hinduBrahmins

-------------------------------------------------------------------------------------

   అత్రి మహర్షి

                       
అంభోజగర్భ హృదయంభోజసంభవు
                                            బంభాదిదైత్యసంస్తః బయితుని
                        సవితాజనానీక ఘనశిరోరత్న మా
                                           యనసూయ జెట్ట పట్టిన గృహస్థు
                        జంద్రదుర్వాసోమునీంద్రదత్తాత్రేయ
                                          ఋషిచంద్రముల గన్న ఋషివతంసు
                       ధర్మశాస్త్రానేక మర్మజ్ఞు, నిర్మల
                                          కర్మరహస్యు సత్కర్మనిరతు

                        బహుతపోధనసంయుతు, నిహతనిఖిల
                        కామరోషాదిశత్రు, దివ్యామలాత్మ
                        తత్త్వమూర్తిని, సప్తర్షి సత్త్వమహితు
                        నత్రిఋషిగొల్తు నెపు డిహాముత్రములకు.

            

                        
'ఆత్రేయ చ నమ స్తుభ్యం సర్వలోక హితైషిణి
                         శుద్ధరూపాయ సత్యగ బ్రహ్మణే మిత తేజసే'
     


    ఆత్రేయస గోత్రీకులకు గోత్రపురుషుడు అత్రి మహర్షి. 'అత్రి' శబ్దంనుంచి ఆవిర్భవించినదే ఆత్రేయ శబ్దం. ఈ గోత్ర ఋషులలో ముద్గల, ఉద్దాలక, శాలంకాయన, ఛాందోగ్య వంటి వారూ ఉన్నారు. 

    'అత్రి' అనే మాటకు 'న, త్రి' అంటే త్రిగుణాలు లేనివాడు అని అర్థం చెప్తారు. త్రిగుణాలు అంటే సత్త్వ తమో రజోగుణాలని గుర్తు చేసుకోవాలి. అలాగే, అత్రి భార్య అయిన అనసూయ అంటే 'న అసూయ' అంటే, అసూయ లేనిది అర్థం. వారి పేర్లే వారి గుణగణాలను మనకు తెలియజేస్తున్నాయి. 

అత్రి మహాముని రూపవిశేషాలు
    అత్రి మహాముని రూపాన్ని వివరిస్తూ ఒక శ్లోకం లభిస్తోంది. అది:


    '
జటినం భస్మదిగ్దంధం సాక్షసూత్రం కమండలం
    వల్క యజిన కౌపీనం శతపత్రం సదానందకం
    సకుశంచోత్తరీయం చ సపత్నీం పూజయేత్‌' 

అన్నది ఈ శ్లోకం. అంటే, తలనిండుగా జటలు (జడలు), ఒంటిమీద బూది, మెడలో రుద్రాక్ష మాల, చేతిలో కమండలం, మరొక చేతిలో కృష్ణాజినం, మొలకు ఒక కౌపీనం (గోచీ), చిరునవ్వులు చిందించే ముఖం, ఒక దండం (ఊతకర్ర)తో ఉండే అత్రి మహామునికి, వారి సతీమణి అయిన అనసూయకు నమస్కారం, అని అర్థం. 

    యజ్ఞోపవీతధారణ ప్రాముఖ్యంగురించి వివరించిన ఋషులలో అత్రి ఒకరు. యజ్ఞోపవీతానికి మూడు ముడులు వేయటం వెనుకగల ప్రాముఖ్యాన్నీ, ఆ మూడు ముడులూ బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు, ఆ ముడులే 'ఓమ్‌' శబ్దంలోని మూడు అక్షరాలు అ,ఉ,మలకు ప్రతీకలనీ అత్రి వివరించాడు.

    ఋగ్వేదంలోని 5వ మండలానికి ద్రష్టగా అత్రి మహామునిని పేర్కొంటారు. ఈ మండలంలో భూమిగురించిన వర్ణన ఉంది.   

    సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాలలో ఒకటి అత్రి. ఉర్సా మేజర్‌ నక్షత్రమండలంలోని ఏడు నక్షత్రాలలో ఇది నాలుగోది. దీనినే 'డెల్టా' అనీ అంటారు.

    అత్రి మహాముని ఆశ్రమం చిత్రకూట పర్వతంలో ఉన్నట్లు అక్కడి స్థలపురాణం చెప్తోంది. ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న చిత్రకూట పర్వతం 25 డిగ్రీలు ఉత్తరంలో ఉంది. అయితే, మరొకచోట, అత్రి ఆశ్రమం ఆలీఘర్‌ ప్రాంతంలో, అత్రావళి పర్వత ప్రాంతంలో ఉన్నట్లుగా ఉంది. అది 28 డిగ్రీల 1 నిమిషం 16 సెకన్లు, 78 డిగ్రీలు 16 నిమిషాలు, 52 సెకన్లుగా ఉంది. ఈ పర్వతశ్రేణి పేరుకూడా 'అత్రావళి' అని ఉండటం గమనించాలి!!

    అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుడు. నవ ప్రజాపతులలో ఒకడు. కర్దమ ప్రజాపతి కుమార్తె, పతివ్రతలలో ఒకరైన అనసూయకు భర్త. అత్రి మహర్షి ఋగ్వేదంలోని 5వ మండలం ద్రష్ట. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. బ్రహ్మవిష్ణుమహేశ్వరుల అవతారాలుగా పేరుగాంచిన ఆ ముగ్గురు: 1. దత్త, 2. దుర్వాసో 3.. సోమ. దత్తుడినే 'దత్తాత్రేయ' అనీ, దుర్వాసో మహామునినే 'కృష్ణాత్రేయ' అనీ, సోముడినే 'చంద్రాత్రేయ' అనీ అంటారు. ఈ సోమేశ్వరుడు స్థాపించినదే 'సోమేశ్వర జ్యోతిర్లింగం'.

    ఈ దంపతులు కన్యాకుమారి వద్దగల 'సుచీంద్ర ఆశ్రమం'లో   ఉండేవారని అంటారు. అయితే, మరికొందరి అభిప్రాయంలో - లక్నో నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో సతీ అనసూయ ఆశ్రమం ఉంది. అదే అత్రి, అనసూయ, వారి ముగ్గురు కుమారులు తపస్సు చేసిన ప్రాంతమని అంటారు. అక్కడే, అనసూయ తపోఫలంవల్ల మందాకిని నది జన్మించిందంటారు. 'మందాకిని' అనేది గంగకుగల అనేక నామధేయాల్లో ఒకటి అన్నది తెలిసిందే!

    అత్రి, అనసూయ దంపతులకు అనేకమంది శిష్యులు ఉండేవారు. వారిలో గండ అనే ఒక శూద్ర మహిళ, పశుసఖ అనే పేరుగల ఆమె భర్త కూడా ఉండేవారు. ఈ మహర్షి దంపతులున్న కన్యాకుమారి వద్ద ఇప్పుడు సుప్రసిద్ధమైన దత్తాత్రేయ ఆలయం ఉంది.       

    అత్రికి చంద్రుడు కుమారుడు కావటం వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మకు మానసపుత్రుడై జన్మించిన అత్రి, తన జీవితానికి పరమార్థం తపస్సేనని భావిస్తూ, నిరంతర తపస్సుకై అడవులకు వెళ్లిపోతాడు. ఆయన తపస్సు అశేషవిశేషమై, ఆయన తపోఫలంగా ఆయన కనులనుంచి ఒక దివ్య తేజస్సు వెలువడుతుంది. ఆ దివ్యతేజం దిగంతాలు దాటి, చివరకు, సముద్రాలలోకి చేరుతుంది. ఈ విషయం బ్రహ్మకు తెలిసి, అక్కడకు వచ్చి, ఆ తేజస్సును తాను తాత్కాలికంగా భరిస్తాననీ, అమృతంకోసం దేవదానవులు క్షీరసాగరమథనం చేస్తున్నప్పుడు, ఆ క్షీరసాగరంనుంచి చంద్రోద్భవం జరుగుతుందనీ తెలియజేస్తాడు. ఆ తర్వాత, అత్రి, అనసూయను వివాహమాడినప్పుడు, వారికి చంద్రుడు కుమారుడై జన్మిస్తాడు.    

    అత్రి అనసూయ దంపతుల ముగ్గురు కుమారులలో చిన్నవాడైన చంద్రుడు తనదైన చంద్రలోకానికి వెళ్లిపోతాడు. రెండవ కుమారుడైన దూర్వాసుడు తపస్సు చేసుకోవడానికి అడవులలోకి వెళ్లిపోతాడు. ఇక, పెద్దవాడైన దత్తాత్రేయుడు మాత్రం తల్లిదండ్రుల సేవకు అంకితమయి, వారి వద్దనే ఉండిపోతాడు. అందుకే, తల్లిదండ్రుల సేవకు దత్తమైన కారణంగా ఆయన 'దత్తుడు' అయ్యాడని అంటారు.

    బ్రహ్మమానస పుత్రుడైన అత్రి మహాముని గురించిన అనేక విశేషాలు, కథలు మనకు రామాయణ, భారతాలవల్ల తెలియవస్తున్నాయి.

