hinduBrahmins

​​----------------------------------------------------------------------------------

అగస్త్య మహర్షి

                       ప్రణవ పంచాక్షరోపనిషత్ప్రపంచంబు
                                         గడదాక నెఱిగిన కఱకలాని
                       వాతాపిదైత్యు నిల్వలునితో గూడంగ
                                         జఠరాగ్ని వ్రేల్చిన సవనరక్త
                      గోపించి నహుషుని గుంభీవసంబుగా
                                         హుంకార మిచ్చిన యుగ్రతేజు
                      వానకాలమునాడు వండునట్టిన నీటి
                                        కాలుష్య ముడిపెడు కతకఫలము

                      బాండుభాసిత త్రిపుండ్రాంక ఫాలభాగు
                      భద్రరుద్రాక్షమాలికా భరితవక్ష
                      వింధ్యగర్వాపహారి నాపీతజలధి
                      నయ్యగస్త్య మహర్షి న నభినుతింతు

        

                                            - (శ్రీ కాశీ ఖండము; 2. 180)
    

    అగస్త్య గోత్రీకులకు గోత్రపురుషుడు అగస్త్య మహర్షి. ఈయననే 'అగస్తి' అనటంకూడా ఉంది. ఈయన సప్త ఋషులలో ఒకడు. ఋగ్వేద సూక్త కర్తలలో ఒకడు. 'అగస్త్య సంహిత' కర్త అగస్త్య మహర్షి. 

    'అగస్త్య' అనే మాటకు పర్వతాలను పడదోయగలిగిన వాడు అని అర్థం. 'అగ' అంటే కదలలేనిది, పర్వతం అని అర్థం కాగా, 'అస్తి' అంటే ఉండుట అర్థం, 'న' అంటే లేదు, అని అర్థం. మొత్తంమీద పర్వతాలను  ఉండనీయకుండా చేయుట లేదా పడగొట్టడం అని అర్థం. వింధ్యపర్వతగర్వభంగం చేసిన కారణంగా ఈయనకు ఈ పేరు వచ్చిఉండవచ్చు.  

    మహాభారతంలోని వన పర్వం (తీర్థయాత్రాపర్వం) ప్రకారం అగస్త్యుడు హరిద్వార్‌ సమీపంలోని గంగానదీద్వారంవద్ద ఉండేవాడు.  మహాభారతంలోని సౌప్తికపర్వంలో ద్రోణుడికి గురువుగా అగస్త్య మహర్షిని ప్రస్తావించటం జరిగింది. అగ్నివేశుడు అగస్త్యుని శిష్యుడు.  

    అగస్త్యుని గురించి అనేక కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని:

అగస్త్య మహర్షి చుట్టరికాలు 
  
 బ్రహ్మమానసపుత్రుడయిన ఋషి పులస్త్యుడు, ఆయన సతీమణి హరిర్భవి దంపతులు కుమారుడు అగస్త్యుడు. ఈయనకే మైత్రావరుణుడు, కుంభసంభవుడు, ఔర్వశేయుడు, సుమేధస్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. 

    ఋగ్వేద ద్రష్ట్టలలో అగస్త్యుడు ఒకడు.


మళ్లీ పుట్టిన అగస్త్యుడు 
    అగస్త్యుడు భూలోకంలో రెండుసార్లు జన్మించినట్లు చెప్పే కథ ఒకటి మనకు లభిస్తోంది. 

    అప్పట్లో దేవతలను తారకాది రాక్షసులు అనేకులు తీవ్రంగా బాధిస్తూ ఉండేవారు. దానికి ఆగ్రహించి, ఇంద్రుడు, తన అష్ట దిక్పాలకులలో ఒకడైన అగ్నిదేవుడిని ఆ రాక్షసులను అంతం చేయాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. దానితో అగ్నిదేవుడు, మరొక దిక్పాలకుడైన వాయుదేవుని సహాయం తీసుకుని, రాక్షసులమీదకు దండెత్తుతాడు. ఇది గమనించిన రాక్షసబృందం, సముద్రగర్భం చేరుకుంటుంది. ఇక, వారితో తమకు ఏ ఇబ్బందీ లేదు కదా అన్న ఉదాశీనతతో అగ్నివాయువులు ఊరుకుంటారు. కొన్నేళ్ల తర్వాత, మళ్లీ ఆ రాక్షసులు, సముుద్రంనుంచి బయటకు వచ్చి, దేవతలను కష్టనష్టాల పాలు చేయటం ఆరంభిస్తారు. ఇది చూసిన, ఇంద్రుడు, తన ఆజ్ఞను అగ్నివాయువులు పూర్తిగా పాలించకపోవటం వల్లనే ఈ కష్టం ఎదురయిందని భావిస్తూ, అగ్నివాయువులను పిలిచి, సముద్రాన్ని వెంటనే ముట్టడించి, రాక్షసులను సమూలంగా నాశనం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అయితే, తాము సముద్రాన్ని ముట్టడిస్తే, అందులో ఉన్న అనేక జీవరాశులు నాశనం అవుతాయని వారు తమకున్న ధర్మసందేహాన్ని వ్యక్తం చేస్తారు. దానితో ఇంద్రుడు, వారిద్దరూ తన ఆజ్ఞను ధిక్కరిస్తున్నారన్న ఆగ్రహంతో, 'మీరు ఇద్దరూ భూలోకంలో ఒక అచేతన పదార్థంనుండి మునులయి జన్మించండి' అని శాపం ఇస్తాడు. అయితే, తామిద్దరూ మునులుగా జన్మించేందుకు సూర్యుడు (మిత్రుడు), వరుణుడు తోడ్పడాలని అగ్నివాయువులు వేడుకుంటారు. దానికి మిత్రావరుణులు(సూర్య,వరుణులు) సమ్మతిస్తారు.   

    కొంతకాలం తర్వాత, తనను కామించిన సూర్యుడిని చేరటానికి ఊర్వశి వెడుతుండగా, ఆమెను చూసి, వరుణుడు తన కామవాంఛను ఆమె ముందు వెల్లడిస్తాడు. దానికి ఆమె 'నాకు నీపై ఇష్టం ఉన్నా, నేను ఇప్పుడు సూర్యుని చేరేందుకు వెళ్తున్నాను, కాబట్టి, నీ కోరికను అంగీకరించలేను' అని నిరాకరిస్తుంది. ఆవిధంగా సూర్యుడిని చేరినప్పటికీ, ఊర్వశి మనసులో వరుణుడిమీద కోరిక ఉండనే ఉంటుంది. ఇది గ్రహించిన సూర్యుడు 'మనసులో వరుణుడిని తలుస్తూ, నన్ను చేరరావటం తగదు' అని ఊర్వశిని శపించి, పంపేస్తాడు. ఇలా, రెండు వేర్వేరు కారణాలవల్ల సూర్యుడు, వరుణుడు ఇద్దరూ ఊర్వశిని పొందలేకపోతారు. కోరిక అధికమై తమ కామాన్ని ఆపుకోలేని సూర్యుడు, వరుణులు శక్తిమంతమైన తమ వీర్యం నష్టం కారాదన్న భావనతో, తమ వీర్యాన్ని ఒక నీటికుండలో వదిలి వెళ్లిపోతారు. మిత్రావరుణులు వదిలిన ఆ వీర్యమే కొంతకాలానికి జీవం పోసుకుని, ఇద్దరు శిశువులయి, అగస్త్య, వశిష్ఠులుగా జన్మిస్తారు.


