమైనవి నాలుగు: 
1. వైయశ్వ శాఖ,    2. ప్రియమేధ శాఖ,       3. ఉపస్తుత శాఖ,      4. సోబరి శాఖ


కణ్వ మహర్షి, ఆయన వంశంవారు చేసిన అనేక దేవతాస్తుతులు మనకు ఋగ్వేదంలోనూ, యజుర్వేదంలోనూ కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి:
వాగ్దేవీస్తుతి, అగ్ని స్తుతి, సూర్యస్తుతి, భూదేవీస్తుతి, లక్ష్మీస్తుతి, వాయు సూక్తం వంటివి ఉన్నాయి. 

కణ్వుడు, ఆయన సంతతి, లేదా ఇతర కాణ్వాయులు మనకుచేసిన సేవలు అనేకం. పైన పేర్కొన్న స్తుతులు, నుతులను తాము దర్శించి మనకు అందించడమేకాక, వారు నేరుగా స్త్రీలపట్ల అందరికీ ఎలాంటి గౌరవప్రపత్తులు ఉండాలో సూచిస్తూ అనేక స్తుతులను మన ముందుంచారు. కాణ్వాయనులలో ఒకరైన మేధాతిథి, తన 'అగ్ని స్తుతి'లో
'అగ్నేపత్నీ రిహావహ దేవానామ్‌' అన్నట్లుంది. అంటే 'ఓ అగ్నిదేవా! దేవపత్నులనుసైతం యజ్ఞశాలకు తీసుకునిరా!' అని ప్రార్థన. అంతక్రితంవరకూ పురుష దేవతలకు మాత్రమే యజ్ఞాలలో హవిస్సులు అందేవి. మేధాతిథి స్త్రీలకు అపూర్వగౌరవం ఇవ్వటంతోబాటుగా, కొత్తగా వాయువు, పృధివి, సదసస్పతి, విశ్వేదేవతలవంటి నూతన దేవతల కల్పన చేశాడు. 

ఇక్కడ మరొక్క విషయాన్ని ప్రస్తావించటం అవసరం.

సత్యవ్రత మనువు తన నావలో తెచ్చిన ఋషిపుంగవులలో కణ్వుడు లేడు. ఈ కథ మనం 'బైబిల్‌'లో చదివే నోవాస్‌ ఆర్క్‌ కథను గుర్తుకు తేవటం వాస్తవం. 


                                                                                          *     *     *     *     *
-----------------------------------------------------------------------


Copyright Reserved