hinduBrahmins

-----------------------------------------------------------------------------------గౌతముడు

    
కరముల్‌ మోడ్చి నుతింతు భక్తి సురగం
                            గాపూతతోయార్ద్రభా
    స్వరమూర్తిన్‌ గతధూమసంజ్వలికస
                            జ్జ్వాలాగ్నికల్పున్‌ సురా
    సురదుర్ధర్షుని పక్షపాదు రచిత
                            శ్రుతర్థవాదున్‌ వ్రతా
    విరళామోదు సుధీబుతుం బ్రలిహతా
                            విద్యాతమున్‌ గౌతమున్‌.
 
                                     (భాస్కర రామాయణము, బాల కాండము, 5-12)    

గౌతమస గోత్రీకులకు గోత్రపురుషుడు గౌతమ మహర్షి. ఈయన సప్తర్షులలో ఒకడు. బ్రహ్మమానసపుత్రులైన ఆంగిరసులలో ఒకడైన రాహుగణుడి కుమారుడు. ఈయన భార్య అహల్య. 

అహల్య కథ
ఒకసారి బ్రహ్మ తన సృష్టిలో భాగంగా ఒక అపురూప సౌందర్యవతిని సృష్టించాడు. ఆమే అహల్య. అంత రూపవతి, గుణవతిఅయిన అహల్యను ఒక ఉత్తమ గుణసంపన్నుడికి ఇచ్చి వివాహం చేయాలని బ్రహ్మ ఆశిస్తాడు. అప్పుడు అతనికి గౌతముడు జ్ఞప్తికి వస్తాడు. గౌతముడి గుణగణాలను పరిశీలించాలనే కాంక్షతో, బ్రహ్మ, ఆ సౌందర్యవతి అయిన అహల్యను గౌతముని వద్ద ఆయన శుశ్రూషలకు ఉంచి, తాను కొంతకాలం తర్వాత వచ్చి ఆమెను తీసుకు వెడతానని చెప్తాడు. కొన్నాళ్ల తర్వాత వచ్చిన బ్రహ్మకు గౌతముని నియమనిష్ఠలు నచ్చుతాయి. అంతకాలం తనవద్ద అపురూప సౌందర్యవతి అయిన అహల్య ఉన్నప్పటికీ, ఆమెను కాంక్షించక, రవ్వంతైనా చలించని ఘోటక బ్రహ్మచారి అయిన గౌతమునికి అహల్యను ఇచ్చి వివాహం చేశాడని ఒక కథ. 

ఈ కథే బ్రహ్మాండ పురాణంలో మరో విధంగా ఇలా ఉంది: ఇంద్రుని సభలో నర్తకిగా ఉన్న సుందరి ఊర్వశికి ప్రతిగా అంతే అందంగా బ్రహ్మ సృష్టించిన అహల్యను చూసి అనేకులు ఆమెను కాంక్షిస్తారు. త్రిలోకాలనూ అత్యంతవేగంగా ప్రదక్షిణం చేసి వచ్చినవారికి ఆమె లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిస్తాడు. అప్పుడే, ఆమెను కోరుకున్న ఇంద్రుడు కూడా త్రిలోకాలనూ చుట్టిరావటానికి బయలుదేరతాడు. కానీ, గౌతముడు వెంటనే కామధేనువుచుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. కామధేనువు  చుట్టూ ప్రదక్షిణ చేయటం మూడు లోకాలచుట్టూ ప్రదక్షిణ చేయటానికి సమానం కావటంవల్ల, ఆ పందెంలో ఇంద్రుడిని ఓడించి, గౌతముడు గెలిచాడని నారదుడు చెప్తాడు. దానితో బ్రహ్మదేవుడు అహల్యను గౌతముడికి ఇచ్చి వివాహం చేస్తాడు.

ఈ కారణంగానే, ఇంద్రుడు అహల్యపై కోరికతోనే, చాలాకాలం తర్వాత, గౌతముడి వేషం ధరించి, ఆమెను లొంగదీసుకున్నాడనే వాదం ఉంది. అయితే,

తనను చేరవచ్చినవాడు తన భర్త కాదు, ఇంద్రుడని తెలిసినా, అతను తన అతిలోకసౌందర్యం వల్లనే తనను కోరాడన్న అతిశయంతో అహల్య ఇంద్రునికి లొంగిపోయిందనీ అంటారు. అసలు సంగతి తెలుసుకున్న గౌతముడు తిరిగి వచ్చి, అహల్యకు రాయిగా మారిపొమ్మని శాపం ఇచ్చాడన్నదీ, ఆ తర్వాత, శ్రీరామపాదం సోకటంవల్ల ఆమెకు శాపవిమోచనం అయిందన్నది తెలిసిందే! 

