hinduBrahmins

------------------------------------------------------------------------------------భరద్వాజుడు

మన ఇతిహాస పురాణాలలో 'భరద్వాజుడు' అనే పేరుతో ఏడుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇందులో చివరివాడు తప్ప మిగతా అందరూ ఋషులే. ధర్మసూత్రకర్త అయిన పండితుడు చివరి భరద్వాజుడు. వీరిలో మంత్రద్రష్ట అయిన భరద్వాజుడు అత్రిమహర్షి కుమారుడు. ఇతడు చాలా వేల సంవత్సరాలు జీవించాడు. ఇతడు తన జీవితంలో చాలాకాలం వేదాధ్యయనానికే వినియోగించాడు. వేదాధ్యయనం చేయడానికే ఇతడు తన జీవితాన్ని అనేకమార్లు పొడిగించుకున్నాడనేది విశేషం.

సంపూర్ణంగా వేదాధ్యయనం చేయటం తన లక్ష్యమని ఇతడు, ఇంద్రునికి చెప్పినప్పుడు ఇంద్రుడు నవ్వి, 'నువ్వు చదివింది కేవలం ఇంతే'నంటూ మూడు గుప్పిళ్ళ ఇసుకను తీసి చూపించాడట. అయినా, భరద్వాజుడు నిరుత్సాహపడక, తన అధ్యయనాన్ని మరింత దీక్షతో కొనసాగించాడు. 

వాల్మీకికి శిష్యుడు, వనవాస ప్రారంభంలో శ్రీరామచంద్రునికి ఆతిథ్యం ఇచ్చిందీ ఇతడేనని కొందరి భావన. (ఆర్ష విజ్ఞాన సర్వస్వము, తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ, 2008 పే.28)

భరద్వాజుడు- పేరు వెనుక అర్థం
    భరద్వాజుడు అంటే 'భరత్‌ వాజః' అంటే 'వీర్యమును రక్షించుకున్నవాడు' అన్న అర్థంకూడా ఉందని శ్రీ గాదె నారాయణరావు వ్రాసిన 'శ్రీరామకథామృతము' అన్న గ్రంథం (పేజీ.58)లో ఉంది. ఈ అర్థం వెనుక ఒక చిత్రమైన కథ ఉంది. దేవతల గురువైన బృహస్పతి ఒకసారి తనఅన్న భార్య (వదినె) అయిన మమతను చూసి కామించాడు. ఆమె 'ఇది తప్పు కూడద'ని ఎంత వారించినా వినక, బృహస్పతి బలాత్కారంగా తన కోరికను తీర్చుకున్నాడు. మమత గర్భంలో అప్పటికే ఉన్న పిండం, 'ఇక్కడ ఇద్దరు శిశువులకు స్థానం లేదు' అంటూ బృహస్పతి వీర్యాన్ని బయటకు వెళ్లగొట్టింది. అప్పుడు ఒక మగపిల్లవాడు జన్మించాడు. 'ద్వాజుడు' అయిన ఈ బిడ్డను నీవు భరించమంటే నీవు భరించమంటూ వదినా మరుదులు ఇద్దరూ వాదులాడుకుంటారు. అందువల్లనే ఆ బిడ్డ 'భరద్వాజుడు' అయ్యాడు. చివరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ బిడ్డ బాధ్యతను చేపట్టలేదు. అప్పుడు దేవతలైన ఏడుగురు మరుత్తులు భరద్వాజుడిని తీసుకెళ్లి పెంచుతారు. (ఆరాధన, దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణ, ఏప్రిల్‌ 2005, సంచిక, పే.43)

(మరుత్తులు 49మంది అనీ అంటారు.మరుత్తుల గురించిన విశేషాలు కశ్యపుడి గురించిన కథలలో చూడవచ్చు.)

ఇదే కథ మరొకవిధంగానూ ఉంది. బృహస్పతి, మమతల మధ్య కీచులాటల కారణంగా, ఇద్దరూ కాదనుకున్న ఆ బిడ్డను 'ద్వాజుడు' అన్న పేరుతో మరుత్‌దేవతలు పెంచాయి. తదనంతరకాలంలో, దుష్యంతుడు, మేనకల కుమారుడైన భరతుడు - తన తర్వాత, భారత దేశానికి పాలకుడు కాగల కుమారుడు లేడన్న తపనతో, 'మరుత్‌ సోమ యజ్ఞం' చేశాడు. అప్పుడు, భరతునికి, మరుత్‌ దేవతలు ప్రత్యక్షమై, తాము పెంచుకుంటున్న 'ద్వాజుడు'ను అప్పగించారు. ఆ 'ద్వాజుడు'ను భరతుడు పెంచుకోవటంతో, అతని పేరు 'భరద్వాజుడు' అయిందనేది కథ. (పుణ్యమూర్తుల దివ్య గాధలు, శ్రీ సామినేని ప్రకాశ రావు, గొల్లపూడి వీరాస్వామి సన్‌, రాజమండ్రి, 2010, పే. 328). 

ఇతడికి భరద్వాజుడనే పేరు కలగడం వెనుక మరొక కారణమూ   ఉంది. 

    
'భరే సుతాన్‌ భరే శిష్యాన్‌ భరే దేవాన్‌ భరే ద్విజాన్‌
    భరే చ భార్యామవ్యాజాధ్భారద్వాజోస్మి శోభనే'

అని శ్రీమద్భాగవతం (117) ఆ కారణాన్ని పేర్కొంటోంది. 'కొడుకులను, శిష్యులను, దేవతలను, బ్రాహ్మణులను, భార్యను ప్రేమతో భరిస్తాన'ని ప్రతిజ్ఞ చేసిన కారణంగానే ఇతనికి 'భరద్వాజుడు' అన్న పేరు కలిగింది. ఈ భరద్వాజుడే ఋగ్వేద సంహితలోని 59 సూక్తాలను దర్శించాడని ప్రతీతి.

భరద్వాజుడు- భారతదేశంలో ఋగ్వేదవ్యాప్తి
ఋగ్వేదంలో 6వ మండలాన్ని దర్శించిన ద్రష్టగా భరద్వాజ మహర్షిని పేర్కొంటారు. వేదాలను సంకలించిన వేదవ్యాసుడు, భరద్వాజుడు రాసిన లేదా దర్శించిన ఋక్కులను, ఋగ్వేదంలోని 6వ మండలంలో పెట్టాడు.  ఋగ్వేదంలో మొత్తం 10,552 ఋక్కులు (మంత్రాలు) ఉన్నాయి.

