hinduBrahmins

--------------------------------------------------------------------------------------ఆంగిరసుడు
    ఋగ్వేదంలో 'అంగిరస్‌' అనే మాట దాదాపు అరవైసార్లు ప్రయోగింపబడింది. దీంట్లో దాదాపు నలభైసార్ల వరకు ఆ పదం బహువచనంలోనే వుంది. అంగిరసులు అనే పదం (గుర్తించండి, ఆంగీరసులు కాదు.) ఒక పూర్తి సూక్తంలో కేవలం ఒక సముదాయంగానే వ్యవహరింపబడింది. అంగిరసులు స్వర్గం పుత్రులు. అంటే దేవతల పుత్రులైన ఋషులు. వీరికి 'అంగిరా' మూలపురుషుడు అని కూడా ఋగ్వేదం (10.62.5)లో ఉంది. ఆయన వారసులైన ఆంగిరసులు అగ్నిని కనిపెట్టారని ఋగ్వేదం (5.11.6)లో ఉంది. అసలు అగ్నియే తొలి అంగిరసుడు అని కూడా ఋగ్వేదం (త్వమగ్నే ప్రధమో అంగిరా, 1.31.1)లో ఉంది. అయితే, అంగీరసుని వారసుడు అగ్ని అని ఋగ్వేదంలో మరోచోట (1-1) ఉందనీ అంటారు. అంగీరసుడే మన దేశంలో అగ్నిని దేవునిగా కొలిచే పద్ధతికి ఆద్యుడు అంటారు. దీనికి ఆయనకు భృగువు సహాయపడ్డాడని మరొక అభిప్రాయం కూడా ఉంది. 

'వల' అనే ఒక రాక్షసుడు లేదా 'పనిస్‌' అనే రాక్షసుల సముదాయంచేత అపహరింపబడిన గోవులను ఇంద్రుడు రక్షించి, ఆ గోవులను అంగీరసునికి కానుకగా ఇచ్చాడని ఋగ్వేదంలోని 3-3-1, 10-108, 8-14 లలో పేర్కొనటం జరిగింది. 

    ఇంకొక అభిప్రాయం ప్రకారం, అంగిరసులు దేవతలకు, మనుష్యులకు మధ్య స్థాయిలో ఉన్న ఒక ఉన్నత సముదాయం. వారు స్వర్గానికీ, భూమికీ మధ్య దూతగా వర్ణింపబడిన అగ్నికి అనుయాయులని, వారిని పురోహితులుగా భావించడం ఆ తర్వాత కాలంలో వచ్చిన పరిణామం అనిచెప్పే అవకాశం ఉందని సుప్రసిద్ధ సంస్కృత విద్వాంసులు, అన్నామలై విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర ఆచార్యులు పి.యస్‌.సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానిస్తారు.

చిత్రం ఏమిటంటే, 'ఆంగీరసుడు' అనే మాటకు 'అంగిరుని కుమారులు', 'ఆంగిరసులు' అని మాత్రమే అర్థం లభిస్తోంది. ఆంగిరసుడు అంటే అంగిరుని కుమారుడు బృహస్పతి అన్న అర్థం ఉంది. మరి బృహస్పతే ఈ అంగీరసుడు కావచ్చునేమో తెలియటం లేదు. అంగిరుడు వేరే అయి   ఉంటే, ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. మొదటి మన్వంతరంలోని సప్తఋషులలో ఒడు. (మిగిలినవారు: మరీచి, అత్రి, పులహుడు, క్రతు, పులస్త్య, వశిష్టుడు). ఆయన సతీమణి పేరు సురూప. వీరికి ముగ్గురు కుమారులు. వారు: ఉతథ్య, సంవర్తన, బృహస్పతి. అయితే మరికొన్నిచోట్ల, అంగీరసుని భార్య స్వాధ, స్మృతి, సతి, శ్రద్ధ అని కూడా ఉంది. ఈ నాలుగూ ఒక్కరి పేర్లో కాకుంటే వారు నలుగురో తెలియటం లేదు.

