hinduBrahmins

ఆదికవి నన్నయ భట్టు


'శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే!'

అని ఆదికవి నన్నయాచార్యుడు ఆదికావ్యంవంటి పంచమవేదాన్ని, శ్రీమదాంధ్ర మహాభారత ఆది పర్వాన్ని ఆరంభించారు. 'ఆంధ్రమహాకవులకు ఆద్యుడు, ఆంధ్రమహాభారత సౌధనిర్మాణ ప్రథమశిల్పి' అయిన నన్నయ భట్టారకునితోనే సుప్రసిద్ధ తెలుగు బ్రాహ్మణుల చరిత్రకు నాంది పలకటం ఔచిత్యంగా ఉంటుందన్న ఆలోచనతో, ఆ మహానుభావునికి పాదాభివందనంతో ఆ బృహత్తర కార్యానికి శ్రీకారం చుడుతున్నాం.

నన్నయ తెనిగీకరించిన 'ఆంధ్ర మహాభారతము' 'అతిపురాతనము', 'ఉదాత్తము', 'జనసమ్మతము నైన కవిత్వమునకు నిధానము'. అది 'సాంప్రదాయిక వ్యాకరణమునకును, ఛందస్సునకును, పదప్రయోగమునకును మూలప్రభవము'. 'ఏదైనా ఒక తెలుగుపదముయొక్క యర్థమును సరిగా నిర్ణయింపవలసివచ్చినప్పుడు నిఘంటుకారులును, వైయ్యాకరణులును భారతప్రయోగమును బ్రమాణముగా నుద్ధరింతురు' అని ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు ప్రచురించిన 'ఆంధ్ర మహాభారతము- సంశోధిత ముద్రణము' గ్రంథములోని  ఉపోద్ఘాతములో ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు వచించారు. 

నన్నయభట్టుకు 'ఆదికవి', 'వాగనుశాసనుడు' లేదా 'శబ్దశాసనుడు' అనే బిరుదాలు ఉన్నాయి. అదివరకు ఆంధ్రభాషలో కావ్యము లేదు. ఆంధ్రభాషకు వ్యాకరణము లేదు. నన్నయభట్టు తెలుగు భాషకు ఈ రెంటినీ ప్రసాదించాడు. 

నన్నయ భట్టు, క్రీ. శ. 11వ శతాబ్దం మధ్యకాలంలో రాజమహేంద్రవరం రాజధానిగా గల తూర్పు చాళుక్య రాజ్యాధిపతి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. స్వయంగా ఆయనే చెప్పుకున్నట్లు ఆయన రాజరాజ నరేంద్రునికి 'కులబ్రాహ్మణుడు'. అంటే 'పురోహితుడు' కావచ్చునని ఒక అభిప్రాయం. కొన్ని పదాలు ప్రస్తు కాలానికి మరుగున పడిపోవటంవల్ల వచ్చే ఇబ్బంది ఇది! అయితే, ఆయన అవిరళ జపహోమ తత్పరుడు; సంహితాభ్యాసుడు; బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాననిరతుడు' అని 'విజ్ఞాన సర్వస్వం' నాలుగో సంపుటం 'తెలుగు సంస్క ృతి-1'లో నన్నయభట్టు వారి పరిచయంలో ఉంది. ఆయన ఆపస్తంబ సూత్రుడు. ముద్గల గోత్రికుడు. బుద్ధియందు బృహస్పతివంటి వాడు. సంస్క ృతంలో వాల్మీకిని మించిన కవి లేనట్టే, తెలుగులో నన్నయను మించిన కవి లేడు. 

నన్నయ కవిత్వానికి ప్రధాన లక్షణాలు మూడు. ఆ లక్షణాలు ఇవి : రుచిరార్థసూక్తిమత్త ్వము, అక్షరరమ్యత, ప్రసన్నకథాకలితార్థయుక్తి. 
రుచిరార్థసూక్తులు అంటే లోకధర్మములను బహురమ్యంగా చెప్పడమని అర్థం. ఇవి ఏవో నీతులు చెప్తున్నట్లు కాకుండా, సందర్భోచితంగా కథలో చొప్పిస్తూ చెప్పడం. 'నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృతవ్రత ఒక్క బావి మేలు... సూనృతవాక్యము మేలు సూడగన్‌' అనేది నీతి. సత్యానికి మించిన ధర్మము లేదనే ఈ నీతి వాక్యాన్ని శకుంతల పరంగా మహాభారత కథలో చొప్పించడం రుచిరార్థసూక్తికి ఉదాహరణం.

