hinduBrahmins

-----------------------------------------------------------------------జమదగ్ని

    
జమదగ్నున్‌, బరమారివీరనిజహృత్సంబంధషడ్వర్గమున్‌ 
    విమాలాత్మాద్భుత సత్తపఃఫలమునన్‌ విధ్వస్తముంజేసి తా
    నమలోదాత్తమనీషచే బరమధర్మానీకసంరక్షణన్‌
    సమతన్‌ గీర్తిని గాంచినాతని బ్రశంసన్‌ గొల్తు సశ్రాంతమున్‌.


    జమదగ్ని జామదగ్న్య గోత్రానికి ఆద్యుడు. ఈయన భృగు మహర్షి వంశంలోని వాడు. ప్రస్తుత మన్వంతరంలోని సప్తర్షులలో ఒకడు. 

జమదగ్ని వంశం
    భృగు మహర్షి - పులోమల కుమారుడు చ్యవనుడు. చ్యవనుని భార్య సుకన్య. వారిద్దరి కుమారుడు ఆదివాసుడు. ఆయన భార్య ఋచి. వారి కుమారుడు ఔర్యుడు. ఆయన కుమారుడు ఋచీకుడు. ఋచీకుడు- ఆయన భార్య సత్యవతిల కుమారుడు జమదగ్ని. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని - రేణుకల కుమారులు ఐదుగురు. వీరిలో చివరివాడైన  రామభద్రుడు తన చేత గండ్రగొడ్డలిని ధరించేవాడు కనుక, 'పరశురాముడు' అయ్యాడు. అందుకే, పరశురామునికి 'భార్గవ రాముడు' అన్న పేరుంది. జమదగ్ని కుమారులు ఐదుగురు అని ఉన్నా, వారి పేర్లు వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా కానవస్తున్నాయి. కొందరు ఆ కుమారులు - వసు, విశ్వవసు, బృహదన్యు, భృత్వ కణ్వ, రామభద్రులు అంటుండగా, మరికొందరు - రుషున్మంతుడు, సుసేనుడు, వసు, విశ్వవసు, రామభద్రులు అంటున్నారు.

ఇంకొందరు ఆ కుమారులు - రమణ్వంతుడు, ముసేషణుడు, వసు, విశ్వవసు, రామభద్రుడు అంటారు. 

శివధనుస్సు భంగం
    జమదగ్ని కుమారులలో ఒకడైన రామభద్రుడు, శివుడిని ప్రసన్నం చేసుకుని శివధనుస్సును పొందాడు. అందుకే, సీతాస్వయంవర ఘట్టంలో - తనకు అత్యంత ప్రియమైన శివధనుస్సును విరిచి వేశాడన్న కోపంతో, జనకుని సభకు వచ్చి, పరశురాముడు, శ్రీరామచంద్రునితో వివాదానికి దిగుతాడు. చివరకు, శ్రీరామచంద్రుడిని తన తదుపరి విష్ణువు అవతారంగా గుర్తించి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోతాడు. ఆ ఘట్టం, పరశురాముడు, శ్రీరామచంద్రుల మధ్య అవతారపరమైన పరివర్తనంగా కొందరు సూచిస్తారు.     

జమదగ్ని కథ
    జమదగ్ని దగ్గర 'సురభి' అనే కామధేనువు ఉండేది. దానిని  తనకిమ్మని హైహయ వంశరాజైన కార్తవీర్యార్జునుడు కోరతాడు. ఈ కార్తవీర్యార్జనుడికి ఒక వరం ఉంటుంది. ఆయన తండ్రి, నర్మదాతీరంలోని హైహయ రాజ్య పాలకుడు అయిన కృతవీరుడు తపస్సు చేసి, విష్ణువును మెప్పిస్తాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, తనకు అత్యంత బలశాలి అయిన కుమారుడు కావాలనీ, అతడిని విష్ణువు, లేదా విష్ణువుకు సమానమైన బలం ఉన్న వాడే చంపగలగాలనీ వరం కోరతాడు. అలా పుట్టినవాడే కార్తవీర్యార్జునుడు.ఈయన దత్తాత్రేయుడి భక్తుడు. దత్తాత్రేయుడిని పూజించి, కార్తవీర్యార్జునుడు వేయి చేతులనూ, కోరిన చోటికి తీసుకెళ్లగల ఒకస్వర్ణ రథాన్నీ వరాలుగా పొందుతాడు. తాను కోరినట్లుగా, సురభిని కానుకగా ఇవ్వకపోవటంతో, జమదగ్నిని కార్తవీర్యార్జునుడు చంపేస్తాడు. ఆ సంగతిని తల్లిద్వారా విన్న పరశురాముడు, తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుడినీ, అతడితోబాటుగా అనేక క్షత్రియ రాజవంశాలనూ వెతికివెతికి చంపేస్తాడు. పరశురాముడు విష్ణువు అవతారం కావటంవల్లనే, కార్తవీర్యార్జునుడిని చంపగలుగుతాడు. జమదగ్ని చనిపోవటంతో, అతని భార్య అయిన రేణుక కూడా సతీసహగమనం చేసుకుని చనిపోతుంది. 

ముంగిసగా జమదగ్ని 
    భృగు వంశానికి చెందినవారికి కోపం అధికం అంటారు. దీనికి నిదర్శనంగా దుర్వాసో మహామునిని పేర్కొంటారు. అయితే జమదగ్ని మహర్షికి పరమ శాంతస్వభావుడిగా పేరుండేది. దీన్ని పరీక్షించాలని ఒకసారి క్రోధదేవత సంకల్పిస్తుంది. అప్పుడు జమదగ్ని తన పూర్వీకులకు వార్షీకం చేస్తుంటాడు. దానికై ఆయన ఆవుపాలను తెచ్చిపెట్టుకుంటాడు. ఆ ఆవుపాలను క్రోధదేవత ఒలకపోస్తుంది. అయినా, జమదగ్ని కోపించక, తన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. ఇది ఆమోదించలేని జమదగ్ని పూర్వికులు, తమకు అతను ఆవుపాలులేని పిండం ఇచ్చిన కారణంగా ముంగిసగా జన్మించమని శాపం ఇస్తారు. ఫలితంగా అలా జన్మించిన జమదగ్ని, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం సమయంలో శాపవిమోచనం పొందాడని ఒక కథ ఉంది. 