అయితే ఇదే కథను మరోవిధంగానూ చెప్తారు. తనను చూసి,  కామించిన సూర్యుడు వదలిన వీర్యాన్ని ఊర్వశి ఒక కుంభంలో నిక్షిప్తం చేసి ఉంచిందనీ,

ఆ తర్వాత వరుణుడు సైతం తనను కామించి వదలిన వీర్యాన్నికూడా ఆమె అదే కుంభంలో దాచిందనీ, ఆ కుంభంనుంచే వశిష్ఠ, అగస్త్యులు జన్మించారనీ ఈ కథ. తనను కోరిన తర్వాత, వరుణుని కోరిందన్న కోపంతో సూర్యుడు ఊర్వశికి 'మానవలోకంలో జన్మించి పురూరవునికి భార్యవు కమ్మ'ని శాపం ఇచ్చాడనేది

ఈ 'ఉత్తర రాయాయణ' కథకు ముగింపు. 

    ఈ అగస్త్య, వశిష్ఠులకు మిత్రావరుణుల కుమారులు కాబట్టే వీరికి 'మైత్రావరుణులు' అనే పేర్లు, కుంభం(కుండ)లోనుంచి జనించారు కాబట్టి,'కుంభసంభవులు' అన్న పేరుంది. వీరు ఇద్దరూ ఊర్వశీపుత్రులు కావటంవల్ల 'ఔర్వశేయుడు' అన్న పేరూ వచ్చింది.అందుకే, అగస్త్య, వశిష్ఠులకు 'కుంభసంభవులు' అన్న పేరుంది. ఈవిధంగా, అగ్నిదేవుడు సూర్యుని సహాయంతో, వాయువు వరుణుని సహాయంతో భూలోకంలో అగస్త్య, వశిష్ఠులుగా రెండోసారి తిరిగి జన్మిస్తారు. కనుక  వశిష్ఠునికి అగస్త్యుడు అన్నగారు అవుతారు. 

    ఈ కథ పద్మ పురాణం, సృష్టి ఖండంలోనూ, మహాభారతంలోని అరణ్య పర్వంలోనూ ఉంది. 

లోపాముద్ర సృష్టి - ఆమెతోనే వివాహం 
    అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర. అగస్త్యునితో ఈమె వివాహం గురించిన కథ ఒకటి ఉంది. 

    ఈవిధంగా జన్మించిన అగస్త్యుడు ఒకసారి ఒక అడవిలో వెడుతుండగా, ఆయనకు తన వంశంలోని పితృదేవతలు చెట్లకొమ్మల మీదనుంచి దిగువకు తలకిందులుగా వేళ్లాడుతూ కానవస్తారు.వారిని చూసి, వారి దురదృష్టానికి చాలా చింతిస్తాడు. వంశం కొనసాగని కారణంగా,  ధర్మనియమాల ప్రకారం తమకు ఉత్తమ లోకాలకు వెళ్లగల అవకాశం లేకపోతోందని వారు అగస్త్యునికి తెలియజేస్తారు. తమ పూర్వికులైన పితృదేవతలకు ఉత్తమగతుల ప్రాప్తి కలిగించటం తన బాధ్యత గనుక,తాను మనుధర్మ నియమానుసారం వివాహం చేసుకుని, తండ్రి కావాలనే కోరికతో అగస్త్య మహర్షి, తన తపోశక్తితో, సకల గుణ సంపన్న కాగల ఆడపిల్ల అయ్యే విధంగా ఒక ఫలాన్ని రూపొందిస్తాడు. అప్పట్లో విదర్భ మహారాజు బిడ్డలకోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన అగస్త్యుడు, తను సృష్టించిన ఫలాన్ని విదర్భ రాజదంపతులకు ఇచ్చి, ఆమె విదర్భరాకుమార్తెగా పుట్టే ఏర్పాటు చేస్తాడు. ఆ బిడ్డ విదర్భ రాజుకు కుమార్తెగా లోపాముద్రగా జన్మిస్తుంది. తర్వాత, ఆమెకు యుక్తవయస్సు వచ్చాక, ఆమెనే అగస్త్య మహర్షి వివాహమాడుతాడు. అగస్త్య మహర్షి అంటే ఇష్టపడే లోపాముద్ర, తన రాజభోగాలను వదులుకుని, భర్తతో అడవికి వచ్చేస్తుంది. ఈ దంపతులకు భృంగి, అచ్యుత అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు.  

    అయితే, అగస్త్య లోపాముద్ర దంపతులకు ఒక్కడే కుమారుడు జన్మించాడనే కథ వేరొకటి ఉంది. ఒకసారి, లోపాముద్ర తన భర్త అయిన అగస్త్యుని చేరి, తనకు కుమారుడు కావాలని కోరుతుంది. దానికి అగస్త్యుడు 'నీకు వెయ్యిమంది కొడుకులు కావాలా? లేదా వెయ్యిమంది శక్తితో వంద మంది కుమారులు కావాలా? లేదా వందమంది శక్తితో పదిమంది కుమారులు కావాలా? లేక పదిమంది శక్తితో ఒక్క కుమారుడే కావాలా?' అని అడుగుతాడు. దీనికి జవాబుగా తనకు ఒక్క కుమారుడు చాలని లోపాముద్ర జవాబు ఇస్తుంది. ఆయన ఆవిధంగానే అనుగ్రహిస్తాడు. దానితో, వారికి 'దృహదశ్యుడు' అనే కుమారుడు జన్మించాడనేది ఈ కథ. ఈ కుమారునికే 'ఇద్మావహుడు' అని మరొక పేరుందని అంటారు.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
    ఇప్పుడంటే మనకు కానరాకపోవచ్చుకానీ, ఇదివరకు తమ ఇంట చిన్న పిల్లలకు అన్నం పెట్టిన అమ్మ, అమ్మమ్మలు ఆఖరి ముద్ద పెట్టిన తర్వాత, ఆ చిన్నారుల చుట్టూ ఆ అన్నంగిన్నెను దిష్టి తీస్తున్నట్లుగా తిప్పుతూ, ఆ చిరంజీవులను 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అంటూ, ఆ పిల్లలు తిన్న అన్నం అతి తేలికగా, అగస్త్యుని కడుపులో వాతాపి రాక్షసుడు జీర్ణం అయినంత తేలికగా జీర్ణం కావాలని దీవించేవారు. ఈ దీవెన వెనుక ఒక కథ ఉంది. 

    పూర్వం మణిమతి నగరంలో ఇల్వలుడు, వాతాపి అని ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. ఒకసారి ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిని ఆహ్వానించి, విందు భోజనం వడ్డించి, ఆయనను సంతుష్టుడిని చేశాడు. తర్వాత, నెమ్మదిగా తనకు 'దేవేంద్రుడికి సమానమైన బలమున్న కుమారుడు కలిగేలా దీవించమ'ని తన మనసులోని కోరికను ఇల్వలుడు బయటపెట్టాడు. 'ఇది పూర్తిగా అసమంజసమైన కోరిక. పైగా నాకు అంత శక్తి లేదు' అంటూ దానికి ఆ బ్రాహ్మణుడు సమ్మతించలేదు. దానితో ఇల్వలుడికి ఆ ఒక్క బ్రాహ్మణుడిమీదనే కాకుండా సమస్త బ్రాహ్మణులమీద ఆగ్రహం వచ్చింది. మాయాజాల విద్యలు తెలిసిన ఇల్వలుడు, తన తమ్ముడైన వాతాపిని ఒక మేకగా మార్చి, తమ ఇంటికి బ్రాహ్మణులను విందుకు ఆహ్వానించి, వారికి మేక రూపంలో ఉన్న వాతాపిని వండి వడ్డించేవాడు. తమకు ఇల్వలుడు వడ్డిస్తున్నది మాంసమనికూడా తెలియని బ్రాహ్మణులు అది తినేవారు. ఆ తర్వాత, ఇల్వలుడు, 'వాతాపి అత్ర గచ్ఛ' అంటూ తన తమ్ముడిని గొంతెత్తి, బయటకు రమ్మని పిలిచేవాడు. ఆ బ్రాహ్మణుల కడుపులో మాంసం రూపంలో ఉన్న వాతాపి, వెంటనే ఆ బ్రాహ్మణుల కడుపు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఇలా అనేకమంది బ్రాహ్మణులను ఆ రాక్షస సోదరులు చంపేశారు. దానితో బ్రాహ్మణులు అగస్త్యుని వద్దకు వెళ్లి, తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నారు. అప్పుడు అగస్త్యుడు బ్రాహ్మణులమీద దయ తలచి, తాను వారిని ఆ కష్టాలనుంచి రక్షిస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారమే, అగస్త్యుడు, ఒక బ్రాహ్మణుని వేషంలో ఆ ప్రాంతానికి వస్తాడు. ఆయనను సాధారణమైన బ్రాహ్మణుడని భావించిన ఇల్వల, వాతాపి సోదరులు భోజనానికి ఆహ్వానిస్తారు. ఆయన వచ్చి, వారు పెట్టిన ఆహారాన్ని భుజిస్తాడు. యథాప్రకారం, ఇల్వలుడు, తన తమ్ముడైన వాతాపిని, అగస్త్యుని కడుపు చీల్చుకుని బయటకు రమ్మని పిలుస్తాడు. కానీ అప్పటికే వాతాపి తన కడుపులో పూర్తిగా జీర్ణం అయిపోయాడని అగస్త్యుడు, తన ఉదరాన్ని నిమురుకుంటూ 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అంటాడు. తన తమ్ముడు అలా చనిపోవటంతో, ఇల్వలుడు అగస్త్యుని శరణు కోరాడనేది ఈ కథ. 