ఇటు ఇంద్రుడికి అతని అండాలు ఊడిపడాలనీ, అతని తుచ్ఛ కామవాంఛను నిత్యం ప్రస్ఫుటించేలా శరీరం అంతా 'సహస్రయోని'భరితం కావాలనీ

గౌతముడు శాపం ఇస్తాడు. దానికి ఇంద్రుడు ఎంతో చింతించి, క్షమాపణ కోరుతూ శాపపరిహారం కావించమని గౌతముడిని కోరతాడు. అప్పుడు

గౌతముడు, 'చూచేవారికి ఆ సహస్రయోనులు 'సహస్రాక్షులు'గా కానవస్తాయ'ని కొంతవరకూ శాపావకాశం కలిగిస్తాడు. ఇంద్రుని వృషణాలు ఊడిపడిపోవటంతో, అతనికి మేక వృషణాలను తెచ్చి, దేవతలు అతికస్తారని ఒక కథ.  

అహల్య కష్టాలను అద్భుతంగా చిత్రిస్తూ, దక్షిణాది మధుర నాయక వంశ రాజులలో ఒకరైన వేంకట కృష్ణప్ప నాయకుడు రాసిన
'అహల్యా సంక్రందనం' తెలుగులో ఒక గొప్ప ప్రబంధంగా వెలుగొందుతోంది. ఇందులో 'సంక్రందనుడు' అంటే ఇంద్రుడు అని అర్థం. 

అయితే, ఇదంతా కట్టుకథ అనీ, శ్రీరాముడంతటివాడికి తన తపశ్శక్తిని దానం చేసిన తపస్విని అహల్య, ఆమె ఇంద్రుని కోరటం, చేరటం అన్నవి విడ్డూరమైన భావన అనేవారూ ఉన్నారు. మోసపూరితంగా ఇంద్రుడు చేసిన పనికి ఆమె ఎంతో చింతించి, ఏ మనోవికారమూ ఉండని శిలారూపం ధరించి తపస్సు చేసుకుంటూ, తన భర్తకు దూరంగా ఉండి తనకు తాను శిక్షను వేసుకుని అనుభవించిందనీ అంటారు. 

ఏది ఏమైనా,
ఇలాంటి కథే ఒకటి గ్రీక్‌ పురాణాలలోనూ ఉంది. జ్యూస్‌ అనే రారాజు ఆల్స్‌మీన్‌ అనే ఆమె శీలాన్ని, ఆమె భర్త రూపంలో వచ్చి కొల్లగొడతాడనేది ఆ కథ. గ్రీక్‌ పురాణాలలో జ్యూస్‌ - రాజులకు రాజు, ఆకాశానికీ, ఉరుములకూ రాజు. మన ఇంద్రుడికి దాదాపు సమానం. ఎటొచ్చీ, గ్రీక్‌ పురాణాల్లో జ్యూస్‌కు ఉన్న దేవసమానమైన ప్రాతిపదిక కారణంగా, జ్యూస్‌ చేసిన పనిని నీచంగా పరిగణించటం లేదు. జ్యూస్‌, ఆల్స్‌మీన్‌ల సంగమకారణంగా వారికి హెరాక్లిస్‌ అనే ధీరోదాత్తుడు జన్మిస్తాడు. ఈ కథ వృత్తాంతం మనకు Windy Doniger రాసిన 'Indra And Ahalya, Zeus ans Alcmena: Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India', 1999, లో లభిస్తాయి. 

మన తెలుగు, తమిళనాడు, శ్రీలంక వంటి ప్రాంతాలలో జరిగే వివాహాలలో భాగంగా ఒక నల్లరాయిమీద వధువు కాలును ఉంచి వరునిచేత మట్టెలు తొడిగించే సంప్రదాయం ఉంది. అది ఈ అహల్యాగౌతముల కథకు ప్రతీక అని కొందరి భావన. నల్లరాయి (మనం దీన్ని 'ఐరేణి' అంటాము) అహల్యకు ప్రతీక అని, నూతన వధువు తాను ఎన్నడూ అహల్యకులాగ మరొకరిని కోరనని సూచిస్తూ, అహల్య చేసిన పనిని నిరసిస్తూ, దానిమీద తన కాలును ఉంచుతుందనీ, ఆమెకు అప్పుడు తమ ఇద్దరిమధ్య వివాహబంధాన్ని నిత్యం గుర్తుచేసేలా వరుడు, మట్టెలు తొడుగుతాడనీ అంటారు. అలాగే, అరుంధతిలాగ భర్తకు పరిమితమయి ఉండాలని గుర్తు చేస్తూ, అరుంధతి నక్షత్రాన్ని చూపించే మరొక సంప్రదాయం ఏర్పడిందనీ అంటారు. ఈ వివరాలు మనకు Herman Jenses రాసిన 'A Classified Collection of Tamil Proverbs' (2002)లో లభిస్తాయి. 