ఈ ఋక్కులు అన్నీ ఛందోబద్ధాలు. ఆయా ఛందస్సుకు అనుగుణంగా ఒక్కొక్క ఋక్కులో మూడు లేదా నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం ఋగ్వేదం 10 మండలాలుగా విభజితమయింది. వీటిలో 2నుంచి 7 వరకు ఉన్న మండలాలు మొదట కూర్చబడినవి. 1, 8, 9 మండలాలను

ఆ తర్వాత చేర్చారు. 2 నుంచి 7 మండలాలను 'సగోత్ర మండలాలు' (Family Books) అంటారు. ఈ మండలాలలో ఒక్కొక్కదానిని ఒక్కొక్క ఋషి లేదా ఆయన సంతతి వారు దర్శించారు. గనుక వాటికి 'సగోత్ర మండలాలు' అనే పేరు వచ్చింది. వీటిలో 6వ మండలాన్ని భరద్వాజుడు లేదా అతని సంతతివారు దర్శించారు. (Ref. Vedic Mythology (వేదాలలో దేవతలు), A. A. Macdonell, 1896). అంటే ఋగ్వేదంలోని 6వ మండలాన్ని భరద్వాజుడు లేదా అతని సంతతివారు దర్శించారని (రాశారు) అనవచ్చు. అయితే, వేదాలు 'అపౌరుషేయాలు' (మనుషులు రాసినవి కావు) కనుక, వారు దర్శించినట్లు చెప్పటం జరుగుతోంది. ఋగ్వేదం ఆరవ మండలంలో ఆరు అనువాకాలు, 75 సూక్తాలు ఉన్నాయి. 

ఋగ్వేదం ఆరవ మండలాన్ని దర్శించిన ద్రష్టగా భరద్వాజుడు, 'అదితి, వరుణుడు, మిత్రుడు, అగ్ని, ఆర్యమా, సవిత, భగరుద్ర, వసుగణ, మరుత్‌, రోదసీ (ద్యావాపృథ్వీ), అశ్వనీద్యయనాసత్య (అశ్వనీ దేవతలు), సరస్వతీ, వాయువు, ఋభుక్ష, పర్జన్యు'ల వంటి దేవతలను పేర్కొన్నాడు (ఋగ్వేదం, 6-50-1). అలాగే, 'ఉషః పర్వతాలు, పితరులు, నదులు, సరస్వతీనది, మేఘుడు' వంటి వాటినీ ప్రార్థించాడు (ఋగ్వేదం, 6-52-4,6).

ఇక్కడ శాఖాచంక్రమణం చేస్తూ, ఒక విషయాన్ని ప్రస్తావించడం అవసరమవుతోంది.

వేదవ్యాసునిద్వారా ఋగ్వేదాన్ని మొదట అధ్యయనం చేసినవాడు పైలుడు. ఇతడి తండ్రి పేరు కూడా పైలుడే. తల్లి పేరు పీల. యుధిష్ఠిరుడు రాజసూయం చేసినప్పుడు, పైలుడినే హోతగా వ్యాసుడు ఏర్పాటు చేశాడు. ఈ పైలుడు ఋగ్వేదాన్ని ఇంద్రప్రమతికి, భాష్కలునికి ఉపదేశించాడు. ఇంద్రప్రమతి మాండూకేయునికి, అతడు సత్యశ్రవునికి, సత్యశ్రవుడు సత్యహితునికి, అతడు సత్యశ్రీకి ఈ ఋగ్వేదసంహితను అధ్యపనం చేశారు. ఈ సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు. వారు-

1. వేదమిత్ర శాకల్యుడు.                2. రథీతర శాకపూణి.        3. బాష్కలి భరద్వాజుడు.

వీరు మరింతమందికి ఈ సంహితను ఉపదేశించారు. ఇలా ఇంద్రప్రమతి శిష్యప్రశిష్యకోటి ద్వారానే భారతదేశంలో ఈ సంహిత వ్యాప్తి చెందింది. అయితే పైలుడి రెండో శిష్యుడైన భాష్కలుడిద్వారా మాత్రం ఈ పరంపర అంతగా కొనసాగలేదు.  

ఇక్కడ ప్రస్తావితమైన బాష్కలి భరద్వాజుడు బహుశా పైన పేర్కొన్న ఏడుగురిలో ఒకరై ఉండవచ్చు. 

భరద్వాజుడు 
భరద్వాజ మహర్షి గురించిన కథలు, ఇతివృత్తాలు మనకు అనేకంగా లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని:

భరద్వాజుడు ఒక గొప్ప ఋషి. సాధారణంగా ఋషులను మూడు వర్గాలలోకి విభజిస్తారు.
    1. బ్రహ్మర్షులు (భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వగైరా)
    2. దేవర్షులు (శుక్రాచార్యుడు, బృహస్పతి వగైరా)
    3. రాజర్షులు (జనకుడు, రుతుపర్ణుడు వగైరా)

    వీరుకాక, వివిధ శాస్త్రాలు చెప్పిన శుశ్రుతుడు వంటి శ్రుతర్షులు, కర్మకాండల గురించి వివరించిన జైమిని వంటి కందర్షులు వంటివారు కూడా ఉన్నారు.

భరద్వాజ మహర్షి ప్రస్తుత మన్వంతరంలోని సప్తఋషులలో ఒకడు. మన్వంతరం అనేది ఒక కాలమానం. దానిని ఒక్కొక్క మనువు పేరుమీదుగా వ్యవహరిస్తారు. ఇప్పటిది వైవస్వత మన్వంతరం. పూజసమయంలో మన సంకల్పంలో ఈ వివరాలను మనం నిత్యం చెప్పుకుంటాం.