ఈ కథ కొంత భిన్నంగా మహాభారతంలో ఉంది. అగస్త్యుడు, లోపాముద్రను వివాహం ఆడిన తర్వాత జరిగిన కథ ఇది. ఒకనాడు,  లోపాముద్రను చూసిన అగస్త్యుడు కామకేళికి ఆహ్వానిస్తాడు. అయితే, ఆమె, తాను అప్పుడు మలినవస్త్ర కావటంతో, తగిన మంచి వస్త్రాలను తెమ్మని కోరుతుంది. ఆ కోరిక తీర్చడానికి తనవద్ద తగినంత ధనం లేదని భావించిన అగస్త్యుడు, శ్రుతపర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్లి 'మీ అవసరాలకు సరిపోగా ఏమైనా ధనం మిగిలినా దానితో తనకు ధనసహాయం చేయాల'ని కోరతాడు. దీనికి శ్రుతపర్వుడు 'నావద్ద మిగులు ధనం లేద'ని, 'ప్రధ్నశ్వుని వద్దకు వెళ్లి ధనసహాయం కోరమ'ని చెప్తాడు. ప్రధ్నశ్వుడి దగ్గరా మిగులు ధనం లేదని తెలుస్తుంది. అగస్త్యుడు అప్పుడు త్రసదస్యుడి వద్దకు వెడతాడు. ఆయన దగ్గరా మిగులు ధనం ఉండదు. ఆయన ఇల్వలుని వద్ద మిగులు ధనం ఉంటుందని చెప్పగా, అగస్త్యుడు, ఇల్వలుడిని చేరతాడు. ఆ తర్వాత, ఇల్వలుని దుశ్చేష్టలు తెలుసుకుని, ఇల్వలుడు, వాతాపిలను తిని జీర్ణం చేసుకుని, వారికి గర్వభంగం చేస్తాడు. 


    ఎంతటి రాక్షసుడినైనా తిని అగస్త్యుడు జీర్ణించుకున్నట్లు తమ బిడ్డలు తిన్నది కొంతైనా అరిగించుకోవాలనేది తల్లుల దీవెన వెనుక ఉన్న ఉద్దేశ్యం.


కావేరి నదిగా లోపాముద్ర 
    లోపాముద్ర జననంగురించి మరొక కథా ఉంది. ఇది దక్షిణాదిన తమిళనాడు ప్రాంతంలో సంప్రదాయపరంగా ప్రచారంలో ఉన్న కథ. అయితే, ఈ కథలో అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర కాదు.

    బ్రహ్మగిరి ప్రాంతంలో 'కవేరుడు' అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలుగుతుంది. కవేర రాజకుమార్తె కాబట్టి ఆమె 'కావేరి' అవుతుంది. కవేర మహారాజుకు, ఆయన కుమార్తె కావేరికి ఆ ప్రాంతం అన్నా, అక్కడి ప్రజలన్నా ఎంతో అభిమానం ఉండేది. లోపాముద్ర అంశగల కావేరిని అగస్త్యుడు వివాహమాడుతాడు. 

    దక్షిణ భారతంలో అదే ప్రాంతంలో 'శూరపద్ముడు' అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి దేవేంద్రుడు అన్నా, దేవేంద్రుడిని సేవించే ప్రజలన్నా చాలా కోపం ఉండేది. అది దేవేంద్రునికి నచ్చదు. ఫలితంగా, ఇంద్రుడు ఆ ప్రాంతంలో వర్షాలు పడకుండా చూస్తాడు. దీనితో ప్రజలు పలు కష్టాలకు గురి అవుతుంటారు. ఇదిలా ఉండగా, అగస్త్యుడు ఒకసారి స్నానానికి వెడుతూ, తన భార్య కావేరిని తన కమండలంలో తీసుకువెడతాడు. ఆ కమండలాన్ని అగస్య్తుడు నదీతీరంలోని ఒక రాతిమీద పెట్టి, స్నానానికి నదిలోకి దిగుతాడు. అప్పుడు,అక్కడి ఋషులు, గణేశుని వద్దకు వెళ్లి, తమ ప్రాంతంలో నీరు లేక ప్రజలు అవస్థల పాలవుతున్నారని, వారిపై దయచూపి, అగస్త్యుని కమండలంలోని నీటిని బయటకు తేవాలనీ కోరతారు. దానికి సమ్మతించిన గణేశుడు, ఒక గోవు రూపం ధరించి వచ్చి, ఆ కమండలంలోని నీటిని ఒలకపోస్తాడు. ఆ నీరు అక్కడ ప్రవహించి, 'కావేరీ నది' అయి, తమిళనాట ప్రజలకు అమృతజలమై, ప్రాణప్రదాయిని అయింది. తర్వాత, అగస్త్యుడు తన స్నానాన్ని ముగించుకుని వచ్చి, వెతికితే, తన భార్య కావేరి, కావేరీనదిగా రూపొందటం గమనిస్తాడు. తనవద్దకు తిరిగి రావాలని ఆయన ఎంతగా ఆమెను ప్రాధేయపడినా, తనకు అక్కడి ప్రజలే ముఖ్యమని ఆమె నిరాకరిస్తుంది. ఈవిధంగా అగస్త్యుని సతీమణి, తమిళ ప్రజలకు జీవధార అయి ప్రాణప్రదమయింది. తన సతీమణి లోక కళ్యాణానికి సిద్ధపడటం గమనించిన అగస్త్యుడు, ఆమె ఆకాంక్షలను గౌరవిస్తాడు. 