ఉత్తర భారతంలో సుప్రసిద్ధమైన మాహరీ నృత్య రీతులలో అహల్య పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంచ కన్యలలో ఒకరుగా వారు అహల్యను ప్రస్తుతిస్తారనేది విశేషం. 

గౌతమీ నది కథ
నారద పురాణంలో కూడా గౌతముడు చేసిన తపస్సుగురించిన ప్రస్తావన ఉంది. ఇది గోదావరి నది భువిపై ప్రవహించటానికి గల కారణాలను, పాపికొండలు రూపొందిన కారణాన్ని వివరిస్తుంది. 

గౌతముడు వరుణుడి కృప కోరుతూ తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమయి, వరం కోరుకోమని అడగగనే, గౌతముడు 'అక్షయ జలం' కోరాడు. ఎంత కరువుకాటకాలు ఉన్నా, దేశంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలనేదే గౌతముడి నిస్స్వార్థమైన కోరిక. 

అనాది కాలంలో ఏర్పడిన ఒక కరువు దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగింది. గౌతముడు అప్పట్లో గోదావరి నది ఒడ్డున తపస్సు చేసుకునేవాడు.

ఆ ప్రాంతం అంతా తీవ్రమైన కరువుకాటకాలపాలయింది. అయినా, తనను దర్శించడానికి వచ్చే వారికి గౌతముడు సకల అతిథి సత్కారమర్యాదలను అందించేవాడు. ఇంతటి తీవ్రమైన కరువుకాలంలో గౌతముడు తన అతిథులకు ఎలా ఆహారం ఇవ్వగలుగుతున్నాడని పలువురు ఆశ్చర్యపడేవారు.

అదంతా గౌతముడికి ఉన్న ఒక వరప్రభావమని చాలామందికి తెలీదు. ఉదయం వేళలో విత్తనాలు వేస్తే అవి సాయంత్రానికి ఆయనకు పూర్తి ఫలసాయాన్ని అందించేవి. ఇలా నిత్యం పంటలతో ఆయన ఆశ్రమం కళకళలాడుతుండేది. 

ఇదిలా ఉండగా, ఒకసారి పార్వతీదేవిని చూసి శివుడి తలపై  ఉన్న గంగ నవ్విందట. అది గమనించిన పార్వతీదేవి, శివుని తలమీద  ఉన్న కారణంగానే గంగ మిడిసిపడుతోందని భావించి, గంగకు ఎలాగైనా గర్వభంగం చేయాలని, అది గంగను శివుని తలమీదనుంచి సాగనంపటంతోనే సాధ్యమని నిర్ణయించుకుంది. తన ఆలోచనను ఆమె, తన కుమారుడైన గణపతితో పంచుకుంది. ఆయన వెంటనే, తన ప్రమధ గణాలలో ఒకడిని పిలిచి, అతడిని మాయాగోవును చేసి, గౌతముడి ఆశ్రమానికి పంపాడు. గణపతి ఆదేశం ప్రకారం గౌతముడి ఆశ్రమానికి చేరిన ఆ మాయాగోవు, గౌతముడి ఆశ్రమంలోని పచ్చని పొలాలమీదపడి, వాటిని నాశనం చేయసాగింది. అది చూసిన గౌతముడు కోపంతో, ఒక దర్భను విసిరి, ఆ గోవును అక్కడినుంచి తరిమివేయాలని ఆశించాడు. కానీ, అది మాయాగోవు కావటంతో, ఆ దర్భతాకిడికి అక్కడే పడి ప్రాణాలను వదిలేసింది. ఇలా గోహత్యాదోషానికి గురైన గౌతముడి ఆతిథ్యం స్వీకరించడానికి సప్తర్షులలో మిగిలిన ఆరుగురూ నిరాకరిస్తారు. 