అనసూయ బిడ్డలుగా త్రిమూర్తులు
    అత్రి - అనసూయ దంపతులకు త్రిమూర్తులు బిడ్డలు కావటం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి ఈ దంపతులు, ఒక యజ్ఞం చేస్తారు. దీనితో సంతుష్టి చెందిన త్రిమూర్తులు వారిముందు ప్రత్యక్షమవుతారు. 'మీ యజ్ఞానికి మెచ్చాము, ఏదైనా వరం కోరుకో'మని వారు ఆ దంపతులను అడుగుతారు. స్త్రీసహజమైన కోరికతో, అనసూయ అప్పుడు తనకు ఆ త్రిమూర్తులకు తల్లిని కావాలనే కోరిక ఉన్నట్లు చెప్తుంది. ఆవిధంగా జన్మించినవారే దత్త, దుర్వాసో, సోములని ఒక కథ.     
    ఈ కథే మరొక విధంగానూ ఉంది: పరమ పవివ్రతగా పేరొందిన అనసూయ పాతివ్రత్యాన్ని సమస్త లోకాలకూ తెలియజేయాలన్న కోరికతో, త్రిమూర్తులు ముగ్గురూ, ముగ్గురు బ్రాహ్మణుల వేషంలో అత్రి, అనసూయల ఆశ్రమానికి వస్తారు. తమకు బిక్ష వేయమని కోరతారు. ఆమె దానికి సిద్ధపడగానే, తమకు ఒక నియమం ఉందనీ, బిక్ష వేసేవారు నగ్నంగా   ఉంటేనే తాము బిక్షను స్వీకరించగలమనీ చెప్తారు. దానితో ఆమె, వారెవ్వరోతనను పరీక్షించడానికే వచ్చారని గుర్తించి, వెంటనే వారిపై మంత్రజలం చిలకరించి, వారిని పసిపాపలుగా మార్చివేస్తుంది. ఆ పసిపాపలు ముగ్గురి ముందూ ఆమె నగ్నంగా వచ్చి వారికి బిక్షను వేస్తుంది. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన త్రిమూర్తులు ఆమెను క్షమాపణ వేడుకుంటారు. అప్పుడు ఆమె వారికి తిరిగి వారి పూర్వ రూపం కలిగిస్తుంది. ఆమె పాతివ్రత్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే తాము అలా వచ్చామని విన్నవించి, ఆ త్రిమూర్తులు, ఆమెకు ముగ్గురు కుమారులు కలిగేలా వరం ఇస్తారు. అలా జన్మించినవారే దత్తాత్రేయ, దూర్వాస, చంద్రాత్రేయలు.

దత్తాత్రేయుడి కథ 
    'దత్తుడు' అంటే మనకు తెలిసిందే. పెంపుడుకు వచ్చినవాడు అని అర్థం. త్రిమూర్తులు ముగ్గురూ తమను తాము అత్రి-అనసూయ దంపతులకు సమర్పించుకోవటంవల్ల, వారి అవతారంగా జన్మించిన ఆయన వారికి 'దత్తుడు' అయినాడు. అత్రి కుమారుడు గనుక 'ఆత్రేయుడు'. కనుకనే ఆయన 'దత్తాత్రేయుడు' అయినాడు. బ్రహ్మవిష్ణుమహేశ్వరుల అవతారంగా అందరూ ఆయనను కొలుస్తారు. 

దుర్వాసో మహాముని కథ
    అత్రి మహాముని, అనసూయల కుమారుడు దుర్వాసో ముని. జనసామాన్యంలో దుర్వాసుడు, దూర్వాసుడు అన్న వ్యవహారం ఉన్నా, ఈ మహామునిని 'దుర్వాసో మహాముని' అని మాత్రమే వ్యవహరించాలి. ఈయన గురించిన కథలన్నీ ఈయన కోపం గురించినవే. దుర్వాసో మునికి కోపిష్టిగా పేరుంది. ఈయనకు కోపం వస్తే, అవతల ఉన్నవాళ్లు ఏవో శాపాల పాలయ్యారన్నమాటే! అందుకే, ఈయన అంటే అందరూ ఎంతో భయంతో మెలిగేవారు. 

    మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం' నాటకంగా రచించారు. ఇది సుప్రసిద్ధ సంస్కృత నాటకం. ఇందులో ఈయన కోపాగ్నికి గురయిన మహిళగా శకుంతలను చూపిస్తారు. ఆమె ప్రియుడు తన గతాన్ని పూర్తిగా మర్చిపోతాడని శకుంతలకు దుర్వాసో మహాముని శాపం ఇస్తాడు. ఫలితమే, దుష్యంతుడు, తను శకుంతలను గాంధర్వవిధిని వివాహమాడిన సంగతిని మర్చిపోయి, శకుంతల చెప్పిన విషయాన్ని అంగీకరించడు. అప్పుడు శకుంతల, తనకు దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని చూపించి, భర్తకు గతాన్ని గుర్తు చేయగలుగుతుంది.

దూర్వాసో మహాముని శాపం కథ మహాభారతంలో లేదు. ఇది కాళిదాసు కల్పన. 