కాలకేయుల కథ
    సముద్రాన్ని అగస్త్యుడు ఆపోసన పట్టాడని ఒక కథ ఉంది. కాలకేయులు అనే ఒక రాక్షసబృందం ప్రతీరోజూ రాత్రివేళలో భూలోకంమీద విరుచుకుపడేవారు. ఉదయం సూర్యోదయానికి ముందు వారు వెళ్లి సముద్రగర్భంలో దాక్కొనేవారు. వీరి బాధను భరించలేని మునిగణాలు వెళ్లి, విష్ణుమూర్తిని తమను కాపాడవలసిందిగా కోరతారు. సముద్రంలో దాక్కుని ఉంటున్న కాలకేయులను చంపాలంటే, ముందుగా సముద్రంలోని నీటిని తోడివేయాల్సి ఉంటుందనీ,

అది ఒక్క అగస్త్య మహర్షికి మాత్రమే సాధ్యం కాగలదని విష్ణుమూర్తి ఆ మునులకు తెలియజేస్తాడు. అప్పుడు ఈ మునులంతా వచ్చి, తమ కష్టాలను అగస్త్యునికి వివరించి, తమను ఆదుకోవలసిందిగా కోరతారు. దానికి అగస్త్యుడు సమ్మతించి, సముద్ర తీరానికి వచ్చి, మూడు ఆపోసనలలో పూర్తి సముద్రజలాన్ని తాగేస్తాడు. నీరు పూర్తిగా ఇంకిపోవటంతో, కాలకేయులను మునిగణాలు, తదితరులు కలిసి చంపేస్తారు. ఆ తర్వాత, మునులు మళ్లీ అగస్త్యుని వద్దకు వెళ్లి, సముద్రాన్ని తిరిగి నీటితో నింపవలసిందిగా కోరతారు. అయితే, తాను ఆపోసన పట్టిన సముద్రజలం పూర్తిగా తనలో జీర్ణం అయిపోయిందని, తిరిగి దాన్ని కక్కటం తనవల్ల కాదనీ అగస్త్యుడు స్పష్టం చేస్తాడు. ఆ తర్వాత, భగీరథ మహారాజు, తన పూర్వికులకు ఉత్తమ గతులను కలిగించడానికి తపస్సు చేసి, ఆకాశగంగను నేలమీదకు ప్రవహింపజేశాడనీ, ఆ జలాలతోనే సముద్రం తిరిగి, నీటితో నిండిందనీ కథ. 

    అయితే, ఇదే కథ కొంత భిన్నంగాకూడా కనిపిస్తోంది. దాని ప్రకారం- ఇంద్రుడి ఆజ్ఞమీద అగ్ని, వాయుదేవులు రాక్షసులను చంపడానికి బయలుదేరతారు.

ఈ రాక్షసులలో కొందరు, ముఖ్యంగా వృత్రాసురుడు అనే రాక్షసుడు, సముద్రంలోకి వచ్చి, దాక్కుంటారు. సముద్రంలో ఇతర జీవులు కోట్లాదిగా ఉన్నాయి గనుక, తాము సముద్రజలాలమీదకు వెళ్లలేదని ఇంద్రునికి చెప్తారు. అయితే, ఇంద్రుడు, వారు తమ ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తూ, సముద్ర జలాలమీదకు వెళ్లలేదనీ, అది తన ఆజ్ఞను ధిక్కరించడమేననీ భావిస్తాడు. తన ఆజ్ఞను ధిక్కరించిన నేరానికి అగ్ని, వాయుదేవులు ఇద్దరూ మానవులుగా పుట్టాలని శపిస్తాడు. మరి తమకు శాపవిమోచనం ఏమిటని వారు అడిగితే, 'మీరు ఇద్దరూ అగస్త్య, వశిష్ఠులుగా జన్మిస్తారనీ, ఇద్దరిలో అగస్త్యుడు సముద్రజలాలను తాగినప్పుడే వారికి శాపవిమోచనం జరుగుతుంద'ని ఇంద్రుడు చెప్తాడని ఈ కథ. తర్వాత, ఈ శాప కారణంగానే అగస్త్యుడు సముద్ర జలాలను మూడుసార్లు ఆపోసన పట్టి, వాటిని ఇంకింపజేయటం తెలిసిందే!!

    అయితే, అలా సముద్రజలాలు ఇంకిపోవటంతో, సముద్రజలంలో ఉన్న అనేక జీవరాశులకు ప్రాణనష్టం కలుగుతుందన్న భావనతో, తిరిగి ఆ నీటిని విడవవలసిందిగా అగస్త్యుడిని దేవతలు కోరతారు. తాను తాగిన సముద్రజలం అప్పటికే తనలో జీర్ణం అయిందనీ, అది ఇక కేవలం తన మూత్రద్వారంనుంచే వెలువడగలదనీ అగస్త్యుడు స్పష్టం చేస్తాడు. అలా, అగస్త్యుని మూత్రరూపంలో బయటకు వచ్చిన జలం, తిరిగి సమస్త సముద్రాలనూ నీటితో నింపింది.

ఈ కారణంగానే, సముద్రజలాలు అన్నీ ఉప్పగా ఉంటాయని మరొక కథ. ఈ కథ స్కాంద పురాణంలోనూ, మహా భారతం, అరణ్యపర్వంలోనూ ఉంది. 

అగస్త్యుడి ద్వాదశ వర్ష యజ్ఞం  
    అగస్త్యుడు ఒకసారి ద్వాదశ వర్ష (12 సంవత్సరాలపాటు జరిగే) యజ్ఞం చేయాలని సంకల్పిస్తాడు. అయితే, ఈ యజ్ఞానికి వచ్చే వారికి అన్నపానాదులు సమకూర్చటం అంటే మాటలు కాదు. పైగా అప్పట్లో వర్షాభావంచేత తీవ్రమైన కరువు ఉండేది. ఈ సందేహాన్నే అనేకమంది మునులు, అగస్త్యుని ముందుంచారు. ఆయన నవ్వి, 'సకాలంలో వానలు కురిపించటం ఇంద్రుని పని. ఆయన ఆ పనిని సరిగ్గా చేయని పక్షంలో నేనే ఇంద్రపదవిని గ్రహించి, వానల్ని కురిపిస్తాను' అని అన్నాడు. ఈ సంగతి విన్న దేవగురువు బృహస్పతి వెంటనే, అగస్త్యుడిని చేరి, క్షమించమని కోరి, ఇంద్రుని పిలిపించి వర్షాలను కురిపించాడు. ఫలితంగా, అగస్త్యుడు, తాను అనుకున్నట్లుగా ద్వాదశ వార్షిక యజ్ఞాన్ని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాడని మహాభారతంలోనిదే మరొక కథ. 

వింధ్యపర్వత గర్వభంగం
    తులసీదాస్‌ విరచితమైన 'రామ్‌ చరిత్‌ మానస్‌'లో మరొక కథ  ఉంది. దానిప్రకారం అగస్త్యుడు వింధ్య పర్వత గర్వభంగం చేస్తాడు. 

    తూర్పున ఉదయించే సూర్యుడు ప్రతీరోజూ మేరు పర్వతంచుట్టూ తిరిగి, పడమటి దిక్కున అస్తమించేవాడు. మేరు పర్వతం తనన్నా ఎత్తులో ఉండటంవల్లే సూర్యుడు అలా మేరు పర్వతంచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని భావించిన వింధ్య పర్వతం అప్పటినుంచీ పెరగటం ప్రారంభిస్తుంది. ఇలా, ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య గల వింధ్య పర్వతం అనూహ్యమైన రీతిలో పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల, సూర్యుడికి తన విధినిర్వహణలో వింధ్య పర్వతం అడ్డు రావటం వల్ల, వింధ్య పర్వతం దాటి సూర్యుడు ప్రదక్షిణ చేయలేకపోతుంటాడు. ఫలితంగా, భూగోళంమీద కొన్ని ప్రదేశాలు చీకటిపాలవుతాయి. ఇది భూమిమీద ఉన్న సమస్త మానవ, జంతుజాలాల మీద, భూతలసమతౌల్యంమీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని భావిస్తూ, దేవగణం అంతా వచ్చి, తమను ఆదుకొనేందుకు ఏమైనా చేయవలసిందిగా అగస్త్యుని కోరతారు. వెంటనే అగస్త్యుడు తన కుటుంబ, శిష్యగణంతో దక్షిణాపథంవైపు బయలుదేరతాడు. మార్గమధ్యంలో వింధ్యపర్వతాల వద్దకు రాగానే, అగస్త్యుడిని చూసి, వింధ్యపర్వతరాజు గౌరవంతో వంగి, ముకుళిత హస్తాలతో నమస్కారం చేస్తాడు. అగస్త్యుడు దానికి ఎంతో సంతోషించి, తాను దక్షిణాపథంవైపు వెడుతున్నానని, తిరిగి ఉత్తరాదికి వెళ్లేందుకు తాను వచ్చేంతవరకూ అలాగే ఉండగలవా అని వింధ్యపర్వతాన్ని అడుగుతాడు. అగస్త్యుడిమీద గౌరవంతో అలాగే ఉంటానని ఆ పర్వతరాజు మాట ఇస్తాడు. వింధ్యపర్వతశ్రేణిని దిగిన తర్వాత, తనకు తిరిగి ఉత్తర భారతానికి వెళ్లే  ఉద్దేశ్యం లేదని అగస్త్యుడు

తన శిష్యబృందానికి చెప్పి, దక్షిణాపథం చేరుకుంటాడు. ఫలితంగా, అగస్త్యునికి ఇచ్చిన మాట ప్రకారం, వింధ్యపర్వతం మరింత పెరగక, అలాగే ఉండిపోయిందన్నది ఈ కథ. 