ఆంగిరసుడి పేరు విషయమై కొంత సందిగ్ధత ఉందంటారు డబ్ల్యు.జె.విల్కిన్స్‌, తన 'హిందూ మైథాలజీ' అనే పుస్తకంలో (పే.370). అగ్ని అనే మూలం నుంచి వచ్చిన ఈ మాటను క్రియగా కూడా  ఉపయోగించడం కనిపిస్తుంది. ఇదే పదాన్ని అగ్ని తండ్రికి కూడా ఉపయోగించడం విశేషం. అగ్ని కుమార్తె అయిన ఆగ్నేయ కుమారుడికి కూడా అంగిరసుడనే పేరే ఉంది.

ఈ పుస్తకంలో 'అంగీరసుడు', 'ఆంగిరసుడు', 'ఆంగీరసుడు' అనే పదాలు అన్నీ సమానార్థకాలుగానే వాడటం జరుగుతోంది. 

    వేదాల్లో అగ్నినే ఆంగీరసుడుగా కొన్నిచోట్ల (ఋగ్వేదం 1.1, 3.31, 10.108) పేర్కొన్నారు. భరద్వాజుడు దర్శించినట్లు చెప్పే ఋగ్వేదంలోని ఆరవ మండలం పూర్తిగా  ఆంగిరసులకే కేటాయించబడింది. బౌద్ధ గ్రంథాల్లో ఆంగిరసుని ప్రసక్తి వుంది. అలాగే గౌతముని ప్రసక్తికూడా!

ఆంగిరసుని కథ
    'ముండకోపనిషత్‌'లో ఆంగిరసుని గురించిన కథ ఒకటి ఉంది. దాని ప్రకారం శౌనకుడనే ఒక గృహస్థు అడవినుంచి కట్టెలు తెచ్చుకుంటూ, తనకు కలిగిన ఒక ధర్మసందేహాన్ని తీర్చుకునేందుకు ఆంగిరసుడు ఉండే అటవీ ప్రాంతానికి వస్తాడు. తనకు విశ్వాన్ని తెలుసుకోగల జ్ఞానం కావాలని అడుగుతాడు. దానికి ఆంగిరసుడు, జ్ఞానం రెండు రకాలని వివరిస్తాడు. శాస్త్రం, వేదాలు, కర్మలు, వ్యాకరణం, జ్యోతిషం వంటి ఐహిక విద్యలుగల సాధారణ జ్ఞానం ఒకటైతే, అనశ్వరమైన విషయాలను గురించిన అసాధారణ జ్ఞానం ఇంకొకటి. ఇవే 'పర', 'అపర' విద్యలుగా పేరొందాయి. 

    ఈ సందర్భంలో ఆంగిరసుడు, శౌనకుడికి ఒక కథó చెప్తాడు. మన మనసు ఒక చెట్టువంటిది అనుకోవచ్చు. ఆ చెట్టుమీద రెండు పక్షులు ఉన్నాయి.

ఒక పక్షి చెట్టులోని పైభాగంలో ఉండగా రెండోది చెట్టులోని దిగువ భాగంలో ఉంది. దిగువభాగంలో ఉన్న పక్షి అక్కడున్న అన్ని రకాల రుచులున్న ఫలాలను తిన్నా కానీ, దానికి ఏదో చెప్పలేని దిగులు ఉండేది. కానీ చెట్టు పైభాగంలోని పక్షి మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. తను దిగులుగా ఉండడానికి, పైన పక్షి ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటో దిగువనున్న పక్షికి అర్ధమయ్యేది కాదు. చివరికి ఒకరోజు దిగువనున్న పక్షి పైకి వెళ్లి చూసింది. ఆశ్చర్యంగా అక్కడ ఉన్నదీ తనేనని గుర్తించింది. అయితే దిగువనున్నది తన అహం అయితే పైన ఉన్నది తన ఆత్మ అని గుర్తించింది. అహం నశించేది కాగా ఆత్మ అనశ్వరమైనదనీ, శాశ్వతమైనదనీ అది అప్పుడు గుర్తించిందని ఆంగిరసుడు శౌనకునికి వివరించాడని ఆ కథనం. 