పృథు మహారాజుకు ప్రశంసలు
    అత్రి, అనసూయలకు బిడ్డలు కలిగిన తర్వాత, వారి పోషణార్థం తగినంత ఆర్థిక స్థోమత లేకపోవటంతో, అనసూయ సూచనలమీద అత్రి, పృథు మహారాజు వద్దకు వెళ్తాడు. ఆసమయంలో పృథు మహారాజు, అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. ఆ యాగం తర్వాత, అశ్వాన్ని వదులుతూ, దానితోకూడా వెడుతున్న తన కుమారుడికి తోడుగా వెళ్లమని అత్రిని పృథు మహారాజు కోరతాడు. వీరు ఇలా వెడుతున్నప్పుడు, పృథు మహారాజు చేసిన అశ్వమేధ యాగం పట్ల అసూయతో, ఇంద్రుడు, ఆ యాగాశ్వాన్ని దొంగలిస్తాడు. ఇంద్రుడు ఇలా తమ యాగాశ్వం దొంగలించటం చూసిన పృథు మహారాజు కుమారుడు, ఇంద్రునిపై యుద్ధం చేయటమా, మానటమా అన్న సంశయంలో పడతాడు. అప్పుడు, యాగాశ్వాన్ని దొంగలించినవాడు ఎవరైనా సంశయించకుండా యుద్ధం చేయాల్సిందేనని అత్రి సలహా ఇస్తాడు. అప్పుడు పృథు మహారాజకుమారుడు వేసిన బాణాలు తగిలి, ఇంద్రుడు గాయాల పాలయి, యాగాశ్వాన్ని వదిలి పారిపోతాడు. అయినా, మళ్లీ ఆ యాగాశ్వాన్ని ఇంద్రుడు దొంగలిస్తాడు. అప్పుడు అత్రి సలహాపై,  పృథు మహారాజకుమారుడు ఇంద్రునితో యుద్ధం చేసి,

తమ యాగాశ్వాన్ని కాపాడుకుంటాడు. ఇలా యాగాశ్వ రక్షణలో తమకు తోడ్పడ్డ అత్రికి పృథు మహారాజు అనేక ధనకనకవస్తువాహనాలను ఇస్తాడు.

అవి స్వీకరిస్తూ, అత్రి, పృథు మహారాజును అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఈ స్తుతులు విన్న గౌతముడు, 'పృథు మహారాజు కేవలం మానవమాత్రుడు, ఆయనను ఇంత ప్రశంసింప అవసరంలేద'ని అభ్యంతరం చెప్తాడు. అత్రి గౌతములు ఇద్దరిమధ్యా ఈ విషయమై వాదోపవాదాలు జరుగుతాయి.

చివరికి ఈ విషయం సనత్కుమారుడి వద్దకు చేరుతుంది. ఆయన 'నా విషుః పృథివీపతిః' అని నానుడి గనుక అత్రి ప్రశంసలు తప్పు కాదని తీర్పు చెప్తాడు.

ఆ మాటలు విన్న పృథు మహారాజు మరింత సంతోషించి, అత్రికి మరిన్ని కానుకలు ఇచ్చి, సత్కరించినట్లుగా మహాభారత అరణ్య పర్వంలోని కథ.


క్షత్రియ చంద్రవంశానికి ఆదిపురుషుడు 
    మన భారత దేశంలో క్షత్రియ వంశాలు ప్రధానంగా సూర్యవంశం, చంద్ర వంశంగా విభజితం అయ్యాయన్నది తెలిసిందే. అత్రి కుమారుడైన సోముడినే చంద్రుడు అనటంకూడా ఉంది. ఈ చంద్రుడి పేరుమీదనే 'చంద్రవంశం' రూపొందింది. ఈ వంశంలో దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, ఆ తర్వాత వారి సంతానమైన కురుపాండవులు   ఉన్నది తెలిసిందే. (కశ్యపుని కుమారుడైన సూర్యుని పేరుమీదుగా సూర్యవంశం రూపొందింది. ఈ వంశంలో దిలీపుడు, రఘు మహారాజు, దశరథుడు, శ్రీరాముడు వంటి వారు ఉన్నారు.)  

రామాయణంలో అత్రి
    శ్రీమద్రామాయణంలో అత్రి మహాముని, వనవాసానికి బయలుదేరిన శ్రీరామునికి దండకారణ్య మార్గాన్ని చూపినట్లుగా ఉంది. అత్రి ఆశ్రమంలో ఉన్న సమయంలో రాముడికి అత్రి తన భార్య అయిన అనసూయను పరిచయం చేస్తూ, 'మహాభాగ తపసి ధర్మచారిణి' అంటాడు. అది అతిసూక్ష్మంగా అనసూయ గుణగణాలను పరిచయం చేస్తుంది.

    శ్రీమద్రామాయణ కాలానికి అత్రి, అనసూయలు చాలా వయసుకు చేరుకుంటారు. అందుకే, సీతాదేవికి అనసూయ ఈవిధంగా కనిపిస్తుంది:
    '
శిథిలం వలితం వృద్ధం జరాపండర మూర్ధజం
    సతతం వేప మనంగినమ్‌ ప్రవతే కడలిం యథా'
 
అంటే, వయోభారంతో కుంగిపోయి, వెంట్రుకలు నెరిసిపోయి, వృద్ధాప్యం స్పష్టంగా కానవస్తూ, ఒక పెద్ద గాలివానలో ఉన్న అరటి చెట్టులా తూలుతూ నడుస్తూ అనసూయ సీతాదేవికి కానవచ్చింది. 