    శ్రీనాథకవి విరచితమైన 'కాశీ ఖండం'లో ఈ కథ ఉంది.  

'ఆదిత్య హృదయ'కర్త అగస్త్యుడు
    శ్రీమద్రామాయణంలోనూ అగస్త్యుడికి చెప్పుకోదగిన పాత్ర ఉంది. శ్రీరాముడు శివధనుస్సును విరిచి, సీతను వివాహమాడాడని అందరికీ తెలుసు. శివ ధనుస్సు ఉన్నప్పుడు, వైష్ణవ ధనుస్సుకూడా ఉండాలి కదా! శ్రీరాముడికి అగస్త్యుడు, వైష్ణవ ధనుస్సును, అనేక బాణాలను ఇచ్చాడని అంటారు. వైష్ణవ ధనుస్సుతో బాణం వదిలితే, అది లక్ష్యాన్ని ఛేదించి, సముద్రం చేరి, అక్కడ సముద్రజలాలలో మునిగి, శుద్ధి అయి, తిరిగిశ్రీరాముని తూణీరం (బాణాలు పెట్టుకునే అమ్ములపొది) చేరేదని అంటారు. అలాగే, వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండలో-రావణుడితో యుద్ధంగురించి ఆలోచిస్తూ, చింతాక్రాంతుడై ఉన్నప్పుడు, అగస్త్యుడు శ్రీరాముడికి 'ఆదిత్య హృదయ స్తోత్రం'ను ఉపదేశిస్తాడు. అది అనుష్టుప్‌ ఛందస్‌లో ఉంటుంది.

ఇదే కాకుండా, అగస్త్య మహర్షి 'సరస్వతీ స్తోత్రం'కూడా రచన చేశాడు. 

    అగస్త్యుడే 'లలితా సహస్ర నామావళి' రచించారని అంటారు. 

నహుషునికి శాపం
    అగస్త్యుడు నహుషునిపై కోపించి, శపించిన కథ ఒకటి ఉంది. త్వార్ష్ట్ర కుమారుడైన ఇంద్రుడు ఒకసారి మోసంతో వృత్తసూనుడిని చంపేస్తాడు. దానితో ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఎలాగైనా ఈ పాపఫలితం తప్పించుకోవటానికి ఇంద్రుడు మానస సరోవరం చేరి, అక్కడ ఒక తామరతూడులో దాక్కుంటాడు. దానితో సకాలానికి వర్షాలు పడక, భూమి మీద ప్రజలు తల్లడిల్లి పోతుంటారు. ఈ దురవస్థలు చూసిన దేవతలు, మునులు ఇంద్రుడు ఎక్కడకు వెళ్లాడోనని అన్వేషణ ఆరంభిస్తారు. అయినా, తామరతూడులో దాగిన ఇంద్రుని ఆచూకీ వారికి తెలియరాదు. అప్పుడు, గత్యంతరం లేని పరిస్థితిలో దేవతలూ, ఋషులూ కలిసి, అప్పటికి ఉత్తమ పాలకుడుగా పేరు తెచ్చుకున్న నహుషుడిని కొత్త ఇంద్రుడుగా ఎంచుకుంటారు. నహుషుడు తన స్వతఃసిద్ధమైన బుద్ధితో, ఇంద్రపదవి దక్కిన ఆనందంతో, స్వర్గలోకంలోని దేవతలైన అప్సరలతో  కాలం గడుపుతుంటాడు. అక్కడితో ఆగక, నహుషుడు, అసలు ఇంద్రుని భార్య అయిన శచీదేవి పొందును కూడా కోరతాడు. శచీదేవికి ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. ఆమె విష్ణువుకు తన కష్టాలను మొర పెట్టుకుంటుంది. అది విన్న ఆయన శచీదేవికి ఒక తరుణోపాయం చెప్తాడు. ఆ ప్రకారమే శచీదేవి తిరిగి ఇంద్రలోకానికి వచ్చి, నహుషునితో 'నా భర్త సజీవుడై ఉండగా వేరొకరిని వివాహమాడటం సమంజసం కాదు, కనుక నా భర్త లేడన్న సంగతిని నిర్ధారించిన పక్షంలో నేను నీతో వివాహానికి సిద్ధం' అంటుంది. ఈవిధంగానైనా తన భర్త అయిన ఇంద్రుడి ఆచూకీ కనుక్కోగల వీలుంటుందని ఆమె అభిప్రాయం. అదే సమయంలో, ఇంద్రుడు తన పాపపరిహారానికి అశ్వమేధ యాగం చేయాలని, శచీదేవి జగదాంబను పూజించాలనీకూడా విష్ణుమూర్తి చెప్తాడు. శచీదేవి, ఆ ప్రకారమే భువనేశ్వరీదేవిని పూజిస్తుంది. భువనేశ్వరీదేవి ప్రత్యక్షమై 'నహుషుని పీడ తొలగించుకోవాలంటే ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. నహుషుడిని వివాహమాడేందుకు సిద్ధం అని నువ్వు చెప్పు. కానీ వివాహానికి నహుషుడు, సప్తర్షులు మోస్తున్న పల్లకీలో రావాలని షరతు విధించు' అని చెప్తుంది. ఆ ప్రకారమే శచీదేవి నహుషునికి తెలియజేస్తుంది. నహుషుడు వెంటనే సప్తర్షులను పిలిచి తనను శచీదేవి వద్దకు ఒక పల్లకీలో తీసుకువెళ్లాలని ఆదేశిస్తాడు. సప్తర్షులలో అగస్త్యుడు పొట్టివాడు. అందుకే, నహుషుడు ఎక్కిన పల్లకీని మిగిలిన ఆరుగురు ఋషులు మోస్తూ నడుస్తున్నంత వేగంతో అగస్త్యుడు నడవలేకపోతాడు. పైగా అందరి ఎత్తూ ఒకటి కాకపోవటంతో పల్లకీ ఎగుడుదిగుడుగాకూడా ఉంటుంది. అగస్త్యుడు నెమ్మదిగా నడుస్తున్నది చూసి, నహుషుడు 'వేగంగా వెళ్లు' అనే అర్థంలో
'సర్ప సర్ప'  అంటూ తన కాలితో తంతాడు. దానితో అగస్త్యుడు కోపం పట్టలేక 'సర్ప సర్ప అంటూ నన్ను తన్నిన నువ్వు సర్పమై పుట్టి వెయ్యేళ్లు జీవించుదువుగాక!' (సర్పోభవ దురాచరవణే ఘోరవపుర్మహన్‌) అని శపిస్తాడు. దానితో నహుషుడు వెంటనే అగస్త్యుని పాదాలమీద పడి, క్షమించమని కోరతాడు. అప్పుడు అగస్త్యుడు 'పాండవ వనవాస కాలంలో నువ్వు నివసించే సరస్సు దగ్గరకు ధర్మరాజు తప్ప తక్కిన పాండవులు నలుగురూ వస్తారు. వారిలో భీముడిని బంధించినట్లయితే, ధర్మరాజు నీ వద్దకు వస్తాడు. అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు తగిన జవాబులు చెప్పటంతో నీకు శాపవిమోచనం అవుతుంది' అని వివరిస్తాడు. అగస్త్యుని శాపం వల్లనే ధర్మరాజు, తన తమ్ముడిని విడిపించుకోవడానికి అనేక యక్షప్రశ్నలకు సమాధానాలు చెప్తాడు. ఈవిధంగా నహుషునికి గర్వభంగం అవడమేకాకుండా, ఇంద్రుడు తిరిగి స్వర్గలోకానికి రాగలుగుతాడు.    