మరి, తన గోహత్యాపాపానికి పరిహారం ఏమిటని గౌతముడు, ఆ ఋషులను అడుగుతాడు. ఆ మాయాగోవు శరీరంమీదనుంచి గంగానది ప్రవహించినట్లయితే, ఆ పాపానికి ప్రక్షాళన జరుగుతుందని వారు వివరిస్తారు. వెంటనే, గౌతముడు శివుడిని ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మహాదేవుడు ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరుకోమని అంటాడు. తన వెంట గంగను తన ఆశ్రమానికి పంపి, తనకు తన పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోగల అవకాశం ఇవ్వమని గౌతముడు కోరతాడు. దానికి శివుడు సరేనని, తన జటాజూటంలోని మూడు జటలను పక్కకు తీసి, గంగ ప్రవహించడానికి అనుమతిని ఇస్తూ, తగిన వీలునూ కల్పిస్తాడు. అప్పుడు గంగ, శివుడితో 'మీ ఆజ్ఞ మేరకు నేను భూలోకానికి వెడుతున్నాను. మరి నేను మిమ్మల్ని తిరిగి కలుసుకోవడం ఎప్పుడు, ఎలా?' అని అడిగింది. దానికి జవాబుగా శివుడు 'ఈ వైవస్వత మన్వంతర కాలంలో నువ్వు భూలోకంలో ఉండు.. తదనంతరం తిరిగి నీ నిజస్థానం చేరుకుందువుగాని!' అని అన్నాడు. అప్పుడు గంగ, 'స్వామీ! మీరు ఇక్కడే నా నదీతీరం వద్ద  ఉండాలని కోరుకుంటున్నా' అనగానే పరమశివుడు 'సరే'నని అక్కడ ఉండిపోయాడు. అదే
'త్య్రంబకం' అయింది. అదే సుప్రసిద్ధ జ్యోతిర్లింగం. 'శివుని ఆజ్ఞానుసారం నేను నీ వెంటనే భువిమీదకు ప్రవహిస్తుంటాను, కానీ, నేను వస్తున్నానా లేదా అని సందేహించి గనుక వెనక్కు తిరిగి చూసిన తక్షణమే నేను నా ప్రయాణాన్ని ఆపేస్తాను' అని గంగ, గౌతముడిని హెచ్చరించింది. ఆ ప్రకారమే, గంగ, గౌతముడి వెంట నడుస్తూ, భూలోకానికి వచ్చింది. భూలోకంలోని బ్రహ్మగిరివద్దగల ఒక మేడి చెట్టు దగ్గర గంగ తన భూలోక ప్రయాణం ఆరంభించింది. అదే గౌతమీనది ఆవిర్భావస్థలంగా పేరొందింది. గంగను భూలోకానికి తెచ్చిన గౌతముడి పేరుమీదనే ఆ గంగాప్రవాహానికిి 'గౌతమి' అన్న మరో పేరు వచ్చింది. అలాగే, గోవును బ్రతికించిందిగనుక 'గోదావరి' అయిందని వరాహ, బ్రహ్మ పురాణాలలో ఉన్న గాథలు విశదీకరిస్తున్నాయి. ఈ కథలు వరాహ, బ్రహ్మ పురాణాలలో ఉన్నాయి.   

బ్రహ్మదత్తునకు శాపం
గౌతముడు ఒకసారి బ్రహ్మదత్తుడు అనే రాజును సందర్శిస్తాడు. ఆ రాజు, గౌతముడిని తన అతిథిగా ఉండమని కోరతాడు. ఆ ప్రకారమే, గౌతముడు అక్కడ బ్రహ్మదత్తుని ఆతిథ్యం పొందుతూ ఉండిపోతాడు. ఒకసారి, గౌతముడికి వడ్డించిన భోజనంలో ఒక మాంసపుముక్క వస్తుంది. అది బ్రహ్మదత్తుని నిర్లక్ష్యంగా భావిస్తూ, అతడిని గద్దగా జన్మించమని శపిస్తాడు. బ్రహ్మదత్తుడు, అది తనకు తెలియక జరిగిన తప్పు అని క్షమాపణ కోరతాడు. అప్పుడు, గద్దగా జన్మించబోయే బ్రహ్మదత్తునికి శ్రీరాముడి చేయి తగలగానే, శాపవిమోచనం అవుతుందని చెప్తాడు. ఆ ప్రకారమే బ్రహ్మదత్తుడు ఒక గద్దగా జన్మిస్తాడు. ఆ గద్దకు ఒక గుడ్లగూబతో తగువు వస్తుంది. తమ తగవును తీర్చవలసిందిగా ఆ గద్ద, శ్రీరాముడిని చేరుతుంది. శ్రీరాముడు, ఆ గద్దను తన చేతితో నిమరగానే, గద్దరూపంపోయి, బ్రహ్మదత్తుడు తన యథారూపం పొందుతాడని 'ఉత్తర రామాయణం'లోని కథ. 