    ఇక, తన భర్తగురించి చెస్తూ, అనసూయ సీతాదేవికి ఇలా చెప్తుంది: 'నాథో విశిష్ఠ పశ్యామి బాంధవాన్‌ విమ్రిశ్యత్యహం' అంటే, భర్తకు మించిన మంచి బంధువు వేరొకరు ఉండరు అని అర్థం. తనకు తన భర్త మంచి బంధువు అని, మంచి స్నేహితుడనీ ఆమె చెప్పినట్లుగా అర్థం చెప్పుకోవాలి.   

ద్రోణుడికి హితోపదేశం
    మహాభారతయుద్ధంలో భీష్ముడి తర్వాత ద్రోణుడు కౌరవ సైన్యాధ్యక్షుడు అయినాడు. వేలమంది సైనికులను ఆయన చంపేశాడు. కురుక్షేత్రంలో మహాభారతయుద్ధం తీవ్రంగా జరుగుతుండటంతో, యుద్ధ్ధక్షేత్రానికి అత్రి, గౌతమ మహామునులు వచ్చారు. ద్రోణుడిచేత యుద్ధం ఎలా మాన్పించాలా అని ఆలోచించారు. అదే సమయంలో కృష్ణుడు, ధర్మరాజుచేత 'అశ్వత్థామ హతః కుంజరః' అనిపించారు. చనిపోయింది అశ్వత్థామ అనే ఒక ఏనుగే అయినా, యుద్ధరంగంలో తన కుమారుడైన అశ్వత్థామ చనిపోయాడని భావించిన ద్రోణుడు అపార దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అప్పుడు అత్రి మహాముని, ద్రోణుడివద్ద చేరి 'ధర్మవిరుద్ధంగా జరిగిన ఈ యుద్ధంలో నువ్వు అనేక తప్పులు చేశావు. అమాయకులైన సైనికులమీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశావు. అపారమైన విద్యావంతుడివైన నువ్వు ఇకనైనా ఈ హింసాకాండకు స్వస్తి చెప్పి, లోకహితార్థం కృషి చెయ్యి' అంటూ హితబోధ చేసి, యుద్ధరంగంనుంచి ద్రోణుడిని విరమింపజేశాడు. ఆపైన ద్రోణుడు, యుద్ధం మాని, యుద్ధరంగంనుంచి బయటకు వచ్చి, తపస్సు చేస్తూనే కాలం చేశాడు. 

ఇంద్రభోగలాలస
    అత్రి మహామునిగురించి ఒక చిత్రమైన కథ కూడా ఉంది. పరమ తపోధనుడైన అయిన ఆయన ఒకసారి ఇంద్రలోకానికి వెళ్లాడు. అక్కడ ఇంద్రుడు అనుభవిస్తున్న సమస్తభోగాలను చూసి, అత్రి ఆ భోగాలపట్ల ఆశపడ్డాడు. అంతటి ఇంద్రభోగం తనకూ కావాలని ఆశిస్తూ, విశ్వకర్మను పిలిపించాడు.

అత్రి మహాముని కోరిక మేరకు విశ్వకర్మ, అత్రిమహామునికి ఒక కొత్త ఇంద్రలోకాన్ని సృష్టించి ఇచ్చాడు. అందులో, అత్రి సర్వసుఖాలనూ అనుభవిస్తుండగా

ఆ విషయం తెలిసి, రాక్షసులు ఆ కొత్త ఇంద్రలోకంమీదకు దాడి చేస్తారు. ఆ దాడిలో అది సర్వనాశనం అయింది. అదే  సమయంలో అత్రి మహామునికూడా తీవ్రంగా గాయపడ్డాడు. తనకు సంప్రాప్తించిన కష్టానికి అత్రి ఎంతో చింతించాడు. తనకు ఈ దురాశ ఎందుకు కలిగిందా అని బాధపడుతూ, అత్రి మహాముని తిరిగి విశ్వకర్మను పిలిపించాడు. తనకు ఇంద్రలోకం అవసరం లేదనీ, గతంలో తనకు ఉన్న తపోవనం చాలనీ వివరించటంతో, విశ్వకర్మ తిరిగి అత్రికి ఆయన తపోవనాన్ని సిద్ధం చేసి ఇస్తాడు. అత్రి తిరిగి తన పవిత్ర తపః కార్యక్రమాలలో మునిగిపోతాడు. 