రేణుకాదేవి వృత్తాంతం
    జమదగ్ని భార్య రేణుకా దేవి మహాపతివ్రత. ఆమెను దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు కొలుస్తారు. ఆమెకే రేణుక, ఎల్లమ్మ, జోగులమ్మ, జోగులాంబ వంటి అనేక నామధేయాలు ఉన్నాయి. 

    రేణుక గురించిన ఒక కథ ఉంది. ఆమె నిత్యం తన భర్త పూజలకై నదీజలాన్ని ఒక పచ్చి మట్టికుండలో తెచ్చేది. సాధారణంగా పచ్చి మట్టితో చేసిన కుండలో నీరు నిలవదన్నది తెలిసిందే. అయితే, రేణుకాదేవి పాతివ్రత్యంవల్ల పచ్చికుండలోకూడా నీళ్లు నిలిచి ఉండేవి. ఒకసారి ఆమె, నదీతీరానికి వెళ్లినప్పుడు, గగనమార్గంలో

ఒక గంధర్వుడు వెళ్తూ ఆమెకు కానవచ్చాడు. అతని రూపానికి రేణుక క్షణకాలం చలించిందట. దానితో, ఆమె పాతివ్రత్యం భంగమై, ఆమె నీళ్లు తెస్తున్న పచ్చి మట్టికుండ కాస్తా పగిలిపోయింది. ఆమె ఎంత చింతించినా, మళ్లీ నీటిని పట్టలేకపోయింది. ఆమె తెచ్చే నీటికోసం ఎదురుచూస్తున్న జమదగ్ని, తన దివ్యదృష్టితో చూసి, విషయం తెలుసుకుని, పట్టలేని ఆగ్రహంతో, తన కుమారులను పిలిచి, ఆమె తలను నరికివేయమని ఆజ్ఞాపించాడు. అయితే, తల్లిని చంపడానికి  వారు సిద్ధపడలేదు.

అదే కోపంతో, తన మాట ధిక్కరించిన వారందర్నీ ఆయన శిలలు కమ్మని శపించాడు. అప్పుడు, తండ్రి మాట తలదాల్చి, పరశురాముడు తల్లిని చంపేశాడు.

దానికి సంతోషించిన జమదగ్ని, పరశురాముడిని రెండు వరాలు కోరుకొమ్మని చెప్పాడు. పరశురాముడు వెంటనే, తన తల్లిని తిరిగి జీవితురాలిని చేయమని ఒక కోరిక, శిలలైన తన సోదరులను తిరిగి జీవితులను చేయాలని మరో కోరికనూ కోరాడు. జమదగ్ని, తన కుమారుడి మాట మన్నిస్తూ, వెంటనే ఆ ప్రకారమే చేశాడన్నది ఈ కథ. 

అలంపురంలో జోగులాంబ
    అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపురంలో జోగులాంబ దేవాలయం ఉంది. ఇక్కడ కొలువైన జోగులాంబను రేణుకామాత అవతారంగా భక్తులు కొలుస్తారు. 

    అలంపురం హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్‌నగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది తుంగభద్ర, కృష్ణానదీ సంగమ స్థలం. దీన్నే 'దక్షిణ కాశి' అనీ, 'నవ బ్రహ్మేశ్వరం' అనీ అంటారు. పరశురాముడు తన తల్లి రేణుకాదేవి తలను నరికినప్పుడు,  మాయా రూపంగా ఆమె తల 'ఏకవీర'గానూ, మిగిలిన మొండెం భాగం మాతృ రూపంగా 'భూదేవి'గానూ ఏర్పడ్డాయి. రేణుకాదేవిలో క్షణకాలంపాటు మాయను కల్పించిన తల భాగం 'మాయారూపం' అయింది. భూదేవీ విగ్రహానికి, అది రేణుకాదేవి మొండెం భాగమే కాబట్టి, తల ఉండదు. ఈ విగ్రహం ప్రతిరూపం అలంపురంలోని మ్యూజియమ్‌లో ఉంది. దీన్ని 'నర్మక్క బండ' అంటారు. అలంపురంలోని  ఆలయం నూతనంగా నిర్మితమై, అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. 

    'యోగినులకు అమ్మ' కాబట్టి 'యోగులాంబ', అదే క్రమంగా 'జోగులాంబ' అయిందనీ, 'ఎల్లరకూ అమ్మ' కాబట్టి 'ఎల్లమ్మ' అయిందనీ అంటారు.

ఎలాగైనా ఆ అమ్మ చల్లని మాయమ్మ.   

కొంకణ బ్రాహ్మణులలో జమదగ్నులు
    జమదగ్ని గోత్రీకులు అధికంగా మహారాష్ట్ర తీరప్రాంతంలోని కొంకణస్థ బ్రాహ్మణులలో కానవస్తారు. కొంకణస్థ బ్రాహ్మణులలో అగ్నిహోత్రి, మహాజన్‌, కుంఠే, పెండ్సే, వార్తక్‌ అనే ఇంటిపేర్లు ఉన్నవారు అధికులు జమదగ్ని గోత్రీకులే. 


                                                                     *       *       *       *       *

-----------------------------------------------------------------------


Copyright Reserved