గౌతముని సంతానం
గౌతముడు-అహల్య దంపతుల కుమారులు వామదేవుడు, నోధుడు. మరొక కుమారుడు శతానందుడు. ఆయన మిథిలకు రాజైన జనకునికి పురోహితుడు. ఈయనే 'శరద్వంతుడు' అనికూడా ఉంది. 

ఋగ్వేదంలోని నాల్గవ మండలాన్ని వామదేవుడు దర్శించినట్లు చెప్తారు. శివపురాణం ప్రకారం గౌతముడి కుమార్తె అంజనాదేవి. ఆమె కుమారుడు ఆంజనేయుడు. 

మహాభారతం ప్రకారం అహల్య-గౌతముల కుమారులుగా శరద్వంతుడు, చిత్రకారి అనే వారూ ఉన్నారు. మహాభారతంలోని అశ్వమేధ పర్వం ప్రకారం, అహల్యాగౌతములకు మరొక కుమార్తెకూడా ఉంది. గౌతముడు, ఈమెను తన శిష్యుడైన ఉదంక మహామునికి నూతన శరీరం, చిరయవ్వనాలను అనుగ్రహించిన తర్వాత ఇచ్చి, వివాహం చేశాడు.          

విష్ణు పురాణం ప్రకారం ఈ దంపతులకే జయ, జయంతి, అపరాజి అనే ముగ్గురు కుమార్తెలూ ఉన్నారు. 

ఆంగిరసులలోనే భరద్వాజ, గౌతములను కలపడంకూడా ఉంది. 

సామవేదంలోని 'భద్ర' ఋక్కులన్నీ గౌతముడు దర్శించినవే అంటారు. అలాగే, సామవేదంలోని 'రాణాయని'నికూడా గౌతముడే దర్శించాడంటారు.  

మహాభారతం, శాంతి పర్వంలో గౌతముడు దాదాపు అరవై సంవత్సరాలపాటు చేసిన తపస్సు గురించిన ప్రస్తావన ఉంది. 

గౌతముడి శిష్యులుగా ప్రాచీన యోగ్య, శాండిల్య, గార్గేయ, భరద్వాజలను కొందరు పేర్కొంటారు. 

యజుర్వేద అనుయాయి అయిన శ్రీరాముని సతీమణి సీతమ్మది గౌతమస గోత్రం. వీరి ప్రవర - ఆంగీరస, ఆయాస్య, గౌతమ. 

సూత్రకర్త అయిన బౌధాయనుడు, తన గ్రంధాలలో గౌతమ మహర్షి గురించి ప్రస్తావించాడు. 

ఇక్కడ ఇంకో కథనూ చెప్పుకోవటం ఉచితంగా ఉంటుంది. గౌతమ మహర్షి ఒకప్పుడు తీర్థయాత్రలకై లోకసంచారం చేస్తూ, దక్షిణ భారతంలోని ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ప్రజలు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు. గౌతమ మహర్షి రాకతో అక్కడి ప్రజలు ఆయనచుట్టూ చేరి, నిత్యం కరవు కాటకాలతో అవస్థలు పడుతున్న తమ కష్టాలు తీర్చవలసిందిగా ఆయనను కోరుతారు. తన దివ్యదృష్టితో వారి కష్టాలకు కారణం అవగతం చేసుకున్న గౌతముడు, అక్కడ కొంత లోతులో, అగస్త్యుడు ప్రతిష్టించిన వినాయకుని విగ్రహం ఉందని గుర్తిస్తాడు. వెంటనే, ఆ గ్రామస్తులను పిలిపించి, వారిని నాగలితో అక్కడ లోతుగా తవ్వమని ఆదేశిస్తాడు. ఆయన చెప్పినట్లుగానే, వారు అక్కడ తవ్వగానే, లోపలినుంచి, వినాయకుని విగ్రహం బయటపడింది. ఆవిధంగా గణపతి విగ్రహం బయటపడిన ప్రదేశం పక్కనుంచి ప్రవహించేలా కావేరీ నది తన మార్గాన్ని మార్చుకుందని అంటారు.