శైబ్యుని యజ్ఞం కథ 
    శిబి మహారాజు దానగుణం గురించి మనకు తెలుసు. శిబి కుమారుడు శైబ్యుడు. ఆయన రాజుగా పరిపాలన సాగిస్తున్న కాలంలో ఘోరమైన కరవు విపత్తు వచ్చిపడింది. అప్పుడు శైబ్యుడు, ఒక యజ్ఞం చేసి, యజ్ఞంలో దక్షిణగా తన కుమారుడిని అర్పిస్తాడు. దీనికి తోడు తనకున్న రాజ్యాన్ని, సకల సంపదలనూ అత్రి మహామునికి ఇస్తానంటాడు. అయితే, తాను అడవులలో తపస్సు చేసుకునే ముని కనుక, తనకు ఏమీ తీసుకునే అవకాశం ఉండదని, అవసరం లేదని వివరిస్తూ, శైబ్యుడు ఇవ్వజూపిన దానాన్ని తిరస్కరిస్తాడు. దీనితో శైబ్యుడు ఆగ్రహిస్తాడు. మరొక యజ్ఞం చేస్తాడు. అప్పుడు, ఆ యజ్ఞగుండంలోంచి 'యాతుధని' అనే రాక్షసి జన్మిస్తుంది. ఆ రాక్షసి, సప్త ఋషులనూ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక కృత్రిమ సరస్సును రూపొందిస్తుంది. అక్కడ పెరిగిన తామర పువ్వులను చూసి ముచ్చటపడిన సప్త ఋషులు, ఆ తామర పువ్వులకై ఆ సరస్సుకు వస్తారు. వచ్చినవారెవ్వరో తెలుసుకునేందుకు ఆ రాక్షసి

వారి పరిచయం అడుగుతుంది. వారు తామెవ్వరో చెప్పగానే విని, ఆ రాక్షసి వారిని మట్టు పెట్టేందుకు యత్నిస్తుంది. ఈలోగా సప్తర్షులు ఆ సరస్సులో

తామర తూడులను కోసి, పక్కన పెడతారు. ఇవి చూసి ముచ్చట పడిన దేవేంద్రుడు, వాటిని దొంగలించి ఇంద్రలోకానికి తీసుకెళ్లిపోతాడు. ఈ విషయం తెలిసిన సప్తర్షులు, దేవేంద్రుని మీద ఆగ్రహం చూపక, దొంగతనం చేసిన దేవేంద్రుడిమీద జాలి పడతారు. దానితో, దేవేంద్రుడు తన తప్పు తెలుసుకుని, వెంటనే వారిని క్షమాపణ కోరి, వారిని ఇంద్రలోకానికి ఆహ్వానించి, అక్కడ వారిని తగు విధంగా సత్కరిస్తాడు. ఇది తెలిసిన శైబ్యుడు, తన తప్పు గుర్తించి, సప్తర్షులను క్షమాబిక్ష కోరతాడు. 

భక్త అంబరీషుని కథ
    దుర్వాసో మహాముని కోపానికి గురయిన వారిలో అంబరీషుడు ఒకడు. అంబరీషుని కథ శ్రీమద్భాగవతంలో ఉంది. 

    అంబరీషుడు విష్ణుభక్తుడు. ఒక యజ్ఞం చేసి, విష్ణు కృపను వరంగా పొందుతాడు. విష్ణువు అంబరీషునికి తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. తర్వాత కొంతకాలానికి, అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని చేపడతాడు. ఏకాదశి దినాన ఉపవాసం ఆరంభించి, ద్వాదశి దినాన ఉపవాస దీక్ష విరమించాలి. అదీ ద్వాదశి వ్రతం. ద్వాదశి ఘడియలు సమీపిస్తున్నప్పుడు అంబరీషుని వద్దకు దుర్వాసో ముని వస్తాడు. దుర్వాసో మునికి సకల లాంఛనాలతో స్వాగతం పలికిన అంబరీషుడు, దుర్వాసో మునిని అతిథిగా నియంత్రిస్తాడు.  దానికి దుర్వాసో ముని అంగీకరించి, తాను నదీతీరాన స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత, అంబరీషుడు ఎంతసేపు ఎదురుచూసినా, ఆయన జాడ అయినా కానరాదు. ఇతర అతిథులకు ఆలస్యం అవుతోందన్న భావనతో, అంబరీషుడు తులసీదళంతో రవ్వంత తీర్థం పుచ్చుకుంటాడు. అంతలో దుర్వాసో ముని రానే వస్తాడు. తను వస్తానని చెప్పినా, తనపట్ల గౌరవం లేకుండా వ్రతసమాప్తి చేసి, తులసితీర్థం తీసుకున్న అంబరీషుడు అంటే ఆగ్రహం పట్టలే, తన జటలోంచి ఒక పాయను తీసి, దాన్ని ఒక రాక్షసుడిగా సృష్టించి, అంబరీషుడిపైకి ప్రయోగిస్తాడు. ఇది గుర్తించిన సుదర్శన చక్రం, ఆ రాక్షసుడిని అడ్డుకుని, తర్వాత ఆ రాక్షసుడిని చంపేసి, దుర్వాసో ముని మీదకు కదులుతుంది. అది చూసిన దుర్వాసో ముని భయంతో బ్రహ్మలోకం చేరి, తనను సుదర్శన చక్రంనుంచి రక్షించమని కోరతాడు. అది తనవల్ల కాదని బ్రహ్మ స్పష్టం చేస్తాడు. దుర్వాసో మహాముని వెంటనే శివుడిని శరణు అడుగుతాడు. కానీ, అది విష్ణువు ప్రసాదించిన చక్రమని, కనుక దాన్ని ఎదుర్కోవటం తనవల్ల కాదనీ చెప్తాడు. దానితో ఆయన వెంటనే విష్ణులోకానికి పయనమయి, వెళ్లి విష్ణుమూర్తిని తనను రక్షించమని కోరతాడు. కానీ, విష్ణువుకన్నా విష్ణుభక్తుల శక్తి అధికమని, కనుక, వెళ్లి అంబరీషుడినే శరణు కోరమని చెప్తాడు. అప్పుడు దుర్వాసో ముని అంబరీషుని చేరి, తన కోపం పట్ల విచారం వ్యక్తం చేసి, క్షమించమని కోరతాడు. అంబరీషుడు సైతం వెంటనే విష్ణువును ప్రార్థించి, సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని కోరి, దుర్వాసో మునిని పూజించి పంపుతాడు. 'తన కోపమే తన శత్రువు' అన్న సామెతకు ఇది చక్కనైన ఉదాహరణగా చెప్పచ్చు. 