ఈ వైవస్వత మన్వంతరంలోని సప్త ఋషులు:
    1. అత్రి,    2. వశిష్ట,    3.విశ్వామిత్ర,    4.జమదగ్ని,    5. కశ్యప,    6. గౌతమ,    7. భరద్వాజ

అయితే, గౌతమ, భరద్వాజులస్థానే అగస్త్య, ఆంగిరసుడిని చెప్పడం ఉంది. అలాగే జమదగ్ని స్థానే భృగుమహర్షిని పేర్కొనటమూ ఉంది. ఆంగిరసుని వారసులుగా భరద్వాజ, గౌతములను, భృగువు వారసునిగా జమదగ్నిని చెప్పటమూ ఉంది. కనుక, సప్తఋషుల విషయంలో కొంత సందిగ్ధం కనిపిస్తోంది. ఇది ముఖ్యంగా 'ప్రవర' చెప్పే సమయంలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మహర్షులు ఏడుగురే అయినా, కొంతమందికి నవ ఋషులతోనూ కూడిన ప్రవర ఉండడం విశేషం. 

భరద్వాజుని బంధుత్వాలు
బ్రహ్మదేవుని మానస పుత్రుడు కుమారుడు అంగిరుడు. ఆయన భార్య శ్రద్ధ. ఈ దంపతుల కుమారుడు బృహస్పతి. బృహస్పతి కుమారుడు భరద్వాజుడు. కనుక, భరద్వాజుడు బ్రహ్మదేవునికి మునిమనుమడు. 

బ్రహ్మమానసపుత్రుడైన అంగిరునికి, ఆయన భార్య అయిన వసుధకు ఏడవ సంతానం గురువు (బృహస్పతి) అనీ, ఆయనకు తార, శంఖణి అని ఇద్దరు భార్యలు, భరద్వాజ, యమకంఠుడు, కచుడు అని ముగ్గురు కుమారులని మరో కథ. 

భరద్వాజుని భార్య సుశీల. ఈ దంపతులకు గర్గుడు, కాత్యాయని అని ఇద్దరు బిడ్డలు. ఈ గర్గుని కుమార్తె సుప్రసిద్ధ వ్యాకరణవేత్త అయిన గార్గి. కాత్యాయని యాజ్ఞవల్క్యుని రెండవ భార్య. యాజ్ఞవల్క్యుడు 'శతపథ బ్రాహ్మణం' రాశాడు. ఈ యాజ్ఞవల్క్య, కాత్యాయని దంపతులకు చంద్రకాంత, మహామేఘ, విజయ అనే ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు.

 భరద్వాజునికి, ఘృతచి అనే అప్సరసకు పరోక్షంగా జన్మించినవాడు ద్రోణుడు.

 మరికొంతమంది అభిప్రాయం ప్రకారం భరద్వాజునికి దేవవర్షిణి (దేవవర్ణిని) అనే కుమార్తె కూడా ఉంది. ఆమె విశ్రావసును వివాహమాడింది. వీరి కుమారులలో ఒకడు సకల సిరిసంపదలకు అధిదేవుడైన కుబేరుడు. (అయితే కుబేరుడి తల్లి ఐద్విద అనే ఒక యక్షిణి అన్న వేరే కథ కూడాఉంది.) వీరి రెండవ కుమారుని పేరు లోకపాలకుడు.

 అయితే భరద్వాజుడు అత్రి మహర్షి కుమారుడని మరో కథ ఉంది.

 శుక్ల యజుర్వేదంలో కొన్ని మంత్రఖండికలను దర్శించినవారిలో ఒకరైన శిరింబఠ అనే మహిళను భరద్వాజుని కుమార్తెగా చెప్తారు. (ఆర్ష విజ్ఞాన సర్వస్వం, ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు, 2003, పే. 239)

దివోదాసు యుద్ధాలు

వేదవాఙ్మయంలో మనకు కనిపించే సుప్రసిద్ధ కథలలో ఒకటి 'దివోదాస యుద్ధాలు'. ఇది సామవేదం పూర్వార్చికం 1వ ప్రపాఠకం, 1వ దశతి, 5వ మంత్రంలో కనిపిస్తుంది. ప్రపంచ కథావాఙ్మయంలో ఇదే మొట్టమొదటి కథగా ప్రసిద్ధి పొందింది. 

వాల్మీకికి శిష్యుడైన భరద్వాజ మహర్షిని మరుద్వజ దేవతలు పెంచారు. భరద్వాజుడు గొప్ప వీరుడు. వేదవాఙ్మయ కథలలో సుప్రసిద్ధమైన దివోదాస యుద్ధాల సందర్భంగా మనకు భరద్వాజుడి ప్రసక్తి వస్తుంది. అభ్యావర్తికి చెందిన రాజ్యాన్ని వార్షికులు ఆక్రమించారు. ఆ సమయంలో అభ్యావర్తికి సహాయం చేసేందుకు దివోదాసు వస్తాడు. ఇద్దరూ తమ సైన్యాలతో కలిసి వార్షికులతో చాలాకాలంపాటు యుద్ధం చేస్తారు. కానీ వార్షికులు బలవంతులు కావడంతో అభ్యావర్తి, దివోదాసులు ఓటమి పాలవుతారు. అప్పుడు వారు పారిపోయి భరద్వాజుని ఆశ్రమానికి వచ్చి ఆయన శరణు కోరతారు. యుద్ధంనుంచి పారిపోయి వచ్చిన అభ్యావర్తి, దివోదాసులను 'యుద్ధంలో ఓడిపోయి తిరిగిరావడం ఏమిట'ి అని భరద్వాజుడు నిరసిస్తాడు. వార్షికులను జయించడం తమ శక్తికి మించిన పని అని వారు చెప్పటంతో స్వయంగా భరద్వాజుడు వార్షికులపై యుద్ధానికి తలపడి వారిని ఓడించి, అభ్యావర్తికి తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ విధంగా చూస్తే భరద్వాజుడు గొప్ప వీరుడని అర్థం చేసుకోవచ్చు. 

ఆ తర్వాత, దివోదాసుకు బిడ్డలు కలగకపోవడంతో భరద్వాజుడు, పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేసి దివోదాసుకు పుత్రసంతానాన్ని ప్రసాదంగా అందించాడని ఒక గాథ.

గొప్ప వీరుడైన భరద్వాజుడు, అగ్నివేశునికి ఆగ్నేయాస్త్ర ప్రయోగ రహస్యాలను నేర్పాడని మరో కథా ఉంది.