గణపతి వెలసిన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు 'గణపతి అగ్రహారం' అంటున్నారు. ఇది తమిళనాడులొని కుంబకోణం దగ్గర ఉంది. కుంబకోణంనుంచి తిరువయ్యూరుకు వెళ్లే దారిలో, కుంబకోణంకు సుమారు 20 కిలోమీటర్‌ల దూరంలో గణపతి అగ్రహారం ఉంది. 

ఈ ఊరిలోని ప్రజలు వినాయక చవితిని తమ ఇళ్లలో జరుపుకోక, స్వామివారి ఆలయంలోనే సామూహికంగా జరుపుకోవటం విశేషం. 

గౌతమ ధర్మసూత్రం
గౌతముడు 'గౌతమ ధర్మసూత్రం' రాశారు. దీనినే 'గౌతమ స్మృతి' అనీ అంటారు. ధర్మసూత్రాలలోనే మొట్టమొదటిదైన 'గౌతమ ధర్మసూత్రం'లో 28 అధ్యాయాలు, దాదాపు 1000 సూత్రాలూ ఉన్నాయి. హిందూ ధర్మ విధానంలోని నాలుగు ఆశ్రమాలు (కౌమారం, బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం), నాలుగు వర్ణాలు, నలభై సంస్కారాలతోబాటుగా వివిధ ధర్మాలు, స్త్రీలు పాటించవలసిన విధులు, ఏవైనా తప్పులు చేస్తే అవలంబించవలసిన ప్రాయశ్చిత్త విధానాలు, పాలకుల విధులు, బాధ్యతలు, ఆస్తుల విషయంలో అనుసరించదగిన పారంపర్య హక్కుల పద్ధతులు వంటివన్నీ గౌతమ ధర్మసూత్రాలలో ఉన్నాయి. 

గౌతముడు 'న్యాయశాస్త్రం'ను రాశారు. దీన్ని వ్యాసుడు నిరసనతో చూశాడని అంటారు. తన న్యాయశాస్త్రాన్ని నీరసభావంతో చూసిన వ్యాసునిపట్ల నిరసనతో, గౌతముడు తన కాళ్లలో నేత్రాన్ని సృష్టించుకుని, ఆ నేత్రంతో వ్యాసుడిని చూశాడు. అందుకే గౌతముడికి 'అక్షపాదుడు' అన్న పేరు వచ్చింది. ఈ గౌతమ న్యాయశాస్త్రం మొత్తం 5 అధ్యాయాలతో ఉంటుంది. ఇందులో ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ వంటి మొత్తం 16 పదార్థనిరూపణలతో ఉంటుంది. 

ఇక, గౌతముడు అందించిన 'గౌతమసంహిత' అతిగొప్ప జ్యోతిశ్శాస్త్రంగా పేరొందింది.  

'గౌతమ' బుద్ధుడు
ప్రపంచానికి బౌద్ధ మత మార్గాన్ని ప్రసాదించిన బుద్ధుని అసలు పేరు గౌతముడు. ఆయనను 'గౌతమ బుద్ధ' అనటం తెలిసిందే. కపిలవస్తు మహారాజు, శాంక్య వంశస్థుడు అయిన శుద్ధోధనుడి కుమారుడైన గౌతముడు 'బుద్ధుడు' అవటంలోనూ, ఆయనను 'సిద్ధార్థుడు' అనటంలోనూ ఔచిత్యం కనిపిస్తోంది కానీ, అసలు ఆయన 'గౌతముడు' ఎలా అయ్యాడు? బుద్ధునికి ముందు బౌద్ధమతం లేదు కాబట్టి, బుద్ధుని తండ్రి అయిన శుద్ధోధనునికి ముందున్న కపిలవస్తు రాజవంశీకులు అందరూ గౌతమ గోత్రీకులు కావచ్చునేమో! వారు క్షత్రియులు కాబట్టి గౌతమస గోత్రం క్షత్రియులలోనూ ఉండవచ్చు.

అన్నట్లు, ఉత్తరభారతంలోని వ్రజభూమి ప్రాంతంలో గౌతమస గోత్ర బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్నారనేది ఇక్కడ సందర్భోచితమైన విషయం.  

                                                                               
*     *     *     *     *
-----------------------------------------------------------------------


Copyright Reserved