గజేంద్రమోక్షం కథ
    శ్రీ మద్భాగవతంలోని గజేంద్రమోక్షం కథ అందరికీ తెలిసిందే. అయితే, ఆ గజేంద్రుడు, పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు అనీ, అగస్త్యుని శాపంవల్లనే ఆయన గజేంద్రుడిగా జన్మను ఎత్తాల్సివచ్చిందనీ వివరించే కథ ఒకటి ఉంది. ఇంద్రద్యుమ్న మహారాజు తనకు రాజ్యకాంక్ష లేదని చెప్పి, రాజ్యత్యాగం చేసి, మలయ పర్వతంమీదకు తపస్సుకు వెళ్లిపోతాడు. అక్కడ, ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా, ఒకసారి అగస్త్యుడు అక్కడికి విచ్చేస్తాడు. అయితే తపస్సులో మునిగి ఉన్న ఇంద్రద్యుమ్నుడు, అగస్త్యుడి రాకను గమనించడు. తన రాకను గమనించి, ఇంద్రద్యుమ్నుడు లేచి, తనకు ఆతిథ్యం ఇవ్వలేదన్న ఆగ్రహంతో అగస్త్యుడు, 'నా రాకను గమనించక రాయిలా కదలక మెదలక ఉన్న నువ్వు వచ్చేజన్మలో రాయిలా మూర్ఖత్వం నిండిన ఏనుగువై జన్మించమ'ని శాపం ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చాలా సమయానికి తన  తపస్సునుంచి లేచిన ఇంద్రద్యుమ్నుడు, అగస్త్యుడు ఇచ్చిన శాపం గురించి తెలుసుకుని, అంతా విధిలీల అనుకుని, దాన్ని తలదాల్చి, మరుజన్మలో గజరాజై జన్మిస్తాడు. కానీ, పూర్వజన్మ సుకృతాన, ఆ ఏనుగు విష్ణుభక్తిని మర్చిపోదు. అందుకే, సరస్సులో దిగినప్పుడు తనను మకరి బంధించినప్పుడు, 'రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మకా!' అంటూ జగమెవ్వనిలోపల లీనమై ఉండునో ఆ దేవదేవుని ప్రార్థిస్తాడు. అందుకే, సిరికిం చెప్పక, శంఖు చక్రాలను చేదోయి ధరించక, పరుగు పరుగున వచ్చి, గజేంద్రుని మకరి బారినుంచి రక్షిస్తాడు.గజేంద్రునికి శాప విమోచన జరగటంతో, సారూప్యస్వర్గలోకప్రాప్తిని (గజేంద్రుడు తన స్వరూపంతోనే నేరుగా స్వర్గలోకం చేరగల ముక్తి) విష్ణువు అనుగ్రహిస్తాడు. 

అగస్త్యుడు ఇచ్చిన శాపాలు
    అగస్త్యుడు అనేక సందర్భాలలో అనేకులకు శాపాలు ఇచ్చినట్లు కూడా కథలు ఉన్నాయి. 

    దేవలోకంలో దేవనర్తకి అయిన ఊర్వశి ఇంద్రుని కుమారుడైన జయంతుడి పట్ల మోహం పెంచుకుంటుంది. దీనితో కోపించిన అగస్త్యుడు, జయంతుడిని ఒక పూల పాన్పు కావాల్సిందిగా శాపమిచ్చాడని అంటారు. అలాగే, మరొక సందర్భంలో, నారదునిపట్ల కోపించిన అగస్త్యుడు, నారదుడు తన వీణ అయిన 'మహతి'ని పోగొట్టుకుంటాడనీ అగస్త్యుడు శాపం ఇస్తాడు. 

కుబేరునికి అగస్త్యుని శాపం
    ధనాధినేత కుబేరుడు సైతం అగస్త్యుని ఆగ్రహానికి గురైన కథకూడా ఒకటి ఉంది. కుబేరునికి పుష్పక విమానం ఉన్న సంగతి తెలిసిందే. ఒకసారి, కుబేరుడు తన స్నేహితుడైన మహిముడితో కలిసి, గగనమార్గాన విహరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో గగనంనుంచి మహిముడు కిందకు ఉమ్మేస్తాడు. అది భూలోకంలో తపస్సు చేసుకుంటున్న అగస్త్యునిమీద పడుతుంది. అగస్త్యుడు ఆ అవమానానికి కోపించి, కుబేరునికి శాపం ఇస్తాడు. 'నీ స్నేహితుడు ఉమ్మి వేస్తోంటే, అది తప్పు అని వారించక, నువ్వూ తప్పు చేశావ్‌! కనుక నీ స్నేహితుడినీ, నీ సైన్యాన్నీ  ఒక మానవుడు చంపుతోంటే, నువ్వు అప్పుడూ మౌనంగా ఉంటావ్‌!' అని అగస్త్యుడు శపిస్తాడు. ఆ శాప కారణంగానే, పాండవ వనవాస సమయంలో, ఒకసారి గంధమాదన పర్వత శ్రేణిలో అర్జునుడు కానరాకపోతే, అతనికోసం అన్వేషిస్తూ, భీముడు మహిముడిని, కుబేరుని సైన్యాన్నీ నాశనం చేస్తాడని ఒక కథ ఉంది.ఈ కథలో మొదటిభాగం - గగనతలంలో కుబేరుడు పుష్పక విమానంలో వెడుతూ ఉన్నప్పుడు, అతని స్నేహితుడు ఉమ్మి వేస్తే, అది కింద అగస్త్యునిమీద పడటం వరకూ గల కథ, మనకు శ్రీకృష్ణార్జున యుద్ధం కథను గుర్తుకు తెస్తుంది. అందులోనూ గయుడనే ఒక గంధర్వ రాజు, గగనవిహారం చేస్తూ ఉమ్మి వేస్తే, అది కింద సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న శ్రీ కృష్ణుని అరచేతిలో పడుతుంది. అప్పుడు, ఆ గంధర్వుని చంపుతానని శ్రీ కృష్ణుడు శపథం చేస్తాడు. ఇది తెలిసిన గంధర్వ రాజు, ఆ విషయం చెప్పక, అర్జునుడిని శరణు వేడతాడు. ఫలితంగా శ్రీ కృష్ణునికి, అర్జునునికి యుద్ధం జరుగుతుంది. చివరికి త్రిమూర్తులు కలగజేసుకోవటంతో వారు తమతమ తొందరపాట్లను గుర్తిస్తారు. ఈ కథే 'గయోపాఖ్యానం'.   


సువర్ణముఖీ నదీ ఆవిర్భావం 
    సుప్రసిద్ధమయిన శివక్షేత్రం శ్రీ కాళహస్తిలోని సువర్ణముఖి నది ఆవిర్భావానికీ అగస్త్యుడు కారణమనే కథా ఉంది. అగస్త్యుడు, దక్షిణకాశీ నగరమయిన శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు అక్కడ ఏ నదీ లేకపోవడం చూసి, ఖిన్నుడయి, తన తపోబలంతో ఆకాశగంగను నేలకు రప్పించాడని అంటారు.  సుందర సువర్ణఛాయతోనూ,  చక్కని ధ్వనితోనూ ఆ నది ప్రవహించటంతో దానికి 'సువర్ణముఖి' అనే పేరు వచ్చిందని అంటారు. దీనికే 'సువర్ణముఖరి' అని మరో పేరు.