నారద సంతానమా ఆంగిరసుడు?
    'అంగీరస' ప్రసక్తి మనకు ప్రభవాది అరవై సంవత్సరాల పేర్లలో ఆరవదిగా వస్తుంది. ఒక సందర్భంలో త్రిలోక సంచారి అయిన నారదుడు, శ్రీకృష్ణుడిని చూసి వెక్కిరింతగా 'నీకు ఎనిమిదిమంది భార్యలు. వీరు చాలరన్నట్టు నీచుట్టూ పదహారువేలమంది గోపికలు. నీకు ఇంతటి స్త్రీలోలత్వం ఏమిటి? ఈ సంసారజంజాటాలు ఏమిటి?' అని అన్నాడట. ఇది విన్న శ్రీకృష్ణుడు నారదునికి తగిన గుణపాఠం నేర్పాలన్న కాంక్షతో, నారదునికి తానే ఒక స్త్రీగా కనిపించి, నారదుడిని మాయలో పడేస్తాడు. ఫలితంగా నారదుడు ఆమెను పెళ్లాడవలసి వస్తుంది. ఈ దాంపత్యబంధం కారణంగా వీరికి 60 మంది పిల్లలు పుడతారు. వీరికి ప్రభవ, విభవ అంటూ 60 పేర్లు పెడతారు. ఈ నారదసంతానం పేరుమీదగానే మనకున్న 60 తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని అంటారు. (ఈ గాధ ఆధారంగానే అక్కినేని నాగేశ్వరరావు, జమున ప్రధానపాత్రధారులుగా 'శ్రీకృష్ణమాయ' చిత్రం నిర్మితమయింది.)

    ఆంగిరసుని గురించి విష్ణుపురాణంలో మరికొన్ని అంశాలు ఉన్నాయి. వీటి ప్రకారం ఆంగిరసుడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. భూమిపై మానవులను సృష్టించాలని బ్రహ్మ భావించినపుడు, ఆ పనిని త్వరితంగా పూర్తి చేయడానికి తనకున్న అధికారాలలో కొన్నిటిని బదలాయిస్తూ, అచ్చం తన వంటివారినే తొమ్మిదిమంది బ్రహ్మలను సృష్టించాడు. భృగు, పులస్త్య, పులహ, క్రతు, ఆంగిరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్టులనే వారే ఈ నవబ్రహ్మలు. అయితే వీరు ఏడుగురేనని మహాభారతంలో ఉంది. ఆ ఏడుగురూ సప్తర్షులుగా, వారు ఆకాశంలోని సప్తర్షి మండలంలో దర్శనం ఇస్తారనీ ఉంది. వీరినే 'ప్రజాపతులు', 'బ్రహ్మపుత్రులు', 'బ్రాహ్మణులు' అనీ అంటారు.

    ఋగ్వేదంలో అనేక ఋక్కులకు కర్త ఆంగిరసుడు. ఈయన మొదట స్మృతిని వివాహమాడాడు. వారికి నలుగురు కుమార్తెలు కలిగారు. తర్వాత ఆయన దక్షుని కుమార్తెలే అయిన స్వాద్ధను, సతిని వివాహమాడాడు. ఈయన కుమార్తెలని చెప్పబడుతున్న 'ప్రత్యాంగీరస రిచలు' వాస్తవానికి అధిదేవతలకు ప్రశంసలైన

35 ఋక్కులు అంటారని విల్కిన్స్‌ (హిందూ మైధాలజీ, పే 370) వివరిస్తున్నారు.