దివోదాసుకు, అతని కుమారుడైన ప్రతర్దనుడికికూడా భరద్వాజుడు పురోహితుడిగా ఉండేవాడు. (మైత్రాయణీయ సంహిత, 3-3-7). ప్రతర్దనుడి కుమారుడైన క్షత్రునికికూడా భరద్వాజుడు పురోహితుడిగా ఉండేవాడు. అంటే, భరద్వాజుడు వరసగా మూడు తరాలకు పురోహితుడిగా ఉండేవాడన్నమాట. 

ఈకాలంలో భరద్వాజునికి ఆయా రాజులు అనేక కానుకలను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అభ్యావర్తీ చాయమానుడు భరద్వాజునికి అనేకమంది వధువులతోబాటుగా, రథములు, 20 గోవులను ఇచ్చాడు (ఋగ్వేదం, 6-63-9). సుమీధుడు భరద్వాజునికి 2 ఆడ గుర్రాలను, 100 ఆవులను ఇచ్చాడు. శాండుడు 10 రథాలను ఇచ్చాడు (ఋగ్వేదం, 1-59-7). పురునీధుడు భరద్వాజునికి శతవనదానం చేసినట్లుగా ఉంది (ఋగ్వేదం, 6-47-22). ప్రస్తోకుడు భరద్వాజునికి 10 కోశములను, 10 అశ్వాలను ఇచ్చాడు (గోపథ బ్రాహ్మణం, 2-1-18). 

భారతదేశ పాలకుడు
భరద్వాజుడు భారతదేశాన్ని పరిపాలించినట్లు కూడా కథలున్నాయి.

విశ్వామిత్రుడు, మేనకలకు జన్మించిన దుష్యంత మహారాజు, శకుంతలకు పుట్టినవాడు భరతుడు. (భరతుడు అంటే రక్షించువాడు అని అర్థం). అతనికి బిడ్డలు లేకపోవడం వల్లనో, లేదా వారసులలో రాజ్యపాలన చేయదగిన అర్హతలు గలవారు లేకపోవడంతోనో, భరతుడు భరద్వాజుడిని పెంచుకున్నాడని ఒక కథనం. ఆ తర్వాత భరతుడు, భరద్వాజుడిని భారతదేశానికి పాలకుడిని చేశాడంటారు. అప్పుడు తన పెంపుడుతండ్రి అయిన భరతుడి కోసం భరద్వాజుడు యజ్ఞం చేస్తే భరతునికి భువమన్యుడు లేదా భూమన్యుడు పుట్టాడు. భరద్వాజుని తర్వాత భరతుని కుమారుడైన భూమన్యుడు రాజ్యపాలన చేశాడు. భూమన్యుడికి నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడైన బృహత్‌ క్షత్రుడు, అతని తర్వాత హస్తినుడు భారతదేశ పాలకులు అయ్యారంటారు. హస్తినుడు నిర్మించిన నగరమే హస్తినాపురం.

ద్రోణాచార్యుని తండ్రి
మహాభారత గాథలో సుప్రసిద్ధుడైన ద్రోణాచార్యుడికి భరద్వాజుడు తండ్రి అని మరొక కథ ఉంది. ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామకు భరద్వాజుడు పితామహుడు (తాతగారు). సుశీల అనే భార్య ఉన్నప్పటికీ ఘృతచి అనే ఒక అప్సరసను మోహించిన భరద్వాజుడు అనుకోకుండా తన రేతస్సు (వీర్యం)ను విడిచాడు. ఎంతో శక్తిమంతమైన తన రేతస్సు, వ్యర్థం కారాదన్న భావనతో ఆయన దాన్ని ఒక కుండలో పెట్టి భద్రపరిచాడు. దాని ఫలితంగానే ఆ కుండలోని రేతస్సువల్ల ద్రోణుడు పుట్టాడు. ద్రోణుడు అంటే కుండలో పుట్టినవాడు అని అర్థం. అందుకే ఆయన 'కుంభసంభవుడు'.

అసలు భరద్వాజుడు అంటే 'భరత్‌వాజః' అంటే వీర్యమును రక్షించుకున్నవాడు అన్న అర్థం కూడా వుందని శ్రీ గాదె నారాయణరావు రాసిన 'శ్రీరామకథామృతము' (పేజీ 58)లో ఉంది. అంటే భరద్వాజుని కాలం నాటికే మనవారికి వీర్యనిక్షిప్త ప్రక్రియ (స్పెర్మ్‌ ప్రిజర్వేషన్‌ టెక్నిక్స్‌ -Sperm Preservation Techniques) బాగా తెలుసునని అర్థం. ఈకోణం లోంచి చూస్తే ద్రోణుడు బహుశా ప్రపంచంలోకెల్లా తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ అవుతాడు. బహుశా ఈ వీర్యనిక్షిప్త ప్రక్రియను సైతం భరద్వాజుడే రూపొందించి ఉండవచ్చు కూడా.

భరద్వాజుడు 'అహింసా ప్రతిష్టాయాం తత్‌ సన్నిధౌ వైరత్యాగః ' అని పతంజలి వ్యాఖ్యానించారు. అలాగే పశుపక్ష్యాదులు సైతం తమ సహజ జాతివైరాలను మాని, భరద్వాజుని చుట్ట్టూ చేరేవి అని ఉంది. 'మృగపక్షీభి రాసీనః మునిభిశ్చ సమంతతః' అని వాల్మీకి రామాయణంలో వుంది.

రామాయణంలో భరద్వాజుడు
నిషాదుడు (బోయవాడు) అయిన రత్నాకరుడు, వాల్మీకి అయి రామాయణ కర్త కావటం యాదృచ్ఛికంగానే జరిగింది. క్రౌంచ పక్షుల జంట నేలకొరిగి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు అది చూసిన ఆయన శోకంలోంచి పుట్టిన శ్లోకమే 'మానిషాద' అయింది.

