hinduBrahmins

బాల్య సంస్కారాలు

1. గర్భాదానం:
సుసంతాన ఉత్పత్తి, జననంకోసం భార్యాభర్తలు చేసే సంస్కారం ఇది. దీన్నే 'గర్భాలంబనం' అనీ అంటారు. సుసంతాన్ని పొందటం ద్వారా సమాజానికి తమ వంతు సేవ చేయటానికి, తాము తమకున్న మూడు రకాల ఋణాలను (దేవఋణం, ఋషిఋణం, పితౄణం) తీర్చుకోవడానికి దంపతులు ఉమ్మడిగా చేసే సంస్కారం ఇది. సుసంతానప్రాప్తికోసం గర్భాదాన సంస్కారం నియమితమైన మంచి రోజున జరగటం వల్ల దైవబలం కలిసి వస్తుందని భావన. 

2. పుంసవనం :
భార్య గర్భవతి అయిన తర్వాత, రెండవ, మూడవ, లేదా నాలుగవ మాసంలో చేసే సంస్కారం ఇది. 'పుంసవనం' అంటే మగబిడ్డ జననానికి ఆత్రపడటం అర్థం.
ఈ సంస్కారాన్ని సాధారణంగా ఒక 'మగ నక్షత్ర' దినాన జరుపుతారు. ఈ సంస్కార సందర్భంగా గర్భవతి అయిన తన భార్య కుడి ముక్కుపుటంలో ఒక అరటి కాండంలోంచి కారే రసం కొన్ని చుక్కలను భర్త వేస్తాడు. గర్భవతి అయిన స్త్రీకి కలిగిన కొన్ని రకాల ఇబ్బందులనుఅధిగమించడానికి అరటి కాండం రసం మంచిదని శుశ్రుతుడు పేర్కొనటం కూడా ఇక్కడ గుర్తించాలి. 

3. సీమంతోన్నయనం :
గర్భధారణ జరిగిన అయిదునుంచి ఎనిమిది మాసాలలోపు జరిగే సంస్కారం 'సీమంతోన్నయనం'. గర్భం ధరించిన అయిదు మాసాల నాటినుంచి గర్భస్థశిశువు మెదడు పెరుగుదల ఆరంభం కావడమనే విషయాన్ని తెలియజేస్తూ, ఇకపై ఆ గర్భవతి ఆరోగ్యంపై తగు శ్రద్ధ  వహించాల్సిన ఆవశ్యకత ఉందని బంధువులకు గుర్తు చేస్తూ, ఆమె సైతం పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోరుతూ అధిక శారీరక శ్రమ కలిగించే పనులు చేయరాదని గుర్తు చేసే సంస్కారం ఇది. ఇదే సమయంలో గర్భవతి అయిన తన భార్యపై ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండరాదని ఆశిస్తూ, ఈ సంస్కారం సమయంలో తన భార్య కురులను భర్త, ఆమె పాపట వద్ద రెండుగా వేరు చేయడం జరుగుతుంది. అసలు 'సీమంతము' అంటేనే పాపట అని అర్థం. అందుకే, ఈ వేడుకకు 'సీమంతోన్నయనం' అన్న పేరు వచ్చింది. 

'సీమంతం' అనేది తల మీద అయిదు మర్మాలు కలిసే స్థలం అంటారు. 

'పంచ సంధాయశ్శిరసి విభక్త స్సీమంత నామ....' అని శుశ్రుతుడు తన 'ఆయుర్వేద వైద్య సంహిత'లో పేర్కొన్నాడు. ఆధునిక వైద్య పరిభాషలో చెప్పాలంటే, Frontal Suture (one), Parietal Sutures (two, one on either side), Lambdoid Suture (one), Sagittal Suture(one) అక్కడ కలుస్తున్నాయి. ఈ మర్మస్థానంలో గాయం తగిలితే, insanity, fear, intellectual disturbances from trauma రాగల ప్రమాదం ఉందని శుశ్రుతుడు పేర్కొన్నట్టు డా. పాలకోడేటి వెంకట కృష్ణారావుగారు రాసిన ‘Comparative Study of the Marmas’ (Pub.1941)లో వివరించారు. ఈ కోణంలోంచి చూసినా, శిరస్సు మీద సీమంత ప్రాంతాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాన్ని మనం చేసే 'సీమంతోన్నయనం' వేడుక ద్వారా కాబోయే ఆ మాతృమూర్తికి తెలియజేస్తున్నాం అన్నమాట!! కానీ, ఇప్పుడు జరుగుతున్న 'సీమంతం' వేడుకలో ఈ పాపటను భర్త వేరు చేసే వేడుక కానరావడం లేదు. 