కుంతికి వరప్రసాదం
    మహాభారతంలో పాండవుల జననానికి కారణమయ్యే అధ్యాయంలో దుర్వాసో మునికి పాత్ర ఉంది. ఒకసారి ఆయన కుంతిభోజ మహారాజు వద్దకు వస్తాడు. అప్పుడు ఆయన సేవల నిమిత్తం కుంతిభోజుడు తన కుమార్తె అయిన కుంతిని నియమిస్తాడు. ఆమె భక్తిశ్రద్ధలతో దుర్వాసోమునిని సేవిస్తుంది. ఆ సేవలకు సంతోషించిన ఆయన, తను వెళ్లిపోయే సమయంలో ఒక కోరికను ప్రసాదిస్తాడు. తను కోరిన సమయంలో ఏ దేవుడైనా ఆమెను సంతుష్టిపరిచే వరం అది. ఆ వరాన్ని పరీక్షించగోరి ఆమె, సూర్యుడితో కర్ణుడిని సంతానంగా పొందుతుంది. ఆవరంతోనే ఆమె, రోగిష్టి అయిన భర్తవల్ల సంతానప్రాప్తి కలగటంలేదనీ, దానివల్ల పాండవ వంశం వారసులు లేకుండా పోతుందనీ భావిస్తూ, యమధర్మరాజును ప్రార్థించి ధర్మరాజును, వాయుదేవుడిని కోరి భీముడిని, ఇంద్రుడిని చేరి అర్జునుడిని పొందుతుంది. ఇదే మంత్రాన్ని తన సవతి అయిన మాద్రికి చెప్పి, అశ్వనీదేవతల ద్వారా ఆమెకు నకులసహదేవులు జన్మించేలా చేస్తుంది. పాండవుల జననం వెనుక ఈవిధంగా దుర్వాసోముని పాత్ర ఉందనుకోవాలి. 

అక్షయపాత్ర కథ 
    మహాభారతం, వనవాస పర్వంలో పాండవుల అరణ్యవాస కాలంలో, దుర్వాసో మహాముని తన తీర్థయాత్రలో భాగంగా తిరుగుతూ, పాండవులు ఉన్న ప్రాంతానికి తన శిష్యబృందంతో చేరతాడు. పాండవుల దగ్గర, వారి ఆహార అవసరాలకై సూర్యుడు ప్రసాదించిన ఒక అక్షయపాత్ర ఉంటుంది. అందరికీ ఆహారాన్ని అందించిన తర్వాత, ద్రౌపది తను భుజించి, అక్షయపాత్రను కడిగి, పూజించి ఒక పూజావేదికమీద పవిత్రంగా ఉంచుతుంది. ఇంక ఆ రోజుకు అది ఆహారాన్ని ఇవ్వదు. ఆ రోజుకూడా అలాగే, ద్రౌపది తను భుజించి, అక్షయపాత్రను కడిగి పక్కన ఉంచుతుంది. ఆ సమయానికి దుర్వాసో మహాముని అక్కడికి వస్తాడు. ఆయనను చూసి, పాండవులు చాలా ఆందోళనకు లోనవుతారు. తాము ఆ మునిగణానికి ఆహారం అందించలేకపోతే, ఆయన కోపించి ఏం శాపం ఇస్తాడోనని వారు భయపడతారు. అప్పుడు తమను రక్షించమని ద్రౌపది, శ్రీకృష్ణుని కోరుతుంది. శ్రీకృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై, ద్రౌపదిని తనకు ఆకలిగా ఉందని అంటాడు. ద్రౌపది తను అక్షయపాత్రను కడిగేశానని చెప్తుంది. అయినా, ఒక్కసారి తనకు ఆ అక్షయపాత్రను చూపమని అడుగుతాడు. ద్రౌపది అక్షయపాత్రను తీసుకువచ్చిన వెంటనే, శ్రీకృష్ణుడు దాన్ని చూసి, అందులో ఉన్న ఒక్క మెతుకును తీసి తన నోట వేసుకుంటాడు. ఆ ఒక్క మెతుకుతో తన ఆకలి తీరిందని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు భగవంతుడు గనుక, ఆయన ఆకలి తీరటంతో సకల చరాచరుల ఆకలీ తీరుతుంది. కనుక, నదీతీరాన స్నానం చేస్తున్న దుర్వాసో మహామునికి, ఆయన శిష్యగణానికీ ఆకలి తీరినట్లవుతుంది, లెక్కలేనన్ని త్రేన్పులు కూడా వస్తాయి. తాము ఇప్పుడు పాండవుల వద్దకు వెడితే, వారు తమను ఆహారం భుజించమని బలవంతపెడితే, తాము ఏమీ తినలేమని భావిస్తూ, అక్కడినుంచి పాండవులను మనసారా ఆశీర్వదించి, అట్నుంచి అటే వెళ్లిపోతారు. 