శ్రీనివాసమంగాపురం కథ 
    అఖిల భారతీయులకూ 'బాలాజీ'గా, తెలుగువారికి 'శ్రీ వేంకటేశ్వరుడు'గా ఇల వైకుంఠంలో వెలసిల్లిన ఇష్టదైవమైన స్వామివారి కథలోనూ అగస్త్యుని గురించిన ప్రస్తావన ఉంది. 

    పద్మావతీ, శ్రీ వేంకటేశ్వరులకు నారాయణ వనంలో వివాహం అయిన తర్వాత, ఆ నూతన దంపతులు ఇద్దరూ అగస్త్యుముని ఆశ్రమానికి విచ్చేసి, అక్కడ వారి ఆతిథ్యం స్వీకరిస్తారు. ప్రస్తుతం తొండవాడ దగ్గర  అగస్త్యేశ్వర ఆలయం ఉన్న చోటనే ఆ ఆశ్రమం ఉండేది అంటారు. అదే సమయంలో ఆ నూతన దంపతులు, తిరుమల కొండ ఎక్కాలని ఎంతగానో ఉవ్విళ్లూరుతారు. అయితే, పసుపు గుడ్డలతో కొత్త దంపతులు కొండ ఎక్కరాదని అగస్త్య, లోపాముద్ర దంపతులు హెచ్చరిస్తారు. దానితో, పద్మావతీశ్రీనివాసులు కొండ ఎక్కాలనే ఆలోచనను విరమించుకుని, కల్యాణీనదీ తీరాన కొంతకాలం గడుపుతారు. ఆ చోటనే ఇప్పుడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం ఉంది. వారు గడిపిస ఆ పుణ్యస్థలిని భక్తులు ఇప్పుడు 'శ్రీనివాసమంగాపురం'గా దర్శించుకుంటున్నారు. (మరో ఆలాపన, వి.ఏ.కె.రంగారావు వ్యాస సంకలనం, ప్రచురణ: ప్రగతి ముద్రణాలయం, హైదరాబాదు, పేజీ. 89) 


దుష్యంతునికి శాపవిమోచనం
    అగస్త్యుని శాపాలు కొన్ని అయితే, అగస్త్యునివల్ల  శాపవిమోచనం పొందిన వారూ ఉన్నారని చెప్పే కథ ఇది. 

    పాటలీపుత్ర నగర రాకుమారుడు దుష్యంతుడు. ఆయన పరమ క్రూరుడుగా పేరొందాడు. నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని సైతం చంపేసేవాడు. తన కుమారుడు ఇంత క్రూరుడు కావటంతో చింతించిన రాజు, కుమారుడైన దుష్యంతునికి బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అలా అడవికి చేరిన దుష్యంతుడు, 'ఉగ్రరవుడు' అనే ఒకతని కుమారుడిని నీళ్లలో ముంచి చంపేస్తాడు. ఉగ్రరవుడు వెంటనే దుష్యంతునికి శాపం ఇస్తాడు. దుష్యంతుడు అగస్త్యుని శరణు కోరుకుంటాడు. అప్పుడు, అగస్త్యుడు, తన శిష్యులలో ఒకడైన సుద్షీణకుడిని గంధమాదన పర్వత శ్రేణికి పంపి, అక్కడినుంచి 'అగ్ని తీర్థ జలం' తెప్పించి, దాన్ని దుష్యంతునిమీద చిలకరిస్తాడు. దానితో, దుష్యంతునికి శాపవిమోచనం అవుతుంది. 

    ఈ కథలోని దుష్యంతుడు మనకు సుపరిచితమైన కాళిదాసు  రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో నాయకుడైన దుష్యంతుడు కాదు. 

తమిళ భాష సృష్టికర్త అగస్త్యుడు
    సుబ్రహ్మణ్య స్వామి ఆజ్ఞమీద తమిళ భాషను అగస్త్యుడు సృజించారని తమిళులు విశ్వసిస్తారు. అందుకే, తమిళనాట అనేక దేవాలయాలలో అగస్త్యుని విగ్రహం ఉండటమే కాక, అగస్త్యునికి నిత్యం అర్చనలు కూడా జరుగుతుంటాయి. తమిళ భాషను ఇచ్చింది అగస్త్యుడైతే, కావేరీ నదికి కారణం లోపాముద్ర అయితే, ఇక, తమిళులకు వారిని మించిన దైవాలు వేరే ఉంటాయని భావించడంకూడా అనవసరం. అందుకే కాబోలు, న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో ఉన్న

శ్రీ మహా వల్లభ వినాయక స్వామివారి ఆలయంలోసైతం మనకు అగస్త్య, లోపాముద్రల విగ్రహాలు నిత్యపూజలు, నిత్యనైవేద్యాలు అందుకుంటూ కానవస్తాయి.

    అగస్త్యునికి 12మంది శిష్యులు ఉన్నట్లుగా తమిళులు విశ్వసిస్తారు. వీరిలో ఒకరైన (థెరయార్‌) తోల్కప్పియార్‌ తమిళంలో రచించిన 'అయ్యావఝు' పుస్తకం ప్రకారం అగస్త్యుడు శివుడి మానసపుత్రుడు. (మరికొందరి దృష్టిలో అగస్త్య మహర్షి వరుణుడు - ఊర్వశిల కుమారుడు.) ఈ పుస్తకానికే 'తోల్కప్పియమ్‌' అని వేరే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. 

చెన్నూరులో అగస్త్యేశ్వరాలయం
    మన ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరులో అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగంగల 'అగస్త్యేశ్వరాలయం' ఉంది. ఇది ద్వాపరయుగంలోనిదని ప్రతీతి. క్రీ.శ.1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చెప్తారు. ఆ తర్వాత, 1309-10 ప్రాంతంలో అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సేనాని అయిన మాలిక్‌ కాఫిర్‌ ఈ ఆలయంపై దాడి చేసి, గోపురాన్ని ధ్వసం చేశాడంటారు. అనంతర కాలంలో శ్రీ కృష్ణదేవ రాయలు ఈ ఆలయానికి పునర్వైభవం తెచ్చినట్లు ఆలయంవద్దగల తెలుగు-కన్నడ మిశ్రమభాషలోని ఒక శిలాశాసనంలో ఉంది. ఆలయంలోని అఖండజ్యోతిని జక్కెపల్లి సదాశివయ్య అనే సద్బ్రాహ్మణుడు 410 సంవత్సరాల క్రితం వెలిగించాడని అంటారు. నాటినుంచీ నేటివరకూ అది నిరంతరం అఖండంగా ప్రజ్వరిల్లుతూనే  ఉండటం విశేషం.

ఆ వంశంలో నాలుగో తరానికి చెందిన హిమాకర శర్మ ప్రస్తుతం ఆలయబాధ్యతలు నిర్వహిస్తున్నారని 'ఈనాడు' ఆదివారం (7 అక్టోబర్‌ 2012) సంచిక కథనం.   

    ఈ ఆలయం చుట్టూ గోదావరినది ఉత్తరవాహినిగా ప్రవహించటం మరో విశేషం. జన్మస్థలంనుంచీ అంతర్వేదివద్ద సముద్రంలో కలిసేవరకూ గోదావరి నది పశ్చిమంనుంచీ తూర్పువైపుగానే ప్రవహిస్తుంటుంది. ఒక్క చెన్నూరు దగ్గరే ఇలా ఉత్తరవాహినిగా ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని పారుపల్లి గుట్టలమీద దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహాన్ని చూడలేకే, గోదావరి నది తన ప్రవాహమార్గాన్ని మార్చుకుందని విశ్వాసం. 