పైన పేర్కొన్నవన్నీ '
ప్రసవపూర్వ సంస్కారాలు'గా ప్రసిద్ది పొందాయి. 

4. జాత కర్మ :
గర్భవతి అయిన స్త్రీ ప్రసవ సమయంలో చేసే సంస్కారం ఇది. గర్భవతి అయిన స్త్రీ శరీరం మీద మంత్రోచ్చాటనతో కూడిన జలాన్ని చిలకరిస్తారు. ముఖ్యంగా బొడ్డుతాడు కోయడానికి మునుపు ఇది చేయడం మంచిది. ఈ సమయంలో బిడ్డ తండ్రి తన బిడ్డ ముఖంలోకి చూస్తాడు. ఈ చర్య వల్ల అతను తన పూర్వికుల రుణాన్ని తీర్చినట్టు అవుతుంది. ఆ వెంటనే అతను వెళ్లి తలారా చన్నీళ్ల స్నానం చేయాలి. స్నానానంతరం వచ్చి ఆ బిడ్డ నాలుకకు ఒక బంగారు ఉంగరంతో తేనెను తాకించాలి. దీని ఫలితంగా బిడ్డకు మేధోశక్తి అనంతంగా పెరుగుతుందని విశ్వాసం. తేనెకు గల ఔషధగుణాలు అనేకమని శుశ్రుతుడు చెప్పిన అంశాన్నీ ఇక్కడ పేర్కోవచ్చు. 

5. నామకరణం :
పుట్టిన బిడ్డకు పేరు పెట్టే ఉత్సవం ఇది. బిడ్డ పుట్టిన పది రోజుల తర్వాత  అంటే 11వ రోజున, లేదా 12వ రోజున నామకరణం చేయాలి. ఈ రెండు రోజులు వీలుపడని పక్షంలో 101వ రోజున, లేదా రెండవసంవత్సరం ఆరంభం రోజున పేరు పెట్టటం మంచిది. నామకరణ సమయంలో బిడ్డ తల ఉత్తర దిశగా, కాళ్లు దక్షిణదిశగా ఉండాలి. 

ఈ నామకరణం విషయంలో కొన్ని అంశాలను శాస్త్రాలు నియమాలుగా విధిస్తున్నాయి. మగబిడ్డకు పేరు పెట్టేటప్పుడు సరి సంఖ్యలో అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. బిడ్డకు రెండు అక్షరాలున్న పేరు ఉన్నట్లయితే, భౌతిక ఐశ్వర్యాలు; నాలుగు అక్షరాల పేరైతే, ఆధ్యాత్మిక కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 

ఆడపిల్ల పేరులో చివరన 'ఇ'కారం కానీ, 'ఆ' కారం కానీ ఉంటే మంచిది. పేరుకు వీలయితే మూడు అక్షరాలు ఉంటే మంచిది. మూడు కాకపోయినా బేసి సంఖ్యలో అక్షరాలు ఉండాలి. పేరు వినసొంపుగా, పలికేందుకు తేలికగా ఉండాలి. 

6. నిష్క్రమణం :
పుట్టిన బిడ్డను ఇంటి బయటకు తెచ్చే వేడుక ఇది. బిడ్డ పుట్టిన నాటి నుంచి మూడవ శుక్లపక్షం తృతీయ తిథిన కానీ, లేదా బిడ్డ పుట్టిన నాలుగో నెలలో బిడ్డ పుట్టిన తిథి రోజున కానీ ఈ వేడుకను జరుపుతారు. బిడ్డను ఇంటి బయటకు తెచ్చి, సూర్యుడిని, అదే రోజు రాత్రి చంద్రుడిని చూపించి, తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్లడమే ఈ వేడుక. అయితే, ఇప్పుడు బిడ్డను సమీపంలోని ఒక ఆలయానికి తీసుకు వెళ్లడం ఆనవాయితీ అవుతోంది. 

