hinduBrahmins

-----------------------------------------------------------------------భృగువు
    భార్గవ గోత్రీకులకు గోత్ర పురుషుడు భృగువు. కానీ, 'భార్గవుడు' అనగానే మనకు భార్గవరాముడు గుర్తుకు రావటం సహజం. 'భార్గవరాముడు' అంటే పరశురాముడు. 'భృగు' శబ్దంలోంచి వచ్చిందే భార్గవుడు. భార్గవరాముడు లేదా పరశురాముడు భృగు వంశంలోని వాడే. 

    'భృగు' శబ్దానికి తెలుగులో ప్రథమావిభక్తి ప్రత్యయం అయిన 'వు' చేరటంవల్ల ఆయన పేరు 'భృగువు' అయింది. 

    భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు. ఆయనను మహాభారత పౌలోమ పర్వంలో బ్రహ్మమానసపుత్రుడుగా పేర్కోవటం జరిగింది. 

భృగువు మహర్షి బంధుత్వాలు
    భృగు మహర్షి, దక్షప్రజాపతికి అల్లుడు. దక్షుని కుమార్తె ఖ్యాతికి ఆయన భర్త. ఈ దంపతులకు ధాత, విధాత అని ఇద్దరు కుమారులు.

దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది. 

    యజ్ఞాల ప్రస్తావన వచ్చింది కనుక, ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. యజ్ఞాలలో దేవతలకు సోమరసాన్ని నివేదించే విధానాన్ని భార్గవ వంశమునులే ప్రవేశపెట్టారు. 

    ఈయనకు పౌలోమ అనే మరో భార్య ద్వారా శుక్రుడు, చ్యవనుడు అనే కుమారులూ ఉన్నారు. శుక్రుని భార్య జయంతి. ఈమె ఇంద్రుని కుమార్తె. ఈమెకే కావ్య అనే మరో పేరుందని దేవీ భాగవతం పేర్కొంటోంది. శుక్రుడు రాక్షసగణాలకు కులగురువు అన్నది తెలిసిందే. శుక్రుడి కుమార్తె దేవయాని. ఆమె యయాతి మహారాజుకు భార్య. యయాతి రెండో భార్య శర్మిష్ఠ.  

    భృగువు కుమారుడైన చ్యవనుడి కుమారుడు ఋచిక. ఆయన కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరుశురాముడు.

అంటే భృగువు, పరశురాముడికి ముత్తాత తండ్రి అవుతాడు.  

    భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది. 

    భృగువు అతి గొప్పవాడని అంటారు. దీనికి సాక్ష్యంగా వారు, శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా 'నేను ఋషులలో భృగువును' అని చెప్పటాన్ని ఉటంకిస్తారు. 

    భృగువు రచించిన 'భృగుసంహిత' సుప్రసిద్ధమైన జ్యోతిష శాస్త్ర గ్రంథం. ఇది క్రీ.పూ.3 వేలనాటిదనీ, త్రేతాయుగంనాటిదనీ వివిధ అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇదే తొలి జ్యోతిషశాస్త్ర సంకలనం అంటారు. అయితే, భృగువు సంకలించిన ఈ గ్రంథంలో అత్యధిక భాగం, నలందా విశ్వ విద్యాలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు కాలిపోయింది. నలంద ఇప్పుడు బీహార్‌లోని పాట్నాకు సుమారు  88 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ, నలందా విశ్వవిద్యాలయం పూర్తిగా శిథిలమయింది. అక్కడ జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఎవరు అన్న విషయమై వివిధ వాదాలు ఉన్నాయి. భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలోనే నలందా విశ్వ విద్యాలయం దహనం అయిందని కొందరు అంటారు. నలందా విశ్వవిద్యాలయం బౌద్ధ మత ప్రచారానికి ఆలవాలం అయింది గనుక, అది సహించలేని హిందువులే దానికి ఒడిగట్టారని మరికొందరి వాదన.  శ్రీ వేంకటేశ్వరుని కథలో భృగు మహర్షి 

    శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో వెలియటానికి వెనుక ఉన్న ఐతిహ్యంలో భృగు మహర్షికి చెప్పుకోదగిన పాత్ర ఉంది. ఆ ఐతిహ్యం: 

    నైమిశారణ్యంలో ఉన్న మునిపుంగవులకు ఒకసారి ఒక పెద్ద సందేహం వచ్చింది. ఉన్నది త్రిమూర్తులే అయినా, వీరిలోనూ సత్వ, తమో, రజో గుణాలకు అతీతులు (త్రిగుణాతీతులు) ఎవ్వరు అనేదే ఈ సందేహం. సందేహం కలిగిన తర్వాత, దాన్ని నివృతి చేసుకోవటం తప్పనిసరి గనుక ఆ విషయం తేల్చవలసిందిగా వారందరూ భృగువు మహార్షిని కోరారు. ఆయన, ఆ పనిమీద బ్రహ్మలోకం చేరాడు. అక్కడ బ్రహ్మదేవుడు తనని పట్టించుకోకపోవటంతో, బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కడా దేవాలయం కానీ, పూజార్హత కానీ ఉండరాదని శపిస్తాడు. తర్వాత, కైలాసానికి చేరతాడు. అక్కడ, ఆ సమయంలో శివుడు, పార్వతితో ఉంటాడు. రతికాంక్షతో ఉన్న శివుడిని చూసి కోపించిన భృగువు, భూలోకంలో శివుడు లింగాకారంలోనే పూజార్హత పొందుతాడని శపిస్తాడు. తర్వాత మిగిలింది -వైకుంఠం. భృగువు అక్కడికీ చేరుకుంటాడు. ఆ సమయంలో మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మితో పాలసముద్రంమీద పవళించి ఉంటాడు. తన రాకను శ్రీమహావిష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగువు, ఆ కోపంలో మహావిష్ణువును గుండెలమీద తన్నాడు. ఇదే తగిన సమయమని భావిస్తూ, విష్ణువు, భృగువుకు కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమి, భృగువుకు గర్వభంగం చేశాడు. తను నివాసం ఉండే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద భృగువు తన్నినా, దాన్ని గుర్తించనివిధంగా తన భర్త  భృగువు పాదాలొత్తడం నిరసిస్తూ, ఆమె వెంటనే వైకుంఠంనుంచి పాతాళలోకానికి వెళ్లిపోయింది. అక్కడ కపిల మహర్షి కోరిన మీదట, ఆమె భూలోకానికి వెళ్లి, కరివీరపురం (నేటి కొల్హాపూర్‌)లో నివసించసాగింది. తన భార్య లక్ష్మీదేవి ఇలా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికోసం అన్వేషిస్తూ, భూలోకం చేరి, ఆమెను కరివీరపురంలో గుర్తించి, ఆమెను ప్రసన్నం చేసుకుని, ఆమె తిరుచానూర్‌లో పద్మావతిగా అవతరించి, తిరిగి, తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు. ఈ విధంగా శ్రీ వేంకటేశ్వరుడు, భూలోక వైకుంఠమైన తిరుపతికి చేరటంలో భృగువు మనకు గొప్ప సహాయం చేశాడనాలి. 


                                                                                    *     *     *     *     *
                 -----------------------------------------------------------------------

Copyright Reserved