hinduBrahmins

------------------------------------------------------హైందవ మతం - చాతుర్వర్ణ్య వ్యవస్థ 

సామూహిక జనజీవన వ్యవస్థే సమాజం. కుటుంబం అనేది ఈ సమాజానికి ప్రాథమికం. ఒక కుటుంబంలోని వ్యక్తుల మధ్య వివిధ అభిప్రాయాలు, వాటి కారణంగా కలిగే అభిప్రాయ భేదాలు, వాటి పర్యవసానంగా ఏర్పడే కలతలు, చివరికి సర్దుబాట్లు మనకు నిత్యజీవనంలో అనుభవంలోనికి వచ్చే విశేషాలే! ఒక మతంలోనూ అంతే!! చిత్రంగా 'మతం' అంటే 'అభిప్రాయం' అన్న అర్థం కూడా ఉంది! అభిప్రాయం ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు సహజమే కదా! మన ప్రాచీన సమాజంలో వివిధ అభిప్రాయాలు ఉండేవి. అప్పటికే పాదుకున్న కొన్ని అభిప్రాయాలను కాదంటూ, ఇంకొందరు తమ అభిమతాలు వేరేవిగా వ్యక్తం చేయవచ్చు. ఇలా ఏర్పడివే భిన్న 'మతాలు'. బౌద్ధం అయినా అంతే, జైనం అయినా అంతే, అలా రూపొందినవే!

'మన' ధాతువుకు 'క్తః' అనే ప్రత్యయాన్ని చేర్చటం వల్ల 'మత' శబ్దం ఏర్పడిందని 'శ్రుతిధర్మ సంగ్రహం' పేర్కొంటోంది. 'మతం' అంటే అవబోధన విషయం, అంటే 'తెలుసుకోవాల్సిన విషయం' అని అర్థం.. అని 'బ్రాహ్మణ సర్వస్వం' (అను ఆంధ్రదేశ సమగ్ర సంక్షిప్త చరిత్ర, చతుర్థ సంపుటం, 1998, పేజీ.24, ప్రచురణ: అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, శ్రీశైలం,) వివరిస్తోంది. 'పరమేశ్వరుని ముఖమునుండి అప్రయత్నంగా పురుష నిశ్వాసమువలే వెలువడిన వేదరాశియే ఆలవాలంగా గలిగి ఉండటంచేత ఇది 'వైదిక మతం' అయింది' అని కూడా అదే వ్యాసంలో ఉంది.

ఇష్టమైన సిద్ధాంతానికి 'మతం' అనే వ్యవహారం కూడా ఉంది. 'మతం' అనే పదానికి Religion అన్న ఆంగ్ల పదం సమానార్థకంగా మనం వాడుతున్నాం. 'Religion' అన్న పదం 'religore' అనే లాటిన్‌ పదం నుంచి ఏర్పడింది. 'Religore' లేదా 'religere' అంటే to pay attention or to observe అన్న అర్థాలు ఉన్నాయి. మతం అంటే దృష్టి నిలపాల్సిన విషయమని గుర్తించడం అవసరం. 

ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా, మన హైందవ మతం లేదా వైదిక మతానికి ఒక ప్రత్యేకత ఉన్న మాట నిజం. వేదాలకు మల్లే ఈ హైందవ మతం లేదా వైదిక మతంకూడా 'అపౌరుషేయం', అంటే, ఒక మానవమాత్రుడు సృష్టించిన లేదా ప్రవచించిన మతం కాదు. 

'సింధు' అనే పదం వాడుకలో 'హిందు' అయి, అక్కడి అత్యధిక ప్రజలు అనుసరించే మతం 'హిందూ మతం' అయింది. అలాగే, వేదాలను ప్రామాణికంగా తీసుకుని జీవించే ప్రజలకు చెందినది కాబట్టి మనది 'వైదిక మతం' అయింది.   

సమాజంలో అందరూ తమతమ అన్ని పనులనూ సక్రమంగా నిర్వర్తించేందుకు, సమాజం అన్ని విధాలా పురోగతి సాధించేందుకు ఏర్పడినదే వర్ణ వ్యవస్థ. ఎవరు ఎప్పుడు ఏర్పరిచారో మనకు తెలియదు. 

    
'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
    తస్య కర్తార మపి మాం వి ద్ధ్య కర్తార మవ్యయమ్‌'


అని శ్రీ మద్భగవద్గీత (4.13)లో శ్రీకృష్ణభగవానుడే వచించాడు. అంటే 'గుణములనుబట్టి, కర్మలను బట్టి చతుర్వర్ణాలనూ నేనే సృష్టించాను. వాటికి నేను కర్తనైననూ, వాస్తవానికి అకర్తనే, అవినాశినే' అని అర్థాన్ని చెప్పారు స్వామి సుందర చైతన్యులవారు. 

చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఋగ్వేదంలోని పురుషసూక్తంలో ఉంది. ఋగ్వేదంలోని పదవ మండలంలో బ్రాహ్మణులతోసహా మొత్తం నాలుగు జాతుల ప్రస్తావన ఉంది. (10-90-12). 

ఆపస్తంబ సూత్రాలలోనూ (1-1-4) చాతుర్వర్ణ ప్రసక్తి  ఉంది. 

----------------------------------------------------------------------------

Copyright Reserved