ఆంగిరసుడు బ్రహ్మమానస పుత్రిక అయిన శతరూపను వివాహమాడాడని మరో ఐతిహ్యం ఉంది. ఈ శతరూప గురించిన మరోకథా ఉంది. తన సృష్టికర్మలో భాగంగా బ్రహ్మదేవుడు ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె అపురూప సౌందర్యవతి. ఆ అందాన్ని చూసిన బ్రహ్మదేవుడు సైతం మనసు ఆపుకోలేక, ఆమెను కామించాడు. తనను సృష్టించిన వాడు తనకు తండ్రి కాబట్టి, ఆ తండ్రి వికారపు చేష్టలను భరించలేక, శతరూప, అటూఇటూ పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. అయినా, బ్రహ్మదేవుడు ఆమె ఎటు కదిలితే, అటు చూడడానికి వీలుగా, మరిన్ని తలలను తనకు మొలిపించుకోసాగాడు. ఇది చూసిన పరమశివుడు, కోపంతో, ఇంతటి చిత్తచాంచల్యం ఉన్న బ్రహ్మకు పూజార్హత ఉండరాదనీ, ఇలలో ఎక్కడా బ్రహ్మకు ఆలయం ఉండరాదనీ శపిస్తాడు. ఈ కథ మనకు 'శ్రీ వేంకటేశ్వర కల్యాణం' ఇతివృత్తంలోనూ కనిపిస్తుంది. ఈ శతరూప, ఆంగిరసుల కుమార్తె ప్రసుతి. ఈమె కుమార్తె స్మృతి అని ఈ ఐతిహ్యం పేర్కొంటోంది. ఇదే ఐతిహ్యాన్ని కొనసాగిస్తే, స్మృతి- ఆంగిరసులకు 5 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలు 1. సిని, 2. వాలి, 3. కుహు, 4. రాకా, 5. అనుమతి కాగా, కుమారుడు బృహస్పతి అని

ఈ కథ.  

ఆంగిరసునికి తొమ్మిదిమంది కుమారులు, ఎనిమిదిమంది కుమార్తెలు అని డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు వివరించారు. వారు: బృహత్‌కీర్తి, బృహజ్జ్యోతి, బృహథ్‌బ్రహ్మ, బృహన్మానస, బృహస్పతి, సమావర్తన, ఉతథ్య, బృహన్మంత, బృహద్భాను అనేవారు కుమారులు కాగా, రాకా, సిని, వాలి, కుహూ, అర్చిష్మతి, మహిష్మతి, మహమతి, యోగసిద్ధి అనేవారు కుమార్తెలు. ఇందులో ఉతథ్యుని కుమారులలో ఒకరైన దీర్ఘతముడు గొప్ప పరిశోధకుడు. ఆయన అంధుడు కావటంవల్ల ఆయనకు 'దీర్ఘతముడు' అనే పేరు (అర్థం : చిరకాలం చీకటిలో ఉండేవాడు) వచ్చిందని ఒకవాదం. కాదు, ఆయన తన పరిశోధనలకోసం సుదీర్ఘకాలం సూర్యుడు, తదితర గ్రహాలను చూస్తూ ఉండటంవల్ల ఆయనకు అంధత్వం సంప్రాప్తించిందని మరొకవాదం. దీర్ఘతముని కుమారులలో అంగ, వంగ, కళింగ, ఆంధ్రులు ఉన్నారని మరొక కథ. ఈయన పేరుమీదే 'దీర్ఘతమస' గోత్రంకూడా ఉంది. 

వేదాలను దర్శించటంలోనూ ఆంగిరసులకు పాత్ర ఉంది. ముఖ్యంగా అథర్వ వేదంలో. అథర్వ వేదసంహితలో 1. అథర్వ, 2. అంగీరస అని రెండు భాగాలు ఉన్నాయి.  

                                                                  *     *     *     *     *

--------------------------------------------------------------------------

Copyright Reserved