పతంజలి కథ 
    అత్రి-అనసూయల మూడవ కుమారుడే చంద్రాత్రేయుడు.
    చంద్రాత్రేయుడే సుప్రసిద్ధ వయ్యాకరణుడు (వ్యాకరణ పండితుడు), యోగశాస్త్రకారుడు అయిన పతంజలి అనికూడా కొందరు అంటారు. ఆయనే 'పతంజలి యోగశాస్త్రం' రూపకర్త. పాణిని రచించిన 'అష్టాధ్యాయి'కి వ్యాఖ్యానం చెప్పినవాడుగా కూడా పతంజలి సుప్రసిద్ధుడు. వర్గాల ఆధారంగా పదానికీ, అర్థానికీ మధ్యగల సంబంధాలను వివరించే 'మహాభాష్యం' ఈనాటికీ సంస్కృతంలో భాషాశాస్త్రానికి మూలస్థంభమై నిలుస్తోంది. ఈ 'మహాభాష్య' కర్తకూడా పతంజలే!దేవాలయ నిర్మాణ సూచిక 'అత్రి సంహిత'


 దేవాలయాల నిర్మాణం
    దేవాలయాల నిర్మాణం ఎలా జరగాలో, దేవతలకు పూజలు ఏవిధంగా చేయాలో వివరించేది 'అత్రిసంహిత'. దీని కర్త అత్రి మహాముని.

    'అత్రిసంహిత' మొత్తం ఆరు అధ్యాయాలుగా ఉంటుంది. అవి :
1. కర్మ, 2. ప్రతిష్ఠ, 3. పూజన, 4. స్నపన, 5. ఉత్సవ, 6. ప్రాయశ్చిత్తం. 
    మొదటి అధ్యాయమైన 'కర్మ'లో - దేవాలయ నిర్మాణానికి తగిన స్థలపరిశీలనం, దేవాయతన రూపం, దైవప్రతిమా నిరూపణ వంటి అంశాలు ఉంటాయి. 
    రెండవ అధ్యాయమైన 'ప్రతిష్ఠ'లో - ప్రధాన, పరివార దేవతాగణాల ప్రతిష్ఠకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
    మూడవ అధ్యాయమైన 'పూజనం'లో - ఆయా దేవతల పూజలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. 
    నాల్గవ అధ్యాయమైన 'స్నపనం'లో - ప్రతిష్ఠితమైన దేవతలకు మహాభిషేక వివరణం ఉంటుంది.  
    ఐదవ అధ్యాయమైన 'ఉత్సవం'లో - నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, ప్రత్యేకోత్సవాల వివరాలు ఉంటాయి. 
    చివరిదైన ఆరవ అధ్యాయం 'ప్రాయశ్చిత్తం'లో - పై అధ్యాయాల అనుసరణ విధానంలో ఏవైనా పొరబాట్లు జరిగిన పక్షంలో వాటికి ప్రాయశ్చిత్తం ఎలా జరుపుకోవాలనే వివరాలు ఉంటాయి.


'అత్రి స్మృతి'-  'ఆత్రేయ ధర్మశాస్త్రం'
    అత్రి మహర్షి మానవాళికి అందించిన మరొక గ్రంథం 'అత్రి స్మృతి'. దీన్నే 'ఆత్రేయ ధర్మశాస్త్రం' అనీ అంటారు. ఇది తొమ్మిది అధ్యాయాల గ్రంథం. కుటుంబబాంధవ్యాల విషయాలు, పుత్రులు, దత్తపుత్రులు, యోగ యోగాంగాలు వంటి అనేక విషయాలు ఇందులో చర్చనీయాంశాలు. 

    అయితే, అత్రిస్మృతి రెండు వేర్వేరు భాగాలుగా, రెండు వేర్వేరు పేర్లతోనూ కానరావటం విశేషం. 'లఘు అత్రిస్మృతి' అనేది ఒకటి కాగా, 'వృద్ధాత్రేయస్మృతి' అనేది మరొకటి.   

                                                                                            *     *     *     *     *

-----------------------------------------------------------------------

Copyright Reserved