    
'మానిషాద ప్రతిష్టాం త్వమాగమశ్శాశ్వతీస్సమాః 
    యత్క్రౌంచ మిధునాదేకమవధీః కామమోహితమ్‌'

 వాల్మీకి నోటినుంచి ఈ శ్లోకం వెలువడినప్పుడు భరద్వాజుడు ప్రత్యక్షసాక్షిగా అక్కడే ఉన్నాడని, ఆయనే దాన్ని గ్రంథస్థం చేశాడని అంటారు. లౌకిక వాఙ్మయంలో ఛందస్సుకు ఆవిర్భావం జరిగింది కూడా ఈ శ్లోకంతోనే అంటారు. (ఆర్ష విజ్ఞాన సర్వస్వం, ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు, 2003, పే.57)

శ్రీమద్రామాయణం, అయోధ్య కాండలోకూడా భరద్వాజుడి ప్రసక్తి ఉంది. కైకేయికి ఇచ్చిన వరాలను తీర్చవలసిన అవసరం కొద్దీ దశరథుని ఆజ్ఞానుసారం సీతారామలక్ష్మణులు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి, వనవాసానికి బయలుదేరారు. అయోధ్యను వదలి, వనవాసానికి బయలుదేరారే గానీ ఎక్కడికి వెళ్లాలో వారికింకా తోచలేదు. అందుకే అయోధ్యకు సమీపంలో గంగాయమునానదీ సంగమప్రాంతం అయిన ప్రయాగలో ఉన్న భరద్వాజుడి ఆశ్రమాన్ని సందర్శించారు. (గోవిందరాజీయము అనే గ్రంధం ప్రకారం శ్రీరామచంద్రుడి వనవాసం చైత్ర శుద్ధ దశమినాడు ఆరంభంకాగా, భరద్వాజ ఆశ్రమానికి వారు నాలుగో రోజైన చైత్ర శుద్ధ చతుర్దశి నాడు చేరారు). తమ ఆశ్రమానికి వచ్చిన శ్రీరాముడికి భరద్వాజుడు, మధుపర్కాలతో స్వాగతం  పలికాడు. ఆ తర్వాత భరద్వాజుడు అక్కడికి సుమారు అరవై మైళ్ళ దూరంలో గంధమాదన పర్వతశ్రేణిలో ఉన్న చిత్రకూట వనప్రాంతానికి వెళ్ళి వనవాసం చేయవలసిందిగా వారికి సూచిస్తాడు. ఆ ప్రకారమే సీతారామలక్ష్మణులు అక్కడికి వెళ్ళి వనవాసం చేస్తారు.

 భరద్వాజుడి గురించిన ఇతరమైన గాధలు కొన్ని ఉన్నాయి. శ్రీరాముడు వనవాసానికి తరలివెళ్లిన తర్వాత దశరథపుత్రుడైన భరతుడు సైతం భరద్వాజుడిని సందర్శించి, ఆయన అనుమతితో శ్రీరాముడు వనవాసం చేసినంతకాలం శ్రీరామ పాదుకలతో భరద్వాజుని ఆశ్రమంనుంచే రాజ్య పరిపాలన చేశాడని అంటారు. అయితే భరతుడు నంది అనే గ్రామాన్ని తన తాత్కాలిక రాజధానిగా చేసుకుని అయోధ్యారాజ్యాన్ని పరిపాలించాడనీ మరో కథ ఉంది. 

భరద్వాజునికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరైన కాత్యాయని యాజ్ఞవల్య్కుడిని, మరొకరైన దేవవర్షిణి, విశ్రవ (విశ్రావసు) మునిని వివాహమాడారు. యాజ్ఞవల్క్యుడు ఆ తర్వాతి కాలంలో భరద్వాజుడినిసందర్శించినప్పుడు భరద్వాజుడి కోరికపై రామకథాగానం చేశాడనీ, దానినే భరద్వాజుడు లోక కళ్యాణార్థం బహిర్గతం చేశాడనీ అంటారు. అలాగే  శ్రీరామచంద్రుడు రావణవధ అనంతరం లంకనుంచి అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు గంగాయమున సంగమస్థలమైన ప్రయాగ ప్రాంతానికి రాగానే తన పుష్పక విమానాన్ని అక్కడ దింపి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి, ఆయనను దర్శించుకుని ఆ తర్వాత అయోధ్యాపురానికి వెళ్లాడని మరో కథ. గోవిందరాజీయము గ్రంథం ప్రకారం రావణవధ చైత్రశుద్ధ (?బహుళ) చతుర్దశినాడు జరిగితే, రావణసంస్కారం ఆ మర్నాడు అంటే అమావాస్యనాడు జరిగింది. వైశాఖ శుద్ధ పాడ్యమినాడు విభీషణునికి పట్టాభిషేకం జరిగితే తదియనాడు సీతమ్మ అగ్నిప్రవేశం జరిగింది. ఆ మర్నాడు అంటే వైశాఖ శుద్ధ చవితినాడు పుష్పకవిమానం ఎక్కి భరద్వాజ ఆశ్రమం చేరిన శ్రీరాముడు తన రాకను హనుమంతుని ద్వారా భరతునికి తెలియజేశాడు. ఆ తర్వాత భరతుడు వచ్చి అన్నగారైన శ్రీరామునికి అయోధ్యను, రాజ్యాన్ని అప్పగించిన విషయం తెలిసిందే.

భరద్వాజ విందు
లంకనుంచి తిరిగి అయోధ్యకు వెళ్తున్న సందర్భంలోనే శ్రీరాముడు తన అపరిమితమైన బంధుమిత్రులతో, బంటుపరివారాలతో వచ్చినప్పుడు వారికి భోజన ఏర్పాట్లను భరద్వాజ మహర్షి చేయవలసి వచ్చింది. దీనికై భరద్వాజుడు, విశ్వకర్మ సహాయంతో గొప్ప విందును ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప విందును మరెవ్వరు ఏర్పాటుచేయని కారణంగా దీనికి 'భరద్వాజ విందు' అన్న పేరు వచ్చింది. భరద్వాజుడు ఏర్పాటుచేసిన ఈ విందు గురించిన వర్ణన వాల్మీకి రామాయణంలో విశదంగా ఉంది.