అక్షరరమ్యత అంటే, కవిత్వంలో అక్షరాలను సొగసుగా కూర్చడం. ఈ అక్షరరమ్యత అనే గుణం చాలా విధాలుగా ఉంటుంది. సందర్భానుసారంగా, కథానుసారంగా, రసానుగుణంగా అక్షరరమ్యతను మనం గుర్తించవచ్చు. 'కురు వృద్ధు ల్గురు వృద్ధ బాంధవు లనేకులు..' అనే పద్యంలో రౌద్రరసం తొణికిసలాడాలి. దానికై సంయుక్తాక్షరాలు, పరుషాక్షరాలు, తాలవ్యాలను అధికంగా ప్రయోగిస్తూ, రౌద్రరసాన్ని అక్షరాలద్వారా కురిపించడం అక్షరరమ్యత. అలాగే, 'జలధి విలోల వీచి విలసత్కలకాంచి సమంచితావనీతల వహనక్షమంబయిన.. గోమలిం దిగిచె           విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్‌'. ఈ శృంగారరసమొలికించే పద్యంలో అక్షరాలు సరళాక్షరాలు. కానీ, పై రెండు ఉదాహరణలలోనూ మాధుర్యం ఉండటమే అక్షరరమ్యత.  

ఇక, ప్రసన్న కథాకలితార్థ యుక్తి. దీన్నే 'ప్రసన్న కథా కవితార్థయుక్తి' అనీ అంటారు. కథతో కూడుకుని ఒక మహార్థాన్ని ప్రకాశింపజేయటం అన్నమాట. మహాభారత ఇతిహాసం ఆది పర్వంలోని గాంధారి వివాహం కథ సమయంలోనూ, అరణ్యపర్వంలోని సౌకన్యోపాఖ్యానం(సంయాతి రాజు కుమార్తె అయిన సుకన్యకు భృగు మహర్షి కుమారుడయిన చ్యవనునితో జరిగే వివాహం గురించిన కథ)లోనూ అ ప్రసన్న కథాకవితార్థయుక్తి  స్పష్టంగా గోచరిస్తుంది అంటారు పెద్దలు. 

సంస్కృతంలో కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించిన మహాభారతాన్ని నన్నయ భట్టు, తిక్కన సోమయాజి, ఎఱ్ఱా ప్రెగడలు ఆంధ్రీకరించారు. నన్నయ భట్టు ఆది, సభాపర్వాలను, అరణ్యపర్వంలో మూడు ఆశ్వాసాలను పూర్తిగానూ, ఆపైన 142 పద్యాలను (144 అని కొందరి అభిప్రాయం ('ఆంధ్రమహాభారతము', సంశోధిత ముద్రణము, ద్వితీయ సంపుటము, ఆరణ్య పర్వము; తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురణ, పేజీ 5) రాసి దివంగతులయ్యారు. 

ఆంధ్ర భాషకు గద్యపద్యాత్మకమయిన కావ్యమే ఉండాలనీ, ఆంధ్ర కావ్యాలలో చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం వంటి వృత్తాలూ, కందం, సీసం, గీత పద్యాలనూ బహుళంగా ఉండటం రమ్యమనీ భావించిన నన్నయ భట్టు, ఆ ప్రకారమే ఆంధ్ర మహాభారత రచన చేసి, తన తర్వాతి తరాల తెలుగు కవులకు పథనిర్దేశం చేసిన మహానుభావుడు; మహోత్తమ బ్రాహ్మణుడు. 

నన్నయ ఒక్క ఆంధ్ర మహాభారత ఆంధ్రీకరణమే కాకుండా, 'చాముండికా విలాసము' లేదా 'చౌడీశ్వర విలాసము',   'ఆంధ్ర శబ్దచింతామణి', 'ఇంద్రవిజయము' 'లక్షణసారము', 'రాఘవాభ్యుదయము' అనే గ్రంథాలనూ రాసినట్లు చెప్తారు. వీటిలో 'ఇంద్రవిజయము', 'రాఘవాభ్యుదయము' దొకరటం లేదు. 'చౌడీశ్వర విలాసము' 120 పద్యాలున్న మూడు ఆశ్వాసాల గ్రంథము. ఇందులో నందవరీ బ్రాహ్మణుల చరిత్ర ఉండటం విశేషం. 

నన్నయ తండ్రి పేరు బేతన భట్టు అని ఒక అభిప్రాయం, తల్లి పేరు తెలియదు. ('ఆంధ్రమహాభారతము', సంశోధిత ముద్రణము, ద్వితీయ సంపుటము, ఆరణ్య పర్వము; తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రచురణ, పేజీ 4). నన్నయ, రాజరాజ మహేంద్రుని మరణానంతరం, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకుకు తూర్పు దిశగా ఒక జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో యజ్ఞం చేశారనే భావన ఉంది. (చూ. పట్టమట్ట సరస్వతీ సోమయాజి రాసిన 'పృథు చరిత్ర'; 'ఆంధ్రమహాభారతము', పేజీ 3) 
--------------------------