    గోదావరి నది పుష్కరాలకు వచ్చే భక్తులు, సమీపంలోని ప్రాణహిత నది పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్లటం ఆనవాయితీ.

శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం వైభవంగా జరుగుతుంది. కార్తీకమాసంలో వైకుంఠ చతుర్దశి వేడుకలూ ఘనంగా జరుగుతాయి. ఆ రోజున ఉమ్మెత్త పూలతో శివలింగానికి పూజలు చేస్తారు.  

    ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాలకు చెన్నూరు సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. మంచిర్యాలనుంచి ప్రతిగంటకూ ఒక బస్సు ఉంది. 

గుంటూరులో అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివాలయం
    అగస్త్యుడు, శివలింగ ప్రతిష్ఠించినట్లు భక్తులు విశ్వసించే శివాలయం ఒకటి పాత గుంటూరులోనూ ఉంది.      

చెన్నన్నూర్‌ కథ 
    కేరళ రాష్ట్రంలో చెన్నన్నూర్‌ అని ఒక ఊరు ఉంది. అక్కడ అగస్త్యుడు నిర్మించిన ఆలయం ఉంది. దీనిగురించిన ఒక కథ ప్రచారంలో ఉంది.

    తదేక తపస్సుతో తనను మెప్పించిన పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి పరమశివుడు అంగీకరిస్తాడు. వివాహం కైలాసంలోజరుగుతోందని తెలిసి, శివభక్తులైన యక్షులు, దేవతలు, కింపురుషులు, కాపురుషులు అందరూ కైలాసానికి చేరుకుంటారు. దానితో కైలాస పర్వతంమీద భారం అధికమయి, భూమి అటువైపు వంగిపోతుంటుంది. అది గమనించిన శివుడు, వెంటనే అగస్త్యుడిని పిలిచి, భూమి ఒకవైపు వంగిపోకుండా తగిన చర్యలు తీసుకొమ్మని అడుగుతాడు. అగస్త్యుడు వెంటనే  దక్షిణ భారతంలోని (నేటి కేరళ రాష్ట్రం) ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ తన శక్తితో భూమి హిమపర్వతంవైపు వంగిపోకుండా ఆపుతాడు. అక్కడ కైలాసంలో శివపార్వతుల వివాహం వైభవంగా జరుగుతుంది. (ఈ కథ శివ పురాణంలో ఉంది.)

    అయితే తను లేకుండా ఆదిదంపతుల వివాహం జరిగిందని బాధ పడిన అగస్త్యుడు, పరమశివ- పార్వతులకు తను ఉన్న చోటనే వివాహం జరిపించాలని ఆశించి, శివపార్వతులను ఆహ్వానిస్తాడు. ఆ ప్రకారమే శివపార్వతులు అక్కడికి వస్తారు కానీ, పార్వతీదేవికి అప్పుడు నెలసరి ఋతుస్రావం జరుగుతుంది. అప్పుడు ఆమె ఋతుస్రావరక్తం అక్కడ నేలమీద పడుతుంది. ఫలితంగా అక్కడి నేలంతా ఎర్రబారిపోతుంది. అందుకే ఆ ఊరు 'చెన్నమన్నూర్‌' (చెన్న అంటే ఎరుపురంగు - మన్ను గల ఊరు) అయిందనీ, అదే ఆ తర్వాత కాలంలో 'చెన్ననూర్‌', 'చెంగన్నూర్‌' అయిందనీ అంటారు. ఆ తర్వాత అక్కడే, పార్వతీదేవికి ఋతుక్రమం పూర్తయిన తర్వాత, శివపార్వతులకు అగస్త్యుని ఆధ్వర్యంలో వివాహం అవుతుంది.

    అక్కడ శివపార్వతులకు అగస్త్యుడు కట్టించిన ఆలయం ఉంది. ఇందులో శివ, పార్వతుల విగ్రహాలు ఒకే గర్భగుడిలో ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. ఈ రెండు విగ్రహాలనూ భక్తులు పూజించుకునే వీలుంటుంది. అయితే, కొన్ని రోజులలో పార్వతీదేవికి ఋతుస్రావం అయినట్లుగా అక్కడ నేలమీద పడిన రక్తం పురోహితులకు కానవస్తుందని అంటారు. ఆ సందర్భాలలో పార్వతీదేవి విగ్రహాన్ని గర్భగుడిలోంచి తీసి, ఆలయంలోనే గర్భగుడికి ఎదురుగా ఉన్న మరొక ఆలయంలో ఉంచి, ఏడు రోజుల తర్వాత తిరిగీ గర్భగృహంలోనికి చేరుస్తారు. ఇది విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం.

మానవాళికి అగస్త్యుని వరాలు 
    అగస్త్య మహాముని మానవాళికి ప్రసాదించిన అపురూప వరాలు ఎన్నో ఉన్నాయి.

    మహాభారతంలోని శాంతి పర్వంలో అగస్త్య బోధ ఉంది. దీన్నే 'అగస్త్య గీత' అనీ అంటారు. 

    'సంస్కృత వాచస్పత్యము' అనే గ్రంధం ప్రకారం, అగస్త్యుడు 'రామచంద్ర విష్ణునామాద్యవతార పూజా విధానము'ను కూడా శాస్త్రోక్తంగా తెలియజేశాడు.

దీన్నే మనం 'అగస్త్య సంహిత' అని వ్యవహరిస్తున్నాం. 

    ఇక, శ్రీరామచంద్రుల వారికి అగస్త్యుడు బోధించిన 'ఆదిత్య హృదయం' సుప్రసిద్ధం. ఇది 

  
 'రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌,
    పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌...' 

అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అంతవరకూ యుద్ధం చేసినా, రావణుని తాను వధించలేకపోయానని బాధపడుతూ, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రుని కర్తవ్యపరాయణుని చేసిన మహా మంత్రమిది. ఈ 'ఆదిత్యహృదయం' పఠనంతో శ్రీరాముడు తిరిగి, సముజ్జ్వల శక్తితో యుద్ధరంగానికి చేరి రావణుని వధించాడు. 

    అలాగే, అగస్త్యుడు, మానవాళిని అనుగ్రహిస్తూ అందించిన 'ఆదిత్య కవచము' కూడా మహామహిమాన్వితం. ఇది 

    
'జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం
    సిందూరాంబర మాల్యం చ రక్తగంధానులేపనమ్‌'

అనే శ్లోకంతో ఆరంభం అవుతుంది. 

    అలాగే, ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణుని స్తుతిస్తూ, అగస్త్యుడు 'ఆదిత్య స్తోత్రము'ను కూడా మానవాళికి ప్రసాదించాడు. 'ఆదిత్య స్తోత్రము' దిగువ పేర్కొన్న శ్లోకంతో ఆరంభం అవుతుంది:

    
'ధ్యాయేత్సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం
    భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్‌'


అగస్త్యునికి అర్ఘప్రదానం
    భాద్రపద మాసంలో ఆకాశవీధిలో అగస్త్య నక్షత్రం మనకు ఎంతో తేజోమయమై కానవస్తుంది. ఈ అగస్త్య నక్షత్రం కానవచ్చిన తర్వాత, ఆగస్త్యుని ప్రతిమకు కాశపుష్పాలతో పూజ చేసి, ఆ రాత్రి జాగరణ చేయటం సంప్రదాయం. ఇలా చేయటం మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ఇది ఇప్పటికీ అనేక ప్రాంతాలలో మనకు కానవస్తున్న పూజావిధానం. 

    
అగస్త్యాయ సమస్తేస్తు అగస్త్యేస్మిన్‌ ఘటేస్థితః 
    అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః 
    అగస్త్యస్సప్తజన్మాఘం నాశయిత్వా వయోరయం
    అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్ఛతు మహామునిః 


                                                                      *  *   *   *   *

---------------------------------------------------------------------------------------------

Copyright Reserved