ఈ విందును శ్రీరామునికి కాకుండా తన ఆశ్రమం నుంచి పరిపాలన జరుపుతున్న సమయంలో భరతునికీ, అతని పరివారానికీ భరద్వాజుడు ఏర్పాటుచేశాడన్న కధ కూడా వుంది. విశ్వకర్మను, యమ, కుబేర, వరుణాది దిక్పాలకులను, ఇంద్రాదిదేవతలను, భరద్వాజుడు పిలిపించాడు. సమస్తమైన నదులను, అప్సరసలను, గంధర్వులను, కులపర్వతాలను రప్పించాడు. విశ్వకర్మ అందమైన భవనాలతో కూడిన నగరాన్ని అక్కడ నిర్మించాడు. కుబేరుని చైత్రరథవనం అక్కడ వెలసింది. చంద్రుడు వచ్చి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలతో కూడిన అన్నాన్ని క్షణాలలో వండించి పెట్టాడు. నదులు సమస్తమైన మధుర రసాలు అందించాయి. పరిమళభరితమైన గాలులు వీచాయి. వివిధ వాద్యాలు మోగాయి. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. వైకుంఠం అక్కడే వెలసిన భావన అందరిలో కలిగింది. బంగారుపాత్రలతో పాలు, పెరుగు, క్షీరాన్నము, మధురమైన మద్యపానీయాలు, పిండివంటలు, దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, పట్టుపాన్పులు, సమస్తం వారికి అందుబాటులోకి వచ్చాయి. ఇంత గొప్ప ఏర్పాట్లతో అద్భుతమైన విందును వారెవ్వరు కనివినీ ఎరుగరు. ఫలితంగా భరద్వాజుని విందు ముల్లోకాలలో అసమానమైనదిగా పేరు పొందింది. (ఆరాధన, దేవాదాయశాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణ, ఏప్రిల్‌ 2005 సంచిక, పే.44)

ఎవరైనా ఇప్పుడు సమస్త మృష్టాన్నాలతో మంచి విందును ఇస్తే దాన్ని 'భరద్వాజ విందు'గా వర్ణిస్తూ మెచ్చుకోవడం ఉంది. 

భరద్వాజుడు గొప్ప శాస్త్రజ్ఞుడు
మరికొన్ని గాథల ప్రకారం భరద్వాజుడు గొప్ప శాస్త్రజ్ఞుడు, ఆయుర్వేదానికి ఆద్యుడు. వైమానిక శాస్త్రానికి రూపకర్త. గొప్ప వ్యాకరణవేత్త.

ఆయుర్వేదాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించి ఇంద్రునికి నేర్పాడు. ఇంద్రుని దగ్గర ఆయుర్వేద శాస్త్రాన్ని నేర్చుకుని, భరద్వాజుడు ఆ విద్యను ఆత్రేయ పునర్వసుకు నేర్పించాడు.

భరద్వాజుడు 'యంత్ర సర్వస్వం' అనే గ్రంథాన్ని రాశాడు. అందులోని ఒక భాగమే (సుమారు 40వ వంతు) వైమానిక శాస్త్రం. ఈ వైమానిక శాస్త్రంలో 8 అధ్యాయాలు, 3000 శ్లోకాలు    ఉన్నాయి. దీన్ని 1918నుంచి 1923 వరకు పండిట్‌ సుబ్బరాయ శాస్త్రి తన శిష్యులకు చెప్తే, వారు గ్రంథస్థం చేశారు. దీని అసలు ప్రతి బరోడాలోని రాజకీయ సంస్కృత గ్రంథాలయంలో నేటికీ ఉందంటారు. ఇందులో శకున, సుందర, రుక్మ, త్రిపుర అనే వివిధ రకాలైన విమానాల గురించి భరద్వాజడు పేర్కొన్నారు. ఆ విమానాలను ఎలా రూపొందించాలి, వాటిలో ఎందరు ప్రయాణించగల వీలుంది, అవి ఏఏ ప్రయోజనాలకు పనికివస్తాయి వంటి అనేక విశేషాలున్నాయి.

అందులో ఆయన భూమిపై ప్రయాణానికి వీలైన  339 రకాల వాహనాలు, నీటిపై చరించేందుకు వీలైన 783 రకాల పడవలు, గాలిలో ప్రయాణించడానికి వీలైన 101 రకాల గాలిఓడల గురించి వివరించాడు. ఇవన్నీ మంత్ర, తంత్ర, కృత్రిమ విధానాలతో చేయగలిగినవేనని చెప్పాడు. వీటిలోనే భాగంగా 31 రకాల యుద్ధ విమానాల గురించిన వర్ణనలు చేశాడు. గంధర్వాదులు ఉపయోగించే వాహనాల వివరాలను ఆయన వర్ణించాడని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, తమ సంపాదకత్వంలో వెలువడే 'ఋషిపీఠం' పత్రికలో ప్రచురించారు. ఈ గ్రంథం గురించిన వివరాలు అనేకంగా లభిస్తున్నాయి. కొందరు శాస్త్రజ్ఞులు విమానాల తయారీకి ఈ వివరాలు సరిపోతాయా అని పరిశోధనలు చేశారు. అయితే భరద్వాజుడు ఇచ్చినట్లు చెప్తున్న వివరాలు మనకు కొత్తగా తెలిసిన న్యూటన్‌ భూమ్యాకర్షణ సిద్ధాంతాలకు అనుగుణంగా లేవనీ, గాలికన్నా బరువైన యంత్రాలు ఏవీ గాలిలో ఎగిరే అవకాశాలు లేవని ప్రకటించారు. అయితే భరద్వాజుడు చెప్పిన వివరాలను అవగాహన చేసుకుని, అర్థం చెప్పి, ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టగల సామర్థ్యం నేటి శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ లేదన్నది, ఇంకా రాలేదన్నది కొందరి అభిప్రాయం.

భరద్వాజుని 'అంశుబోధిని'
భరద్వాజుడు గొప్ప శాస్త్రవేత్త అన్నది వివాదరహితంగా ఋజువైన సత్యం. ఆయన రాసిన 'అంశుబోధిని' అనే గ్రంథం బరోడాలోని ఓరియంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భద్రంగా ఉంది. దీనిలోని కొన్ని అధ్యాయాల ఫోటోకాపీలను వారు, వారణాసిలోని సాహ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. వీటిపై అక్కడి శాస్త్రజ్ఞులు విస్తృత పరిశోధనలు చేసి తమ అభిప్రాయాలను 'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ సైన్స్‌'లో ప్రచురించారు.