7. అన్నప్రాసనం :
బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చిన సమయంలో, అంటే బిడ్డకు తల్లిపాలు మాన్పించే దశలో, ఘనాహారాన్ని ముఖ్యంగా అన్నాన్ని తొలిసారిగా పెట్టే సంస్కారం ఇది. మగ బిడ్డకు సరి సంఖ్య నెలలో, ఆడ పిల్లకు బేసి నెలలో అన్నప్రాసనం వేడుకగా చేయడం ఆనవాయితీగా ఉంటోంది. బిడ్డల మీద అపారమైన ప్రేమతో కొందరు తల్లులు బిడ్డకు ఏడాది వరకూ కూడా పాలు ఇస్తుంటారు. ఇది బిడ్డ పోషక అవసరాలకు సరిపోదు సరికదా, తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేసే సంస్కారం ఇది. అయితే, ఇప్పుడు తల్లి వీలైనంత ఎక్కువకాలం బిడ్డకు పాలివ్వటం మంచిది అంటున్నారు.  తమ  కుటుంబ, శారీరక అవసరాలను బట్టి అన్నప్రాసనం చేసే సమయంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఏడాది వయసు దాటక మునుపే, అన్న ప్రాసనం జరగటం అవసరం. ఈ సమయంలోనే వాగ్దేవితో బాటు ఇతర శక్తి దేవతలను ప్రార్థించి బిడ్డకు సకల శక్తులను ప్రసాదించమని కోరటం జరుగుతుంది. 'ప్రాసనము' అంటే వేయుట అనీ,  'అన్నప్రాసనము' అంటే బిడ్డకు తొలిసారి అన్నము పెట్టటం అని అర్థం. 

8. చూడాకరణం :
'చూడ' అంటే తల అని, సిగజుట్టు అని అర్థాలు ఉన్నాయి. ('చూడామణి' అంటే సిగలో పెట్టుకునే మణి, లేదా నగ అన్న పేరు ఈ విధంగా వచ్చిందే. రామాయణంలో - లంకకు హనుమంతుడు వెళ్లినప్పుడు, తన గుర్తుగా సీతకు చూపవలసిందిగా రాముడు తన ముద్రికను ఇవ్వగా, తనను కలిసిన గుర్తుగా రామునికి చూపవలసిందిగా తన చూడామణిని  సీతాదేవి హనుమంతునికి ఇచ్చిందన్నది మనకు తెలుసు). 'శిరోమణి' అన్న పదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అన్నట్టు 'చూడ' అన్న పదంలోంచే 'జడ' అన్న ఇప్పటి మాట పుట్టింది!!

చూడాకరణం అంటే సిగజుట్టును సరి చేయటం అనుకోవచ్చు. దీన్నే 'చౌలము' అని కూడా అంటారు. ఇది ఉపనయన సంస్కారానికి ముందు చేయవలసిన సంస్కారం. ఈ సంస్కారం, మిగిలిన దాదాపు అన్ని సంస్కారాలలాగానే ఆరోగ్యపరమైన కారణాలతో ఆరంభం అయిందని పరిశీలకుల అభిప్రాయం. బిడ్డ తలపైన పెరిగే జుట్టులో అనేక హానికరమైన క్రిములు చేరే ప్రమాదం ఉందనీ, వాటి వల్ల ఆరోగ్యం క్షీణించగలదని గుర్తించి, చూడాకరణ సంస్కారాన్ని ప్రవేశ పెట్టి ఉంటారు. అయితే, లోహయుగం ఆరంభం అయిన తొలినాళ్లలో, బిడ్డ తలమీద కత్తిని పెట్టటంఅనేది తల్లిదండ్రులకు చెప్పలేనంత ఆందోళన కలిగించి ఉంటుంది. తమ బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ జరగరాదని కోరుతూ తల్లిదండ్రులు చేసే ప్రక్రియగా చూడాకరణ సంస్కారం క్రమంగా రూపు దిద్దుకుని ఉంటుంది. ఇదే ఇప్పుడు పుట్టు వెంట్రుకలు తీసే వేడుకగా మార్పు చెందిందనుకోవాలి. 

పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో, తలమీద శిఖలను ఉంచటం పద్దతిగా ఉంటోంది. తమ కుటుంబం ప్రవర అనుసారం మూడు శిఖలను కానీ, అయిదు శిఖలను కానీ ఉంచుతారు. వశిష్ఠ గోత్రానికి చెందిన వారు తల మధ్యలో ఒక శిఖను, అత్రి, కాశ్యప గోత్రాల వారు తలకు రెండు వైపులా రెండు శిఖలను, భృగు గోత్రానికి చెందిన వారు అసలు శిఖలు లేకుండా, ఆంగిరస గోత్రీకులు ఐదు శిఖలను ఉంచుకోవాలని శాస్త్రం. కానీ, ఇప్పుడు శిఖలను ఉంచుకునేవారు ఎవరైనా ఉంటే, వారు కేవలం ఒక శిఖనే ఉంచుకుంటున్నారు. 

తల మధ్య నడినెత్తిన ఒక సిర, ఒక సంధి కలుస్తాయని, ఆ స్థానంలోనే కేశాల దిగువన 'అధిపతి' అనే కీలకస్థానం ఉందని, సున్నితమైన అక్కడ

ఏ దెబ్బ తగిలినా ప్రాణాపాయం తప్పదని శుశ్రుతుడు వివరించారు. కనుక, ఈ అవగాహనతోనే శిఖ ఏర్పాటు జరిగిందని కొందరి అభిప్రాయం.

9. కర్ణవేధ :
ఏ గృహ్యశాస్త్రాలలోనూ నేరుగా 'కర్ణవేధ' గురించిన ప్రస్తావన లేదు. పారస్కర సూత్రాలకు చెందిన పరిశిష్టంలో మాత్రం దీని గురించిన వివరణ ఉంది. అథర్వణ వేదంలోనూ దీని ప్రస్తావన ఉంది. బిడ్డ పుట్టిన 10వ రోజు, లేదా 12వ రోజు లేదా 16వ రోజున 'కర్ణవేధ' సంస్కారం జరపాలని బృహస్పతి అభిప్రాయం. అంత చిన్న వయసులోనే దీన్ని నిర్వహించడం వల్ల బిడ్డకు అంత బాధాకరంగా ఉండదని భావన. అయితే, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కర్ణవేధను బిడ్డకు ఆరు నెలలో కానీ, లేదా ఏడవ నెలలో కానీ చేస్తే మంచిదని శుశ్రుతుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక మంచి రోజున తల్లి ఒడిలో బిడ్డను తూర్పు దిక్కు వైపు చూస్తున్నట్టుగా కూర్చుండబెట్టి, ఆడుకునేందుకు బొమ్మలను ఇచ్చి, కొంచెం ఆడిస్తూ, ముందు కుడి చెవిని, తర్వాత ఎడమ చెవిని కుట్టాలి. చెవి కుట్టిన చోట నూనెతో తడిసిన పత్తిగుడ్డతో ఒత్తాలి. 

పైన పేర్కొన్న సంస్కారాలన్నీ
'బాల్య సంస్కారాలు'గా ప్రసిద్ది పొందాయి. 

10. విద్యారంభం :
ఈ సంస్కారాన్ని పలుపేర్లతో వ్యవహరిస్తారు.  దీన్ని 'విద్యారంభం' అని కొందరు అంటుండగా, మరికొందరు 'అక్షరారంభం' అంటారు. ఇంకొందరు 'అక్షర స్వీకరణ', 'అక్షర లేఖనం',  'అక్షరాభ్యాసం' అంటారు. సంస్కారాలలో అనేకమైనవి సహజమైనవి కాగా, ఇది సంస్కృతీపరమైనదని భావన. గృహ్య సూత్రాలు కానీ, ధర్మసూత్రాలు కానీ, తొలినాటి స్మృతులు కానీ 'విద్యారంభం' సంస్కారం గురించి ఎక్కడా పేర్కోలేదు. దీనికి కారణం అప్పట్లో విద్య అనేది ఏది ఉన్నా అదంతా శ్రుతపూర్వకమైనదే కావటం! అక్షరాలు రూపొందని ఆ కాలంలో లిఖితపూర్వకమైన విద్య గురించి ఎవరికి అవగాహన లేదు. అందుకే, ఈ సంస్కారం బహుశా క్రీస్తు శకం 8వ శతాబ్దం తర్వాతనే మన జీవితాల్లో చోటు చేసుకుందని కొందరి అభిప్రాయం. అయితే, అంతకు మునుపు నుంచి కూడా మన దేశంలో లిఖిత పూర్వకమైన కళలు ఉన్నాయని నిర్ధారితమవడం గమనార్హం.

-----------------------------------------------------------------