 వారణాసిలోని సాహ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రజ్ఞులు ప్రకటించిన వివరాల ప్రకారం అంశుబోధిని గ్రంథం మొత్తం 12 అధ్యాయాలతో 1000 విభాగాలతో ఉంది. మొదటి అధ్యాయం 'సృష్ట్యాధికరణం'. ఇది పూర్తిగా సృష్టికి సంబంధించిన అంశాలతో ఉంది. ఇప్పుడు మనం సృష్టికి కారణంగా చెప్పుకుంటున్న 'బిగ్‌ బ్యాంగ్‌ థియరీ'నుంచి మన సౌరకుటుంబంలోని సూర్యుని పుట్టుకవరకు అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇలాగే మిగిలిన అధ్యాయాలలోనూ పలు శాస్త్రాంశాలు ఉన్నాయి.

 'యంత్రసర్వస్వం' గ్రంథంలో వివరించిన అనేక యంత్రాలలో 109వదిగా 'ధ్వాంత ప్రమాపక యంత్రం'ను పేర్కొన్నారు. 'ధ్వాంతం' అనేది వెలుగుగా భావించవచ్చు. 'ధ్వాంత ప్రమాపక యంత్రం' లేదా 'తమ ప్రమాపక యంత్రం' అంటే వెలుగును కొలిచే యంత్రం. ఇది వివిధ రకాల కాంతికిరణాలను కొలిచే యంత్రం. ధ్వాంతం అనేది మూడు భాగాలు (components)గా ఉంటుంది. వీటిని అంధంతమ, గూఢంతమ, తమ అంటారు. ఈ 'తమ' అనేది పోలికలను చెప్పేదిగా గుర్తించాలి. పరిశోధనల ప్రమాణం

 ఈ ధ్వాంత ప్రమాపక యంత్రం గురించి వారణాసిలోని పరిశోధన శాలలో ఎన్‌.జి.డోంగ్రే నిర్వహించి, తన పరిశోధన ఫలితాలను ఆయన Indian Journal of History of Science లో ప్రచురించారు. కాంతి కిరణాలలో భాగమైన అతినీలలోహిత (అల్ట్రావయొలెట్‌ - ultraviolet),

దృష్టి (విజిబుల్‌- visible), పరారుణ(ఇన్‌ఫ్రారెడ్‌- infrared) తరంగాల వర్ణమాల లోని దేన్ని అయినా ఒకదాన్ని ఎంచుకుని దాని తరంగ దైర్ఘ్యాన్ని (వేవ్‌లెంగ్త్‌ - wavelength) కొలవటానికి ఈ యంత్రం పనికి వస్తుంది.

 ఈ పరిశోధన పత్రానికి ముందుమాటగా రాసే అబ్‌స్ట్రాక్ట్‌లో వారు పేర్కొన్న ఒక విశేషాంశం గమనార్హం. వారు అన్నది వారి పదాల్లోనే:

'The instrument can measure wavelength directly with the help of a graduated linear scale, an entirely new technique not prevalent in modern times...'

 భరద్వాజుడు వివరించిన 32 అనుబంధ పరికరాల (ancilliary components)తో కూడుకుని ఉన్న ఈ 'ధ్వాంత ప్రమాపక యంత్రా'న్ని తాము తమ ప్రయోగశాలలో రూపొందించామని ఎన్‌.జి.డోంగ్రే 'Indian Journal of History of Science' వారి 15 ఏప్రిల్‌ 1994 సంచికలో ప్రకటించారు.

కొత్త లోహాల సృష్టికర్త
భరద్వాజ మహర్షి పేర్కొన్న 'ప్రకాశ స్తంభనాభిద లౌహ' అనే ఒక ప్రత్యేక తరహా లోహాన్ని కూడా ఎన్‌.జి.డోంగ్రే, తన సహ పరిశోధకులు, జంషెడ్‌పూర్‌లోని నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబరేటరీకి చెందిన ఎస్‌.కె. పాలవీయ, పి. రామచంద్ర రావులతో కలిసి రూపొందించారు. వీరు తమ పరిశోధన ఫలితాలను Indian Journal of History of Science, Vol. 33(4), 1998, పేజీలు 273-280 లో ప్రచురించారు.

ఈ లోహాన్ని వారు
'A novel non-hygroscopic transparent  material having a range from 5000 to 1400 -cm (2 to 7 mue)' గా వర్ణించారు. 

ఏదీ భరద్వాజ నది?
మన జీవనది  గోదావరికి ఏడు ఉపనదులు ఉన్నాయంటారు. వీటిని 'సప్తగోదావరులు' అని వ్యవహరిస్తారు. రాజమండ్రికి దగ్గరలోని ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి నది ఏడుపాయలుగా చీలిపోయి సముద్రంలో కలుస్తోంది. ఈ ఏడుపాయలను సప్తగోదావరులుగా పేర్కొంటారు. ఆ ఏడుపాయలు ఇవి: 1. వశిష్ట, 2. తుల్య (తుల్యభాగ),  3. ఆత్రేయ, 4. భరద్వాజ, 5. గౌతమి, 6. వృద్ధగౌతమి, 7. కౌశిక (కౌంతేయ). వీటిలో ఒక పాయను 'జమదగ్ని' అని కూడా అంటారు. 

అయితే, ఇవి సప్తర్షులు విభజించిన ఏడు గోదావరి పాయలనీ కొందరు అంటారు. (ఈనాడు ఆదివారం, 3 ఫిబ్రవరి, 2013, పే.3) 

ఈ సప్తగోదావరులలో భరద్వాజ, కౌశిక, జమదగ్ని నదులు ప్రస్తుతం కానరాకపోవడం దురదృష్టం. అన్నట్లు గోదావరి నది ఒడ్డుమీద లేకపోయినా, ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని పుష్కరిణి 'సప్తగోదావరి'గా ప్రసిద్ధి పొందింది. గోదావరిని ద్రాక్షారామానికి అంతర్వాహినిగా ఏడుగురు ఋషులు తెచ్చారు. గనుక దానికి ఆ పేరు వచ్చిందని క్షేత్ర మహాత్మ్యంలో ఉంది.

ఆయుర్వేద విద్య
ఆయుర్వేద విద్యను ఇంద్రునినుంచి అభ్యసించి, మానవాళికి అందజేసిన మహానుభావుడు భరద్వాజుడు. ఒకప్పుడు ఈ లోకం అంతా రుగ్మతల మయంకావటంతో, వైదిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందట. అప్పుడు, అంగిరుడు, జమదగ్ని, వశిష్టుడు, కశ్యపుడు వంటి మహామునులు అంతా సమావేశమై, ధర్మార్థకామమోక్షాలకు ఆరోగ్యమే ప్రధానం కాబట్టి, మానవలోకాన్ని పట్టి పీడిస్తున్న రోగనివారణకు ఇంద్రుడే తగినవాడని, అతనివద్ద వైద్యవిద్యను అభ్యసించి రావలసిందిగా భరద్వాజుని కోరారు. అప్పుడు, భరద్వాజుడు, ఇంద్రలోకానికి వెళ్లి, అక్కడ ఇంద్రునికి అశ్వనీదేవతలు ఉపదేశించిన ఆయుర్వేద విద్యను ఇంద్రునివద్ద అభ్యసించి తిరిగి భూలోకానికి వచ్చాడట. అశ్వనీదేవతలకు బ్రహ్మ ఆయుర్వేదాన్ని బోధించాడు. ఈ ఆయుర్వేదశాస్త్రంలో రోగకారణం, రోగలక్షణం, ఔషధ సేవ అనేవి మూడు ప్రధాన స్కంధాలుగా చెప్తారు. ఇప్పటికీ వైద్యశాస్త్రం పాటించే విధానాలే ఇవి కావటం విశేషం.  

భరద్వాజుడు తానే ఆయుర్వేద ఔషధాలను తయారుచేసి, తాను సేవించి, ఋషులకు ఇచ్చి, ఆయుర్వేదానికి ప్రచారం కల్పించాడంటారు. 'చరక సంహిత' ప్రథమాధ్యాయంలో 'ఆయుర్వేదానికి భరద్వాజుడే కారకుడ'న్న ప్రశస్తి ఉంది. 

భరద్వాజునివద్ద శిష్యరికం చేసిన ఆత్రేయ పునర్వసు ఆయుర్వేద శాస్త్రంలో కాయకల్ప చికిత్సను ప్రవేశపెట్టాడు. అగ్నివేశ, పరాశరాది మునులకు ఈ కాయకల్ప చికిత్సను ఆత్రేయ పునర్వసు నేర్పించాడు. 

వ్యాకరణ విద్య
భరద్వాజుడు గొప్ప వ్యాకరణవేత్త. సామవేదంలో ఉన్న ఋక్‌తంత్రం ప్రకారం బ్రహ్మదేవుడు వ్యాకరణాన్ని బృహస్పతికి నేర్పితే, బృహస్పతి దాన్ని ఇంద్రుడికి నేర్పాడు. ఇంద్రుడు దాన్ని భరద్వాజునికి నేర్పాడు. తాము అనేక వ్యాకరణ విషయాలను భరద్వాజునితో చర్చించినట్లు ప్రముఖ సంస్కృత వయ్యాకరణులైన పాణిని, తైత్తిరీయ, ఋక్‌ ప్రతిసఖ్యలు కూడా పేర్కొన్నారు. వ్యాకరణ శాస్త్రాన్ని కూడా భరద్వాజుడు, ఇంద్రుని దగ్గరే నేర్చుకున్నాడని రామాయణంలోని అయోధ్య కాండ, 54వ సర్గలో ఉంది. అలాగే, ధర్మ శాస్త్రాన్ని భృగు మహర్షి దగ్గర (మహాభారతం, శాంతి పర్వం, 5వ శ్లోకం), పురాణాలను తృణంజయుడి దగ్గర నేర్చుకున్నాడని (వాయుపురాణం, 0-8-63) పేర్కొంటోంది. మహాభారతంలోని శాంతి పర్వం 6వ అధ్యాయం, 21వ శ్లోకంలో విప్రులకు రాజనీతి శాస్త్రాన్ని భరద్వాజుడు నేర్పించాడని    ఉంది. 

మరొకవాదం ప్రకారం - వ్యాకరణాన్ని బ్రహ్మదేవుడు బృహస్పతికి నేర్పితే, బృహస్పతి ఇంద్రునికి నేర్పాడు. ఇంద్రుడు భరద్వాజునికి నేర్పాడు.

నవగ్రహాలలో అందగాడిగా పేరున్న కుజుడు భరద్వాజ స గోత్రంలో జన్మించాడు. కుజునికి మాలిని, సుశీల అని ఇద్దరు భార్యలు.  

భరద్వాజుడు - కులవ్యవస్థ
భరద్వాజ మహర్షి చాతుర్వర్ణ వ్యవస్థగురించి భృంగి మహర్షితో పలు చర్చలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తన దృష్టిలో ఏ వర్ణానికి చెందిన వారిలోనైనా శారీరకపరంగా ఏ వ్యత్యాసమూ లేదని భరద్వాజ స్పష్టం చేయటం విశేషం. 

భరద్వాజుని అంత్యకాలం
వృషతుని కుమారుడైన ద్రుపదుడు సిింహాసనాన్ని అధిరోహించిన కాలానికి భరద్వాజుడు స్వర్గాన్ని చేరినట్లుగా మహాభారతం, ఆదిపర్వం,       44-45 శ్లోకాలలో ఉంది. దీన్నిబట్టి, భరద్వాజుడు సుదీర్ఘకాలం జీవించి  ఉన్నట్లు భావించే వీలుంది. బహుశా భరద్వాజుడు 1000 సంవత్సరాలు జీవించి ఉన్నాడనే అభిప్రాయం ఉంది. ఇంతకాలం జీవించడానికి అనువైన రసాయనాల ప్రసక్తి 'చరకసంహిత'లో ఉందంటారు. అలసట, రోగము, జరాదులకు అతీతంగా దీర్ఘకాలం జీవించగల ఈ రసాయనాన్ని వశిష్ఠ, కశ్యప, జమదగ్ని, పరశురామాదులు సైతం సేవించారని తెలుస్తోంది. 


                                                         *    *    *    *    *

 -----------------------------------------------------------------------
Copyright Reserved